parchur
-
దొంగ ఓట్లు.. ‘పచ్చ’ నోట్లు
సాక్షి, అమరావతి: ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లతో మోసాలకు పాల్పడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని మరోసారి రుజువైంది! నల్లధనాన్ని వెదజల్లి ఎన్నికల్లో అక్రమ మార్గాల్లో నెగ్గేందుకు టీడీపీ ఏకంగా ప్రత్యేక కార్యాలయాలనే ఏర్పాటు చేసుకున్నట్లు ఆధారాలతో సహా బట్టబయలైంది. 2019 ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా (ప్రస్తుతం బాపట్ల జిల్లా) పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ పాల్పడిన అక్రమాలు రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్ డీఆర్ఐ) తనిఖీల్లో తాజాగా వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్‌గా ఉన్న నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయం కేంద్రంగా ఎన్నికల అక్రమాలకు తెగబడినట్లు డీఆర్ఐ కీలక ఆధారాలను గుర్తించింది. ఆ వెంటనే ఆ కంపెనీకి చెందిన కీలక వ్యక్తులు పరారు కావడం గమనార్హం. ఆదాయపన్ను (ఐటీ) చట్టం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డట్టు తేలింది. డీఆర్ఐ నివేదిక మేరకు న్యాయస్థానం అనుమతితో టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు, నోవా అగ్రిటెక్ కంపెనీలపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ వ్యవహారం ఇదిగో ఇలా సాగింది.. నోవా అగ్రిటెక్ కేంద్రంగా... పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు చెందిన నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో డీఆర్ఐ అధికారులు తాజాగా తనిఖీలు నిర్వహించారు. గుంటూరు శ్రీలక్ష్మీ నగర్‌లోని ఆ కంపెనీ కార్యాలయంలో ఈ నెల 24న చేపట్టిన సోదాల్లో ప్రధానంగా డీఆర్ఐ అధికారులు స్వా«దీనం చేసుకున్న ఓ డైరీ టీడీపీ ఎన్నికల అక్రమాల గుట్టును విప్పింది. స్వతంత్ర సాక్షులు, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగుల సమక్షంలో ఆ డైరీని డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. కీలక అధికారి పరార్ నోవా అగ్రిటెక్‌కు చెందిన ఉద్యోగి పుల్లెల అజయ్‌బాబు ఆ డైరీని ఉపయోగించారని కంపెనీ ఉద్యోగులు వెల్లడించారు. ప్రస్తుతం రిటైరైన పుల్లెల అజయ్ బాబును కార్యాలయానికి రావాలని డీఆర్ఐ అధికారులు సూచించిన వెంటనే ఆయన పరారు కావడం గమనార్హం. తన సెల్‌ఫోన్‌ను సైతం స్విచ్ఛాఫ్ చేసేసి అందుబాటులో లేకుండా పోయారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాలతోనే ఆయన పరారైనట్లు స్పష్టమవుతోంది. 13 పేజీల్లో నమోదు.. ఆ డైరీని పరిశీలించగా పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ ఎలా ఎన్నికల అక్రమాలకు పాల్పడిందో వెలుగు చూసింది. పోలింగ్‌కు ముందు రోజు అంటే 2019 ఏప్రిల్ 11న అక్రమ నిధులను ఎలా తెచ్చారు? ఓటర్లకు ఎలా పంపిణీ చేశారనే వివరాలన్నీ అందులో ఉన్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీ చేసిన డబ్బుల వివరాలను ఏకంగా 13 పేజీల్లో నమోదు చేయడం గమనార్హం. అంతా నల్లధనమే... ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భారీగా నల్లధనాన్ని తరలించినట్లు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. అందుకోసం షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధులను చేరవేశారు. ఆ డబ్బుల వివరాలేవీ నోవా అగ్రిటెక్ కంపెనీ రికార్డులతో సరిపోలకపోవడంతో అదంతా నల్లధనమేనని రుజువవుతోంది. కంపెనీ బ్యాంకు ఖాతాల్లో ఆ నిధుల జమ, విత్‌డ్రాలకు సంబంధించిన వివరాలేవీ లేవు. అంటే ఓటర్లను ప్రలోభ పెట్టి ఎన్నికల్లో అక్రమాలుకు పాల్పడేందుకు వెచ్చిం చినదంతా నల్లధనమేనని నిర్థారణ అయింది. ఎన్నికల కమిషన్‌కూ బురిడీ... డైరీలో పేర్కొన్న నిధుల వ్యయానికి సంబంధించిన వివరాలను టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఎన్నికల వ్యయంలో చూపలేదు. కమిషన్‌కు ఎప్పటికప్పుడు సమర్పించాల్సిన వ్యయంలో డైరీలో పేర్కొన్న నిధుల వివరాలు లేవు. అంటే టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల కమిషన్‌కు తప్పుడు నివేదిక ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. ఐటీ, ఈడీ, సెబీలకు నివేదిక.. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అక్రమంగా నిధులు తరలించినట్లు ఆధారాలతో వెల్లడి కావడంతో డీఆర్ఐ అధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. తమ తనిఖీల్లో వెలుగు చూసిన అంశాలను ఆదాయపన్ను శాఖ, ఈడీ, సెబీ దృష్టికి తెచ్చారు. నోవా అగ్రిటెక్ కంపెనీ తమ రికార్డుల్లో చూపని నిధులను వెచ్చించడంతోపాటు పన్ను చెల్లించకుండా ఎగవేసింది. అక్రమ నిధుల తరలింపు ద్వారా కేంద్ర మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించింది. అక్రమ నిధులను తరలించేందుకు కంపెనీని కేంద్ర బిందువుగా చేసుకోవడం సెబీ నిబంధనలకు విరుద్ధం. నోవా అగ్రిటెక్ అక్రమాలపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదాయపన్ను, ఈడీ, సెబీలకు డీఆర్ఐ అధికారులు నివేదిక సమర్పించారు. త్వరలోనే ఆ మూడు సంస్థలు రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదుకు సన్నద్ధం అక్రమ నిధుల ద్వారా ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డ నోవా అగ్రిటెక్ కంపెనీ, కంపెనీ చైర్మన్‌గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై పోలీసు శాఖ కేసు నమోదు చేయనుంది. ఈ అక్రమ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు బాపట్ల జిల్లా పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ కేసులో త్వరలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు స్పష్టమవుతోంది. డైరీలో నల్లధనం ♦ పవులూరు అనే గ్రామంలో పోలింగ్ కేంద్రాలు 223 నుంచి 226 పరిధిలో 239 మంది ఓటర్లకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. మొత్తం రూ.2.39 లక్షలు పంపిణీ చేసినట్టు ఆ డైరీలో ఉంది. ♦ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రావు ద్వారా రూ.3.60 లక్షలు ఓటర్లకు పంపిణీ చేసినట్లు డైరీలో ఉంది. ♦ నోవా అగ్రిటెక్ కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారా ఓటర్లకు ఆ డబ్బులను పంపిణీ చేశారు. ♦ ఆ కంపెనీకి చెందిన అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేశ్ అనే ఉద్యోగుల ద్వారా దుద్దుకూరు గ్రామంలో ఓటర్లకు రూ.15 లక్షలు పంపిణీ చేశారు. ♦ పర్చూరు నియోజకవర్గంలోని దుద్దుకూరు, ఇంకొల్లు, తాటిపర్తివారిపాలెం, గంగవరం తదితర గ్రామాల్లో ఓటర్లకు డబ్బులు ఎలా పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేశారో డైరీలో వివరంగా ఉంది. ♦ ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తరలించేందుకు రవాణా వ్యయం, పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల పేర్లు, వారికి పంపిణీ చేసిన మొత్తం తదితర వివరాలను ఆ డైరీలో సవివరంగా పేర్కొనడం గమనార్హం. -
పర్చూరులో టీడీపీ దొంగ ఓట్లపై ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో 2013 నుంచి 2023 వరకు జరిగిన అవకతవకలపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్కుమార్మీనాను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమంచి మాట్లాడుతూ.. 2013లో కేవలం మూడునెలల వ్యవధిలోనే సుమారు 20 వేల దొంగ ఓట్లు చేర్చగా.. అప్పటి ఆర్ఓ ఈ అవకతవకలపై విచారణ చేయమని క్రిమినల్ కేసు పెట్టారన్నారు. అప్పటి నుంచీ అది పెండింగ్‌లో ఉందన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఏఆర్ఓ ఆఫీస్ నుంచి నివేదిక లేదంటూ కోర్టుకు అప్పటి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. 2018లో సుమారు 15 వేల దొంగ ఓట్లు చేర్చారన్నారు. ఇలా ఇప్పటికి 2013 నుంచి 2023 జనవరి 1వ తేదీ కొత్త ఓటరు జాబితా ప్రకారం, సప్లిమెంటరీ ఓటరు జాబితా వరకు సుమారు 40వేల దొంగ ఓట్లు ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేర్చి అక్రమ పద్ధతిలో స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యారన్నారని ఆరోపించారు. వీటితోపాటు విదేశాలలో ఉంటున్న వారి ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, దేశంలో ఇతర ప్రాంతాలలో స్థిరపడిన వారి ఓట్లు, పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిన ఆడపడచుల ఓట్లు తొలగించకుండా వాటిపేరుతో దొంగ ఓట్లతో అప్రజాస్వామికంగా ఎన్నికలు పర్చూరులో జరుగుతోందని వివరించారు. మార్టూరు ప్రస్తుత ఏఈఆర్ఓ తన లాగిన్‌లోని డేటాను ఏలూరికి ఎలా ఇచ్చారని ప్రశి్నంచారు. ఒక ప్రత్యేక అధికారి బృందంతో ఇంటింటికి సమగ్ర విచారణ జరిపి ప్రత్యేక ఓటరు ధ్రువీకరణ చేయాలని, ఓట్లు చేర్పు కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. -
పర్చూరు టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. కారంచేడు మండల టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గురువారం నిర్వహించిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం దీనికి వేదికైంది. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఓ వర్గానికి కొమ్ముకాయడంతో రెండో వర్గం నేతలు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంతో గురువారం రోడ్డెక్కారు. ఎమ్మెల్యేపై తిట్ల దండకం అందుకున్నారు. స్థానిక నేత అక్క య్య చౌదరికి మద్దతుగా నిలిచిన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను ధ్వంసం చేశా రు. గంటకు పైగా కారంచేడులో టీడీపీ నేతల వీరంగం కొనసాగింది. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ అనూరాధతోపాటు పలువురు టీడీపీ ముఖ్యనేతల సమక్షంలోనే విభేదాలు రచ్చకెక్కడం గమనార్హం. నేపథ్యమిదీ భవిష్యత్‌కు గ్యారెంటీ పేరిట టీడీపీ చేపట్టిన కార్యక్రమం గురువారం కారంచేడు చేరింది. తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ అక్కయ్యచౌదరి టీడీపీ కార్యాలయంలోకి వచ్చి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి పార్టీ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కోరారు. ఎమ్మెల్యే అందుకు అంగీకరించకపోవడంతో రావాల్సిందేనని అక్కయ్యచౌదరి పట్టుబట్టాడు. బస్సులోంచి దిగిన ఎమ్మెల్యే కార్యాలయం బయటే నిలబడి కార్యకర్త ఇచ్చిన జెండా నిలబెట్టి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన అక్కయ్యచౌదరి వర్గం ఎమ్మెల్యే ఎగురవేసిన టీడీపీ జెండాను అక్కడికక్కడే పీకేశారు. పార్టీ కార్యాలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను సైతం ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ‘పార్టీ వద్దు.. బొక్కా వద్దు’ అంటూ చిందులు తొక్కారు. పార్టీ పదవికి రాజీనామా ఈ ఉదంతంతో పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు అక్కయ్యచౌదరి ప్రకటించారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీని అనునిత్యం కాపాడుకుంటూ ఆర్థికంగా ఎంతో నష్టపోయానన్నారు. ఇంత కష్టపడినా ఎమ్మెల్యే వద్ద తనకు కనీస గౌరవం దక్కడం లేదన్నారు. తన వ్యతిరేకులను ప్రోత్సహిస్తూ పార్టీని పాడు చేస్తున్నాడని వాపోయారు. ఈ విషయంపై అధిష్టానంతోనే తేల్చుకుంటానని తెగేసి చెప్పారు. కారంచేడుకు చెందిన సీనియర్ నేత అక్కయ్యచౌదరి అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మండలంలో బలమైన నాయకుడైన ఆయన గతంలో కారంచేడు ఎంపీపీ, పర్చూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వంటి పదవులు చేపట్టారు. ప్రస్తుతం కారంచేడు–2 ఎంపీటీసీగా ఉన్నారు. కాగా, అక్కయ్యచౌదరికి వ్యతిరేకంగా ఇదే మండలానికి చెందిన పార్టీ మాజీ అధ్యక్షుడు జాగర్లమూడి ప్రహ్లాదరావు ప్రత్యేకంగా గ్రూపు కట్టా రు. అక్కయ్య చౌదరి వ్యతిరేక వర్గీయులను చేరదీశారు. దీంతో కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదా లు తారస్థాయికి చేరగా.. తాజాగా రోడ్డునపడ్డాయి. -
గిరిజన కానిస్టేబుల్‌పై దాడి
పర్చూరు: ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న అమరావతి రైతులు విధి నిర్వహణలో ఉన్న ఒక గిరిజన కానిస్టేబుల్‌పై దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కారుమంచి ధ్రువకుమార్, కొల్లా శ్రీను తదితరులపై పర్చూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా పర్చూరులో శనివారం ఈ ఘటన జరిగింది. బాధితుడు కథనం మేరకు.. పర్చూరు వై జంక్షన్లో గిరిజన కానిస్టేబుల్ చంద్రనాయక్ విధుల్లో భాగంగా కెమెరాలో చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో పాదయాత్రలోని కొందరు ఫొటోలు ఎందుకు తీస్తున్నావంటూ కానిస్టేబుల్‌ను ప్రశ్నించారు. తాను పోలీసునని, విధుల్లో భాగంగా ఫొటోలు తీస్తున్నానని చెప్పినా వినకుండా చంద్రనాయక్‌పై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై అమరావతి రైతులు దాడి చేయడం దారుణమన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అల్లుకున్న బంధంలో.. అపోహల చిచ్చు!
సాక్షి, పర్చూరు: కులాల అడ్డుగోడలను ప్రేమ పిడికిలిలో బద్దలు కొట్టగలిగారు కానీ.. సంసారంలో రగిలిన వివాదాల కుంపట్లకు తాళలేకపోయారు. మనసుతో ఉప్పొంగిన ప్రేమను పెళ్లి తీరాలకు చేర్చగలిగారు కానీ..జీవితంలో వచ్చిన కష్టాల ఆటుపోట్లకు నిలువలేకపోయారు. అంతులేని ప్రేమను ఆప్యాయతల భారంలో అందంగా అమర్చుకున్నారుగానీ.. అర్థం లేని అంతరాల ఆగాధాలను పూడ్చుకోలేకపోయారు. భార్య కాపురానికి రాలేదని సెల్‌టవర్ ఎక్కి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు కానీ.. తాను లేకపోతే ఆమెకు ఊపిరి ఆడదనే విషయాన్ని గుర్తించలేకపోయాడు. రెండు నెలల క్రితం పెళ్లిపీటలెక్కిన నవ దంపతులు నూరేళ్లు కలిసి బతకాల్సిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలనుకున్నారు. భార్య కోసం భర్త ఉసురు తీసుకోవాలనుకోగా భర్త లేనిదే తాను బతకలేనని భార్య పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చందును ఆస్పత్రికి తీసుకెళ్తున్న సీఐ రాంబాబు సెల్‌టవర్ ఎక్కి.. వారిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయినా కాపురంలో కలతలతో భర్త తనను మానసికంగా హిస్తున్నాడని ఆమె పుట్టింటికి వెళ్లింది. తన భార్యను తనతో పంపించాలని అతడు ఆమె ఇంటి వద్ద గొడవ చేశాడు. తమ కుమార్తెను పంపించేది లేదని అత్తింటి వారు హెచ్చరించడంతో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. ఇంతలో పోలీసులు ఆ యత్నాన్ని విఫలం చేశారు. అయినా ఇద్దరూ పురుగుమందు తాగి ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన పర్చూరు మండలం అన్నంభొట్లవారిపాలెంలో మంగళవారం జరిగింది. సినీ ఫక్కీలో చాలాసేపు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా తన భార్యను సెల్ టవర్ వద్దకు తీసుకొచ్చి తనతో మాట్లాడిస్తే సెల్ టవర్ దిగుతానని డిమాండ్ చేశాడు. గ్రామస్తులు, సీఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులోని సువర్ణభారతి నగర్‌కు చెందిన నామాల చందు, అన్నంభొట్లవారిపాలెం గ్రామానికి చెందిన మాదాల విజయలక్ష్మి రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. చందు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న పోలీసులు మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. చందు భార్యను హింసించడంతో పుట్టింటికి చేరింది. చందు సోమవారం రాత్రి భార్య ఇంటికి వెళ్లి తనతో రావాలని కోరాడు. ఆమె నీతో రాననేసరికి గొడవ చేశాడని, చుట్టు పక్కల వారు వచ్చి నీతో ఆమె రాదని చెప్పడంతో ఊరు శివారులోని సెల్‌టవర్ ఎక్కి తన భార్యను పంపించాలని డిమాండ్ చేశాడు. లేకుంటే టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. సీఐ రాంబాబు, ఎస్ఐ దాచేపల్లి రంగనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని అతడితో మాట్లాడాడు. కిందకు దిగాలని చెప్పినా అతడు వినిపించుకోలేదు. మీడియా సాక్షిగా నీకు అండగా ఉంటామని, సమస్య పరిష్కరిస్తామని ఇంకొల్లు సీఐ రాంబాబు నచ్చజెప్పారు. అక్కడకు చేరుకున్న చందు బంధువులు కూడా హామీ ఇవ్వాలని కోరాడు. ఎస్ఐ రంగనాథ్, చందు బంధువులు పైకి ఎక్కే ప్రయత్నం చేయగా తన వద్ద ఉన్న పురుగుమందు తాగి దూకేందుకు ప్రయత్నించాడు. అంతా కలిసి పట్టుకుని అతడిని కిందకు దించారు. అంతకు ముందు ఇంటి వద్ద ఉన్న చందు భార్య కూడా పురుగుమందు తాగడంతో కారులో చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చందును కూడా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి అపశృతి చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేత
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు పర్చూరు టీడీపీ నేత రామనాథం బాబు తెలిపారు. గురువారం తన మద్దతుదారులతో కలిసి ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ కండువాలతో వీరందరినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామనాథం బాబు మాట్లాడుతూ... విశాల హృదయంతో తమను సీఎం జగన్ పార్టీలో చేర్చుకున్నారని, వైఎస్సార్సీపీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు. రామనాథం బాబు తన అనుచరులతో పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తున్నానని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. రామనాథం బాబు మంచి నిర్ణయం తీసుకున్నారని, అందరం కలిసి జగనన్న ప్రభుత్వానికి వెన్ను దన్నుగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరరెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: టీడీపీకి మరో ఎదురుదెబ్బ) -
రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి
పర్చూరు (ప్రకాశం జిల్లా) : పర్చూరు మండలకేంద్రంలోని చిలకలూరిపేట వెళ్లే రోడ్డులో వై జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం ఓ కారు రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా..మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
పర్చూరు (ప్రకాశం జిల్లా) : పర్చూరు మండలం వీర్లపాలెం గ్రామ సమీపంలో ఉన్న చెరువులో మునిగి కందా పవన్ కల్యాణ్(14) అనే బాలుడు మృతిచెందాడు. కల్యాణ్‌తోపాటు మరో ఇద్దరు బాలలు సరదాగా ఈత కొడదామని చెరువు దగ్గరకు బయలుదేరారు. కల్యాణ్ చెరువులోకి దిగే సమయంలో ప్రమాదవశాత్తూ జారి పడి ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. చనిపోయిన బాలుడి మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. -
సీఎం చంద్రబాబు 7న రాక
పర్చూరు: జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 7వ తేదీ సీఎం చంద్రబాబు నాగులపాలెం రానున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రకటించారు. ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా గురువారం జేసీ యాకుబ్ నాయక్‌తో కలిసి స్థానిక మార్కెట్ యార్డులో హెలీప్యాడ్, గ్రామసభ నిర్వహణ స్థలాన్ని పరిశీలించారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడి
పర్చూరు : పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కక్ష పెంచుకున్న టీడీపీ కార్యకర్తలు వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన పర్చూరు మండలం ఇనగల్లులో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తన్నీరు తిరుపతిరావు, కొప్పాకు వెంకటేష్, చిట్టినేని రామకృష్ణపై పథకం ప్రకారం దాడిచేసి గాయపరిచారు. తన్నీరు తిరుపతిరావుపై గ్రామంలోని బొడ్డురాయి సెంటర్లో, కొప్పాకు వెంకటేష్‌పై ట్రాక్టర్లో పొలం వెళ్లి వస్తుండగా, చిట్టినేని రామకృష్ణపై పొలంలో పత్తి విత్తనాలు నాటి వస్తుండగా దాడిచేశారు. పోపూరి శ్రీను, రాములు మరికొంతమందితో కలిసి కర్రలు, ఇనుప రాడ్డులతో వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. తిరుపతిరావు, వెంకటేష్, రామకృష్ణలు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుండటంతో తెలుగుదేశం నాయకులు కక్ష కట్టారు. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా దాడికి ప్రయత్నించారు. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న టీడీపీ వర్గీయులు అదునుచూసి దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్ఆర్ సీపీ వర్గీయులు ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై కె.మాధవరావు గ్రామానికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన ముగ్గురినీ చికిత్స నిమిత్తం 108లో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామని ఇంకొల్లు సీఐ సత్యకైలాష్‌నాథ్ తెలి పారు. నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని చెప్పారు. -
రాష్ట్ర విభజనపై టీడీపీ వైఖరి ప్రకటించాలి
పర్చూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన విషయంలో నిర్ణయాన్ని వెల్లడించకుండా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ వెంటనే తన వైఖరి ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు డిమాండ్ చేశారు. సోమవారం పర్చూరు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారిందన్నారు. వైఎస్ఆర్ కుటుంబంపై కేంద్రం చేస్తున్న కుట్రలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు భాగస్వాములయ్యారని ఆరోపించారు. కేవలం కేంద్రానికి గులాంగిరీ చేయలేదన్న సాకుతో రాష్ట్రాన్ని విభజించాలన్న కేంద్రం నిర్ణయాన్ని వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. టీడీపీ విధానం చెప్పకుండా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, రామోజీరావుల ఆస్తులను పరిరక్షించేందుకు కేసీఆర్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజనను వైఎస్సార్ సీపీ ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకుంటుందని చెప్పారు. ప్రజలు వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారని సర్వేలు సైతం చెబుతున్నాయన్నారు. ఒకవేళ రాష్ట్రం విడిపోయినా సీమాంధ్రలోని 175 స్థానాల్లో 150 స్థానాలు కచ్చితంగా గెలిచే శక్తి వైఎస్సార్ సీపీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అమలవుతాయన్నారు. ముందుగా స్థానిక బొమ్మల సెంటర్లోని అంబేద్కర్, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి జూపూడి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మనుబోతు వెంకటరెడ్డి, దళిత నేతలు జూపూడి మార్కు, జంగా అనిల్, నలిగల కిషోర్, గేరా స్వరాజ్‌కుమార్, బండి రాంబాబు, బిళ్లా బాబురావు, రేగులగడ్డ దయారావు, విష్ణుమూర్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు యద్దనపూడి హరిప్రసాద్, కొసనా రాంప్రసాద్, గాజుల రమేష్, తమ్మా అమ్మిరెడ్డి, దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కొల్లా శ్రీహరిరావు, ఆకుల మధుబాబు, పొదిలి రాఘవ తదితరులు పాల్గొన్నారు. -
పర్చూరులో నలుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులు అరెస్ట్
ప్రకాశం జిల్లా పర్చూరులో అంత రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు దొంగలను శుక్రవారం ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 25 సవర్ల బంగారం, కిలోన్నర వెండిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దొంగలను పర్చూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.7 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పోలీసుల తమదైన శైలీలో వారిని దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు.