చంద్రబాబు చెప్పినట్లే విభజన
రాష్ట్రాన్ని విడదీయడానికి ఆయన చెప్పిన పద్ధతులనే కేంద్రం పాటిస్తోంది
వైఎస్సార్ సీపీ నాయకుడు కొణతాల ధ్వజం
అఖిలపక్షం పెట్టాలని అక్టోబర్ 7న చంద్రబాబు అడిగారు.. వీరు పెట్టారు
సమన్యాయమంటూ ఆయన ఢిల్లీలో దీక్షకు కూర్చోగానే జీవోఎం ఏర్పాటు చేశారు
ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో టీడీపీ అధినేత మాట్లాడాకే విభజన నిర్ణయం
రాష్ట్రంలోనే ఉన్న తెలంగాణకు విజయమ్మను ఎందుకు వెళ్లనీయలేదో సీఎం జవాబు చెప్పాలి
వరద బాధిత రైతులకు కేంద్ర సాయం కోసం జగన్ ప్రధాని, రాష్ట్రపతిల అపాయింట్‌మెంట్ కోరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పిన పద్ధతిలోనే కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ ధ్వజమెత్తారు. కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం తమ పార్టీని ఇరుకున పెట్టేందుకే అంటూ బాబు మాట్లాడుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ‘‘బాబు మర్చిపోయారేమోగానీ, అక్టోబర్ ఏడో తేదీన ఆయన ఢిల్లీలో దీక్షకు కూర్చుంటూ స్పష్టంగా ఆఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.
ఆయన అఖిలపక్ష సమావేశం అన్నాకే ఈ రోజు సమావేశం పెట్టారు. సమన్యాయం చేయాలని ఆయన ఢిల్లీలో దీక్షకు కూర్చున్నాకే విభజన తరువాత ఏర్పడబోయే సమస్యల పరిష్కారం కోసం కేంద్రం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు 7వ తేదీన ఢిల్లీలో దీక్షకు కూర్చుంటే 8వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. ఆయన ఢిల్లీ వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడాకే రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయింది. ఆయన మళ్లీ ఢిల్లీ వెళ్లి వచ్చాకే కేంద్ర మంత్రివర్గం రాష్ట్రవిభజన నిర్ణయానికి ఆమోదం తెలిపింది’’ అని కొణతాల వివరించారు.
శుక్ర వారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబు ఢిల్లీ దీక్ష తరువాత ఆ పార్టీ నేతలే తమ అధినేత దీక్ష విజయవంతమైందని ప్రకటించుకుంటూ.. ఆ దీక్షకు కేంద్రం తలవంచే విభజన సమస్యలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం వేశారని చెప్పుకున్నారని గుర్తు చేశారు. జులై 30న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తెలంగాణ అనుకూల ప్రకటన తీసుకున్న తరువాత కూడా చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టి మరీ ఆ నిర్ణయాన్ని స్వాగతించారన్నారు. కొత్త రాజధాని నిర్మానానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలని కూడా డిమాండ్ చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పటికీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. చంద్రబాబు పైకి మాట్లాడేది ఒక రకంగా ఉంటుందని, చేసేది మరో రకంగా ఉంటుందని కొణతాల తూర్పారబట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరి సహకారంతోనే విభజన ప్రక్రియ వేగంగా జరుగుతుండడం దురదృష్టకరంగా అభివర్ణించారు.
విజయమ్మ యాత్రను అడ్డుకుంది ప్రజలు కాదు, పోలీసులే..
గతంలో వరంగల్ జిల్లా ఓదార్పుయాత్రకు బయలుదేరిన జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు కూడా తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను నల్లగొండ జిల్లా పర్యటనకు వెళ్లనీయకుండా చేయడం ద్వారా అప్పటి ఘటనను పునరావృత్తం చేసిందని కొణతాల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయమ్మ పర్యటనను అడ్డుకున్నది ప్రజలు కాదని, పోలీసులేనని గుర్తు చేశారు. వరద వల్ల న ష్టపోయిన రైతుల పరామర్శకు వెళ్లిన విజయమ్మను ఖమ్మం జిల్లాలో ప్రజలు ఆదరించారని, దీంతో జీర్ణించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం తన శక్తియుక్తులను, పోలీసులను అడ్డంపెట్టుకొని ఆమెను నల్లగొండ జిల్లా ప్రజల దగ్గరకు వెళ్లకుండా చేశారన్నారు. విజయమ్మ వెంట ఉన్న పార్టీ నేతలందరినీ భయభ్రాంతులకు గురిచేశారన్నారు. తాను గట్టి సమైక్యవాదినని చెప్పుకునే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసే పోలీసుయంత్రాంగం ఈ సరికే రాష్ట్ర విభజన జరిగిపోయిందన్న రీతిలో వ్యవహరించడం.. ఆయన మంత్రివర్గంలో పనిచేసే మంత్రులే రెచ్చగొట్టడం వంటి ఘటనలు బాధాకరమన్నారు. ఇదే సమయంలో అదే ప్రాంతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన చేస్తుంటే ఎలాంటి ఆటంకాలూ లేకుండా పూర్తి వెసులుబాటు కల్పించారని అన్నారు.
వైఎస్సార్ సీపీ అంటే ప్రభుత్వానికి గుండెల్లో రైళ్లు..
విజయమ్మను ప్రజల వద్దకు వెళ్లనీయకుండా చేయడాన్ని బట్టే.. ప్రభుత్వ పెద్దలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతలా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చని కొణతాల అన్నారు. రాష్ట్రంలోనే ఉన్న ఒక ప్రాంతానికి విజయమ్మను ఎందుకు వెళ్లనీయలేదో స్పష్టంగా జవాబు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతున్న సమయంలోనే ఇలాంటి ఘటనలు శోచనీయమని.. ఈ రకంగా ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సినముఖ్యమంత్రి వేరొక పార్టీ గౌరవాధ్యక్షురాలికి రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు. విభజన ప్రక్రియకు ముందే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో తిరగడానికి వీలులేదన్నట్టు నిర్ణయాలు తీసుకునే వ్యక్తికి.. ఈ సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొ నసాగే హక్కులేదని ధ్వజమెత్తారు. రక్షణ కల్పించడం చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన మంత్రివర్గంలోని మంత్రులను నియంత్రించుకోలేరు.. తన చేతిలో ఉన్న విభజన ప్రక్రియను ఆపడం ఆయనకు చేతకాదని సీఎంపై విరుచుకుపడ్డారు.
జగన్ ప్రధాని, రాష్ట్రపతిల అపాయింట్‌మెంట్ కోరారు..
వరదలలో నష్టపోయిన రైతులకు కేంద్ర సాయం కోరేందుకు తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి, రాష్ట్రపతిల అపాయింట్‌మెంట్ కోరారని కొణతాల చెప్పారు. రాష్ట్రపతి నుంచి వచ్చే అపాయింట్‌మెంట్‌ను బట్టి ఆయనను వీలుంటే హైదరాబాద్‌లో లేదంటే ఢిల్లీలో కలుస్తారన్నారు. రైతులను ఆదుకునే అంశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలను వారి దృష్టికి తీసుకువస్తారన్నారు. విభజన ప్రక్రియకు సంబంధించి 11 అంశాలపై జీవోఏంకు సూచనలు చేయాలంటూ కేంద్రం రాసిన లేఖ శుక్రవారం పార్టీ కార్యాలయానికి అందిందని చెప్పారు. దానిపై పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ పార్టీ మొదట నుంచీ సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటుందని.. కేంద్రం జీవోఎంను ఏర్పాటు చేసినప్పడు దానిని సైమన్ కమీషన్‌తో పోల్చుతూ, బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించామని గుర్తు చేశారు. తమ పార్టీ సమైక్యవాద వైఖరికి, కేంద్రం లేఖకు పొసగదని అనిపిస్తోందన్నారు. ఏది ఏమైనా లేఖపై పార్టీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.