పార్టీ కోసం కలిసి పనిచేయండి
-
సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోండి
-
టీడీపీ కందుకూరు కార్యకర్తల సమావేశంలో పోతుల, దివిలను ఉద్దేశించి రాష్ట్ర మంత్రులు రావెల, శిద్దా
-
కార్యకర్తలకు ఏ ఇబ్బందీ రానివ్వమని హామీ
కందుకూరు :
రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు, నియోజకవర్గంలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నాయకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంలను ఉద్దేశించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిశోర్‌బాబు పేర్కొన్నారు. స్థానిక వెంగమాంబ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం నిర్వహించిన టీడీపీ కందుకూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించి సీఎం చంద్రబాబునాయుడు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారని తెలిపారు.
ఈ క్రమంలోనే కందుకూరు నియోజకవర్గంలో పోతుల రామారావును కూడా చేర్చుకున్నారని చెప్పారు. అధిష్టానం ఆదేశాల మేరకు పోతులతో కలిసి పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా తామంతా అండగా ఉంటామని వివరించారు. మరో మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ఇద్దరు నేతలూ సమస్యలు పరిష్కరించుకుని పనిచేయాలన్నారు. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో శివరాంతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.
సహకరించమంటేనే బాధకలుగుతోంది : శివరాం
తాను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, ఇప్పుడు కొత్తగా ఇద్దరు మంత్రులు సమావేశం పెట్టి తనను పార్టీకి సహకరించాలని కోర డమేంటని మాజీ ఎమ్మెల్యే శివరాం ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. తనను సముదాయించేందుకు సమావేశం పెట్టినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చంద్రబాబు మనిషినన్నారు. పదవుల కోసం కలిసిపోవడం లేదన్నారు. ఒక అడుగు వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఏఎంసీ చైర్మన్ తల్లపనేని వెంకటేశ్వర్లు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ సభ్యుడు కంచర్ల శ్రీకాంత్, దివి లింగయ్యనాయుడు, కసుకుర్తి ఆదెన్న, బత్తిన వెంకయ్య, మాలకొండ ట్రస్టుబోర్డు చైర్మన్ మాల్యాద్రి, బెజవాడ ప్రసాద్ పాల్గొన్నారు.