divi sivaram
-
మీడియాను చూసి నాలుక్కరుచుకున్న మాజీ ఎమ్మెల్యే
సాక్షి, కందుకూరు: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికారపార్టీ కుట్రలు, కుతంత్రాలు, బరితెగింపు, బెదిరింపులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు తాము ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు వెనుకాడబోమని నిరూపిస్తున్నారు. తాము అనుసరించబోయే అక్రమ కార్యకలాపాల వ్యూహమేంటో చెప్పకనే చెబుతున్నారు. ‘ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైతే రౌడీయిజం చేద్దాం. దాంట్లో తప్పేమి లేదంటూ బహిరంగంగానే ప్రకటించి’ తమ నైజాన్ని చాటుకున్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం చేసిన వ్యాఖ్యలే.. వారి దుష్ట వ్యూహాలను బయటపెట్టాయి. ఎమ్మెల్యే పోతుల రామారావు సాక్షిగా..శివరాం చేసిన ఈ వ్యాఖ్యలపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నం.. కందుకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి ప్రభంజనంలా వీస్తోంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇప్పటికే వందల మంది నాయకులు, కార్యకర్తలు టీడీపీకి గుడ్‌బై చెప్పి, మాజీ మంత్రి, కందుకూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహీధర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిపోయారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన పోతుల రామారావు పార్టీ ఫిరాయించి, టీడీపీలో చేరడంతో.. అప్పటి వరకు పెత్తనం చేసిన దివి శివరాం వర్గానికి మధ్య విబేధాలు తలెత్తాయి. పార్టీలో అసంతృప్తులు తీవ్రస్థాయిలో చెలరేగాయి. ఆ అసంతృప్తులు నేటికీ చల్లారడం లేదు. అదే సమయంలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుండడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. అటు పార్టీని కాపాడుకోవడంతోపాటు ఇటు ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. వారి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఎన్నికల రోజు ఎలాగైనా అల్లర్లు సృష్టించి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయాలనే వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు శివరాం వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. రౌడీయిజం చేసైనా ఎన్నికల్లో గెలుద్దామని బహిరంగంగా కార్యకర్తలకు చెబుతూ.. మీడియా ఉందని గమనించి నాలుక్కరుచుకున్నారు. దీంతో కందుకూరులో పాత రోజులు మళ్లీ పునరావృతమవుతాయా అంటూ చర్చలు మొదలయ్యాయి. -
ఎన్నికల ప్రచారంలో హద్దుమీరుతున్న టీడీపీ నేతలు
-
‘ఎన్నికల్లో గెలిచేందుకు రౌడియిజం చేద్దాం’
సాక్షి, ప్రకాశం: ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలు హద్దుమీరుతున్నారు. ప్రజలు భయాందోళనకు గురయ్యేలా బరితెగింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు తాము ఎంతటికైనా వెనకడామని స్పష్టం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును గెలిపించేందుకు పోరాడుదాం.. అవసరమైతే రౌడీయిజం చేద్దామని వ్యాఖ్యానించారు. అందులో తప్పేం లేదని కూడా అన్నారు. -
పార్టీ కోసం కలిసి పనిచేయండి
సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోండి టీడీపీ కందుకూరు కార్యకర్తల సమావేశంలో పోతుల, దివిలను ఉద్దేశించి రాష్ట్ర మంత్రులు రావెల, శిద్దా కార్యకర్తలకు ఏ ఇబ్బందీ రానివ్వమని హామీ కందుకూరు : రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు, నియోజకవర్గంలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నాయకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంలను ఉద్దేశించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిశోర్‌బాబు పేర్కొన్నారు. స్థానిక వెంగమాంబ ఫంక్షన్హాల్లో సోమవారం నిర్వహించిన టీడీపీ కందుకూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించి సీఎం చంద్రబాబునాయుడు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే కందుకూరు నియోజకవర్గంలో పోతుల రామారావును కూడా చేర్చుకున్నారని చెప్పారు. అధిష్టానం ఆదేశాల మేరకు పోతులతో కలిసి పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా తామంతా అండగా ఉంటామని వివరించారు. మరో మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ఇద్దరు నేతలూ సమస్యలు పరిష్కరించుకుని పనిచేయాలన్నారు. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో శివరాంతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. సహకరించమంటేనే బాధకలుగుతోంది : శివరాం తాను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, ఇప్పుడు కొత్తగా ఇద్దరు మంత్రులు సమావేశం పెట్టి తనను పార్టీకి సహకరించాలని కోర డమేంటని మాజీ ఎమ్మెల్యే శివరాం ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. తనను సముదాయించేందుకు సమావేశం పెట్టినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చంద్రబాబు మనిషినన్నారు. పదవుల కోసం కలిసిపోవడం లేదన్నారు. ఒక అడుగు వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఏఎంసీ చైర్మన్ తల్లపనేని వెంకటేశ్వర్లు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ సభ్యుడు కంచర్ల శ్రీకాంత్, దివి లింగయ్యనాయుడు, కసుకుర్తి ఆదెన్న, బత్తిన వెంకయ్య, మాలకొండ ట్రస్టుబోర్డు చైర్మన్ మాల్యాద్రి, బెజవాడ ప్రసాద్ పాల్గొన్నారు. -
బరితెగిద్దాం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారం కోసం బరితెగించాలని తెలుగుదేశం నాయకులు నిర్ణయించారు. ఎంత ఖర్చయినా సరే జెడ్పీతో పాటు మెజారిటీ ఎంపీపీలు దక్కించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తోపాటు కొండపి, పర్చూరు, కనిగిరి ఎమ్మెల్యేలు డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, కదిరి బాబూరావు, కందుకూరు, గిద్దలూరు, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జులు దివి శివరామ్, అన్నా రాంబాబు, కరణం వెంకటేష్, కందుల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీలో మెజారిటీ లేకపోయినా ఏదోవిధంగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని, అందుకు ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. జెడ్పీ ఎన్నికల్లో 56 జెడ్పీటీసీ స్థానాలకు గాను 31 స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్, 25 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అడ్డదారిలో గెలుపు కోసం కనీసం ఐదుగురు జెడ్పీటీసీలను అయినా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వైఎస్సార్ సీపీ విప్ జారీ చేయనుండటంతో జెడ్పీటీసీ సభ్యులు వచ్చే పరిస్థితి లేనందున విప్ చెల్లదని ప్రచారం చేయాలని, ఆ తర్వాత వారి పదవి పోయినా మనకు వచ్చిన నష్టం లేదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయినట్లు సమాచారం. జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రతి నియోజకవర్గ ఇన్చార్జి పూర్తిస్థాయిలో కృషి చేయాలని టీడీపీ నాయకులు నిర్ణయించారు. వారు దాదాపు గంటకుపైగా చర్చించుకొని జెడ్పీ పీఠాన్ని, అత్యధిక ఎంపీపీలను దక్కించుకోవడంపైనే దృష్టిపెట్టారు. ఇందుకుగాను వైఎస్సార్సీపీ తమకు విప్ ఉందని చెబుతున్నా లేదనే చెప్పాలని నిర్ణయించారు. ప్రధానంగా సభ్యులను ఏదో ఒక విధంగా ఎన్నికల వరకు మభ్యపెట్టేందుకు ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఎన్నికల కమిషన్ సైతం విప్ చెల్లుతుందంటూ ప్రకటించింది కదా అంటే ఫర్లేదు...ఎన్నికలు జరిగే సమయానికి వైఎస్సార్సీపీ రికగ్నైజ్డ్ పార్టీ కాదని, అందువల్ల వారు చెబుతున్నదంతా అబద్ధం అంటూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్‌ను ప్రలోభపెట్టాలని సూచించారు. -
రచ్చ గెలిచి.. ఇంట గెలవకున్నా..
* పద్ధతి మార్చుకోని కందుకూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు * ఇక్కడ ఓడినా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ రెచ్చగొట్టే ర్యాలీ * పట్టణంలో ఓ సామాజికవర్గమే లక్ష్యంగా షాపులపై దాడులు * భయంతో షాపులు మూసి పరుగులు తీసిన వ్యాపారులు * తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహంపై వెల్లువెత్తుతున్న విమర్శలు కందుకూరు, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఓడామన్న బాధను బయటకు కనిపించకుండా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వివరాలు.. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన దివి శివరాం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోతుల రామారావు చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు. నియోజకవర్గంలో ఓటమిపాలైనా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటూ పట్టణంలో సోమవారం ర్యాలీ చేపట్టారు. కోటారెడ్డినగర్లోని దివి శివరాం ఇంటి నుంచి ఓవీరోడ్, పోస్టాఫీసు సెంటర్, పామూరు రోడ్, ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీకి ముందు కొందరు టీడీపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై హల్చల్ చేశారు. తమకు ఓట్లు వేయలేదని భావిస్తున్న ఓ సామాజిక వర్గానికి చెందిన వారి షాపులను టార్గెట్ చేశారు. పోస్టాఫీసు సెంటర్ లో ఉన్న వేముల పాపయ్యగుప్తా జ్యూయలర్స్ (వీపీజీ జ్యూలయర్స్) ఎదుట కొందరు ద్విచక్ర వాహనాలు ఆపి హంగామా చేశారు. అనంతరం ఆ జ్యుయలరీ షాపును టార్గెట్ చేస్తూ దాడులకు దిగారు. షాపు అద్దాలు పగలగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వీలు కాకపోవడంతో పక్కనే ఉన్న సైకిల్‌ను బలంగా విసరడంతో షాపు అద్దాలు ధ్వసమయ్యాయి. దీంతో అప్పటికే షాపులో బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళతో పాటు కూలీలు, యజమాని గజగజలాడిపోయారు. భయభ్రాంతులకు గురై షాపు షెట్టర్ వేసుకుని లోపలే ఉండిపోయారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులు మొత్తం భయంతో తమ షాపులు మూసివేసి పరుగులు తీశారు. ర్యాలీ పామూరురోడ్డులోకి వచ్చే సరికి వ్యాపార సంస్థలన్నీ మూతబడ్డాయి. కొద్దిసేపటి తర్వాత దాడి జరిగిన వీపీజీ జ్యుయలరీ వద్దకు వచ్చిన దివి శివరాం.. షాపు యజమానితో మాట్లాడారు. ఏదో పొరపాటున అద్దాలు ధ్వంసమయ్యాయని సర్దిచెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం. ఓట్లు పడలేదని నిర్ధారించుకునేదాడులు గెలుపు కోసం టీడీపీ నాయకుల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వరుసగా మూడోసారి శివరాం ఓటమి పాలుకావడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే తమకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గాలన్నిటినీ తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పట్టణంలో అధిక సంఖ్య లో ఓటర్లు ఉన్న ఓ సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలను తమ వైపునకు తిప్పుకున్నారు. ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ తమకే వస్తాయని భావించగా ఎన్నికల్లో వారికి ఊహించని షాక్ తగిలింది. పట్టణంలో అధిక మంది ఓటర్లు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. తాము ఎంతో నమ్మకం పెట్టుకున్న ఓట్లు సైతం తమకు పడలేదనే బాధ టీడీపీ నేతల్లో ఉంది. ఓటమికి గల కారణాలను అన్వేషించిన టీడీపీ నేతలు పట్టణంలో ఆ సామాజికవర్గం వారి షాపులను టార్గెట్ చేసుకుని దాడులకు దిగారు. పాత సంప్రదాయం పునరావృతం కందుకూరు అర్బన్, న్యూస్‌లైన్ : కందుకూరులో పాత సంప్రదాయం పునరావృతమైంది. నియోజకవర్గంలో ఓటమి తట్టుకోలేని టీడీపీ శ్రేణులు స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంపై అక్కసు వెల్లగక్కాయి. నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన ఓడినా ఆ పార్టీ కార్యకర్తలు పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తారని అందరూ ముందుగా ఊహించిన విధంగానే జరిగింది. టీడీపీ ఓటమిని తట్టుకోలేని ఆ పార్టీ కార్యకర్తలు తొలి రెండు రోజలు మౌనం వహించారు. తమ ఉనికిని ఏ విధంగానైనా చాటుకోవాలని భావించి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న పేరుతో కందుకూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కోవూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం మీదుగా కావాలనే సాగించారు. అక్కడ ఉన్న ఆ పార్టీ కార్యాలయంపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు ఫ్లెక్సీలను చించేసి బీభత్సం సృష్టించారు. కార్యాలయంలో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు భయంతో తలుపులు ముసికొని లోపలే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మరింత రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు మీ అంతు చస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగని టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ యువజన విభాగం పట్టణ కన్వీనర్ రఫీ పూల కొట్టు ఎదురుగా తారాజువ్వలు కాలుస్తూ భయనక వాతావరణం సృష్టించారు. రఫీపై దాడి చేసేందుకు పక్కనే ఉన్న దేవాల యంలో 20 మంది టీడీపీ యువకులు సిద్ధంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐ మధుబాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న వారిని చెదరగొట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన జ్యుయలరీ షాపును పోలీసులు పరిశీలించారు. సీఐ ఎం.మధుబాబు, పట్టణ ఎస్సై రమణయ్యలు సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. స్టేషన్లో ఫిర్యాదు చేయాలని షాపు యజమానికి సూచించారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
5 కోట్లు అన్నారు.. ఉన్నవి జత బట్టలే!!
వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్తుంటే చాలు.. ఆ వాహనాల్లోను, సూట్కేసుల్లోను కట్టలకొద్దీ డబ్బులు ఉన్నాయంటూ గోల చేయడం టీడీపీ నాయకులకు బాగా అలవాటైపోయింది. ప్రకాశం జిల్లా కందుకూరులో ఇలాగే 5 కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నారంటూ నానా హడావుడి చేసి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొట్టి తీరా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి చూస్తే అందులో కేవలం ఒక జత బట్టలు, ఒక దుప్పటి మాత్రమే కనిపించడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. వివరాలిలా ఉన్నాయి... ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న పోతుల రామారావు బంధువు ఒకరు కారులో వస్తుండగా, ఆ కారులో 5 కోట్ల రూపాయలు ఉన్నాయని, వాటిని పంచడానికి తీసుకెళ్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. అంతేకాదు, కందుకూరు టీడీపీ అభ్యర్థి దివి శివరాం తన కారును తీసుకొచ్చి, ఆ కారుకు అడ్డంగా పెట్టి నానా గందరగోళం మొదలుపెట్టారు. దాదాపు 200-300 మంది టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని, ఆ ప్రాంతంలోనే ఉన్న ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహనరెడ్డి పీఏ పరంధామిరెడ్డిని కొట్టి, ఆయన చొక్కా కూడా చించేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని సమాచారం అందుకున్న పోతుల రామారావు కూడా అక్కడకు చేరుకున్నారు. తీరా కారును పోలీసు స్టేషన్ వద్దకు తీసుకెళ్లి మొత్తం తనిఖీ చేయగా, అందులో ఉన్న సూట్‌కేసులో కేవలం ఒక జత దుస్తులు, ఒక దుప్పటి మాత్రమే ఉన్నాయి. టీడీపీ నాయకులు చెప్పినట్లుగా 5 కోట్లు కాదు కదా.. 5 వేల రూపాయలు కూడా దొరకలేదు. దీంతో తమపై దౌర్జన్యం చేసి, కారు అడ్డుపెట్టి, తమవాళ్లను కొట్టిన టీడీపీ అభ్యర్థి దివి శివరాం, ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని రామారావు కోరారు. ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న అరాచకాలను అడ్డుకోవాలని చెప్పారు.