పర్చూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన విషయంలో నిర్ణయాన్ని వెల్లడించకుండా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ వెంటనే తన వైఖరి ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు డిమాండ్ చేశారు. సోమవారం పర్చూరు వచ్చిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారిందన్నారు. వైఎస్‌ఆర్ కుటుంబంపై కేంద్రం చేస్తున్న కుట్రలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు భాగస్వాములయ్యారని ఆరోపించారు. కేవలం కేంద్రానికి గులాంగిరీ చేయలేదన్న సాకుతో రాష్ట్రాన్ని విభజించాలన్న కేంద్రం నిర్ణయాన్ని వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.
టీడీపీ విధానం చెప్పకుండా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, రామోజీరావుల ఆస్తులను పరిరక్షించేందుకు కేసీఆర్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజనను వైఎస్సార్ సీపీ ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకుంటుందని చెప్పారు. ప్రజలు వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారని సర్వేలు సైతం చెబుతున్నాయన్నారు. ఒకవేళ రాష్ట్రం విడిపోయినా సీమాంధ్రలోని 175 స్థానాల్లో 150 స్థానాలు కచ్చితంగా గెలిచే శక్తి వైఎస్సార్ సీపీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు.
జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అమలవుతాయన్నారు. ముందుగా స్థానిక బొమ్మల సెంటర్‌లోని అంబేద్కర్, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి జూపూడి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మనుబోతు వెంకటరెడ్డి, దళిత నేతలు జూపూడి మార్కు, జంగా అనిల్, నలిగల కిషోర్, గేరా స్వరాజ్‌కుమార్, బండి రాంబాబు, బిళ్లా బాబురావు, రేగులగడ్డ దయారావు, విష్ణుమూర్తి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు యద్దనపూడి హరిప్రసాద్, కొసనా రాంప్రసాద్, గాజుల రమేష్, తమ్మా అమ్మిరెడ్డి, దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కొల్లా శ్రీహరిరావు, ఆకుల మధుబాబు, పొదిలి రాఘవ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజనపై టీడీపీ వైఖరి ప్రకటించాలి
Published Tue, Dec 31 2013 2:52 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement