
సెల్ టవర్‌లో మంటలు.. జనం పరుగులు
- ఆందోళనతో జనం పరుగులు
- విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తప్పిన ప్రమాదం
పుల్‌కల్(మెదక్): ఓ ప్రైవేటు సంస్ధకు చెందిన సెల్ టవర్ నుంచి ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో అది గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా టవర్ నుంచి మంటలు రావడంతో ఏం జరుగుతుందోనని ప్రజలు పరుగులు తీశారు. ఆ వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన పుల్‌కల్‌లోని గ్రామీణ వికాస్ బ్యాంకుకు ఆనుకుని ఎయిర్‌టెల్ సంస్థకు చెందిన సెల్‌ఫోన్ టవర్ ఉంది. ఆదివారం మధ్యాహ్నం సెల్‌ఫోన్ టవర్‌కు చెందిన జనరేటర్ నుంచి మొదట్లో పొగలు వచ్చాయని స్థానికులు తెలిపారు.ఎండ వేడిమికి పొగలు వేడికి వస్తున్నాయని తాము భావించామని, కొద్దిసేపటికే పెద్దగా మంటలు లేచాయని స్థానికులు తెలిపారు.
అప్పటికే సెల్‌టవర్ ఆవరణలో ఉన్న గ్యాస్‌ను భద్రపరచిన ప్రదేశంలో మంటలు లేవడంతో మరింత భయం పట్టుకుందని తెలిపారు. అనంతరం జోగిపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. కాని అంతలోపే సెల్‌టవర్‌కు చెందిన పరికరాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇప్పటికైనా అదికారులు జనవాసాల మధ్య ఉన్న సెల్ ఫోన్ టవర్‌లను గ్రామాలకు దూరంగా ఉన్న ప్రదేశాలలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.