సెల్ఫ్‌ హెల్ప్‌ అవుతుందా? | Does self help? | Sakshi
Sakshi News home page

సెల్ఫ్‌ హెల్ప్‌ అవుతుందా?

Published Fri, Jun 30 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

సెల్ఫ్‌ హెల్ప్‌ అవుతుందా?

సెల్ఫ్‌ హెల్ప్‌ అవుతుందా?

ఒకప్పుడు డబ్బున్న మారాజులకు మాత్రమే పరిమితమైన సెల్‌ ఫోన్‌ ఇంచుమించు ప్రతి ఒక్కరి జేబుల్లోనూ ఉంటోంది. దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్‌ వినియోగదారుల సంఖ్య వందకోట్లు రీచ్‌ అయిపోయిందిప్పుడు. టెక్నాలజీ పెరిగిన కొద్దీ సెల్‌ఫోన్ల వాడకం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సెల్‌ఫోన్‌తోనే టైమంతా స్పెండ్‌ చేసేవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఫలితంగా సెల్‌ఫోన్‌ వాడకం వల్ల కలిగే అనర్థాలు కూడా అంతకు అనేకరెట్లు పెరుగుతున్నాయి. సెల్‌ వాడేకొద్దీ దానిమూలంగా విడుదలయ్యే రేడియేషన్‌ కూడా ఆటోమేటిగ్గా పెరుగుతుంది.

మెదడు కణాలపైన అది చూపే దుష్ఫలితం అంతా ఇంతా కాదు. సెల్‌ఫోన్‌ వాడకం వల్ల బ్రెయిన్‌ సెల్స్‌ దెబ్బతింటాయనీ, క్యాన్సర్‌ వస్తుందనీ ఎన్ని పరిశోధనలు తేల్చి చెబుతున్నా, సర్వే నివేదికలు ఎన్ని మొత్తుకుంటున్నా సెల్‌ వినియోగం పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. అసలు సెల్‌ఫోన్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే, వాటివల్ల క్యాన్సర్‌ ముప్పు ఉందో లేదో తెలుస్తుంది. సెల్‌ఫోన్లు సిగ్నల్స్‌ను రిసీవ్‌ చేసుకోవడం, పంపడం వాటికి దగ్గరలోని సెల్‌ఫోన్‌ టవర్స్‌ ద్వారా జరుగుతుంది. ఈ సెల్‌ఫోన్‌ టవర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలే ఆధారం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు సెల్‌ఫోన్‌ యాంటినా నుంచే వెలువడతాయి. మనం చెవి దగ్గర ఉంచి సెల్‌ మాట్లాడేటప్పుడు ఈ యాంటినా మన తలకు అతి పమీపంలోకి వస్తుంది. అప్పుడు ఈ తరంగాలు మెదడును తాకుతాయి. మనం ఎంత ఎక్కువ సేపు సెల్‌ మాట్లాడితే అంత ఎక్కువసేపు ఈ తరంగాలు మెదడును తాకి మెదడును ఉడికే లా చేస్తాయి.

సెల్‌ఫోన్‌ వాడకం వల్ల బ్రెయిన్‌ ట్యూమర్‌ వస్తుందా?
పరిశోధనలు, అధ్యయనాల వల్ల తేలిందేమంటే సెల్‌ఫోన్‌ వాడకానికీ, మెదడులో కణుతులు ఏర్పడటానికీ సంబంధం లేదని. అయితే, అంతమాత్రాన నిశ్చింతగా ఊరుకోవడానికి వీలు లేదు. ముఖ్యంగా చిన్నారుల విషయంలో. చిన్నారులు ఎక్కువసేపు సెల్‌ఫోన్‌ మాట్లాడటం, సెల్‌ వాడటం వారి మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.

నిపుణులు ఏమి చెబుతున్నారు?
ప్రపంచ ఆరోగ్యసంస్థ, అంతర్జాతీయ క్యాన్సర్‌ పరిశోధన సంస్థలు సంయుక్తంగా చెబుతున్నదేమంటే, సెల్‌ఫోన్‌ల వాడకం వల్ల బ్రెయిన్‌ ట్యూమర్‌ అంటే మెదడులో కణుతులు ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయని. పైన చెప్పిన దానికీ, దీనికీ పూర్తి విరుద్ధంగా ఉన్నప్పటికీ పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు అన్ని రకాల సెల్‌ఫోన్ల వాడకం వల్లా మెదడులో కణుతులు ఏర్పడకపోవచ్చు కానీ, కొన్ని రకాల అంటే ముఖ్యంగా చైనా ఫోన్లు, చవకబారు, నాణ్యత లేని ఫోన్లు ఎక్కువ మొత్తంలో రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు విడుదల చేస్తాయనీ, దాని మూలంగా మెదడులోని కణాలు ఉడికిపోయినట్లయి, కణుతుల్లా ఏర్పడే అవకాశం ఉందనీ చెబుతున్నాయి.

హాని లేకుండా సెల్‌ఫోన్‌ వాడలేమా?
సెల్‌ఫోన్‌ వాడకం వల్ల ముప్పు ఉందని తెలిసినప్పటికీ వాడకుండా ఉండటం మాత్రం సాధ్యం కాదు. అయితే, నష్టశాతాన్ని మాత్రం తగ్గించుకోవచ్చు. అదెలాగంటే..? ఫోన్లలో సార్‌ వ్యాల్యూ అని ఉంటుంది. సార్‌ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే, రేడియో ఫ్రీక్వెన్సీ అంత ఎక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ సార్‌ వాల్యూ ఉన్న మోడల్‌ సెల్‌ఫోన్లను వాడటం ద్వారా దాని ముప్పును తగ్గించుకోవచ్చు.
∙స్పీకర్‌ మోడ్‌లో వాడటం ద్వారా లేదా హ్యాండ్స్‌ ఫ్రీ ద్వారా లేదా కార్డ్‌లెస్‌ ఇయర్‌ పీస్‌ వాడటం ద్వారా కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్‌ తగ్గుతుంది.

సెల్‌ మాట్లాడటాన్ని తగ్గించి, వీలయినంత వరకు టెక్ట్స్‌ మెసేజెస్‌ అంటే ఎస్సెమ్మెస్‌లను వాడటం మంచిది. పిల్లలకు సెల్‌ఫోన్‌ వీలయినంతవరకు ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే వారి మెదడు కణాల అభివృద్ధికి సెల్‌ఫోన్‌ వాడకం హాని చేస్తుంది కాబట్టి.గంటల తరబడి సెల్‌ సొల్లు చెప్పుకుంటూ ముప్పు తెచ్చుకునేబదులు ఆ మాటలేవో నేరుగా మాట్లాడుకోవడం వల్ల మానవ సంబంధాలు, రాకపోకలు కూడా పెరుగుతాయి కదా! డ్రైవింగ్‌ చేసేటప్పుడు సెల్‌ఫోన్‌ మాట్లాడకపోవడం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement