సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారం కోసం బరితెగించాలని తెలుగుదేశం నాయకులు నిర్ణయించారు. ఎంత ఖర్చయినా సరే జెడ్పీతో పాటు మెజారిటీ ఎంపీపీలు దక్కించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తోపాటు కొండపి, పర్చూరు, కనిగిరి ఎమ్మెల్యేలు డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, కదిరి బాబూరావు, కందుకూరు, గిద్దలూరు, అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జులు దివి శివరామ్, అన్నా రాంబాబు, కరణం వెంకటేష్, కందుల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీలో మెజారిటీ లేకపోయినా ఏదోవిధంగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని, అందుకు ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. జెడ్పీ ఎన్నికల్లో 56 జెడ్పీటీసీ స్థానాలకు గాను 31 స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్, 25 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అడ్డదారిలో గెలుపు కోసం కనీసం ఐదుగురు జెడ్పీటీసీలను అయినా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వైఎస్సార్ సీపీ విప్ జారీ చేయనుండటంతో జెడ్పీటీసీ సభ్యులు వచ్చే పరిస్థితి లేనందున విప్ చెల్లదని ప్రచారం చేయాలని, ఆ తర్వాత వారి పదవి పోయినా మనకు వచ్చిన నష్టం లేదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయినట్లు సమాచారం.
జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రతి నియోజకవర్గ ఇన్‌చార్జి పూర్తిస్థాయిలో కృషి చేయాలని టీడీపీ నాయకులు నిర్ణయించారు. వారు దాదాపు గంటకుపైగా చర్చించుకొని జెడ్పీ పీఠాన్ని, అత్యధిక ఎంపీపీలను దక్కించుకోవడంపైనే దృష్టిపెట్టారు. ఇందుకుగాను వైఎస్సార్‌సీపీ తమకు విప్ ఉందని చెబుతున్నా లేదనే చెప్పాలని నిర్ణయించారు.
ప్రధానంగా సభ్యులను ఏదో ఒక విధంగా ఎన్నికల వరకు మభ్యపెట్టేందుకు ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఎన్నికల కమిషన్ సైతం విప్ చెల్లుతుందంటూ ప్రకటించింది కదా అంటే ఫర్లేదు...ఎన్నికలు జరిగే సమయానికి వైఎస్సార్‌సీపీ రికగ్నైజ్డ్ పార్టీ కాదని, అందువల్ల వారు చెబుతున్నదంతా అబద్ధం అంటూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్‌ను ప్రలోభపెట్టాలని సూచించారు.
బరితెగిద్దాం..
Published Wed, Jul 2 2014 5:47 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement