cell tower
-
పెళ్లి చేయలేదని యువకుడి హల్చల్
నల్లమాడ: పెళ్లి చేయలేదని అలిగిన ఓ యువకుడు హల్చల్ చేశాడు. సెల్‌టవర్ ఎక్కి దూకేస్తానని బెదిరింపులకు దిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంతో అతడిని కిందకు దింపి ప్రాణాలు కాపాడారు. వివరాలిలా ఉన్నాయి. రెడ్డిపల్లికి చెందిన రంగప్ప అనే యువకుడు పూటుగా మద్యం తాగి ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో సమీపంలోని రిలయన్స్ సెల్ టవర్ ఎక్కాడు. తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయడం లేదని, టవర్‌పై నుంచి దూకి చనిపోవాలని ఉందని బిగ్గరగా అరిచాడు. సమాచారం అందుకున్న నల్లమాడ సీఐ వై.నరేంద్రరెడ్డి వెంటనే అప్రమత్తమై ఓడీ చెరువు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సహకారంతో రెండు గంటల పాటు శ్రమించి యువకుడికి నచ్చజెప్పి సెల్ టవర్ నుంచి కిందకు దిగేలా చర్యలు తీసుకున్నారు. యువకుడికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులను ఎస్పీ రత్నతతో పాటు గ్రామస్తులు అభినందించారు. -
తాగిన మైకంలో సెల్‌టవర్ ఎక్కిన యువకుడు.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా!
కోస్గి: పట్టణ శివారులోని బీఎస్ఎన్ఎల్ టవర్‌పైకి ఎక్కిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని డయల్ 100కు ఫోన్ చేసి హల్చల్ చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అన్నదమ్ములు భూమిలో సరిగా భాగం ఇవ్వడం లేదని, అడిగితే దాడి చేస్తున్నారని, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మండలంలోని చంద్రవంచకు చెందిన రాంచందర్ ఈ ఏడాది జూన్ 25న తాగిన మైకంలో పోలీస్‌స్టేషన్‌లోని సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తాజాగా అదే యువకుడు గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు. మధ్యాహ్నం 2 గంటలకు డయల్ 100కు కాల్చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని బెదిరించాడు. 250 అడుగుల ఎత్తు ఉన్న టవర్‌పై నుంచి ఆ యువకుడిని కిందకి దించేందుకు పోలీసులు ప్రయత్నించారు. తాగిన మైకంలో టవర్ ఎక్కి అక్కడే నిద్రపోయాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించ లేదు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ శ్రీనివాస్‌తో పాటు పోలీసులు అక్కడే ఏడు గంటల పాటు ఉండి పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. ఎత్తు ఎక్కువగా ఉండటంతో టవర్‌పైకి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. చివరకు మత్తు దిగడం.. చలి ఎక్కువ కావడంతో అతడే కిందకు రావడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి సీఐ జనార్దన్ కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. -
నేనడిగింది చేస్తేనే వస్తా..! లేదంటే.. యువకుడు ఏడు గంటల పాటు హల్చల్!
భద్రాద్రి: తన తాతల నుంచి వచ్చిన రెండున్నర ఎకరాల భూమి, ఇంటిని ఉపసర్పంచ్ అక్రమంగా అక్రమించుకున్నారంటూ మండలంలోని కిన్నెరసాని గ్రామానికి చెందిన సురుగు గౌతమ్ అనే యువకుడు సోమవారం సెల్ టవరెక్కి నిరసన తెలిపాడు. కొత్తగూడెం విద్యానగర్‌లో ఉంటున్న గౌతమ్ కిన్నెరసానిలో తన తల్లిదండ్రులకు చెందిన ఇల్లు, రెండున్నర ఎకరాల భూమిని ఉపసర్పంచ్ కొంగర అప్పారావు ఆక్రమించాడని, ఇల్లు, భూమి ఇప్పించాలని రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్నిసా ర్లు తిరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. తనకు న్యాయం చేసేంతవరకు కిందకు దిగేది లేదని భీష్మించాడు. ఇదే సమస్యపై గతంలో కొత్తగూడెంలో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉదయం 7 గంటల నుంచి సెల్ టవర్‌పై నిరసన వ్యక్తం చేస్తుండగా సమాచారం అందుకున్న రూరల్ ఇన్చార్జ్ ఎస్ఐ భిక్షం, డీటీ వినయ్ శీలాశ్రీరాం, ఆర్ఐ హచ్యా ఘటనా స్థలానికి వెళ్లి కిందకు దిగివస్తే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా గౌతమ్ దిగి రాకపోవడంతో మధ్యాహ్నం 1.30 గంటలకు సీఐ వినయ్‌కుమార్ సెల్‌టవర్ వద్దకు చేరుకుని ఫోన్ ద్వారా నచ్చజెప్పారు. భూమి, ఇంటికి సంబంధించిన కాగితాలు సక్రమంగా ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లి సమస్య పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగివచ్చాడు. అనంతరం కిన్నెరసానిలో ఆక్రమణకు గురైన ఇల్లు, భూమిని గౌతమ్ అధికారులకు చూపించగా పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి భూ రికార్డులను తీసుకుని కలెక్టరేట్‌కు వెళ్లారు. సమస్యను డీఆర్ఓ రవీంద్రనాథ్‌కు వివరించగా అక్రమించిన వ్యక్తికి నోటీసులు ఇవ్వాలని డీటీని ఆదేశించారు. -
భూమి పోతోందని.. సెల్ టవర్‌పై ఉరేసుకున్న రైతు
లింగంపేట (ఎల్లారెడ్డి): చెరువు కింద కాస్త భూమి ఉంది.. తూము నుంచి నీళ్లు వదిలితే ఆ భూమిలో నీళ్లు నిలుస్తాయి.. ఏ పంటా వేయలేని పరిస్థితి.. పైగా ఆ భూమి నుంచే కాల్వ తవ్వేందుకు గ్రామస్తులు నిర్ణయించడంతో ఓ రైతు ఆవేదన చెందాడు. తనకు అన్యాయం జరుగుతోందని, అధికారులు పట్టించుకోవడం లేదని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అందరూ చూస్తుండగానే టవర్‌పై రుమాలుతో ఉరివేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగారంలో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది. చెరువు నీళ్లు నిలుస్తుండటంతో.. మెంగారం గ్రామానికి చెందిన రైతు పుట్ట ఆంజనేయులు (32)కు గ్రామ శివార్లలోని చెరువు ముందు 9 గుంటల వ్యవసాయ భూమి ఉంది. చెరువు దిగువన అర గుంట భూమి ఉంది. దిగువన ఉన్న పంట భూములకు చెరువు నుంచి తూము ద్వారా నీళ్లు వదులుతుంటారు. అలా నీళ్లు వదిలినప్పుడు పక్కనే ఉన్న ఆంజనేయులు భూమిలో నీళ్లు నిలుస్తాయి. దీనివల్ల కొన్నేళ్లుగా ఆ భూమిలో పంట వేయలేక పోతున్నాడు. ఒకట్రెండు సార్లు పంట వేసినా నీళ్లకు కొట్టుకుపోయి దెబ్బతింది. దీనితో తనకు నష్టపరిహారం చెల్లించాలని, తన పొలం నుంచి నీళ్లు పోకుండా చేయాలని గతంలోనే ఆంజనేయులు అధికారులు, గ్రామస్తులను కోరాడు. దానితో గత ఏడాది రూ.2వేలు నష్టపరిహారంగా ఇచ్చారు. ఇక గత ఏడాది తన పొలం మీదుగా కాల్వ తవ్వడానికి అధికారులు, గ్రామస్తులు ప్రయత్నించగా జేసీబీకి అడ్డునిలిచి ఆపేశాడు. కాల్వ తవ్వుతారని.. ప్రస్తుతం యాసంగి పంటకు నీళ్లు ఇచ్చేందుకు గ్రామ పంచాయతీ ఆదివారం నిర్ణయం తీసుకుంది. చెరువు తూము దిగువ నుంచి పంట కాల్వ తీయాలని నిర్ణయించిన గ్రామస్తులు.. ఆయకట్టు రైతుల నుంచి ఎకరానికి రూ.500 చొప్పున వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇది తెలిసిన ఆంజనేయులు తన పొలం నుంచి కాల్వ తవ్వుతారని, భూమి తనదికాకుండా పోతుందని ఆందోళన చెందాడు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ సోమవారం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. ‘నాన్నా దిగి రా’ అంటూ పిల్లలు రోదించినా.. రైతు ఆంజనేయులు సెల్ టవర్ ఎక్కిన విషయం తెలుసుకున్న తహసీల్దార్ మారుతి, ఎస్సై శంకర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని, దిగి రావాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆంజనేయులు భార్య సుజాత కూడా సెల్ టవర్ దిగాలని వేడుకుంది. ఆయన ముగ్గురు పిల్లలు ‘నాన్నా దిగి రా’ అంటూ రోదించినా వినిపించుకోలేదు. సుమారు గంటసేపు సెల్ టవర్‌పైనే ఉన్న ఆంజనేయులు.. అందరూ చూస్తుండగానే టవర్‌పై ఇనుప రాడ్‌కు తన రుమాలును కట్టి ఉరివేసుకున్నాడు. కాసేపటికే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి పరిశీలించారు. రైతు ఆత్మహత్యకు కారణాలు, ఇతర అంశాలను ఆరా తీశారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ భరోసా ఇచ్చారు. -
మూడేళ్లు ప్రేమించి,రెండు నెలల క్రితం వివాహం.. పెళ్లైన మరుసటి రోజే..
సాక్షి, ఖమ్మం: ‘మూడేళ్ల పాటు ప్రేమించిన యువకుడు రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నా.. ఆ తర్వాత ముఖం చాటేశాడు... నాకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు’ అని చెబుతూ ఓయువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రఘునాథపాలెంకు చెందిన మౌనిక, అదే మండలానికి చెందిన వీరబాబు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీంతో జనవరి 8న వీరికి పోలీసుల సమక్షాన వివాహం జరిగింది. ఆ మరుసటి రోజూ మౌనికను ఆమె ఇంటి వద్ద వదిలేసిన వీరబాబు ఫోన్ ఎత్తకపోవడమే కాక, స్వయంగా వెళ్లినా ఏం సంబంధం లేదని దుర్బాషలాడుతూ వెళ్లగొట్టాడు. ట్యాంక్ కింద వలతో ఫైర్ సిబ్బంది దీంతో రఘునాథపాలెం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకోలేదని, స్టేషన్ వద్ద బైఠాయించగా ఇరు కుటుంబాలు మాట్లాడుకోవాలని సూచిస్తూ పంపించారని మౌనిక ఆరోపించింది. ఈమేరకు శుక్రవారం ఖమ్మంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కిన ఆమె ఆత్మహత్యకు సిద్ధంకాగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో టూటౌన్ ఎస్ఐ రాము, సిబ్బందిచేరుకున్నారు. ముందు జాగ్రత్తగా ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ అధికారి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్ చేరుకుని మౌనిక దూకినా ఏమీ జరగకుండా ట్యాంక్ క్రింద వలలు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా మౌనిక వినకపోవడంతో చివరకు ఓ మహిళా కానిస్టేబుల్‌తో సెల్‌ఫోన్ పంపించారు. అయితే, సెల్‌ఫోన్ తీసుకున్నాక వెంటనే దిగకపోతే దూకుతానని అనడంతో కానిస్టేబుల్ వచ్చేసింది. ఈమేరకు ఎస్ఐ రాము ఫోన్లో మౌనికతో మాట్లాడి న్యాయం చేస్తామని, వీరబాబు, ఆయన కుటుంబసభ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చచెబుతూ మళ్లీ మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్‌ను పంపించి మౌనికను కిందకు తీసుకొచ్చారు. మొత్తంగా గంటన్నర సేపు ఉత్కంఠ సాగగా ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మౌనికపై కేసు నమోదు చేయడమే కాక ఆమె వద్ద ‘తన చావుకి పురం వీరబాబు, ఆయన కుటుంబ సభ్యులే కారణం’ అని రాసి ఉన్న లేఖను స్వాధీనం చేసుకున్నామని, మౌనిక ఫిర్యాదు మేరకు వీరబాబు, కుటుంబసభ్యులపై కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
మైనర్ ప్రేమ వ్యవహారం.. ప్రేమించిన అమ్మాయిని తీసుకురాకుంటే..
సాక్షి, శ్రీకాకుళం: తాను ప్రేమించిన అమ్మాయిని తీసుకురాకపోతే సెల్‌టవర్ నుంచి దూకేస్తానంటూ పదో తరగతి విద్యార్థి హల్చల్ సృష్టించాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో కథ సుఖాంతమైంది. వీరఘట్టం గాసీ వీధికి చెందిన 16 ఏళ్ల బాలుడు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఖాళీ సమయంలో వీరఘట్టం నుంచి విశాఖపట్నం వెళ్లే కాయగూరల వాహనాలకు క్లీనర్‌గా వెళ్తుండేవాడు. ఈ క్రమంలో విశాఖలో 19 ఏళ్ల అమ్మాయితో ఏడాది కిందట పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ వారం రోజుల కిందట ఆ అమ్మాయిని వీరఘట్టం తీసుకువచ్చాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు గురువారం వీరఘట్టం వచ్చి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. వెంటనే ఆ అమ్మాయి తల్లిదండ్రులతో విశాఖ వెళ్లిపోయింది. చదవండి: భర్తతో విసిగిపోయిన భార్య .. సుపారీ ఇచ్చి.. పక్కా ప్లాన్‌తో ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అబ్బాయి సాయంత్రం 5 గంటల సమయంలో వీరఘట్టంలోని సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అమ్మాయిని తీసుకురాకపోతే టవర్ పైనుంచి దూకేస్తానని చెప్పడంతో స్థానికు లు వీరఘట్టం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, పాలకొండ ఫైర్ సిబ్బంది టవర్ వద్దకు చేరుకుని అబ్బాయితో చాకచక్యంగా మాట్లాడి రాత్రి 8 గంటల సమయంలో టవర్ పైనుంచి కిందకు దించా రు. దీంతో మూడు గంటల ఉత్కంఠకు తెరపడింది. -
కాపురానికి రావడం లేదని సెల్‌టవర్ ఎక్కి భర్త హల్చల్
కుంటాల: భార్య కాపురానికి రావడం లేదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల మండలం లింబా (కే) గ్రామంలో భర్త టవర్ ఎక్కి హల్చల్ చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. లింబా (కే) గ్రామానికి చెందిన అశ్మినికి లోకేశ్వరం మండలం నగర్ గ్రామానికి చెందిన కొత్తూరు శ్రీనుతో ఆరునెలల క్రితం వివాహం జరిగింది. తరచూ భర్త వేధిస్తుండడంతో భార్య అశ్మిని ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి రావాలని కోరుతూ శ్రీనివాస్ సోమవారం ఉదయం 10.30 గంటలకు సెల్ టవర్ ఎక్కాడు. దీంతో గ్రామస్తులు 100 నంబర్‌కు సమాచారం అందజేయడంతో ఎస్సై శ్రీకాంత్, ప్రొహిబిషినరీ ఎస్సై షరీఫ్‌లు ఘటన స్థలానికి చేరుకుని శ్రీనుకు నచ్చజెప్పారు. దీంతో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సెల్ టవర్ దిగాడు. పెట్రో కార్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం చదవండి: తీజ్ సంబరాల్లో విషాదం: వ్యక్తి ఆత్మహత్య -
Lockdown: పెళ్లి వాయిదా మనస్తాపంతో టవరెక్కిన యువకుడు
సాక్షి, హొసపేటె(కర్ణాటక): తనను ప్రేమించిన అమ్మాయితో తల్లిదండ్రులు వివాహం చేయలేదని ఆవేదన చెందిన ఓ యువకుడు మొబైల్ టవరెక్కి హల్చల్ చేశాడు. వివరాలు... తాలూకాలోని మరియమ్మనహళ్లికి చెందిన చిరంజీవి గొసంగి (23) ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించాయి. అయితే లాక్డౌన్ కారణంగా పెళ్లిని వాయిదా వేయడం చిరంజీవికి నచ్చలేదు. సోమవారం పాత వీరభద్రశ్వర టాకీస్ వద్ద నున్న మొబైల్ టవర్ ఎక్కి కూర్చున్నాడు. పెళ్లి చేయకపోతే దూకుతానని హెచ్చరించాడు. ఈ విషయం తెలుసుకొన్న చుట్టు పక్కల ప్రజలు టవర్ వద్దకు వచ్చి మకాం వేశారు. సమాచారం అందుకున్న సీఐ వసంత, ఎస్ఐ మీనాక్షి, అక్కడికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పి కిందకు రప్పించడంతో కథ సుఖాంతమైంది. చదవండి: నాకూ ఈటల గతి పడుతుందని అనుకున్నారు -
సెల్‌టవర్ నిర్మాణం అగ్రిమెంట్ పేరుతో మోసం..
సాక్షి, జగిత్యాల: సాంకేతికరంగం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కూడా సాంకేతికరంగాన్ని ఉపయోగిస్తూ బడా వ్యాపారుల నుంచి మొదలుకుని సామాన్య రైతులు, రైతు కూలీలను మోసం చేస్తున్నారు. తమ భూ మిలో సెల్‌టవర్ నిర్మిస్తామని నమ్మించి అగ్రిమెంట్ పేరుతో రూ.22,700 ఫోన్‌పే చేయించుకుని రైతును మోసం చేశారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన బోడుగం బాపురెడ్డి అనే రైతుకు పొరండ్ల గ్రామ శివారులో రెండు స్థలాల్లో భూమి ఉంది. 10 రోజుల నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి తమ భూమిని ఐడియా సెల్‌టవర్ నిర్మాణానికి 10 ఏళ్లపాటు అద్దెకివ్వాలని కోరాడు. తాము ల్యాండ్ కూడా చూశామని నమ్మించి రూ.20 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్ పెడతామని, నెలకు రూ.25 వేల అద్దె, ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని నమ్మించారు. దీంతో సోమవారం బాపురెడ్డికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి అగ్రిమెంట్ చార్జీలు రూ.5200 సెల్ నంబరు 8195911026కు ఫోన్ ద్వారా చెల్లించారు. తర్వాత వారు రైతుకు ఐటీ రిటర్న్ లేదని, ట్యాక్స్ పేరున రూ.17,500 జమచేస్తే బ్యాంక్ ఖా తాలో రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తామని నమ్మించారు. రూ.17,500 జమచేసిన తర్వాత బ్యాంక్‌లో రూ.10 లక్షలు జమకాకపోవడంతో రైతు వారికి ఫోన్ చేయగా బ్యాంక్ డబ్బులు జమచేసినట్లు ఓ నకిలీ రశీదును పంపించారు. “మరో రూ.25 వేలు చెల్లిస్తే ఖాతాలో అరగంటలో రూ.10 లక్షలతో పాటు మీరు వేసిన రూ.25 వేలు మీ ఖాతాలోనే జమ అవుతాయి’ అని నమ్మించారు. కానీ రైతు అనుమానం వచ్చి వారు పంపించిన డాక్యుమెంట్లు పరిశీలించగా మోసపోయామని తెలుసుకున్నాడు. దీంతో అతడు సోమవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
భార్య కాపురానికి రావడం లేదని..
సాక్షి, మనూరు(నారాయణఖేడ్): భార్య కాపురానికి రావడం లేదని భర్త సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన నాగల్గిద్ద మండలం కరస్‌గుత్తిలో ఆదివారం చోటు చేసుకుంది. నాగల్గిద్ద ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే యువకుడు గత రెండేళ్ల క్రితం నాగల్గిద్ద మండలం మోర్గి గ్రామానికి చెందిన పార్వతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో గత కొన్ని రోజులుగా ఇరువురి మద్య మనస్పర్థలు రాడంతో భార్య పార్వతి తన తల్లిగారి ఇల్లు అయిన మోర్గికి వెళ్లింది. కాగా భార్యను తీసుకెళ్లెందుకు భర్త లక్ష్మణ్ రాగా భార్య నిరాకరించడంతో మనస్తాపానికి గురైన లక్ష్మణ్ తనకు న్యాయం చేయాలని కరస్‌గుత్తిలోని ఓ సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. (పోలీసుల అదుపులో మనోజ్ఞ భర్త, అత్తమామలు) తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు పాల్పడుతానని హల్చల్ చేయడంతో స్థానికులు విషయం గమనించి నాగల్గిద్ద ఎస్ఐ సందీప్‌కు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ సదురు వ్యక్తితో ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తానని భరోసా ఇవ్వడంతో యువకుడు టవర్ దిగి వచ్చాడు. అనంతరం యువకుడిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతని భార్య, కుటుంబీకులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించడంతో సమస్య సద్దుమణిగింది. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
పోలీసులు అక్రమ కేసు బనాయించారని..
మునగాల (కోదాడ): పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తనపై అక్రమ కేసు బనాయించారని ఆరోపిస్తూ ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. నర్సింహాపురం గ్రామానికి చెందిన బారి వేణు కుటుంబానికి, బంధువులకు సంబంధించి గతంలో భూ వివాదం నెలకొన్నది. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో బారి సంధ్య అనే యువతి వేణు కుంబసభ్యులపై మునగాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక ఎస్ఐ బారి వేణు, తండ్రి లక్ష్మయ్యపై కేసు నమోదు చేశారు. తమపై సంధ్య ఆమె అనుచరులే దాడి చేశారని వేణు ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్ఐ పట్టించుకోకుండా తమపై అక్రమ కేసు బనాయించారని, తనకు న్యాయం చేయాలంటూ వేణు పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న సెల్‌ఫోన్ టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న మునగాల ఎస్ఐ సత్యనారాయణగౌడ్, సీఐ శివశంకర్‌గౌడ్ సెల్‌టవర్ వద్దకు చేరుకున్నారు. భూ వివాదంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఫోన్ ద్వార బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కథ సుఖాంతం అయింది. -
సెల్ టవర్‌పై యువకుడు హల్చల్
సాక్షి, సూర్యాపేట : భూ వివాదంలో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఓ యువకుడు హల్చల్ చేశాడు. సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలోని నర్సింహపురం గ్రామానికి చెందిన వేణు అనే వ్యక్తిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. తనకు సంబంధంలేని భూ వివాదంలో తనపై అక్రమ కేసు నమోదు చేశారని నిరసనకు దిగాడు. మునగాల పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని సెల్ టవర్‌పై నుంచి హల్చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతన్ని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు. -
సూర్యాపేట: సెల్ టవర్‌పై యువకుడు..
-
ఒక్క ‘ఐడియా’తో రూ.70 వేలు ఊడ్చేశారు!
సాక్షి, సిటీబ్యూరో : ఐడియా నెట్వర్క్ పేరుతో ఫోన్ చేశారు. అనువైన స్థలంలో టవర్ ఏర్పాటు చేస్తామన్నారు.. ఆకర్షణీయంగా బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపారు. చివరకు సెక్యూరిటీ డిపాజిట్ల పేరు చెప్పి రూ.70 వేలు కాజేశారు. బాధితుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని తన సమీప బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. రాజేంద్రనగర్ పరిధిలోని ఓ కళాశాలలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడికి గత నెల 30న ఐడియా నెట్వర్క్ సంస్థ నుంచి అంటూ ఓ ఫోన్‌కాల్ వచ్చింది. తన కవరేజ్‌ను పెంచడానిక రాష్ట్ర వ్యాప్తంగా టవర్లు ఏర్పాటు చేస్తున్నామంటూ తెలుగులో మాట్లాడారు. ఇందుకు అవసరమైన స్థలాల కోసం అన్వేషిస్తున్నామన్నారు. ఆసక్తి, హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల అనువైన స్థలం ఉంటే చెప్పాలని కోరారు. తొలుత సదరు యువకుడు తనకు ఆసక్తి లేదంటూ చెప్పేశాడు. అయినప్పటికీ ఐడియా పేరుతో ఉండేలా పలు బల్క్ ఎస్సెమ్మెస్‌ల్ని, వాట్సాప్ ద్వారా సందేశాలను నిందితులు పంపారు. వీటిలో రూ.10 లక్షలు అడ్వాన్స్ చెల్లిస్తామని, కుటుంబంలో ఒకరికి తమ సంస్థలో ఉద్యోగం ఇస్తామంటూ ఎర వేశారు. దీంతో వారి వలలో పడిన ఎంబీఏ విద్యార్థి పరిగిలో ఉండే తన మామకు విషయం చెప్పారు. టవర్ ఏర్పాటుకు తన స్థలం ఇస్తానంటూ ఆయన ముందుకు వచ్చి వారితో సంప్రదింపులు జరిపారు. ప్రాసెసింగ్ మొదలు పెడుతున్నామని చెప్పిన మోసగాళ్లు స్థలం పత్రాలు, యజమాని ఆధార్‌కార్డు తదితరాలను వాట్సాప్ ద్వారా తెప్పించుకున్నారు. వీటి ఆధారంగా ఆ స్థలాన్ని తమ టవర్ ఏర్పాటు కోసం అద్దెకు తీసుకుంటున్నట్లు పత్రాలు రూపొందించారు. వీటినీ వాట్సాప్ ద్వారా పంపడంతో బాధితులు పూర్తిగా సైబర్ నేరగాళ్ల వలలో పడిపోయారు. ఆపై అసలు అంకం ప్రారంభించిన అవతలి వ్యక్తులు టవర్ ఏర్పాటుపై తుది ఉత్తర్వుల్ని తమ లీగల్ విభాగం ఇస్తుందని చెప్పారు. దీని కోసం ఘజియాబాద్‌లో ఉండే ఆ బృందానికి సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.70 వేలు చెల్లించాలని కోరారు. అనుమానం వచ్చిన బాధితుడు హైదరాబాద్‌లో సంస్థ ఉన్నప్పుడు ఘజియాబాద్ ఖాతాల్లోకి డబ్బు ఎందుకు చెల్లించాలంటూ ప్రశ్నించాడు. తమ లీగల్ టీమ్ ఆఫీస్ అక్కడే ఉందంటూ చెప్పిన నేరగాళ్లు ఆ మొత్తం డిపాజిట్ చేయించుకున్నారు. డబ్బు డిపాజిట్ అయిన తర్వాత వారి మాట మారటం, సరైన స్పందన లేకపోవడంతో బాధితుడు తన డబ్బు తిరిగి పొందాలని భావించారు. దీంతో తమ నుంచి తీసుకున్న డబ్బులో కనీసం రూ.50 వేలు అయినా తిరిగి ఇప్పించాలని కోరినా నేరగాళ్లు స్పందించలేదు. దీంతో సదరు ఎంబీఏ విద్యార్థి సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎస్.రామిరెడ్డి దర్యాప్తు చేపట్టారు. నేరగాళ్లు వినియోగించిన ఫోన్ నంబర్లు,బ్యాంకు ఖాతాల ఆధారంగా ముందుకు వెళ్లనున్నారు. -
సెల్ టవర్ ఎక్కిన యువకుడు
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని రామకుప్పం మండలంలో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన బుధవారం కలకలం రేగింది. కాగా మంగళవారం తన సోదరుడు చనిపోవడంతో ఒక వర్గం పెద్దలు స్మశానంలోకి అనుమతించకపోవడంతో మనస్తాపం చెంది సెల్ టవర్ ఎక్కినట్లు సమాచారం. ఈ క్రమంలో శ్మశాన వాటికలపై కూడా కుల రాజకీయం చేస్తున్నారని అతడు ఆరోపించాడు. కాగా హిందూ స్మశాన వాటికను కాస్త కుల స్మశాన వాటికగా బోర్టు మార్చి ఇతరులను అనుమతించకుండ అడ్డుకుంటున్నారని సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. -
భార్య కాపురానికి రావడం లేదని.. టవర్ ఎక్కి..
సాక్షి, తిరుమలాయపాలెం(ఖమ్మం): భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి పురుగుమందు డబ్బాతో సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన పెంటా రాజుకు మండలంలోని కొక్కిరేణి గ్రామానికి చెందిన ఉమతో 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దంపతులు కొక్కిరేణి గ్రామంలోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నారు. మూడేళ్ల నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కాగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో తండ్రికి సంబంధించిన ఉద్యోగం రావడంతో రాజు ఇటీవల కరీంనగర్ వెళ్లాడు. రాజుతోపాటు అక్కడికి వెళ్లేందుకు భార్య నిరాకరించింది. ఈ విషయమై పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. అయినా ఫలితం లేదు. దీంతో విసిగి వేసారిన రాజు గురువారం తెల్లవారుజామున పురుగుల మందు డబ్బాతో కొక్కిరేణి గ్రామంలోని సెల్ టవర్ ఎక్కాడు. తన భార్య కాపురానికి రావాలని, లేకపోతే తాను మందు తాగి చనిపోతానని బెదిరించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాజుతో మాట్లాడారు. భార్యను సంఘటన స్థలానికి పిలిపించి, నచ్చజెప్పి రాజును కిందకు దింపారు. అనంతరం పోలీసులు దంపతులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. రాజుతో కలిసి ఉండాలని ఉమకు చెప్పి ఇరువురిని పంపించారు. -
న్యాయం కోసం సెల్ టవర్ ఎక్కాడు.. అంతలోనే
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవాబ్‌పేటకు చెందిన కిష్టయ్య భూమి విషయంలో తన సోదరునితో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో శుక్రవారం తనకు న్యాయం చేయాలంటూ కిష్టయ్య సెల్ టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కిష్టయ్యను సముదాయించి కిందికి దించే ప్రయత్నంలో అతను ఒక్కసారిగా అదుపుతప్పి టవర్‌పై నుంచి కిందపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ కృష్ణ పేర్కొన్నారు.కాగా కిష్టయ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు అతన్ని హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం అందింది. -
నిజామాబాద్‌లో ఇంటిపై ఉన్న సెల్‌టవర్‌లో మంటలు
-
నిజామాబాద్‌లో కాలి బూడిదైన సెల్ టవర్
-
కాలి బూడిదైన సెల్ టవర్
సాక్షి, నిజామాబాద్ : ఓ భవనంపై ఏర్పాటు చేసిన సెల్ టవర్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి దగ్ధమైన సంఘటన నిజామాబాద్‌లో శనివారం చోటుచేసుకుంది. గాజులుపేటకు చెందిన నరసింహారావు నివాసంపై సెల్ టవర్ ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం నుంచి కరెంట్ లేకపోవడంతో సిబ్బంది జనరేటర్ వేశారు. అయితే షార్ట్ సర్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెల్‌టవర్ కోసం ఏర్పాటు చేసిన గదిలోని సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యింది. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా సెల్ టవర్ అంటుకోవడంతో ఇంటి యజమానితో పాటు, ఆ భవనంలో అద్దెకు ఉంటున్నవారు భయంతో పరుగులు తీశారు. మరోవైపు సెల్ టవర్ అంటుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన సెల్ టవర్‌ను తొలగించాలంటూ స్థానికులు గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. -
డబుల్ బెడ్రూం కోసం సెల్‌టవర్ ఎక్కి..
సాక్షి, కామేపల్లి\ ఖమ్మం: అర్హత ఉన్న తనకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయలేదని, రెవెన్యూ అధికారులు అనర్హులకు మంజూరు చేశారని మనస్తాపానికి గురై సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన కామేపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు స్థానికులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి.. కామేపల్లిలో ప్రభుత్వం నిర్మించిన 20 డబుల్ బెడ్రూం ఇళ్లకు సర్పంచ్ అజ్మీర రాందాస్ అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభను ఏర్పాటు చేసి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంటి నంబర్లను కేటాయించారు. అజ్మీర నరేష్ అనే యువకుడు తనకు డబుల్ బెడ్రూం ఇవ్వాలని కోరుతూ పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి దూకుతానని హల్చల్ చేశాడు. ఎస్సై తిరుపతిరెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని టవర్ దిగి రావాలని పలుమార్లు కోరారు. తనకు ఇల్లు ఇవ్వాలని, సర్వేను తప్పుదోవ పట్టించిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. నరేష్ సెల్ టవర్‌పై ఉండటంతో పలువురు ఫోన్ చేస్తుండగా సెల్‌ను కూడా కిందపడేశాడు. తన డిమాండ్ తీర్చాలని లేనిచో దూకుతానన్నాడు. జెడ్పీటీసీ సభ్యుడు బానోత్ వెంకటప్రవీణ్‌కుమార్‌నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని కలెక్టర్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ బి.శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని రెవెన్యూ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. జెడ్పీటీసీ సభ్యులు, సీఐ, ఎస్సై సమస్యను పరిష్కారం చేస్తామని, కలెక్టర్ హామీ ఇచ్చారని సెల్ టవర్ దిగి రావాలని కోరారు. దీంతో నరేష్ సెల్ టవర్ దిగి వచ్చాడు. కాగా పంచాయతీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ డ్రా పద్ధతి ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, 41 మందిలో ఎవరైనా అనర్హులు ఉంటే ఫిర్యాదు బాక్స్‌లో దరఖాస్తు వేయాలని, అర్హులనే గుర్తించి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. -
అల్లుకున్న బంధంలో.. అపోహల చిచ్చు!
సాక్షి, పర్చూరు: కులాల అడ్డుగోడలను ప్రేమ పిడికిలిలో బద్దలు కొట్టగలిగారు కానీ.. సంసారంలో రగిలిన వివాదాల కుంపట్లకు తాళలేకపోయారు. మనసుతో ఉప్పొంగిన ప్రేమను పెళ్లి తీరాలకు చేర్చగలిగారు కానీ..జీవితంలో వచ్చిన కష్టాల ఆటుపోట్లకు నిలువలేకపోయారు. అంతులేని ప్రేమను ఆప్యాయతల భారంలో అందంగా అమర్చుకున్నారుగానీ.. అర్థం లేని అంతరాల ఆగాధాలను పూడ్చుకోలేకపోయారు. భార్య కాపురానికి రాలేదని సెల్‌టవర్ ఎక్కి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు కానీ.. తాను లేకపోతే ఆమెకు ఊపిరి ఆడదనే విషయాన్ని గుర్తించలేకపోయాడు. రెండు నెలల క్రితం పెళ్లిపీటలెక్కిన నవ దంపతులు నూరేళ్లు కలిసి బతకాల్సిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలనుకున్నారు. భార్య కోసం భర్త ఉసురు తీసుకోవాలనుకోగా భర్త లేనిదే తాను బతకలేనని భార్య పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చందును ఆస్పత్రికి తీసుకెళ్తున్న సీఐ రాంబాబు సెల్‌టవర్ ఎక్కి.. వారిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయినా కాపురంలో కలతలతో భర్త తనను మానసికంగా హిస్తున్నాడని ఆమె పుట్టింటికి వెళ్లింది. తన భార్యను తనతో పంపించాలని అతడు ఆమె ఇంటి వద్ద గొడవ చేశాడు. తమ కుమార్తెను పంపించేది లేదని అత్తింటి వారు హెచ్చరించడంతో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. ఇంతలో పోలీసులు ఆ యత్నాన్ని విఫలం చేశారు. అయినా ఇద్దరూ పురుగుమందు తాగి ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన పర్చూరు మండలం అన్నంభొట్లవారిపాలెంలో మంగళవారం జరిగింది. సినీ ఫక్కీలో చాలాసేపు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా తన భార్యను సెల్ టవర్ వద్దకు తీసుకొచ్చి తనతో మాట్లాడిస్తే సెల్ టవర్ దిగుతానని డిమాండ్ చేశాడు. గ్రామస్తులు, సీఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులోని సువర్ణభారతి నగర్‌కు చెందిన నామాల చందు, అన్నంభొట్లవారిపాలెం గ్రామానికి చెందిన మాదాల విజయలక్ష్మి రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. చందు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న పోలీసులు మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. చందు భార్యను హింసించడంతో పుట్టింటికి చేరింది. చందు సోమవారం రాత్రి భార్య ఇంటికి వెళ్లి తనతో రావాలని కోరాడు. ఆమె నీతో రాననేసరికి గొడవ చేశాడని, చుట్టు పక్కల వారు వచ్చి నీతో ఆమె రాదని చెప్పడంతో ఊరు శివారులోని సెల్‌టవర్ ఎక్కి తన భార్యను పంపించాలని డిమాండ్ చేశాడు. లేకుంటే టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సీఐ రాంబాబు, ఎస్ఐ దాచేపల్లి రంగనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని అతడితో మాట్లాడాడు. కిందకు దిగాలని చెప్పినా అతడు వినిపించుకోలేదు. మీడియా సాక్షిగా నీకు అండగా ఉంటామని, సమస్య పరిష్కరిస్తామని ఇంకొల్లు సీఐ రాంబాబు నచ్చజెప్పారు. అక్కడకు చేరుకున్న చందు బంధువులు కూడా హామీ ఇవ్వాలని కోరాడు. ఎస్ఐ రంగనాథ్, చందు బంధువులు పైకి ఎక్కే ప్రయత్నం చేయగా తన వద్ద ఉన్న పురుగుమందు తాగి దూకేందుకు ప్రయత్నించాడు. అంతా కలిసి పట్టుకుని అతడిని కిందకు దించారు. అంతకు ముందు ఇంటి వద్ద ఉన్న చందు భార్య కూడా పురుగుమందు తాగడంతో కారులో చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చందును కూడా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి అపశృతి చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
భార్య నుంచి విడదీశారని సెల్ టవర్ ఎక్కి..
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా అన్నముబొట్లవారిపాలెంలో సెల్‌టవర్ ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని తన నుంచి విడదీసి.. అక్రమ కేసు పెట్టారని అతను ఆరోపిస్తున్నాడు. తాను పెళ్లి చేసుకున్న యువతిని తనతోపాటు పంపించేవరకు సెల్‌టవర్ దిగేది లేదని పట్టుబట్టాడు. అన్నముబొట్లవారిపాలెంకు చెందిన యువతి గుంటూరులో చదువుకుంటుడగా... ఆటో నడుపుకుంటున్న నామాల చందుతో పరిచయం అయ్యింది. వీరి పరిచయం ప్రేమగా మారడంతో... పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన నెల తర్వాత యువతి తాను మోసపోయానంటూ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసిందని స్థానికులు చెప్తున్నారు. చందూపై పర్చూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని సమాచారం. ఈ క్రమంలో చందూ రాత్రి అన్నముబొట్లవారిపాలెంలోని యువతి ఇంటికి వచ్చి.. ఆమె తల్లిదండ్రులతో గొడవపడ్డాడని చెప్తున్నారు. చుట్టపక్కవారు వచ్చేసరికి అక్కడినుంచి పరారయ్యాడని, ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్లీ సెల్‌టవర్ ఎక్కి చందూ గొడవ చేస్తున్నాడని యువతి బంధువులు మండిపడుతున్నారు. పర్చూరు పోలీసులు యువకుడికి నచ్చజేపే ప్రయత్నం చేస్తున్నారు. -
సెల్ టవర్ ఎక్కి ఆర్టీసీ డ్రైవర్ నిరసన
సాక్షి, కడ్తాల్: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్‌లో వెంకటేష్ అనే ఆర్టీసీ డ్రైవర్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తమ డిమాండ్లు నెరవేరేవరకు సెల్ టవర్ దిగబోనని అతను భీష్మించుకొని కూర్చున్నాడు. దాదాపు గంటసేపు టవర్‌పైన ఉండి నిరసన తెలిపిన వెంకటేశ్‌ను పోలీసులు, స్థానికుల నచ్చజెప్పి కిందకు దించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు రెండో రోజు ఆదివారం కూడా సమ్మె కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సమ్మె విషయంలో ఇటు ప్రభుత్వం అటు కార్మిక సంఘాలు పట్టువిడవడం లేదు. సమ్మె ఎన్నిరోజులు కొనసాగినా కార్మికులతో చర్చలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేయగా.. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని కార్మికులు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ ముగిసినా కార్మికులంతా సమ్మె కొనసాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. -
సెల్ టవర్ ఎక్కిన మహిళ
-
సెల్ టవరెక్కి మహిళ హల్చల్
సాక్షి, నల్లగొండ: భూ వివాదం పరిష్కరించాలంటూ ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసింది. వివరాలు.. జిల్లాలోని నకిరేకల్ మండలం కడపర్థికి చెందిన సోమయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో అంజమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం సోమయ్య మరణించాడు. అయితే చనిపోవడానికి ముందే సోమయ్య తనకున్న రెండెకరాల భూమిని ఇద్దరి భార్యలకు సమంగా పంచాడు. ఈ ఏడాది అంజమ్మ తన పొలంతో పాటు పక్కనే ఉన్న మొదటి భార్య పొలాన్ని కూడా దున్నింది. దాంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమయ్యింది. ఈ వివాదం ఎంతకి తెగకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ అంజమ్మ సెల్ టవర్ ఎక్కింది. విషయం తెలుసుకున్న పోలీసులు కడపర్థి చేరుకుని అంజమ్మను కిందకు దించడానికి ప్రయత్నం చేస్తున్నారు. -
కానిస్టేబుల్ కొట్టాడని హల్చల్
సాక్షి, నిజామాబాద్ : పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ తనపై అకారణంగా చేయి చేసుకున్నాడని, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన గైని లక్ష్మణ్ (27) ఆదివారం మధ్యాహ్నం సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. రెండు గంటల పాటు ఉత్కంఠ సాగింది. తనకు న్యాయం చేయనట్టయితే కిందకు దూకుతానని సెల్‌ఫోన్ ద్వార సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న అతని స్నేహితులు, బంధువులు ఎంత నచ్చచెప్పినా దిగిరాలేదు. సీఐ దామోదర్ రెడ్డి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో లక్ష్మణ్ సెల్‌టవర్ దిగాడు. విచారణ జరిపి కానిస్టేబుల్‌పై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు. లక్ష్మణ్ అతని భార్య మధ్య ఘర్షణ జరుగుతోంది. లక్ష్మణ్ భార్య ఆదివారం ఉదయం పోలీస్‌స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. కౌన్సెలింగ్ చేయకుండానే కానిస్టేబుల్ చేయిచేసుకోవడంతో మనస్తాపం చెందిన లక్ష్మణ్ సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. -
అనుమతి ఒక చోట.. నిర్మాణం మరోచోట
గత టీడీపీ ప్రభుత్వం పాలనలో అవినీతి, అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. అక్రమాలకు కాదేదీ అనర్హం అన్నట్లు గ్రావెల్ తవ్వకాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, నీరు–చెట్టు పనులు అన్నింటిలోనూ తెలుగు తమ్ముళ్లు బరితెగించి సొమ్ము చేసుకున్నారు. చివరకు సెల్ టవర్ నిర్మాణంలోనూ అధికారాన్ని అడ్డంపెట్టుకున్న టీడీపీ మండల అధ్యక్షుడు నాగేంద్రప్రసాద్ అనుమతి ఒక చోట చూపి ప్రభుత్వ భూమిలో సెల్ టవర్ నిర్మించి టవర్ యాజమాన్యం ప్రతినెలా ఇచ్చే అద్దెను జేబులో నింపుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు సెల్ టవర్ తొలగింపునకు శ్రీకారం చుట్టారు. సాక్షి, వెంకటాచలం (నెల్లూరు): వెంకటాచలం మండలం కంటేపల్లి గ్రామ పరిధిలో రిలయన్స్ జియో సెల్ టవర్ నిర్మించేందుకు టీడీపీ మండల అధ్యక్షుడు కుంకాల నాగేంద్ర ప్రసాద్ రిలయన్స్ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గ్రామ పరిధిలోని సర్వే నంబరు 184–3, 184–6,184–7,184–8లో టవర్ ఏర్పాటునకు గత ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీన పంచాయతీ నుంచి తీర్మానం పొందాడు. అయితే టీడీపీ అధికారంలో ఉండడంతో సెల్ టవర్‌ను సర్వే నంబరు 184–2లో ఉన్న 50 సెంట్ల గ్రామ కంఠం విస్తీర్ణంలో నిర్మించాడు. ఈ విషయం రిలయన్స్ జియో టవర్ ప్రతినిధులకు తెలిసినా మౌనం వహించారనే విమర్శలున్నాయి. గ్రామ కంఠం భూమిలో సెల్ టవర్‌ను అక్రమంగా నిర్మించారని పత్రికల్లో కథనాలు వచ్చినా, మండల సర్వసభ్య సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు ప్రశ్నించినా అధికారులు చర్యలు చేపట్టలేదు. మాజీ మంత్రి సోమిరెడ్డి అండతో అక్రమంగా నిర్మించిన సెల్ టవర్ జోలికి ఎవరూ రాకుండా నాగేంద్రప్రసాద్ అధికారులను బెదిరించాడు. దీంతో అప్పట్లో అధికారులు మౌనం వహించారు. మళ్లీ కొందరు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో సెల్ టవర్ నిర్మాణం గ్రామ కంఠం భూమి సర్వే నంబరు 184–2లో నిర్మించారని సర్వేయర్ సర్వేచేసి తేల్చడంతో వాస్తవాలు వెలుగుచూశాయి. సర్వేలో వాస్తవాలు బయటపడటంతో సెల్ టవర్ నిర్మాణాన్ని పరిశీలించి నిర్మించిన వారికి నోటీసులు ఇచ్చి తొలగించేలా చర్యలు చేపట్టాలని డీపీఓ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వెంకటాచలం మండల పంచాయతీ విస్తరణాధికారి రవీంద్రబాబు వెంటనే నోటీసులు ఇచ్చి తొలగించాలని గ్రామకార్యదర్శి నాగవేణును ఆదేశించారు. దీంతో గత నెల 21తేదీన టీడీపీ మండల అధ్యక్షుడు నాగేంద్ర ప్రసాద్‌తోపాటుగా రిలయన్స్ జియో టవర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. అధికారుల ఇచ్చిన నోటీసులకు వారం రోజులలో ఎవరూ స్పందించలేదు. సెల్ టవర్ తొలగింపునకు ఆదేశాలు కంటేపల్లిలో గ్రామ కంఠం భూమిలో నిర్మించిన అక్రమ సెల్ టవర్ నిర్మాణానికి సంబంధించి నోటీసులు ఇచ్చినా స్పందించక పోవడంతో అధికారులు మంగళవారం సెల్ టవర్ తొలగింపునకు శ్రీకారం చుట్టారు. కంటేపల్లి టవర్ వద్దకు గ్రామ కార్యదర్శి నాగవేణు, రెవెన్యూ అధికారులు వెళ్లారు. నాలుగు జేసీబీలు, ఒక పొక్లెయినర్‌ను తీసుకొచ్చి సెల్ టవర్ తొలగింపును ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రిలయన్స్ జియో టవర్ ప్రతినిధులు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని కలిశారు. భూమి యజమాని నిర్లక్ష్యానికి తమ కంపెనీకి తీవ్ర నష్టం జరుగుతుందని, గ్రామ కంఠం విస్తీర్ణంలో సెల్ టవర్ ఏర్పాటు చేసినందువల్ల ఆ పంచాయతికే ప్రతినెలా బాడుగ ఇస్తామని వివరించారు. దీంతో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధికారులతో ఫోన్లో మాట్లాడి సెల్ టవర్ తొలగింపు పనులు తాత్కాలికంగా నిలిపి వేయించారు. -
తాగిన మైకంలో.. సెల్‌టవర్ ఎక్కి హల్చల్..
టేకులపల్లి: తాగిన మైకంలో సెల్ టవర్ ఎక్కి అందరినీ ముచ్చెమటలు పట్టించిన సంఘటన మండలంలోని కోయగూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చీమల భద్రయ్య కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. బుధవారం సాయంత్రం తాగి ఇంటికి వచ్చిన భర్తను భార్య సారమ్మ మందలించింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన భద్రయ్య గ్రామం చివరిలో ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కాడు. చుట్టుపక్కల వారు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలిపారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ ఉమ, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య సంఘటన స్థలానికి చేరుకును పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్, డయల్ 100 వచ్చింది. ఎంత ప్రయత్నం చేసినా స్పందన లేదు.విద్యుత్ సరఫరా ఉంటుందనే భయంతో ఎవరూ పైకి ఎక్కడానికి సాహసించలేదు. రెస్క్యూ టీంని పిలిపించారు. వారు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈలోగా భారీ వర్షం మొదలైంది. టెక్నీషియన్‌తో మాట్లాడి ఆఫ్ చేయించారు. మైక్‌లో ఎస్ఐ మాట్లాడుతూ నిన్ను ఏమీ అనం .. కిందికి రావాలని కోరాడు. ఎస్ఐ విజ్ఞప్తి మేరకు భద్రయ్య కిందికి దిగి పారిపోయాడు. -
ఇప్పుడు గుర్తొచ్చాయ్
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ ప్రజలు అనుమతి లేకుండా ఇల్లు కట్టుకుంటే హడావుడి చేసి కూల్చేసే జీహెచ్ఎంసీ అధికారులు... అక్రమంగా సెల్‌టవర్లు ఏర్పాటు చేసి అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న నిర్వాహకులను మాత్రం ఏమనడం లేదు. సామాన్యులు ఆస్తి పన్ను చెల్లించకుంటే జరిమానాలతో సహా వసూల్ చేసే అధికారులు... దీర్ఘకాలంగా సెల్టవర్ల ఏజెన్సీలు పన్ను చెల్లించకున్నా పట్టించుకోవడం లేదు. ఓవైపు ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడం... మరోవైపు జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో వివిధ ఆదాయ మార్గాలపై దృష్టిసారించిన బల్దియా అధికారులకు ఇప్పుడు సెల్‌టవర్లు గుర్తొచ్చాయి. దాదాపు రూ.15 కోట్ల మేర ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయని గుర్తించిన అధికారులు వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అనుమతి పొందిన ఏజెన్సీల నుంచి రావాల్సిన ఈ ఆస్తి పన్నును లెక్కేసిన అధికారులు... అనధికార టవర్లను గురించి మాత్రం పట్టించుకున్నట్లు లేదు. సెల్‌టవర్ ఏర్పాటు చేసిన ఏజెన్సీలు వన్‌టైమ్ ఫీజు కింద రూ.లక్ష చెల్లించడంతో పాటు ప్రతి ఏటా టవర్‌ను ఏర్పాటు చేసిన ప్రాంతం, స్థల విస్తీర్ణాన్ని బట్టి ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలా కంపెనీలు అసలు వన్‌టైమ్ ఫీజు కూడా చెల్లించలేదని సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలో అనధికారికంగా 3,303 సెల్‌టవర్లు ఏర్పాటు చేసినట్లు దాదాపు రెండేళ్ల క్రితమే గుర్తించిన అధికారులు... వాటి ద్వారా రూ.33 కోట్లకు పైగా రావాల్సి ఉందని లెక్కలేశారు. ఇవికాక ఆస్తి పన్ను రూపేణా అప్పట్లోనే దాదాపు రూ.20 కోట్లు రావాల్సి ఉందని అంచనా వేశారు. వెరసి మొత్తం దాదాపు రూ.50 కోట్లకు పైగా రావాల్సి ఉందని అంచనా వేసినప్పటికీ... ఇంతవరకు ఎంత వసూలైందో మాత్రం వెల్లడించలేదు.తాజాగా సెల్టవర్ల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు చెల్లించాల్సిన ఆస్తి పన్ను దాదాపు రూ.15 కోట్లు వెంటనే కట్టాలని కమిషనర్ ఆదేశించారు. లేని పక్షంలో నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్పష్టత కరువు... 2013లో జారీ చేసిన జీవో ప్రకారం విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఆస్పత్రులు తదితర ప్రదేశాలకు 100 మీటర్లలోపు సెల్టవర్ల ఏర్పాటు నిషిద్ధం. అందుకనుగుణంగా జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొందాకే సెల్‌టవర్‌ను ఏర్పాటు చేయాలి. 2015లో జారీ చేసిన జీవో మేరకు సెల్‌టవర్‌ను ఏర్పాటు చేశాక సమాచారమిస్తే సరిపోతుంది. దీన్ని ఆసరాగా చేసుకొని సమాచారమే ఇవ్వకుండా 3,303 సెల్‌టవర్లు ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ 2017లో పేర్కొంది. వీటిలో ఎంతమంది నిర్వాహకులు ఫీజులు చెల్లించారో? లేక మాఫీ చేశారో? తెలియదు. ఆ తర్వాత కొత్తగా అనధికారికంగా ఇంకా ఎన్ని వెలిశాయో? ఎన్ని అనుమతులు తీసుకొని ఏర్పాటు చేశారో? అధికారులకే తెలియాలి. అధికారుల లెక్క ప్రకారం ఆయా ఏజెన్సీలు చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిలు ఇవీ... -
న్యాయం కోసం.. సెల్ టవర్ ఎక్కిన యువతి
సాక్షి, వరంగల్: తొమ్మిది సంవత్సరాలుగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు ముఖం చాటేశాడంటూ తనకు న్యాయం చేయాలని ఏకంగా సెల్ టవర్ ఎక్కిన యువతి. ఈ ఘటన మంగళవారం జిల్లాలోని పెగడపెల్లిలో చేటు చేసుకుంది. కుటుంబ సభ్యలు, వయుతి తెలిపిన వివరాలు ప్రకారం.. పెగడపల్లికి గ్రామానికి చెందిన దామెరా మాలిక అదే ప్రాంతానికి చెందిన నక్క మహేష్ గత 9 సంవత్సరాలు ప్రేమించుకుంటున్నారు. యువకుడు ఇప్పుడు నీవు నాకు అవసరం లేదంటున్నాడని యువతి సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేయడంతో అమె తల్లిదంద్రుడలు, కుటుంబ సభ్యలు భయందోళనకు గురవుతున్నారు. -
సెల్‌టవర్ ఎక్కి యువకుడి హల్చల్
రాజేంద్రనగర్: ఓటరు లిస్టు నుంచి తన పేరును తొలగించారంటూ ఓ యువకుడు రాజేంద్రనగర్ బుద్వేల్లోని సెల్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. బంధువులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో గంట తర్వాత కిందకు దిగి వచ్చాడు. పొంతన లేకుండా మాట్లాడుతుండడంతో పోలీసులు హెచ్చరించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలుకూరు ప్రాంతానికి చెందిన శ్రావణ్‌కుమార్(28) గతంలో కిస్మత్పూర్ ఉండేవాడు. మంగళవారం రాత్రి కిస్మత్పూర్ ప్రాంతానికి వచ్చి మద్యం సేవించాడు. అనంతరం స్థానికంగా ఉన్న బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లి పొంతన లేని మాటలు మాట్లాడుతూ ఇబ్బంది పెట్టాడు. రాత్రి 11 గంటల వరకు బస్తీలో తిరుగుతుండడంతో యువకులు అతడిని ఇంటికి వెళ్లాలని రోడ్డుపైకి తీసుకువచ్చి వదిలి వేశారు. బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో బుద్వేల్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ ప్రాంతంలో ఉన్న సెల్‌టవర్ ఎక్కి అరుస్తూ కేకలు వేస్తూ దూకుతానని బెదిరించాడు. స్థానికులు గమనించి రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కిస్మత్‌పూర్‌లోని వారి బంధువులు, గ్రామస్తులను పిలిపించి సముదాయించి కిందకు దించారు. కిందకు దిగిన అనంతరం శ్రావణ్‌కుమార్ తన ఓటును తీసివేశారని నాయకులు తనకు ఏమి చేయడం లేదని, మంత్రులు, ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదంటూ ఉద్యమంలో తీవ్రంగా నష్టపోయానని పొంతన లేని సమాధానాలు ఇస్తూ అందరిని దూషించాడు. దీంతో పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి సముదాయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పాసుబుక్కు ఇవ్వడంలేదని టవరెక్కిన రైతు
గన్నేరువరం(మానకొండూర్): అధికారులు వెంట నే తమ భూ సమస్యను పరిష్కరించాలని కోరు తూ మండలంలోని ఖాసీంపేట గ్రామానికి చెంది న జేరిపోతుల చొక్కాయ్య మంగళవారం సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. గ్రామంలోని 276 సర్వేనంబర్‌లో ఎకరం భూమి తన తండ్రి మొండ య్య ద్వారా వారసత్వంగా వస్తుందని తెలిపాడు. దీనికి సంబంధించి పాసుబుక్కును అధికారులు ఇవ్వడంలేదని ఆరోపించాడు. దీంతో రైతుబంధు, రైతుబీమా వర్తించడం లేదని, సమస్య పరిష్కారం కోసం టవర్‌ఎక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలిసి చొక్కాయ్య భార్య లత పిల్లలతో సెల్‌టవర్ వద్దకు చేరుకుంది. తమ భూమి నుంచి వరదకాల్వ వెళ్తోందని, భూముల కోల్పోతున్న రైతుల జాబితాలో తమపేరు ఉందని తెలిపింది. ఈ ఏడాది పంటలను సైతం సాగుచేసినట్లు పేర్కొంది. పాసు బుక్కు ఇవ్వడంలో అధికారులు తిరకాసు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నా రు. ఈ భూమిపై గ్రామానికి చెందిన ఒక రైతు కోర్టుకు వెళ్లాడంతో వివాదం కొనసాగుతోందని, కోర్టు పరిధిలో ఉన్నందున్న జోక్యం చేసుకోలేమని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారించడానికి కృషి చేస్తానని ఎస్సై వంశీకృష్ణ హామీ ఇవ్వడంతో చొక్కాయ్య సెల్ టవర్ దిగివచ్చాడు. తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
ఉద్యోగం కోసం టవరెక్కి హల్చల్
తాండూరు రూరల్: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో ఉన్న చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీలో ఓ భూ నిర్వాసితుడు హల్చల్ చేశాడు. తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామానికి చెందిన ఎరుకలి రాజు శుక్రవారం చెట్టినాడు ఫ్యాక్టరీలో ఉన్న ఓ టవర్ ఎక్కాడు. చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కొరకు రాజుకు సంబంధించిన పొలంను అమ్మాడు. ఆ సమయంలో ఆయనకు ఉద్యోగం కల్పిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. కొన్ని సంవత్సరాలు తర్వాత ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో శుక్రవారం అతడు ఫ్యాక్టరీలో ఉన్న టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఉద్యోగం ఇస్తానని హామీ ఇస్తే తప్పా టవర్ దిగనని చెప్పారు. దీంతో కంపనీ ప్రతినిధులు ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో టవర్ దిగారు. అనంతరం తాండూరు జెడ్పీటీసీ రవిగౌడ్ కంపనీకి చేరుకుని భూ నిర్వాసితుడితో మాట్లాడారు. అనంతరం అతడికి ఉద్యోగం కల్పించాలని కోరారు. -
న్యాయం చేయకపోతే దూకేస్తా...
పాల్వంచ: కేటీపీఎస్‌లో నిర్మాణ కార్మికుడిగా పనిచేసిన తనను ఆర్టిజన్‌గా తీసుకోకపోవడంతో ఆవేదన చెందిన కార్మికుడు, విద్యుత్ టవర్ లైన్ ఎక్కాడు. పట్టణంలోని కరకవాగు గ్రామానికి చెందిన గుగులోతు శ్రీను, గురువారం స్థానిక కేటీపీఎస్ 7వ దశలోని 400 కేవీ విద్యుత్ లైన్ ఎక్కాడు. తాను కేటీపీఎస్ 6వ దశ నిర్మాణంలో, భూపాలపల్లి కర్మాగారంలో, కేటీపీఎస్ 7వ దశలో ఏళ్లతరబడి నిర్మాణ కార్మికుడిగా పనిచేశానని, తనను ఆర్టిజన్ కార్మికుడిగా అధికారులు గుర్తించడం లేదని, తనకు న్యాయం చేయకపోతే దూకి చనిపోతానంటూ గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విద్యుత్ టవర్ ఎక్కాడు. పట్టణ అదనపు ఎస్ఐ రవి, ఎస్పీఎఫ్ ఎస్ఐ తిరుపతి చేరుకున్నారు. సీఈ సమ్మయ్యతో ఎస్ఐ రవి మాట్లాడారు. గుగులోతు శ్రీనుతో సెల్ ఫోన్లో సీఈ మాట్లాడారు. జెన్కో సీఎండీ ప్రభాకర్ రావును కల్పించి సమస్య పరిష్కరిస్తానని సీఈ హామీ ఇవ్వడంతో శ్రీను శాంతించి, సాయంత్రం 5.30 గంటల సమయంలో టవర్ లైన్ పైనుంచి కిందకు వచ్చాడు. తనకు సంబంధం లేని కేసులో ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నెల 22న ఓ యువకుడు (షల్‌మోహన్ నరేష్ బాబు) కూడా విద్యుత్ టవర్ లైన్ ఎక్కిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఐదు రోజుల వ్యవధిలో అదే ప్రాంతంలోని మరో విద్యుత్ టవర్ లైన్‌ను శ్రీను ఎక్కాడు. -
సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి
కృష్ణాజిల్లా, పెనమలూరు : కానూరు గ్రామంలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హడావిడి చేశాడు. తన సోదరుడు ఆస్తి విషయంలో మోసం చేశాడని, పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ అందుకు నిరసనగా ఈ పని చేశాడు. దీంతో పోలీసులు, గ్రామస్తులు వచ్చి అతనిని శతవిధాలా నచ్చజెప్పి కిందకు రప్పించారు. వివరాలిలా ఉన్నాయి. కానూరుకు చెందిన గుడివాక వెంకటేశ్వరరావు (48) ఆటోనగర్‌లో ఇనుప సామాను కొట్టులో పని చేస్తున్నాడు. అతనికి సోదరుడు రాంబాబుతో ఆస్తి వివాదం ఉంది. వీరికి ఆటోనగర్‌లో 500 గజాల స్థలం ఉంది. రాంబాబు 250 గజాలు అమ్ముకున్నాడు. మిగతా 250 గజాల స్థలం వెంకటేశ్వరరావుకు అగ్రిమెంట్ రాశాడు. ఆ స్థలాన్ని వెంకటేశ్వరరావు 2015 సంవత్సరంలో అమ్ముకున్నాడు. అయితే, తన సంతకం పోర్జరీ చేసి స్థలాన్ని అమ్మాడంటూ రాంబాబు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వెంకటేశ్వరరావుపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ ఆస్తి వ్యవహారం సోదరుల మధ్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు మంగళవారం ఉదయం గ్రామంలోని రంగా బొమ్మ వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలని పట్టుబట్టాడు. లేకపోతే పై నుంచి దూకుతానని బెదిరించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. సమాచారం అందుకున్న సీఐ దామోదర్, సిబ్బంది రంగంలోకి దిగారు. గ్రామ మాజీ సర్పంచి అన్నే వేణుగోపాలకృష్ణమూర్తి కూడా వచ్చి సెల్ టవర్‌పై ఉన్న వెంకటేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు. రాంబాబును పిలిపించి, రాజీ చేస్తామని టవర్ దిగాలని కోరారు. దాదాపు గంట పాటు టవర్‌పై హడావిడి చేసిన వెంకటేశ్వరరావు చివరికి రాజీకి ఒప్పుకుని కిందకి దిగి వచ్చాడు. దీంతో పోలీసులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వేధించటం వలనే.. పోలీసులు తరచూ తన ఇంటికి వచ్చి కేసు విషయంలో వేధించటం వలన సెల్ టవర్ ఎక్కానని వెంకటేశ్వరరావు చెప్పాడు. పోలీసులు తరచూ వచ్చి సమన్లు ఇస్తామని ఇబ్బంది పెడుతున్నారని తెలిపాడు. తనను సోదరుడు మో సం చేయటమే కాకుండా పోలీసు కేసు పెట్టడం అన్యాయమని వాపోయాడు. ఈ వ్యవహారం పటమట పోలీస్ స్టేషన్లో మాట్లాడుకోవాలని అతనికి నచ్చజెప్పి అక్కడకు పంపించారు. బాధితుడికి భార్య వీరరాఘవమ్మ, మౌనిక, మోహనసాయి అనే పిల్లలు ఉన్నారు. -
డబ్బు ఇప్పించకపోతే దూకేస్తా?
అడ్డగూడూరు(తుంగతుర్తి) : తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి హల్చల్ సృష్టించాడు. ఈ ఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు..మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన ఏనుగునూతల సంజీవ మండల కేంద్రంలోని ఓ సెల్‌టవర్ ఎక్కాడు. రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి నాలుగు సంవత్సరాల క్రితం తనకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 2లక్షలు తీసుకున్నాడని ఆరోపించాడు. ఆ డబ్బు తనకు ఇప్పించి న్యాయం చేయాలని కోరాడు. లేకుంటే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగివచ్చాడు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మూడు గంటల హైడ్రామాకు తెరపడింది. అయితే ఇదే విషయంపై రామకృష్ణారెడ్డిని వివరణ కోరగా ఆరోపణలు అవాస్తమని కొట్టిపారేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. -
సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్చల్
మడికొండ నల్గొండ: సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేసిన సంఘటన మడికొండలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... మడికొండ గ్రామానికి చెందిన తాటి బద్రి అనే వ్యక్తి మడికొండ శివారులోని ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తూ జీవనం కొసాగిస్తున్నాడు. పాఠశాల విధులకు సరిగా హాజరుకాకపోవడంతో యజమాన్యం బద్రిని విధుల నుంచి తొలగించారు. నాలుగు నెలల క్రితం ఇదే సెల్ టవర్ ఎక్కి పాఠశాల యజమాన్యం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో స్థానిక్ ఇన్స్పెక్టర్ సంతోష్ మాట్లాడి ఇప్పిస్తానని హమీ ఇవ్వడంతో టవర్ దిగాడు. గత వారం రోజుల క్రితం కూడా టవర్ ఎక్కి బెదిరించడంతో స్థానికులు వారించి కిందకు దింపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ఎవరికి చెప్పకుండా మడికొండ జాతీయ రహదారి పక్కన లోతుకుంట వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని బద్రితో మాట్లాడినా... కిందకు దిగకపోవడంతో చేసేది లేక అక్కడే కాపాలా ఉన్నారు. సెల్ టవర్‌పై నిలబడుతూ.. కూర్చుంటూ రాత్రి 8 గంటల వరకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానికులు, వాహనదారులు భారీగా తరలివచ్చారు. అయితే స్థానికులను చూసి సెల్ టవర్‌పై ఇంకా ఎక్కువ చేస్తున్నాడని పోలీసులు అందరిని పంపించారు. ఇంట్లో ఏమైనా గొడవ అయిందా అని అడుగగా ఏమి గొడవ లేదు.. ఇంతకు ముందు ఇలాగే రెండు, మూడు సార్లు చేశాడని, మా పరువు తీసున్నాడని బద్రి భార్య రాధ భోరున విలపించింది. కాగా స్థానికులు, పోలీసులు దిగమని కోరడంతో శనివారం రాత్రి 9.50 గంటలకు బద్రి కిందికి దిగాడు. -
ప్రత్యేకహోదా కోసం సెల్‌టవర్ ఎక్కిన ప్రభుత్వ ఉద్యోగి
-
ప్రత్యేక హోదా : సెల్ టవర్ ఎక్కిన విజయ్ భాస్కర్
సాక్షి, అనంతరపురం : ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ నవ్యాంధ్ర డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు విజయ్ భాస్కర్ సెల్ టవర్ ఎక్కారు. ధర్మవరంలో శనివారం సెల్ టవర్ ఎక్కిన విజయ్ భాస్కర్ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇటీవల వరంగల్‌లో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కిన విషయం తెలిసిందే. చిత్తూరులో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం విధితమే. -
న్యాయం కోసం సెల్‌టవర్ ఎక్కిన మహిళ
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): తన భర్త మరణించిన తరువాత తల్లిదండ్రులు, అత్తవారిచ్చిన స్థలాన్ని కొంతమంది కబ్జా చేసినా తననెవరూ ఆదుకోలేదని.. తనకు న్యాయం చేయకపోతే కిందకు దూకి మరణిస్తానని ఓ మహిళ సెల్ టవర్ ఎక్కిన ఘటన విశాఖలో కలెక్టరేట్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. మల్కాపురం అంబేడ్కర్ కాలనీకి చెందిన బాధితురాలు ఉల్లసి లక్ష్మికథనం ప్రకారం.. ఆమె భర్త అనారోగ్యంతో మూడేళ్ల కిందట మరణించాడు. ఇద్దరు ఆడపిల్లలతో కూలి పని చేసుకుంటూ జీవిస్తోంది. అంబేడ్కర్ కాలనీలో ఓ స్థలాన్ని తన తల్లిదండ్రులు పెళ్లి సమయంలో కట్నంగా ఇచ్చారని, ఆ స్థలాన్ని భూషణ్ అనే రిటైర్డ్ పోలీసు అధికారి కబ్జా చేశాడని, తనపై భౌతిక దాడి చేసి హింసించాడని తెలిపింది. అంతేకాకుండా తన అత్త వారి ఊరైన నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలో తన భర్త ఆస్తి 50 సెంట్ల భూమిని గోర్స సత్యారావు అనే వ్యక్తి కబ్జా చేçసి, తన పేర రాయించుకున్నాడని, ఈ విషయాన్ని మండల అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పేర్కొంది. కాగా విషయం తెలుసుకున్న కలెక్టరేట్ సూపరింటెండెంట్ సూర్యప్రకాష్ ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. విశాఖ ఆర్డీవో తేజ్‌భరత్ ఆమెతో మాట్లాడుతూ అన్యాయం గురించి తెలుసుకుంటున్న సమయంలో పోలీసులు వెనక నుంచి ఎక్కి చాకచక్యంగా ఆమెను పట్టుకుని కిందకు దించారు. అనంతరం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ దగ్గరకి తీసుకుని వెళ్లారు. ఆయన విచారణ జరిపించి న్యాయం చేస్తామని బాధితురాలు ఉల్లసి లక్ష్మికి హామీ ఇచ్చారు. ఇదీ ఆమె వేదన.. ఇరవై ఏళ్ల కిందట తన తల్లిదండ్రులు అంబేడ్కర్ కాలనీలో రూ.6 లక్షల విలువైన ఇంటి స్థలాన్ని కట్నంగా ఇచ్చారని, ఇప్పుడు ఆ స్థలాన్ని రిటైర్డ్ పోలీసు భూషణ్ అనే వ్యక్తి కబ్జా చేసి వేరే వాళ్లకు అమ్మేందుకు చూస్తున్నారని లక్ష్మి తెలిపింది. ఇదే విషయమై మాల్కపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తే భూషణ్ వచ్చి తనను భౌతికంగా కొట్టాడని వాపోయింది. అక్కడ పోలీసులు గానీ, అధికారులు గానీ ఎవరూ తన బాధను పట్టించుకోకుండా భూషణ్ దగ్గర డబ్బులు తీసుకుని తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వాపోయింది. అలాగే తన భర్త ఊరిలో తన అత్త పేరుతో సర్వే నంబర్253/1లో 70 సెంట్ల స్థలం ఉందని, దీని విలువ ప్రస్తుతం రూ.30 లక్షలుంటుందని తెలిపింది. దానిని గోర్స సత్యారావు అనే అతను అక్రమించి తన భూమిని ఆయన పేరుతో పట్టాలో ఎక్కించుకున్నాడని చెప్పింది. ఇదే విషయమై లెక్కలేనన్ని సార్లు నక్కపల్లి మండల అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదని వాపోయింది. అలాగే నక్కపల్లిలో ఉన్న హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి వెళ్లే దారిలో తనకు, తన బావకు సర్వే నంబరు 253/2లో సుమారు కోటి రూపాయల విలువైన 2.16 ఎకరాల భూమి ఉందని..దీన్ని నూకరాజు అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చామని తెలిపింది. ఒప్పందం ప్రకారం జూన్ 10, 2018 నాటికి కౌలుకాలం ముగిసినా..తమకు భూమి స్వాధీనం చేయకుండా..దిక్కున్న చోట చెప్పుకోండంటున్నాడని వాపోయింది. టీడీపీ మహిళా నేత మోసం! మల్కాపురంలోని అంబేడ్కర్‌నగర్‌లో ఉన్న ఇంటి స్థలానికి ప్రభుత్వ పట్టా ఇప్పిస్తానని నమ్మబలికి తెలుగుదేశం పార్టీకి చెందిన రాజీమణి అనే నాయకురాలు తన వద్ద నుంచి రూ. 3 వేల లంచం తీసుకుని మోసం చేసిందని లక్ష్మి ఆరోపించింది. భూషణ్, రాజీమణి బంధువులు కావడంతో తనకు ఇంటి పట్టా రాకుండా అడ్డుకుంటున్నారని, ఏడాదిగా ఎనిమిదిసార్లు కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేసినా.. తనకు న్యాయం జరగలేదని చెప్పింది. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలని.. తన అసక్తతకు ఆవేదన చెంది..ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నానని కన్నీళ్లతో చెప్పింది. -
ప్రియురాలు సెల్ టవర్ ఎక్కి!
-
లవర్ ముఖం చాటేశాడని సెల్ టవర్ ఎక్కి!
సాక్షి, భువనగిరి : ప్రేమించినప్పుడు తనతో సరదాగానే ఉన్నాడు. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి కథ అడ్డం తిరిగింది. మాటిచ్చిన ప్రియుడు ఆమెకు ముఖం చాటేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువతి ఏకంగా సెల్ టవర్ ఎక్కడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన పల్లపు జ్యోతి, వలిగొండ మండల కేంద్రానికి చెందిన రావుల భాస్కర్ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ అన్నప్పుడు తనతో సరదాగా సమయం గడిపిన ప్రియుడు పెళ్లి మాట ఎత్తేసరికి దూరంగా ఉంటున్నాడు. పెళ్లి చేసుకోవాలని భాస్కర్‌ను గట్టిగా నిలదీయడంతో అందుకు అతడు నిరాకరించాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని యువతి వాపోయారు. ఇంకో పెళ్లికి సిద్ధపడుతున్నాడని ఆరోపిస్తూ.. ప్రియుడి ఇంటి ముందు గత మూడు రోజులుగా బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నా న్యాయం జరగడం లేదని మనస్తాపానికి లోనయ్యారు. ఆమె స్థానిక వెంకటేశ్వర థియేటర్ పక్కన ఉన్న సెల్ టవర్ ఎక్కారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేశారు. -
మైనర్ బాలికతో ప్రేమ.. టవరెక్కిన యువకుడు
సాక్షి, నల్గొండ : తమ ప్రేమను బతికంచండంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి సెల్ టవర్ ఎక్కిన ఘటన నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించింది. కొండమల్లేపల్లికి గ్రామానికి చెందిన ఓ యువకుడు మంగళవారం ఉదయం సెల్‌టవర్ ఎక్కాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బంధించారని, ఆమెతో మాట్లాడిస్తేనే కిందకు దిగుతానని లేదంటే దూకుతానని హెచ్చరిస్తున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది యువకుడికి నచ్చజెప్పి కిందికి దింపే ప్రయత్నం చేస్తున్నారు. మా అమ్మాయి మైనర్ ఆ యువకుడిపై అమ్మాయి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ అయిన తమ కుమార్తెను ఆ యువకుడు ప్రలోభాలకు గురి చేశాడని వారు మండిపడ్డారు. తమ కూతురికి మైనారిటీ తీరలేదని, అందుకే ఇప్పుడు పెళ్లి చేయలేమని ఆమె తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. తమ కూతురుని బంధించలేదని, మైనారిటీ తీరకుండా వివాహం ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు. సూసైడ్‌నోట్.. సెల్‌టవర్ ఎక్కిన ఆ యువకుడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో.. గత నాలుగు సంవత్సరాలుగా తాము ప్రేమించుకుంటున్నామని, ప్రేమ విషయం తెలిసి తనపై ఆమె తల్లిదండ్రులు అక్రమ కేసులు పెట్టించారని ఆ యువకుడు పేర్కొన్నాడు. ఇద్దరివి వేరువేరు కులాలు కావడంతోనే తమ ప్రేమను అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. గతంలో తమను కొట్టారని.. అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామని నోట్లో తెలిపాడు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారని, ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను బంధించి చిత్రవదలకు గురిచేస్తున్నారని తన లేఖలో వివరించాడు. -
నక్సల్స్ ప్రాంతాల్లో 4 వేల సెల్ టవర్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 4,072 సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. మొబైల్ టవర్ ఫేజ్–2 కింద 10 రాష్ట్రాల్లో టవర్ల ఏర్పాటుకు టెలికం కమిషన్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదానికి ఈ ప్రతిపాదనను పంపింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సెల్ టవర్ల ఏర్పాటు ద్వారా మొబైల్ ఫోన్ల వాడకం పెరగడంతో కొంత మేర భద్రత సవాళ్లను అధిగమించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త టవర్లలో జార్ఖండ్‌లో 1,054, ఛత్తీస్‌గఢ్‌లో 1,028, ఒడిశాలో 483, ఆంధ్రప్రదేశ్‌లో 429, బిహార్‌లో 412, పశ్చిమ బెంగాల్లో 207, ఉత్తరప్రదేశ్‌లో 179, మహారాష్ట్రలో 136, తెలంగాణలో 118, మధ్యప్రదేశ్‌లో 26 టవర్లను ఏర్పాటు చేయనున్నారు. -
సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్చల్
మడికొండ:సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేసిన సంఘటన మడికొండలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మడికొండ గ్రామానికి చెందిన తాటి బద్రి అనే వ్యక్తి మడికొండ శివారులో ఉన్న రామన్ స్కూల్లో పని చేస్తూ జీవిస్తున్నాడు. గత నెల రో జుల క్రితం పాఠశాల యజమాన్యం పనిలో నుంచి తీసివేయడంతో మానసికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చె ప్పారు. గురువారం ఎవరికి చెప్పకుండా మడికొండ జాతీ య రహదారి పక్కన లోతుకుంట వద్ద ఉన్న సెల్ టవర్ ఎ క్కడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అం దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బద్రిని తాళ్లతో కట్టి కిందకు దించారు. తిరిగి గంట తర్వాత మళ్లీ టవర్ పైకి ఎక్కి నాకు ఉద్యోగం ఇప్పించాలని, లేదంటే కిందకు దూకుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో మడికొండ ఇన్స్పెక్టర్ సంతోష్‌కుమార్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని టవర్ పైకి ఎందుకు వెళ్లావని బద్రిని అడగటంతో స్కూల్ నుంచి తనను తీసివేశారు, మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని బద్రి చెప్పాడు. దీంతో రామన్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేష్‌కుమార్‌ను అక్కడికి పిలిపించి మాట్లాడించి కిందకు దింపారు. -
టవర్ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య
ఇల్లంతకుంట(మానకొండూర్): ఒకవైపు పేదరికం.. మరోవైపు జీవితంలో ఇంకా స్థితపడలేదనే మనోవేదనకు గురైన ఓ యువకుడు మూడు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయి ఇంటి సమీపంలోనే ఉన్న సెల్ టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుంభం గోవర్ధన్(22) అనే యువకుడు డిగ్రీలో ఫేయిల్ అయిన సబ్జెక్టులను ఇటీవలే రాశాడు. మూడు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోగా కుటుంబసభ్యులు బంధువులకు ఫోన్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. గురువారం సాయంత్రం సెల్ టవర్ కంపెనీ ప్రతినిధులు టవర్ వద్దకు రాగా దుర్వాసన వెదజల్లడంతో లోపలికి వెళ్లి చూసే సరికి కుల్లిపోయిన మృతదేహం కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి ఎస్సై చంద్రశేఖర్ చేరుకుని మృతుడి జేబులోని పర్సు, ఫోన్‌ను పరిశీలించగా కుంభం గోవర్ధన్ మృతదేహంగా గుర్తించారు. పేదరికం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి తండ్రి చంద్రమౌళి, ఇద్దరు సోదరులున్నారు. సోదరుడు సాయికిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. -
సీఎం కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటా
పట్నంబజారు (గుంటూరు): ‘‘నా భర్త శవంతో రాజకీయాలు చేస్తున్నారు. ఎవరు తప్పు చేసినా చర్యలు చేపడతానని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలపై ఏం చర్యలు తీసుకుంటున్నారు. నా సమస్యలు పరిష్కరించకుంటే ఈసారి సీఎం కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటా’’ అంటూ తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త అయిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన నర్రా లలిత శనివారం గుంటూరు నగరంపాలెంలోని రిజిస్ట్రారు కార్యాలయంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది. సుమారు మూడు గంటలకు పైగా సెల్‌టవర్‌పైనే కూర్చుంది. ఈ విషయం తెలుసుకున్న గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కేజీవీ సరిత, సీఐ వై.శ్రీధర్‌రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ శ్రీధర్‌రెడ్డి సెల్‌టవర్ ఎక్కి మహిళ సమస్యలు అడిగి తెలుసుకుని హామీ ఇవ్వడంతో లలిత కిందకు దిగారు. అనంతరం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి గ్రామానికి పంపినట్టుసీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలతో ప్రాణభయం సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టిన నర్రా లలిత మీడియాతో మాట్లాడుతూ, తన భర్త సాంబశివరావు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తనకు న్యాయంగా రావాల్సిన ఆస్తులను రానీయకుండా తన మామగారు మోహన్‌రావు, ఆడపడుచు భర్త జాగర్లమూడి శ్రీనివాసరావు అడ్డుపడుతూ ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని, వారికి స్థానిక టీడీపీ నేతలు, పోలీసులు అండగా ఉన్నారని ఆరోపించారు. తన భర్త కేసు విషయంలో వాస్తవాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో, ఈనెల 2వ తేదీ రాత్రి తమ ప్రాంతంలోని రౌడీషీటర్ మొవ్వా బుల్లయ్య, జాగర్లమూడి శ్రీనివాసరావు, కాపా శ్రీకాంత్, గడ్డం మురళీకృష్ణ తన ఇంటికి వచ్చి చంపుతామని బెదిరింపులకు దిగారని తెలిపారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్లు చెప్పి రౌడీషీటర్లతో పాటు మాజీ ఎంపీపీ పూనాటి రమేష్ తనను భయపెడుతున్నారని పేర్కొన్నారు. చేబ్రోలు సీఐ, వట్టిచెరుకూరు ఎస్ఐ వారికి వంత పాడుతున్నారన్నారు. వట్టిచెరుకూరు ఎస్ఐ అశోక్ తనపై వ్యభిచారం కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
అత్తవారితో డేంజర్.. సెల్ టవరెక్కిన మహిళ
-
సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యా బెదిరింపు
అన్నానగర్: కోవిల్పట్టిలో ఆదివారం సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యా బెదిరింపులు చేసిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోవిల్పట్టి సమీపం వానరముట్టి ఉత్తర వీధికి చెందిన సంగయ్య కుమారుడు మారిముత్తు (30), వ్యాన్ డ్రైవర్. ఇతనికి కనక అనే భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మారిముత్తు శనివారం రాత్రి బైక్‌పై వానరముట్టి సమీపంలో వెళుతుండగా వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు అడ్డుకుని అసభ్యంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో మారిముత్తు ఆవేశంతో పోలీసుల తీరుకు నిరసనగా వానరముట్టి అంబలవీధిలోని 200అడుగుల సెల్‌ఫోన్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. దీనిపై సమాచారం అందుకున్న కోవిల్పట్టి జాయింట్ పోలీసు సూపరింటెండెంట్ జభరాజ్, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మారిముత్తుతో చర్చలు జరిపి కిందకు తీసుకొచ్చారు. మారిముత్తుపై ఆత్మహత్యా బెదిరింపు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
హైడ్రామా.. టవరెక్కిన ప్రేమికుడు..!
సాక్షి, తిరువళ్లూరు: ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు సెల్‌ఫోన్ టవరెక్కి ఆత్మహత్యా బెదిరింపులకు దిగాడు. మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడని ఆ అమ్మాయిని పోలీసులు తల్లిదండ్రులతో పంపారు. దీంతో ఆ యువకుడు మనస్తాపం చెంది బుధవారం సెల్‌ఫోన్ టవరెక్కాడు. భార్యను తనతో పంపేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని టవరెక్కి బెదిరించడంతో ఉద్రిక్తతకు నెలకొంది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌లోని కొప్పూర్ గ్రామానికి చెందిన మారియప్పన్ కుమారుడు గజేంద్రన్ (21). ఇతను అదే ప్రాంతానికి చెందిన ప్లస్‌టూ విద్యార్థినిని వారం రోజుల కిందట తిరుమలలో వివాహం చేసుకున్నాడు. ఇలాఉండగా బాలిక అదృశ్యంపై ఫిర్యాదు మేరకు మనవాలనగర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక తిరుమలలో ఉన్నట్టు గుర్తించి మూడు రోజుల క్రితం వారిని తిరువళ్లూరు తీసుకొచ్చారు. అనంతరం బాలిక మైనర్ అని తెలియడంతో కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్దరిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. టవరెక్కి బెదిరింపులు: మైనర్ కావడంతో రహస్యంగా చేసుకున్న పెళ్లి చెల్లదని పోలీసులు చెప్పి ఇద్దరినీ వారి తల్లిదండ్రుల వద్దకు పంపారు. గజేంద్రన్ సెల్ఫోన్లో ఉన్న పెళ్లి ఫొటోలను తొలగించారు. ఈ నేపథ్యంలో ఇద్దరినీ బలవంతంగా విడదీశారని యువకుడు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టవరెక్కి ఆత్మహత్యా బెదిరింపులకు దిగాడు. తిరువళ్లూరు అదనపు ఎస్పీ తిలైనటరాజన్, 20 మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చారు. యువకుడితో కింద నుంచే చర్చలు జరిపారు. తన భార్య వచ్చే వరకు కిందకు దిగనని, ఎవరైనా టవర్‌పైకి రావాలని ప్రయత్నిస్తే దూకేస్తానని యువకుడు బెదిరించాడు. మీడియా ముసుగులో వెళ్లిన పోలీసు: మీడియాతో సమస్యను చెప్పుకోవడానికి ఆ యువకుడు అంగీకరించాడు. ఓ కానిస్టేబుల్‌ను మీడియా ప్రతినిధిగా టవర్‌పైకి పంపారు. మళ్లీ అతను మనసు మార్చుకుని భార్యను చూపిస్తే తప్ప దిగనని భీష్మించుకున్నాడు. అప్పటికే టవర్ పైకి వెళ్లిన కానిస్టేబుల్ గజేంద్రన్తో లైవ్‌లో మాట్లాడిస్తానని చెప్పి నమ్మించి దగ్గరికి వెళ్లి పట్టుకున్నాడు. మరికొంత మంది పోలీసులు పైకి వెళ్లి రాత్రి 9 గంటలకు యువకుడిని కిందకు దించారు. దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన ఈ హైడ్రామా సుఖాంతం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
సెల్‌టవర్ ఎక్కిన ఎమ్మార్పీఎస్ నేత
మహబూబ్‌నగర్ క్రైం: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను విడుదల చేయాలనే డిమాండ్‌తో ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. దీంతో అక్కడకు పెద్దసంఖ్యలో స్థానికులు చేరుకోగా ట్రాఫిక్ జాం కావడంతో దాదాపు అర గంట పాటు ఉట్కంఠ నెలకొంది. హన్వాడ మండల ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి కేశవులు మంద కృష్ణను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌తో సోమవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో బాధం సరోజిని దేవి ఆడిటోరియం ఆవరణలో ఉన్న బీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్ ఎక్కాడు. అక్కడకు చేరుకున్న టూటౌన్ సీఐ డీవీపీ.రాజు, ఎస్ఐ మురళి అతడికి నచ్చచెప్పినా కిందకు రాలేదు. ఆ తర్వాత మంద కృష్ణ జైలు నుంచి విడుదల అయ్యాడని ఫోన్లో సమాచారం ఇవ్వడంతో కేశవులు కిందకు దిగాడు. ఈ మేరకు కేశవులుపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో 309 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
నమ్మించి నట్టేట ముంచేసి..
నల్లగొండ టూటౌన్ :అమాయక రైతులకు మాయమాటలు చెప్పాడు.. ప్లాట్లు ఇప్పిస్తానని నమ్మబలికాడు.. రూ.కోటికిపైగా డబ్బులు వసూలు చేసి ఉడాయించాడు. న్యాయం చేయాలని కోరుతూ బాధితులు సోమవారం కలెక్టర్‌ను ఆశ్రయిం చా రు. వివరాలు.. నాంపల్లి మండలం లక్ష్మణాపురంలో లక్ష్మీనర్సింహస్వామి రిజర్వాయర్ నిర్మాణంలో గ్రామం మొత్తం ముంపునకు గురైంది. దీంతో ప్రభుత్వం బాధిత రైతులకు ఎకరాకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇచ్చిం ది. ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన దేప ఈశ్వర్‌రెడ్డి ముంపు బాధితులకు హైదరాబాద్‌లో ప్లాట్లు ఇప్పిస్తానని నమ్మ బలికి సుమారు కోటి రూపాయాలకు పైగా వసూలు చేశాడు. హైదరాబాద్‌లో ఉంటున్న ఈశ్వర్‌రెడ్డి 20 రోజుల నుంచి గ్రామానికి రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన రైతులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లినా ఆచూ కీ లభించలేదు. తాము మోసపోయామని గ్రహించిన గ్రామానికి చెందిన 11 మంది రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేసి ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సెల్ టవర్ ఎక్కిన యువకుడు ... తమ ఊరు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయామని, ఇలా తమను నిండా ముంచినా నాంపల్లి పోలీసులు తమకు న్యాయం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితుడు ఆరోపించారు. తమకు డబ్బులు ఇప్పించాలని కోరుతూ లక్ష్మాపురం గ్రామానికి చెందిన గడ్డి లింగయ్య అనే యవకుడు కలెక్టరేట్ ఆవరణలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. యువకుడు సెల్ టవర్ ఎక్కడంతో కలకలం రేగింది. డీఎస్పీ సుధాకర్, పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. జేసీ నారాయణరెడ్డి సెల్ టవర్ దగ్గరకు వచ్చి యువకుడితో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో కిందకి దిగాడు. పోలీసులు బాధిత రైతులతో పాటు టవర్ ఎక్కిన యువకుడిని జేసీ చాంబర్‌కు తీసుకెళ్లారు. జేసీ వారి నుంచి వివరాలు సేకరించారు. కలెక్టర్‌తో కూడా మాట్లాడారు. ఎస్పీతో మాట్లాడా.. లక్ష్మాపురం గ్రామానికి చెందిన రైతులు ఓ ప్రైవేట్ వ్యక్తికి డబ్బులు ఇచ్చి అతని చేతిలో మోసపోయారని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ విలేకరులకు తెలిపారు. ప్రజా వాణిలో ఫిర్యాదు చేశారని, జిల్లా ఎస్పీ, ఆర్డీఓ, డీఎస్పీ, తహసీల్దార్‌తో మాట్లాడడం జరిగిందని తెలి పారు. మోసం చేసిన వ్యక్తి ఈశ్వర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతనిపై ఎల్బీనగర్లో కూడా మోసాలకు సంబంధించిన విషయంలో కేసు నమోదు అయినట్లు తెలిపారు. ప్లాట్లు ఇప్పిస్తామని ఈశ్వర్‌రెడ్డి గ్రామస్తులతో పాటు అతని సమీప బంధువులను కూడా మోసం చేశాడని తెలిపారు. ఇలాంటి వ్యక్తులను నమ్మి రైతులు ఎవరు డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. – కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ -
అందులో మా తప్పేం లేదు: కామినేని
సాక్షి, విజయవాడ : గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో కడప ఫాతిమా మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు, ఒక విద్యార్థి తండ్రి గుణదలలోని సెల్ టవర్ ఎక్కడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఆందోళన నేపథ్యంలో ఏపీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న స్టూడెంట్స్ కు గవర్నమెంట్ కళాశాలలో సీట్లు ఇవ్వడానికి అభ్యంతరం తెలిపిందన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధనను సుప్రీంకోర్టు కొట్టివేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఫాతిమా విద్యార్ధుల విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ లెటర్ రాసినట్లు తెలిపారు. ఫాతిమా కళాశాల విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాని, ప్రమేయం గాని లేదని.. కాలేజీ యాజమాన్యమే తప్పు చేసిందని మంత్రి కామినేని ఆరోపించారు. ఫాతిమా విద్యార్ధుల సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి జె.పి.నడ్డాతో, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుధాన్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు మంత్రి కామినేని శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. ఫాతిమా మెడికల్ కళాశాల సమస్యలపై ఈ నెల 29,30న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. విద్యార్ధుల అభ్యర్ధన మేరకే వారి సమస్యలపై విద్యార్ధుల ముందే ఫాతిమా కళాశాల యాజమాన్యంతో మాట్లాడాం తప్ప, అంతకు మించి యాజమాన్యంతో ఇతర విషయాలు చర్చించలేదని మంత్రి కామినేని చెబుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలపై తమకు నమ్మకం పోయిందని బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల ఉపఎన్నిక సమయంలో సీఎం చంద్రబాబు తమకు వేరే కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు విద్యార్థులు, ఒక విద్యార్థి తండ్రి తమకు న్యాయం చేయాలని కోరుతూ గుణదలలో సెల్ టవర్ ఎక్కారు. -
సెల్‌టవర్‌పై ఆరుగురు.. గుణదలలో టెన్షన్.. టెన్షన్
సాక్షి, విజయవాడ: కడప ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళన కొత్త మలుపు తిరిగింది. గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఫాతిమా మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు, ఒక విద్యార్థి తండ్రి గుణదలలోని సెల్ టవర్ ఎక్కడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇవ్బకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలపై తమకు నమ్మకం పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల ఉపఎన్నిక సమయంలో సీఎం చంద్రబాబు తమకు వేరే కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. రేపు (సోమవారం) సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామంటూ కలెక్టర్ లక్ష్మీకాంతం వారికి నచ్చజెప్పినా విద్యార్థులు వినడం లేదు. తక్షణం వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సెల్ టవర్ వద్దకు వచ్చి మీడియా సమక్షంలో తమ సమస్య పరిష్కారంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు గంటలుగా విద్యార్థులు సెల్‌టవర్‌పై ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించక పోవడం సిగ్గుచేటని అక్కడికి చేరుకున్న వైఎస్ఆర్ సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఇప్పటివరకూ నాలుగుసార్లు సీఎం చంద్రబాబును కలిసినా ప్రయోజనం లేకపోయిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే వైఎస్ జగన్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కు లేఖ రాశారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు సెల్ టవర్ ఎక్కారని తెలిపారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అసలు వివాదం ఏంటంటే.. 'ఫాతిమా కాలేజీ 2015-16 బ్యాచ్ విద్యార్థుల అడ్మిషన్లను సరైన వసతులు లేని కారణంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎమ్సీఐ) రద్దు చేసింది. తొలి రెండు దశల్లో నిర్వహించిన కౌన్సెలింగులో విద్యార్థుల చేరికకు ఎమ్సీఐ అనుమతి ఇవ్వలేదు. కాలేజీ యాజమాన్యం హైకోర్టు ఉత్తర్వులతో మూడో దశ కౌన్సెలింగులో 100 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. అనంతరం ఈ విద్యార్థుల సీట్లను ఎమ్సీఐ రద్దు చేసింది. దీంతో ఆ విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగిపోయింది. తమకున్న సీట్లలోని వంద సీట్లను ఏపీ ప్రభుత్వం ఇవ్వడానికి నిరాకరించడంతో ఇతర కాలేజీల్లో చేర్చాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. -
సెల్ టవర్ ఎక్కిన ఫాతిమా మెడికల్ విద్యార్థులు
-
సెల్ టవర్ ఎక్కిన ఫాతిమా విద్యార్థులు
సాక్షి, విజయవాడ: ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళన కొత్త దోవ పట్టింది. గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు గుణదల ప్రాంతంలో సెల్ టవర్ ఎక్కారు. ఐదుగురు విద్యార్థులు, ఓ విద్యార్థి తండ్రి గుణదలలోని సెల్ టవర్ ఎక్కారు. తమకు ప్రభుత్వం నుంచి న్యాయం చేస్తాననే హామీ ఇవ్వకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సెల్ టవర్ దిగేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. సెల్ టవర్ ఎక్కిన వారికి నచ్చజెప్పి కిందకు దించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులతో కలెక్టర్ లక్ష్మీకాంతం చర్చలు జరుపుతున్నారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ సీపీ నేత మేరుగ నాగార్జున, విద్యార్థి విభాగం నేత అంజిరెడ్డి, పలువురు ప్రజా సంఘాల నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
విశాఖలో మళ్లీ అన్నల అలజడి
-
‘టవర్ల’ టోకరా!
- జీహెచ్ఎంసీ నెత్తిన ‘సెల్’ టోపీ - అనుమతుల్లేకుండానే టవర్ల ఏర్పాటు - ఆ తర్వాత ఫీజులు, ఆస్తిపన్ను కట్టని వైనం - రూ.50 కోట్ల మేర జీహెచ్ఎంసీకి నష్టం సాక్షి, హైదరాబాద్: సామాన్యులు నివాస గృహానికి అనుమతి తీసుకోకున్నా.. ఆస్తిపన్ను చెల్లించకున్నా పెనాల్టీలతో కలిపి ముక్కుపిండి వసూలు చేసే జీహెచ్ఎసీ యంత్రాంగం.. సెల్ టవర్ల నిర్వాహకులు విషయంలో చూసిచూడనట్టు వదిలేస్తున్నాయి. వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సెల్ టవర్ నిర్వాహకులు అనుమతులే తీసుకోకున్నా, ఆస్తి పన్ను చెల్లించకున్నా పట్టించుకోవడం లేదు. దీంతో జీహెచ్ఎంసీ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఫీజులు ఎగ్గొడుతున్న కంపెనీలు.. నగరంలో సెల్ టవర్ ఏర్పాటు చేసిన కంపెనీ జీహెచ్ఎంసీకి వన్‌టైమ్ ఫీజు కింద రూ.లక్ష చెల్లించాలి. సెల్ టవర్‌ను ఏర్పాటు చేసిన స్థల విస్తీర్ణాన్ని బట్టి ఏటా ఆస్తిపన్ను చెల్లించాలి. అనుమతులే లేకుండా టవర్లను ఏర్పాటు చేస్తున్న కంపెనీల నిర్వాహకులు, ఏర్పాటు తర్వాత ఫీజులు కూడా చెల్లించడం లేదు. గ్రేటర్లో అనధికారికంగా 3,303 సెల్ టవర్లను గుర్తించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో వెల్లడించారు. ఈ లెక్కన జీహెచ్ంఎసీకి రూ.33 కోట్లకుపైగా రావాలి. ఇది టవర్ల ఏర్పాటుకు సంబంధించిన ఫీజు మాత్రమే. ఆస్తిపన్ను రూపేణా ఒక్కో టవర్ నుంచి సగటున రూ.20 వేల వరకు రావాలి. అనుమతి పొందిన, అనుమతి లేని అన్ని టవర్ల నుంచి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఆస్తిపన్ను రావాల్సి ఉంటుందని అంచనా. అనుమతి తీసుకున్న సంస్థలు సైతం సెల్ టవర్లకు సంబంధించిన ఆస్తిపన్నును చెల్లించడం లేవు. ఇలా జీహెచ్ఎంసీకి రావాల్సిన దాదాపు రూ.50 కోట్లు రాకుండా పోయాయి. పుట్టగొడుగుల్లా సెల్ టవర్లు.. ప్రస్తుతం భాగ్యనగరంలో పుట్టగొడుగుల్లా సెల్ టవర్లు పుట్టుకొస్తున్నాయి. అక్రమంగా అనధికారి కంగా ఏర్పాటు చేస్తున్న ఈ టవర్లతో రేడి యేషన్ ప్రభావం ఉంటుందని, ప్రజలు ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని హైదరా బాదీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదని, ఒకవేళ రేడి యేషన్ తీవ్రతపై ఫిర్యాదులు అందితే వాటిని డాట్ టర్మ్ సెల్‌కు తగిన చర్యల నిమిత్తం తెలియజేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెపుతున్నారు. సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్‌ను అది నియంత్రిస్తుందని తెలిపారు. అయితే జీహెచ్ఎంసీ తన పరిధి లోని అక్రమ టవర్ల ఏర్పాటును చూసీ చూడనట్లు వదిలేయడం విమర్శలకు తావి స్తోంది. టవర్ల నిర్వాహకులతో అధికారుల లాలూచీయే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ► 2013లో వెలువడిన జీవో మేరకు స్కూళ్లు, ప్రార్థనా మందిరాలు, ఆస్ప త్రుల వంటి ప్రదేశాలకు వంద మీటర్ల లోపు సెల్ టవర్ల ఏర్పాటు నిషిద్ధం. ఆ మేరకు జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొంది సెల్ టవర్‌ను ఏర్పాటు చేయాలి. ► 2015లో వెలువరించిన జీవో మేరకు సెల్ టవర్‌ను ఏర్పాటు చేశాక సమాచారం ఇవ్వవచ్చు. దీన్ని ఆసరా చేసుకునే సమాచారమే ఇవ్వకుండా సెల్‌టవర్లు ఏర్పాటు చేసేస్తున్నారు. -
సెల్ టవర్ ఎక్కి నిరసన
కోటకందుకూరు (ఆళ్లగడ్డ రూరల్): ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడంపై కోటకుందుకూరు గ్రామానికి చెందిన మల్లికార్జున అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుకున్న గంగుల యువసేనా నియోజకవర్గ అధ్యక్షుడు నాగ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని యువకుని కిందకు దింపి మాట్లాడారు. ఫిరాయింపు దారులకు మంత్రి పదవులు రద్దు చేయకపోతే.. వందల సంఖ్యలో టవర్ ఎక్కి నిరసన చేస్తామని తెలిపారు. రాజ్యంగాన్ని ఉల్లంఘించిన సీఎం చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
రావెలకు మంత్రిపదవి ఇవ్వాలని..
గుంటూరు: రావెల కిషోర్‌బాబును మంత్రి పదవి నుంచి తొలగించినందుకు నిరసనగా ఓ అభిమాని సెల్‌టవర్ ఎక్కాడు. గుంటూరుకు చెందిన ఒక ఆటోడ్రైవర్ సోమవారం మధ్యాహ్నం అరండల్‌పేట 16వ లైను వద్ద ఉన్న సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. రావెలను తిరిగి మంత్రి పదవిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. లేకుంటే కిందికి దూకుతానని బెదిరించసాగాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ సరిత అక్కడికి చేరుకుని అతని డిమాండ్‌ను పైఅధికారులకు తెలుపుతామని, కిందికి దిగాలని కోరారు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి కిందకి దిగిరావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. -
సెల్‌ఫోన్ వాడటం సురక్షితమేనా?
జనరల్/న్యూరో కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 27 ఏళ్లు. సాఫ్ట్వేర్. ఎక్కువగా సెల్ఫోన్లో మాట్లాడుతూ, బ్రౌజ్ చేస్తూ ఉంటాడు. ఇంటర్మీడియట్ నుంచీ ఇలా మాట్లాడే అలవాటు ఉంది. ఇంజనీరింగ్ చేసేటప్పుడు పెరిగింది. ఇటీవల బాగా ఎక్కువైంది. సెల్‌ఫోన్ ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని విన్నాను. మా మనవడి వయసు మూడేళ్లు. వాడు కూడా సెల్‌ఫోన్‌తో ఎక్కువగా ఆడుతున్నాడు. నాకు చాలా భయంగానూ, ఆందోళనగానూ ఉంది. సెల్‌ఫోన్‌తో క్యాన్సర్ వచ్చే మాట నిజమేనా? – నిర్మల, సికింద్రాబాద్ సెల్‌ఫోన్ నుంచి రేడియేషన్ వచ్చే మాట నిజమే. సెల్ టవర్‌కు దూరంగా ఉన్నప్పుడు, సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు, కాల్ కనెక్ట్అవడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు రేడియేషన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో సెల్‌ఫోన్ వాడటం వల్ల మెదడులో గడ్డలు వస్తాయన్న అపోహలు చాలామందిలో ఏర్పడ్డాయి. అయితే సెల్‌ఫోన్ వల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్పడానికి ఇంతవరకు కచ్చితమైన ఆధారాలు ఏమీ లభించలేదు. ఇంతవరకు జరిగిన అధ్యయనాల్లో ఫోన్లు, సెల్ టవర్ల నుంచి రేడియేషన్ వెలువడుతుందని గుర్తించినా, అది క్యాన్సర్‌కు దారితీస్తాయని కచ్చితంగా చెప్పడానికి గల ఆధారాలే లేవు. కొన్ని అధ్యయనాలు మొబైల్ఫోన్స్తో మెదడుకు క్యాన్సర్ ప్రమాదం ఉందని చెబితే... మరికొన్ని అలాంటిదేమీ లేదని తేల్చాయి. అయితే ఈ రెండు రకాల అధ్యయనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తూ వచ్చాయి. అయితే ఒక అంశం మాత్రం స్పష్టం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సెల్‌ఫోన్స్ వెలువరించే రేడియేషన్ స్థాయి తగ్గుతూ పోతోంది. పైగా మొబైల్స్ వాడకం ఆధునిక జీవితంలో భాగంగా మారింది. క్యాన్సర్ ప్రమాదం గురించి అనుమానాలు, భయాలు వ్యాప్తిలో ఉన్నా మొబైల్‌ఫోన్స్‌ను పూర్తిగా విస్మరించడం సాధ్యం కావడం లేదు. సెల్‌ఫోన్ రేడియేషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు, అధ్యయనాలు పూర్తి వాస్తవాలను తేల్చిచెప్పేలోపు మనం కొన్ని మందు జాగ్రత్తలను పాటించాలి. ►సెల్‌ఫోన్ రేడియేషన్‌కు సంబంధించి సురక్షిత స్థాయి అంటూ స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ (ఎస్.ఏ.ఆర్.)ను నిర్ణయించారు. ఆ పరిధిలో ఉన్న ఫోన్స్ వాడాలి n వీలున్న అన్ని సందర్భాలలో సాధారణ ఫోన్స్ (లైన్డ్ ఫోన్స్)లో మాట్లాడాలి n సెల్‌ఫోన్ సంభాషణలు క్లుప్తంగా ఉండేట్లు చూసుకోవాలి n సెల్‌ఫోన్ వాడటం తప్పనిసరి అయినప్పుడు హ్యాండ్స్ ఫ్రీ అటాచ్‌మెంట్‌ను ఉపయోగించడం, మరీ చెవికి ఆనించి దగ్గరగా పెట్టుకోవడం కాకుండా కొద్ది సెంటీమీటర్లు దూరంలో ఉంచుకొని మాట్లాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి n రింగ్ చేసిన నెంబరు, కనెక్ట్ ఆయిన తర్వాత మాత్రమే సెల్‌ఫోన్‌ను చెవి వద్దకు తీసుకెళ్లాలి n పైన పేర్కొన్న జాగ్రత్తలతో పాటు... రోజు మొత్తం మీద కాల్స్ కలిసి, మూడునాలుగు గంటలు దాటుతున్నట్లు గమనిస్తే సెల్‌ఫోన్ వాడకాన్ని ప్రత్యేకంగా నియంత్రించడం మంచిది. వీలైన సందర్భాల్లో ఎస్ఎంఎస్, చాటింగ్, యాప్ బేస్డ్ మెసేజింగ్, డేటా సర్చింగ్ వంటి అవసరాలకు మాత్రమే సెల్‌ఫోన్‌ను పరిమితం చేయాలి. ప్రత్యేకించి పిల్లలను సెల్‌ఫోన్ వాడకానికి దూరంగా ఉంచాలి. పిల్లల మెదడు లేత కణాలతో కూడి ఉంటుంది. వాటిగుండా రేడియేషన్ నిరాఘాటంగా ప్రయాణం చేస్తుంది. అందువల్ల సెల్‌ఫోన్ రేడియేషన్ ప్రభావం పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లల్లో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గడిచిన ఐదారేళ్ల నుంచే మరీ ఎక్కువగా పిల్లల చేతుల్లోకి సెల్‌ఫోన్స్ చేరుతున్నాయి. మరో పదేళ్లు పోతేగానీ సెల్‌ఫోన్ రేడియేషన్ ఎటువంటి ప్రభావం చూపిందన్నది కచ్చితంగా తెలిసిరాదు. అంతవరకు ముందుజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా అవసరం అని మాత్రం చెప్పగలం. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
సెల్ టవర్ ఎక్కి.. వ్యక్తి హల్ చల్!
సిద్దిపేట: ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలోని కోహెడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వేధింపులకు నిరసనగా మండలంలోని రాంచంద్రపూర్ గ్రామానికి చెందిన బత్తుల రాజు కోహెడలో ఆదివారం ఉదయం సెల్ టవర్ ఎక్కాడు. భూ వివాదంలో తనపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించాడు. సీఐ శ్రీనివాస్ అక్కడికి వచ్చి బాధితుడు రాజుకు హామీ ఇవ్వడంతో అతను సెల్ టవర్ పై నుంచి కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
కుల బహిష్కరణపై టవరెక్కి నిరసన
-
కుల బహిష్కరణపై టవరెక్కి నిరసన
వలిగొండ(యాదాద్రి భువనగిరి): కుల బహిష్కరణపై ఆవేదన చెందిన ఇద్దరు యువకులు సెల్ టవరెక్కి నిరసన తెలిపారు. వలిగొండ మండలం దుప్పలి గ్రామంలో అరూర్ యాదయ్య, సండ్ర యాదయ్య అనే వారు కుల పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో కులపెద్దలు వారిపై కుల బహిష్కరణ శిక్ష విధించారు. దీనిపై బాధితులు తహశీల్దారుకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం కనిపించకపోవటంతో శుక్రవారం ఉదయం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కారు. తమకు న్యాయం జరిగితేనే కిందికి దిగుతామంటూ అక్కడే కూర్చున్నారు. -
మిన్నంటిన నిరసనలు
► సెల్‌టవర్ నిర్మాణంపై స్థానికుల ఆందోళన ► కిరోసిన్ పోసుకున్న మహిళ ► ఎస్పీకి ఫిర్యాదు.. నిర్మాణం అడ్డుకున్న పోలీసులు సిరిసిల్ల టౌన్: ప్రజల భాగోగులు పరిరక్షించాల్సిన టీఆర్ఎస్ నాయకుడు స్వయంగా..జనావాసాల మధ్య సెల్‌టవర్ నిర్మించడంపై స్థానికుల నుంచి నిరసనలు మిన్నంటాయి. సదరు ఇంటి యజమాని టీఆర్ఎస్ నేతకావడంతో పోలీసు లు పట్టిచుకోవడం లేదంటూ..ఏకంగా ఓమహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకునిఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈసంఘటన శుక్రవారం సాయంత్రం సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నెహ్రూనగర్‌లోని అధికార పార్టీ కి చెందిన నాయకు డు, సెస్ మాజీ డైరెక్టర్ గుండ్లపెల్లి శ్రీని వాస్ ఇంటిపై ప్రె ౖవేటు సెల్ కంపెనీకి చెందిన సెల్‌టవర్ నిర్మాణం జరుగుతుం ది. ఈవిషయమై గతంలో వద్దని తాము చెప్పి నా సదరు నాయకడు వినకుండా టవర్ నిర్మా ణం పనులు చేపట్టాడంటూ ఆరోపించారు. రేడియేషన్ ద్వారా ప్రజలు రోగాల భారిన పడుతారని చెప్పినా అధికార పార్టీ నాయకుడు ఆర్థికలాభం కోసం పాకులాడుతున్నాడని ఆరోపించారు. ఈవిషయమై స్థానికులతో సదరు నాయకుడు రెండు గంటల పాటు వాగ్వాదానికి దిగాడు. టవర్ సమీపంలో ఉండటం వల్ల తమ కుటుంబ సభ్యులు నంది కనుకవ్వ అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. నిర్మాణాన్ని వెంటనే నిలిపి వేయాలని వెంటనే సెల్‌టవర్ నిర్మాణం నిలిపి వేయాలని కోరుతూ.. స్థానికులు అన్నపూర్ణ, అమల, రాజవ్వ తదితరులు ఎస్సీ, కలెక్టర్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. -
ఇళ్లమధ్య సెల్‌టవర్‌పై కాలనీవాసుల పోరాటం
ఇళ్ల మధ్య సెల్ టవర్ ఏర్పాటుచేస్తే తమ ఆరోగ్యాలు ఏం కావాలని హయత్‌నగర్‌లోని గాయత్రినగర్ వాసులు మండిపడ్డారు. జనవాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను వారు అడ్డుకున్నారు. కాలనీవాసుల పోరాటానికి స్థానిక కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డి కూడా అండగా నిలిచారు. కాలనీలో సెల్‌టవర్ ఏర్పాటు కోసం గుంతలు తీస్తుండగా కాలనీకి చెందిన పురుషులు, మహిళలు దాన్ని అడ్డుకున్నారు. గుంతలు పూడ్పించి, యంత్రాలను వెనక్కి పంపేశారు. సెల్‌టవర్ రేడియేషన్ వల్ల ఆరోగ్యసమస్యలు వస్తాయని ఒకవైపు చెబుతుంటే, మరోవైపు ఇళ్ల మధ్యనే ఎలా ఏర్పాటుచేస్తారని తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం కార్పొరేటర్‌తో కలిసి జీహెచ్ఎంసీ ఈస్ట్ జోనల్ కమిషనర్ రఘుప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. కాలనీ వాసుల నుంచి గానీ, అసోసియేషన్ నుంచి గానీ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండానే టవర్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయడాన్ని నిరసించారు. దీనిపై విచారణ జరిపించి, త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని జోనల్ కమిషనర్ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. -
‘నోట్ల’ కోసం టవరెక్కిన యువకుడు
నోట్ల మార్పిడి అవస్థలు భరించలేక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూర్‌లో ఖాజా అనే యువకుడు సెల్‌టవరెక్కాడు. ఖాజా వద్ద రూ.15 వేల విలువైన పెద్ద నోట్లు ఉన్నారుు. వాటిని మార్పించుకోవడానికి శనివారం సంగారెడ్డిలోని ఎస్బీఐకి వెళ్లాడు. రద్దీ కారణంగా వీలుగాక ఇంటికి వచ్చేశాడు. డబ్బులు మార్చుకోవడానికి బ్యాంకు అధికారులు నిరాకరించారని, అత్యవసరానికి చేతిలో డబ్బులు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేస్తూ.. గ్రామంలోని సెల్‌టవర్ ఎక్కాడు. పోలీసులు, పలువురు నేతలు అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో దిగాడు. -
మహిళపై మైకు విసిరిన టీడీపీ ఎమ్మెల్యే
జనావాసాల మధ్య సెల్‌టవర్ వద్దనడమే ఆమె చేసిన పాపం ఇక్కడ్నుంచి పోతావా? పోవా? అంటూ ఎమ్మెల్యే వెలగపూడి ఆగ్రహం విశాఖ నగరంలో నిర్వహించిన జనచైతన్య యాత్రలో నిర్వాకం ఆరిలోవ(విశాఖ): జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన సెల్‌టవర్ వల్ల తమకు సమస్యలు ఎదురవుతున్నాయని తమ వద్దకు వచ్చిన అధికారపార్టీ ప్రజాప్రతినిధికి విన్నవించడమే ఆమె చేసిన పాపం. దీంతో నన్నే నిలదీస్తావా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ప్రజాప్రతినిధి చేతిలో ఉన్న మైకును ఆమెపైకి విసిరేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామంటూ టీడీపీ నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలో భాగంగా విశాఖ నగరంలోని మూడో వార్డులో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రవీంద్రనగర్ ఆఖరి బస్‌స్టాప్ వద్ద అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజల సమస్యలు పరిష్కరించటానికే వచ్చానని, టీడీపీ పాలనలో ప్రజాసమస్యలు తీరుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇంతలో అదే ప్రాంతానికి చెందిన మాకిన వరలక్ష్మి అనే మహిళతోపాటు స్థానికులు కొందరు ఇటీవల ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెల్‌టవర్ గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సెల్‌టవర్ వల్ల సమస్యలెదురవుతాయని గతంలో ఇక్కడి మహిళలంతా ఉద్యమాలు చేసి ఎత్తివేయించామని, అయితే ఇక్కడ ఇటీవల కొత్తగా మరో సెల్ టవర్‌ను మీ అండతో ఏర్పాటు చేశారని చెప్పడంతో ఆ మహిళపై ఎమ్మెల్యే ఊగిపోయారు. ఆ సెల్‌టవర్ పెట్టింది వేరే పార్టీ కార్యకర్త.. నేనెందుకు మద్దతు పలుకుతాను.. నీవు ఇక్కడ నుంచి పోతావా పోవా.. అంటూ చేతిలో ఉన్న మైక్‌ను విసిరేశారు. అయినప్పటికీ ఆ మహిళ వెనుదిరగకుండా.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మీరు ఇక్కడికొచ్చారు.. అందుకే సమస్యలు చెప్పుకొంటున్నాం. నేను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే పొమ్మని చెప్పండి.. మా వద్దకు వచ్చి మమ్మల్ని పొమ్మంటారా.. అంటూ ఎదురుతిరిగింది. దీంతో ఎమ్మెల్యే మరింత ఊగిపోయారు. ఆమెను తీసుకుపోండంటూ కార్యకర్తలను గద్దించారు. మధ్యలోనే యాత్రను ముగించేసి రుసరుసలాడుతూ వెళ్లిపోయారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కొందరు ఎమ్మెల్యేనే నిలదీస్తావా? అంటూ వరలక్ష్మితో వాగ్వాదానికి దిగారు. -
షార్ట్ సర్క్యూట్‌తో సెల్ టవర్ దగ్ధం
మామిడికుదురు : జాతీయ రహదారి పక్కన మామిడికుదురులోని ఏటీఎం సమీపంలో భవనంపై ఉన్న సెల్ టవర్ ఆదివారం అర్థరాత్రి దగ్ధమైంది. టవర్ అంతా మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగిందో తెలియక అటూ ఇటూ పరుగులు తీశారు. షార్ట్సరŠూక్యట్ వల్ల ఈ సంఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. టవర్ పైభాగంలో అంటుకున్న మంటలు క్రమేపీ కిందవరకూ వ్యాపించాయని స్థానికులు పేర్కొన్నారు. ఈ టవర్ ద్వారా ఐడియా, ఎయిల్టెల్, వొడాఫో¯ŒS వినియోగదారులకు సేవలందుతున్నాయి. సెల్‌టవర్ కాలిపోవడంతో ఆయా సెల్ఫోన్లకు సిగ్నల్స్ అందక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
సెల్‌టవర్‌లో అగ్నిప్రమాదం
రాజమండ్రి: ఓ భవనం పై ఏర్పాటు చేసిన సెల్‌ఫోన్ టవర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ భవనం పై ఉన్న ఐడియా, ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీల సంయుక్త టవర్ వద్ద ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచరం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే టవర్ పూర్తిగా కాలి బూడిదైంది. -
అట్టుడికిన ఇనుగుర్తి... టవర్ దిగని యువకులు
వరంగల్ :వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తే తప్ప టవర్ దిగేది లేదంటూ యువకులు పట్టుబట్టారు. ఇప్పటికి దాదాపు 22 గంటలుగా ఐదుగురు యువకులు టవర్ మీదే ఉండిపోయారు. అధికారులు నేరుగా ప్రకటన చేస్తేనే తాము కిందికి దిగి వస్తామని వాళ్లు స్పష్టం చేస్తున్నారు.శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇనుగుర్తి బంద్ పాటించారు. వివిధ ప్రాంతాల్లోని సెల్ టవర్, వాటర్ ట్యాంకులపైకి మండల సాధన సమితి సభ్యులతోపాటు యువకులు ఎక్కి ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వం నూతన మండలాల ప్రకటనలో ఎక్కడా ఇనుగుర్తి ప్రస్తావన లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. సీఎం హామీ ఇచ్చారని... ఇనుగుర్తి మండలం వస్తుందని... ఇన్నాళ్లు వేచి ఉన్నామని... ఇప్పుడు తమ ఆశ నిరాశ అయిందని వారు ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టినందుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను గ్రామస్తులు దహనం చేశారు. అయితే గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే వరకు తాము దిగేది లేదని... సెల్ టవర్ ఎక్కిన ఆందోళనకారులు భీష్మించుకున్నారు. దీంతో వారు సెల్ టవర్ ఎక్కి 22 గంటలు అయినా కిందకి దిగకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదు. -
సెల్ టవర్ ఎక్కిన యువకులు
దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని అడివిదేవరపల్లిని మండల కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామానికి చెందిన యువకులు మంగళవారం సెల్‌టవర్ ఎక్కారు. అడివిదేవరపల్లిలో రాస్తారోకో, ధర్నా నిర్వహించిన గ్రామస్తులు అనంతరం సెల్‌టవర్ ఎక్కి హల్చల్ చేస్తున్నారు. మండల కేంద్రంగా ప్రకటించేవరకూ కిందకు దిగేదిలేదని వారు భీష్మించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
సెల్‌టవరెక్కిన ముగ్గురు యువకులు
షాబాద్(రంగారెడ్డి జిల్లా): షాబాద్ మండలాన్ని కొత్తగా ఏర్పడబోయే వికారాబాద్ జిల్లాలో కలపొద్దంటూ షాబాద్‌లో ముగ్గురు యువకులు ఎయిర్ టెల్ సెల్‌టవర్ ఎక్కారు. షాబాద్‌ను శంషాబాద్ జిల్లాలో ఉంచాలంటూ డిమాండ్ చేశారు. మంత్రి మహేందర్ రెడ్డి వచ్చేంతవరకు సెల్‌టవర్ దిగమని భీష్మించుకు కూర్చున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి దింపే ప్రయత్నం చేస్తున్నారు. -
సెల్‌టవర్ ఎక్కిన యువకుడు
⇒ అర గంటపాటు మండల కేంద్రంలో కలకలం ⇒ పోలీసులు, అఖిలపక్షం నాయకుల జోక్యంతో కిందికి దిగిన వైనం మొయినాబాద్: మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలపాలని కోరుతూ ఓ యువకుడు ఆదివారం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలపుతామని ప్రభుత్వం ప్రకటించకపోతే టవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. అరగంటపాటు టవర్‌పైనే కూర్చొని కలకలంరేపాడు. పోలీసులు, అఖిలపక్షం నాయకుల జోక్యంతో కిందికి దిగివచ్చాడు. మొయినాబాద్‌ను శంషాబాద్‌లో కలపాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రిలే నిరహార దీక్షలు చేపడుతున్నారు. అన్ని గ్రామాల అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షులు, సభ్యులు దీక్షలో ఆదివారం కూర్చున్నారు. దీక్ష కొనసాగుతుండగానే మొయినాబాద్‌కు చెందిన కంజర్ల నరేష్ రోడ్డుపక్కనే ఓ భవనంపై ఉన్న సెల్ టవర్‌పైకి ఎక్కాడు. మొయినాబాద్, శంషాబాద్‌లో కలపకపోతే ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాని పెద్దగా కేకలు వేయడంతో కిందన్న జనం అతన్ని చూశారు. కిందకు దిగాలని ఎంత అరిచినా దిగలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు భవనంపైకి ఎక్కి అతన్ని కిందకి రావాలని కోరారు. అయినా రాకపోవడంతో అఖిలపక్షం నాయకులు భవనంపైకి వెళ్లి కిందకు దిగాలని కోరారు. ఉద్యమాన్ని శాంతియుతంగా చేపట్టి డిమాండ్‌ను సాధించుకోవాలని నచ్చజెప్పారు. అరగంటపాటు సెల్‌టవర్‌పైనే ఉన్న యువకుడు చివరకు పోలీసులు, అఖిలపక్షం నాయకుల జోక్యంతో కిందికి దిగాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం పలువురు నాయకులు, యువకులు అతనికి పూలమాలలు వేసి సన్మానించారు. మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలపకపోతే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ యువకుడు తెలిపాడు. -
తిరుపతి సెల్‌టవరెక్కి యువకుడు హల్చల్
-
సెల్ టవర్ అంటే భయం వద్దు
- దాంతో ఎలాంటి హానీ లేదు - టెలికం శాఖ ముమ్మర ప్రచారం సాక్షి, హైదరాబాద్ : సెల్‌టవర్ నుంచి ప్రమాదకరమైన స్థాయిలో రేడియో ధార్మిక శక్తి విడుదల కాదని, అది పూర్తిగా సురక్షితమేనని, ప్రజలు భయాందోళనలు లేకుండా ఉండొచ్చంటూ కేంద్రప్రభుత్వం ముమ్మర ప్రచారానికి సిద్ధపడింది. టెలికం శాఖ దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి టెలికం శాఖ నగరంలో తొలి అవగాహన సదస్సు నిర్వహించింది. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఎస్ఐబీ ఐజీ సజ్జనార్ తదితరులు రాష్ట్రప్రభుత్వం తరఫున హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ మాజీ సలహాదారు టి.హనుమాన్ చౌదరి, ప్రముఖ వైద్య నిపుణులు కాకర్ల సుబ్బారావుతోపాటు టెలికం సీనియర్ డీటీజీ శివేంద్ర భట్నాగర్, డీడీజీ రఘునందన్, పలు మొబైల్ ఆపరేటర్లు తదితరులు హాజరయ్యారు. టవర్లతో ప్రమాదం లేదు సదస్సులో డాక్టర్ కాకర్ల సుబ్బారావు మాట్లాడుతూ సెల్ టవర్ల వల్ల మనకెలాంటి ప్రమాదం లేదని ప్రజలు అనవసరంగా భయపడకుండా నిశ్చితంగా ఉండొచ్చని అన్నారు. టి.హనుమాన్ చౌదరి మాట్లాడుతూ సెల్ ఫోన్, టవర్ల రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉంటుందని, ఎలాంటి భయం వద్దని పేర్కొన్నారు. -
సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్ చల్
♦ పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయితోనే వివాహం చేయాలని పట్టు ♦ సముదాయించి కిందికి దించిన పోలీసులు మేడ్చల్ : పెళ్లి చూపుల్లో చూసిన అవ్మూయితోనే తనకు వివాహం జరిపించాలని ఓ యువకుడు సెల్ టవర్ఎ క్కి హల్చల్ చేశాడు. ఈ ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ వుండలం గవలపల్లికి చెందిన నర్సింలు(25) నగరంలోని చింతల్లో నివాసవుుంటూ బాలానగర్ అడ్డాపై డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పెళ్లీడుకొచ్చిన అతడికి వివాహం చేయాలని భావించిన కుటుంబీకులు 8 నెలల క్రితం నగరంలోని భరత్‌నగర్‌లో ఓ అవ్మూరుుని చూడగా నర్సింలు ఆమెను ఇష్టపడ్డాడు. అయితే, అమ్మాయిని నర్సింలుకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె కుటుంబీకులు నిరాకరించారు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని నర్సింలు పట్టుబట్టాడు. ఈక్రమంలో కుటుంబీకులపై ఒత్తిడి తెచ్చాడు. వారు సముదాయించినా ఫలి తం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయుం మేడ్చల్ కు చేరుకున్న నర్సింలు మేడ్చల్ చెక్‌పోస్టు-పారిశ్రామిక వాడల వుధ్య ఉన్న ఓ సెల్ టవర్ ఎక్కి పైభాగంలో కూర్చున్నాడు. తను పెళ్లిచూపుల్లో నచ్చిన అమ్మాయితోనే వివాహం చేయాలని భీష్మించాడు. అటుగా వెళ్తున్న కార్మికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గంటపాటు నర్సింలును సముదాయించారు. అతడితో మైకులో వూట్లాడి కిందికి దించారు. అనంతరం నర్సింలును ఠాణాకు తరలించి కౌన్సెలింగ్ చేశారు. టవరెక్కిన యువకుడిని క్షేమంగా పోలీసులు కిందికి దించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రియురాలితో పెళ్లి చేయకపోతే..
మేడ్చల్: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం జరిగింది. చెక్‌పోస్ట్ వద్ద ఉన్న సెల్‌టవర్ ఎక్కిన యువకుడు తన ప్రియురాలితో పెళ్లి జరిపించాలని లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తానని బెదిరిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
జనగాం జిల్లా కోసం సెల్‌టవరెక్కి ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాల్లో జనగాంను కూడా చేర్చాలనే డిమాండ్లు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలోని సెల్‌టవర్‌పైకి గురువారం ఉదయం ఐదుగురు యువకులు ఎక్కి నిరసన తెలిపారు. తమ వెంట పెట్రోల్ బాటిళ్లను కూడా తీసుకెళ్లారు. ప్రభుత్వం వెంటనే జనగాం జిల్లాను ప్రకటించకుంటే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని కిందికి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. టవరెక్కిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, యువజన కాంగ్రెస్ నేత గోవర్థన్ ఉన్నారు.