eluri sambasivarao
-
ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: మార్టూరు గ్రానైట్ అక్రమ రవాణా వ్యవహారం అధికారపార్టీలో అగ్గి రాజేస్తోంది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య ఇది మరింత విభేదాలు సృష్టించింది. గ్రానైట్ అక్రమ రవాణాకు సంబంధించి ప్రతి లారీకి కప్పం కట్టాల్సిందేనంటూ పర్చూరు ఎమ్మెల్యే అనుచరులు పట్టుబడుతుండగా, తాము చెల్లించేది లేదంటూ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి అనుచరులు తెగేసి చెబుతున్నారు. వీరి మధ్య ముదిరిన ఈ వివాదం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జీరో బిల్లులతో అక్రమ రవాణాప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్టీతో పాటు ఎటువంటి పన్నులు చెల్లించకుండా జీరో బిల్లులతో మార్టూరు నుంచి గ్రానైట్ నిత్యం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, పలు దేశాలకు తరలిపోతోంది. రోజుకు కనీసం 80 లారీల్లో 30 నుంచి 45 టన్నుల పాలిషింగ్ బండలు ఇలా జీరో బిల్లులతో తరలిస్తున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీలు పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరులో ఉన్నాయి. జీరో బిల్లులతో తరలిస్తున్నందున ఇక్కడి అధికారపార్టీ ఎమ్మెల్యే అనుచరులు వసూళ్లకు పాల్పడుతున్నారు. మార్టూరు నుంచి తెలంగాణకు లారీ వెళ్లాలంటే బాపట్ల జిల్లాలోని పర్చూరు, అద్దంకి, పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల లేదా మాచర్ల నియోజకవర్గాలు దాటాల్సి ఉంది. పర్చూరు నియోజకవర్గం నేతకు లారీకి రూ. 8 వేలు చెల్లిస్తుండగా చిలకలూరిపేట నేతకు రూ. 2 వేలు, నరసరావుపేట నేతకు రూ. 4 వేలు, సరిహద్దు కావడంతో మాచర్ల రూటున వెళితే అక్కడి నేతకు రూ. 10 వేలు, లేదా పిడుగురాళ్ల రూటున వెళితే అక్కడి నేతకు రూ. 10 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. రూ. 8 వేలు దందా నిర్వహకులు తమ వాటాగా తీసుకుంటున్నారు. మొత్తంగా లారీకి రూ. 32 వేలు వసూలు చేస్తున్నారు. పర్చూరు నేత కనుసన్నల్లోనే వసూళ్ల పర్వం..డబ్బు చెల్లించిన లారీలను మాత్రమే పిడుగురాళ్ల లేదా మాచర్ల నుంచి తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. లారీకి చెల్లించాల్సిన రూ. 32 వేలు వసూలయ్యాకే వాటిని పంపుతున్నారు. ఇలా వసూలైన మొత్తాన్ని పర్చూరు నేత అనుచరులు అందరికీ పంపకాలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఆ పర్చూరు నేత మార్టూరు మండలానికి చెందిన ఓ బీసీ నేతకు అప్పగించారు. ఆవ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతకు రూ. 2 కోట్లు ఎన్నికల ఫండ్ ముట్టజెప్పాడని సమాచారం. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి వారం నుంచే గ్రానైట్ అక్రమ రవాణా వ్యవహారం అతనికి కట్టబెట్టారని తెలుస్తోంది.కప్పం కట్టేందుకు ససేమిరా.. మంత్రి గొట్టిపాటి సొంత గ్రామం పర్చూరు నియోజకవర్గంలోని యద్దనపూడి మండలంలో ఉంది. మార్టూరు గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకుల్లో మంత్రి అనుచరులు కూడా ఉన్నారు. మంత్రికి అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మార్టూరులోని 250 పాలిషింగ్ పరిశ్రమలకు గ్రానైట్ రాయి (ముడిరాయి)ని తరలిస్తారు. గొట్టిపాటి క్వారీల నుంచి రాయిని తెచ్చుకోవడం, పైగా సొంత నియోజకవర్గానికి చెందినవారు కావడంతో గ్రానైట్ వ్యాపారులకు మంత్రితో సత్సంబంధాలున్నాయి. కొందరు బంధువులు కూడా ఉన్నారు. వీరంతా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే అనుచరులకు కప్పం కట్టేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. తమ నియోజకవర్గంలో ఉన్న ఫ్యాక్టరీల నుంచి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నందున తమ నేతకు కప్పం కట్టాల్సిందేనంటూ పర్చూరు ఎమ్మెల్యే అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మంత్రి సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలో ఉంది కాబట్టి కట్టించుకుంటున్న కప్పంలో వాటా ఇవ్వాలని గొట్టిపాటి అనుచరులు మెలిక పెట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య అగ్గిరాజుకుంది. ఈ వ్యవహారం అద్దంకి, పర్చూరు ప్రాంతాల్లోనే కాక జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి అధిష్టానానికి సైతం ఈ రచ్చ చేరినట్లు అధికారపార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ప్రభుత్వాదాయానికి భారీగా గండి..అధికార పార్టీకి చెందిన వారే ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తుండటంతో ఖజానాకు భారీగా గండి పడుతోంది. ప్రతి టన్ను పాలిషింగ్ రాయికి సేల్స్‌టాక్స్ రూ. 1,300, మైనింగ్ ట్యాక్స్ రూ. 700 చొప్పున మొత్తం రూ. 2 వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ లెక్కన 35 టన్నుల లారీకి రూ. 70 వేలు ట్యాక్స్ చెల్లించాలి. రోజుకు 80 లారీలు అనుకుంటే రూ. 56 లక్షలు ట్యాక్స్ రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించకుండా అక్రమ మార్గంలో గ్రానైట్‌ను తరలిస్తున్నారు. అయినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. -
దొంగ ఓట్లు.. ‘పచ్చ’ నోట్లు
సాక్షి, అమరావతి: ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లతో మోసాలకు పాల్పడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని మరోసారి రుజువైంది! నల్లధనాన్ని వెదజల్లి ఎన్నికల్లో అక్రమ మార్గాల్లో నెగ్గేందుకు టీడీపీ ఏకంగా ప్రత్యేక కార్యాలయాలనే ఏర్పాటు చేసుకున్నట్లు ఆధారాలతో సహా బట్టబయలైంది. 2019 ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా (ప్రస్తుతం బాపట్ల జిల్లా) పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ పాల్పడిన అక్రమాలు రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్ డీఆర్ఐ) తనిఖీల్లో తాజాగా వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్‌గా ఉన్న నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయం కేంద్రంగా ఎన్నికల అక్రమాలకు తెగబడినట్లు డీఆర్ఐ కీలక ఆధారాలను గుర్తించింది. ఆ వెంటనే ఆ కంపెనీకి చెందిన కీలక వ్యక్తులు పరారు కావడం గమనార్హం. ఆదాయపన్ను (ఐటీ) చట్టం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డట్టు తేలింది. డీఆర్ఐ నివేదిక మేరకు న్యాయస్థానం అనుమతితో టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు, నోవా అగ్రిటెక్ కంపెనీలపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ వ్యవహారం ఇదిగో ఇలా సాగింది.. నోవా అగ్రిటెక్ కేంద్రంగా... పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు చెందిన నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో డీఆర్ఐ అధికారులు తాజాగా తనిఖీలు నిర్వహించారు. గుంటూరు శ్రీలక్ష్మీ నగర్‌లోని ఆ కంపెనీ కార్యాలయంలో ఈ నెల 24న చేపట్టిన సోదాల్లో ప్రధానంగా డీఆర్ఐ అధికారులు స్వా«దీనం చేసుకున్న ఓ డైరీ టీడీపీ ఎన్నికల అక్రమాల గుట్టును విప్పింది. స్వతంత్ర సాక్షులు, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగుల సమక్షంలో ఆ డైరీని డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. కీలక అధికారి పరార్ నోవా అగ్రిటెక్‌కు చెందిన ఉద్యోగి పుల్లెల అజయ్‌బాబు ఆ డైరీని ఉపయోగించారని కంపెనీ ఉద్యోగులు వెల్లడించారు. ప్రస్తుతం రిటైరైన పుల్లెల అజయ్ బాబును కార్యాలయానికి రావాలని డీఆర్ఐ అధికారులు సూచించిన వెంటనే ఆయన పరారు కావడం గమనార్హం. తన సెల్‌ఫోన్‌ను సైతం స్విచ్ఛాఫ్ చేసేసి అందుబాటులో లేకుండా పోయారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాలతోనే ఆయన పరారైనట్లు స్పష్టమవుతోంది. 13 పేజీల్లో నమోదు.. ఆ డైరీని పరిశీలించగా పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ ఎలా ఎన్నికల అక్రమాలకు పాల్పడిందో వెలుగు చూసింది. పోలింగ్‌కు ముందు రోజు అంటే 2019 ఏప్రిల్ 11న అక్రమ నిధులను ఎలా తెచ్చారు? ఓటర్లకు ఎలా పంపిణీ చేశారనే వివరాలన్నీ అందులో ఉన్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీ చేసిన డబ్బుల వివరాలను ఏకంగా 13 పేజీల్లో నమోదు చేయడం గమనార్హం. అంతా నల్లధనమే... ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భారీగా నల్లధనాన్ని తరలించినట్లు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. అందుకోసం షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధులను చేరవేశారు. ఆ డబ్బుల వివరాలేవీ నోవా అగ్రిటెక్ కంపెనీ రికార్డులతో సరిపోలకపోవడంతో అదంతా నల్లధనమేనని రుజువవుతోంది. కంపెనీ బ్యాంకు ఖాతాల్లో ఆ నిధుల జమ, విత్‌డ్రాలకు సంబంధించిన వివరాలేవీ లేవు. అంటే ఓటర్లను ప్రలోభ పెట్టి ఎన్నికల్లో అక్రమాలుకు పాల్పడేందుకు వెచ్చిం చినదంతా నల్లధనమేనని నిర్థారణ అయింది. ఎన్నికల కమిషన్‌కూ బురిడీ... డైరీలో పేర్కొన్న నిధుల వ్యయానికి సంబంధించిన వివరాలను టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఎన్నికల వ్యయంలో చూపలేదు. కమిషన్‌కు ఎప్పటికప్పుడు సమర్పించాల్సిన వ్యయంలో డైరీలో పేర్కొన్న నిధుల వివరాలు లేవు. అంటే టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల కమిషన్‌కు తప్పుడు నివేదిక ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. ఐటీ, ఈడీ, సెబీలకు నివేదిక.. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అక్రమంగా నిధులు తరలించినట్లు ఆధారాలతో వెల్లడి కావడంతో డీఆర్ఐ అధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. తమ తనిఖీల్లో వెలుగు చూసిన అంశాలను ఆదాయపన్ను శాఖ, ఈడీ, సెబీ దృష్టికి తెచ్చారు. నోవా అగ్రిటెక్ కంపెనీ తమ రికార్డుల్లో చూపని నిధులను వెచ్చించడంతోపాటు పన్ను చెల్లించకుండా ఎగవేసింది. అక్రమ నిధుల తరలింపు ద్వారా కేంద్ర మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించింది. అక్రమ నిధులను తరలించేందుకు కంపెనీని కేంద్ర బిందువుగా చేసుకోవడం సెబీ నిబంధనలకు విరుద్ధం. నోవా అగ్రిటెక్ అక్రమాలపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదాయపన్ను, ఈడీ, సెబీలకు డీఆర్ఐ అధికారులు నివేదిక సమర్పించారు. త్వరలోనే ఆ మూడు సంస్థలు రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదుకు సన్నద్ధం అక్రమ నిధుల ద్వారా ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డ నోవా అగ్రిటెక్ కంపెనీ, కంపెనీ చైర్మన్‌గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై పోలీసు శాఖ కేసు నమోదు చేయనుంది. ఈ అక్రమ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు బాపట్ల జిల్లా పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ కేసులో త్వరలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు స్పష్టమవుతోంది. డైరీలో నల్లధనం ♦ పవులూరు అనే గ్రామంలో పోలింగ్ కేంద్రాలు 223 నుంచి 226 పరిధిలో 239 మంది ఓటర్లకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. మొత్తం రూ.2.39 లక్షలు పంపిణీ చేసినట్టు ఆ డైరీలో ఉంది. ♦ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రావు ద్వారా రూ.3.60 లక్షలు ఓటర్లకు పంపిణీ చేసినట్లు డైరీలో ఉంది. ♦ నోవా అగ్రిటెక్ కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారా ఓటర్లకు ఆ డబ్బులను పంపిణీ చేశారు. ♦ ఆ కంపెనీకి చెందిన అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేశ్ అనే ఉద్యోగుల ద్వారా దుద్దుకూరు గ్రామంలో ఓటర్లకు రూ.15 లక్షలు పంపిణీ చేశారు. ♦ పర్చూరు నియోజకవర్గంలోని దుద్దుకూరు, ఇంకొల్లు, తాటిపర్తివారిపాలెం, గంగవరం తదితర గ్రామాల్లో ఓటర్లకు డబ్బులు ఎలా పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేశారో డైరీలో వివరంగా ఉంది. ♦ ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తరలించేందుకు రవాణా వ్యయం, పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల పేర్లు, వారికి పంపిణీ చేసిన మొత్తం తదితర వివరాలను ఆ డైరీలో సవివరంగా పేర్కొనడం గమనార్హం. -
చర్చలో రభస
సాక్షి, అమరావతి: బడ్జెట్ సమావేశాల సందర్భంగా నాలుగో రోజూ సభలో రభసను విపక్షం కొనసాగించింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారామ్ బడ్జెట్‌పై చర్చ చేపట్టారు. పార్టీ ల సంఖ్యాబలాన్ని అనుసరించి సభ్యులకు సమయం కేటాయిస్తానని సభ ప్రారంభంలోనే ప్రకటించారు. దీని ప్రకారం టీడీపీ సభ్యులకు 17 నిమిషాలు ఇస్తున్నట్లు పేర్కొంటూ చర్చలో తొలుత మాట్లాడే అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ బడ్జెట్ గణాంకాలు అంకెల గారడీ అని, ప్రభుత్వం హామీలను విస్మరించిందని చెప్పారు. ఫ్యాన్సీ నెంబర్‌పై 2,79,279పై ఉన్న దృష్టి ప్రజా సమస్యలపై లేదంటూ బడ్జెట్‌ను విమర్శించారు. ఈ సమయంలో సీఎం ఆస్తులంటూ ఆరోపణలు చేస్తుండడంతో అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అప్పటికే నిర్ణీత సమయం మించిపోవడం, వ్యక్తిగత విమర్శలు కొనసాగించడంతో ప్రసంగాన్ని త్వరగా ముగించాలని స్పీకర్ సూచించారు. బడ్జెట్‌పై చర్చించకుండా తప్పుదోవ పట్టించే యత్నాలు సరికాదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూచించారు. అప్పటికే టీడీపీకి ఇచ్చిన నిర్ణీత సమయం దాటిపోయి 25 నిమిషాలు మాట్లాడడంతో అధికార పార్టీ నుంచి చర్చలో పాల్గొనేందుకు కోన రఘుపతికి స్పీకర్ అవకాశమిచ్చారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని తమకు సమయం సరిపోలేదంటూ నినాదాలు చేస్తూ చర్చకు ఆటంకం కల్పించారు. డోల బాలవీరాంజనేయులు, వెలగపూడి రామకృష్ణ, ఆదిరెడ్డి భవానీ తదితరులు సభాపతి కుర్చీ వద్దకు చేరుకుని స్పీకర్ డౌన్‌డౌన్... అంటూ నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు తమ సీట్ల వద్దకు వెళ్లాలని స్పీకర్ పదేపదే కోరినా మైక్ ఇవ్వాలని పట్టుబట్టారు. భోజనం సమయం కావడంతో టీడీపీ సభ్యులు సభ నుంచి సస్పెండై బయటకు వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో ఉన్నారని ఆర్థిక మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. అనంతరం సభ ఆమోదంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో నినాదాలు చేస్తూ నిష్క్రమించారు. -
బరితెగిద్దాం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారం కోసం బరితెగించాలని తెలుగుదేశం నాయకులు నిర్ణయించారు. ఎంత ఖర్చయినా సరే జెడ్పీతో పాటు మెజారిటీ ఎంపీపీలు దక్కించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తోపాటు కొండపి, పర్చూరు, కనిగిరి ఎమ్మెల్యేలు డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, కదిరి బాబూరావు, కందుకూరు, గిద్దలూరు, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జులు దివి శివరామ్, అన్నా రాంబాబు, కరణం వెంకటేష్, కందుల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీలో మెజారిటీ లేకపోయినా ఏదోవిధంగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని, అందుకు ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. జెడ్పీ ఎన్నికల్లో 56 జెడ్పీటీసీ స్థానాలకు గాను 31 స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్, 25 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అడ్డదారిలో గెలుపు కోసం కనీసం ఐదుగురు జెడ్పీటీసీలను అయినా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వైఎస్సార్ సీపీ విప్ జారీ చేయనుండటంతో జెడ్పీటీసీ సభ్యులు వచ్చే పరిస్థితి లేనందున విప్ చెల్లదని ప్రచారం చేయాలని, ఆ తర్వాత వారి పదవి పోయినా మనకు వచ్చిన నష్టం లేదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయినట్లు సమాచారం. జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రతి నియోజకవర్గ ఇన్చార్జి పూర్తిస్థాయిలో కృషి చేయాలని టీడీపీ నాయకులు నిర్ణయించారు. వారు దాదాపు గంటకుపైగా చర్చించుకొని జెడ్పీ పీఠాన్ని, అత్యధిక ఎంపీపీలను దక్కించుకోవడంపైనే దృష్టిపెట్టారు. ఇందుకుగాను వైఎస్సార్సీపీ తమకు విప్ ఉందని చెబుతున్నా లేదనే చెప్పాలని నిర్ణయించారు. ప్రధానంగా సభ్యులను ఏదో ఒక విధంగా ఎన్నికల వరకు మభ్యపెట్టేందుకు ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఎన్నికల కమిషన్ సైతం విప్ చెల్లుతుందంటూ ప్రకటించింది కదా అంటే ఫర్లేదు...ఎన్నికలు జరిగే సమయానికి వైఎస్సార్సీపీ రికగ్నైజ్డ్ పార్టీ కాదని, అందువల్ల వారు చెబుతున్నదంతా అబద్ధం అంటూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్‌ను ప్రలోభపెట్టాలని సూచించారు.