దొంగ ఓట్లు.. ‘పచ్చ’ నోట్లు | Nova Agritech Company committed election irregularities through illegal funds | Sakshi
Sakshi News home page

దొంగ ఓట్లు.. ‘పచ్చ’ నోట్లు

Published Sat, Jan 27 2024 4:48 AM | Last Updated on Sun, Feb 4 2024 5:16 PM

Nova Agritech Company committed election irregularities through illegal funds - Sakshi

సాక్షి, అమరావతి: ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లతో మోసాలకు పాల్పడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని మరోసారి రుజువైంది! నల్లధనాన్ని వెదజల్లి ఎన్నికల్లో అక్రమ మార్గాల్లో నెగ్గేందుకు టీడీపీ ఏకంగా ప్రత్యేక కార్యాలయాలనే ఏర్పాటు చేసుకున్నట్లు ఆధారాలతో సహా బట్టబయలైంది. 2019 ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా (ప్రస్తుతం బాపట్ల జిల్లా) పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ పాల్పడిన అక్రమాలు రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (ఏపీఎస్‌ డీఆర్‌ఐ) తనిఖీల్లో తాజాగా వెలుగులోకి వచ్చాయి.

టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్‌గా ఉన్న నోవా అగ్రిటెక్‌ కంపెనీ కార్యాలయం కేంద్రంగా ఎన్నికల అక్రమాలకు తెగబడినట్లు డీఆర్‌ఐ కీలక ఆధారాలను గుర్తించింది. ఆ వెంటనే ఆ కంపెనీకి చెందిన కీలక వ్యక్తులు పరారు కావడం గమనార్హం. ఆదాయపన్ను (ఐటీ) చట్టం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజెస్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డట్టు తేలింది. డీఆర్‌ఐ నివేదిక మేరకు న్యాయస్థానం అనుమతితో టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు, నోవా అగ్రిటెక్‌ కంపెనీలపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ వ్యవహారం ఇదిగో ఇలా సాగింది.. 

నోవా అగ్రిటెక్‌ కేంద్రంగా... 
పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు చెందిన నోవా అగ్రిటెక్‌ కంపెనీ కార్యాలయంలో డీఆర్‌ఐ అధికారులు తాజాగా తనిఖీలు నిర్వహించారు. గుంటూరు శ్రీలక్ష్మీ నగర్‌లోని ఆ కంపెనీ కార్యాలయంలో ఈ నెల 24న చేపట్టిన సోదాల్లో ప్రధానంగా డీఆర్‌ఐ అధికారులు స్వా«దీనం చేసుకున్న ఓ డైరీ టీడీపీ ఎన్నికల అక్రమాల గుట్టును విప్పింది. స్వతంత్ర సాక్షులు, నోవా అగ్రిటెక్‌ కంపెనీ ఉద్యోగుల సమక్షంలో ఆ డైరీని డీఆర్‌ఐ అధికారులు జప్తు చేశారు.  

కీలక అధికారి పరార్‌ 
నోవా అగ్రిటెక్‌కు చెందిన ఉద్యోగి పుల్లెల అజయ్‌బాబు ఆ డైరీని ఉపయోగించారని కంపెనీ ఉద్యోగులు వెల్లడించారు. ప్రస్తుతం రిటైరైన పుల్లెల అజయ్‌ బాబును కార్యాలయానికి రావాలని డీఆర్‌ఐ అధికారులు సూచించిన వెంటనే ఆయన పరారు కావడం గమనార్హం. తన సెల్‌ఫోన్‌ను సైతం స్విచ్ఛాఫ్‌ చేసేసి అందుబాటులో లేకుండా పోయారు. టీడీపీ ఎమ్మె­ల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాలతోనే ఆయన పరారైనట్లు స్పష్టమవుతోంది.  

13 పేజీల్లో నమోదు.. 
ఆ డైరీని పరిశీలించగా పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ ఎలా ఎన్నికల అక్రమాలకు పాల్పడిందో వెలుగు చూసింది. పోలింగ్‌కు ముందు రోజు అంటే 2019 ఏప్రిల్‌ 11న అక్రమ నిధులను ఎలా తెచ్చారు? ఓటర్లకు ఎలా పంపిణీ చేశారనే వివరాలన్నీ అందులో ఉన్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీ చేసిన డబ్బుల వివరాలను ఏకంగా 13 పేజీల్లో  నమోదు చేయడం గమనార్హం.  

అంతా నల్లధనమే... 
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భారీగా నల్లధనాన్ని తరలించినట్లు డీఆర్‌ఐ సోదాల్లో వెల్లడైంది. అందుకోసం షెల్‌ కంపెనీల ద్వారా అక్రమ నిధులను చేరవేశారు. ఆ డబ్బుల వివరాలేవీ నోవా అగ్రిటెక్‌ కంపెనీ రికార్డులతో సరిపోలకపోవడంతో అదంతా నల్లధనమేనని రుజువ­వుతోంది. కంపెనీ బ్యాంకు ఖాతాల్లో ఆ నిధుల జమ, విత్‌డ్రాలకు సంబంధించిన వివరాలేవీ లేవు. అంటే ఓటర్లను ప్రలోభ పెట్టి ఎన్నికల్లో అక్రమాలుకు పాల్పడేందుకు వెచ్చిం చినదంతా నల్లధనమేనని నిర్థారణ అయింది. 

ఎన్నికల కమిషన్‌కూ బురిడీ... 
డైరీలో పేర్కొన్న నిధుల వ్యయానికి సంబంధించిన వివరాలను టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఎన్నికల వ్యయంలో చూపలేదు. కమిషన్‌కు ఎప్పటికప్పుడు సమ­ర్పించాల్సిన వ్యయంలో డైరీలో పేర్కొన్న నిధుల వివరాలు లేవు. అంటే టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల కమిషన్‌కు తప్పుడు నివేదిక ఇచ్చినట్టు స్పష్టమవుతోంది.  

ఐటీ, ఈడీ, సెబీలకు నివేదిక.. 
టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అక్రమంగా నిధులు తరలించినట్లు ఆధారాలతో వెల్లడి కావడంతో డీఆర్‌ఐ అధికారులు తదు­పరి చర్యలకు ఉపక్రమించారు. తమ తనిఖీ­ల్లో వెలుగు చూసిన అంశాలను ఆదాయపన్ను శాఖ, ఈడీ, సెబీ దృష్టికి తెచ్చారు. నోవా అగ్రిటెక్‌ కంపెనీ తమ రికార్డుల్లో చూప­ని నిధులను వెచ్చించడంతోపాటు పన్ను చెల్లించకుండా ఎగవేసింది. అక్రమ నిధుల తరలింపు ద్వారా కేంద్ర మనీ లాండరింగ్‌ చట్టాన్ని ఉల్లంఘించింది.

అక్రమ నిధులను తరలించేందుకు కంపెనీని కేంద్ర బిందువుగా చేసుకోవడం సెబీ నిబంధనలకు విరుద్ధం. నోవా అగ్రి­టెక్‌ అక్రమాలపై విచారించి తగిన చర్య­లు తీసుకోవాలని కోరుతూ ఆదాయపన్ను, ఈడీ, సెబీలకు డీఆర్‌ఐ అధికారులు నివే­దిక సమర్పించారు. త్వరలో­నే ఆ మూడు సంస్థలు రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది.

కేసు నమోదుకు సన్నద్ధం
అక్రమ నిధుల ద్వారా ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డ నోవా అగ్రిటెక్‌ కంపెనీ, కంపెనీ చైర్మ­న్‌­గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై పోలీసు శాఖ కేసు నమోదు చేయనుంది. ఈ అక్రమ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసేందుకు బాపట్ల జిల్లా పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ కేసులో త్వరలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు స్పష్టమవుతోంది.

 డైరీలో నల్లధనం
♦ పవులూరు అనే గ్రామంలో పోలింగ్‌ కేంద్రాలు 223 నుంచి 226 పరిధిలో 239 మంది ఓటర్లకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. మొత్తం రూ.2.39 లక్షలు పంపిణీ చేసినట్టు ఆ డైరీలో ఉంది.  
♦  మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రావు ద్వారా రూ.3.60 లక్షలు ఓటర్లకు పంపిణీ చేసినట్లు డైరీలో ఉంది.  
♦ నోవా అగ్రిటెక్‌ కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారా ఓటర్లకు ఆ డబ్బులను పంపిణీ చేశారు. 
♦  ఆ కంపెనీకి చెందిన అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేశ్‌ అనే ఉద్యోగుల ద్వారా దుద్దుకూరు గ్రామంలో ఓటర్లకు రూ.15 లక్షలు పంపిణీ చేశారు.  
♦ పర్చూరు నియోజకవర్గంలోని దుద్దుకూరు, ఇంకొల్లు, తాటిపర్తివారిపాలెం, గంగవరం తదితర గ్రామాల్లో ఓటర్లకు డబ్బులు ఎలా పంపిణీ చేసి  ఓట్లను కొనుగోలు చేశారో డైరీలో వివరంగా ఉంది.  
♦ ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తరలించేందుకు రవాణా వ్యయం, పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్ల పేర్లు, వారికి పంపిణీ చేసిన మొత్తం తదితర వివరాలను ఆ డైరీలో సవివరంగా పేర్కొనడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement