అల్లుకున్న బంధంలో.. అపోహల చిచ్చు! | Wife And Husband Suicide Attempt In Parchur | Sakshi
Sakshi News home page

అల్లుకున్న బంధంలో.. అపోహల చిచ్చు!

Published Wed, Oct 30 2019 6:13 AM | Last Updated on Wed, Oct 30 2019 9:58 AM

Wife And Husband Suicide Attempt In Parchur - Sakshi

సెల్‌టవర్‌ నుంచి కిందకు దిగుతున్న చందు  

సాక్షి, పర్చూరు: కులాల అడ్డుగోడలను ప్రేమ పిడికిలిలో బద్దలు కొట్టగలిగారు కానీ.. సంసారంలో రగిలిన వివాదాల కుంపట్లకు తాళలేకపోయారు. మనసుతో ఉప్పొంగిన ప్రేమను పెళ్లి తీరాలకు చేర్చగలిగారు కానీ..జీవితంలో వచ్చిన కష్టాల ఆటుపోట్లకు నిలువలేకపోయారు. అంతులేని ప్రేమను ఆప్యాయతల భారంలో అందంగా అమర్చుకున్నారుగానీ.. అర్థం లేని అంతరాల ఆగాధాలను పూడ్చుకోలేకపోయారు. భార్య కాపురానికి రాలేదని సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు కానీ.. తాను లేకపోతే ఆమెకు ఊపిరి ఆడదనే విషయాన్ని గుర్తించలేకపోయాడు. రెండు నెలల క్రితం పెళ్లిపీటలెక్కిన నవ దంపతులు నూరేళ్లు కలిసి బతకాల్సిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలనుకున్నారు. భార్య కోసం భర్త ఉసురు తీసుకోవాలనుకోగా భర్త లేనిదే తాను బతకలేనని భార్య పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

చందును ఆస్పత్రికి తీసుకెళ్తున్న సీఐ రాంబాబు  
సెల్‌టవర్‌ ఎక్కి.. 
వారిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయినా కాపురంలో కలతలతో భర్త తనను మానసికంగా హిస్తున్నాడని ఆమె పుట్టింటికి వెళ్లింది. తన భార్యను తనతో పంపించాలని అతడు ఆమె ఇంటి వద్ద గొడవ చేశాడు. తమ కుమార్తెను పంపించేది లేదని అత్తింటి వారు హెచ్చరించడంతో సెల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. ఇంతలో పోలీసులు ఆ యత్నాన్ని విఫలం చేశారు. అయినా ఇద్దరూ పురుగుమందు తాగి ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన పర్చూరు మండలం అన్నంభొట్లవారిపాలెంలో మంగళవారం జరిగింది. సినీ ఫక్కీలో చాలాసేపు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా తన భార్యను సెల్‌ టవర్‌ వద్దకు తీసుకొచ్చి తనతో మాట్లాడిస్తే సెల్‌ టవర్‌ దిగుతానని డిమాండ్‌ చేశాడు. గ్రామస్తులు, సీఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులోని సువర్ణభారతి నగర్‌కు చెందిన నామాల చందు, అన్నంభొట్లవారిపాలెం గ్రామానికి చెందిన మాదాల విజయలక్ష్మి రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.

చందు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న పోలీసులు  

మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. చందు భార్యను హింసించడంతో పుట్టింటికి చేరింది. చందు సోమవారం రాత్రి భార్య ఇంటికి వెళ్లి తనతో రావాలని కోరాడు. ఆమె నీతో రాననేసరికి గొడవ చేశాడని, చుట్టు పక్కల వారు వచ్చి నీతో ఆమె రాదని చెప్పడంతో ఊరు శివారులోని సెల్‌టవర్‌ ఎక్కి తన భార్యను పంపించాలని డిమాండ్‌ చేశాడు. లేకుంటే టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సీఐ రాంబాబు, ఎస్‌ఐ దాచేపల్లి రంగనాథ్‌ సంఘటన స్థలానికి చేరుకొని అతడితో మాట్లాడాడు. కిందకు దిగాలని చెప్పినా అతడు వినిపించుకోలేదు.

మీడియా సాక్షిగా నీకు అండగా ఉంటామని, సమస్య పరిష్కరిస్తామని ఇంకొల్లు సీఐ రాంబాబు నచ్చజెప్పారు. అక్కడకు చేరుకున్న చందు బంధువులు కూడా హామీ ఇవ్వాలని కోరాడు. ఎస్‌ఐ రంగనాథ్, చందు బంధువులు పైకి ఎక్కే ప్రయత్నం చేయగా తన వద్ద ఉన్న పురుగుమందు తాగి దూకేందుకు ప్రయత్నించాడు. అంతా కలిసి పట్టుకుని అతడిని కిందకు దించారు. అంతకు ముందు ఇంటి వద్ద ఉన్న చందు భార్య కూడా పురుగుమందు తాగడంతో కారులో చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చందును కూడా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి అపశృతి చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement