5 కోట్లు అన్నారు.. ఉన్నవి జత బట్టలే!!
వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్తుంటే చాలు.. ఆ వాహనాల్లోను, సూట్కేసుల్లోను కట్టలకొద్దీ డబ్బులు ఉన్నాయంటూ గోల చేయడం టీడీపీ నాయకులకు బాగా అలవాటైపోయింది. ప్రకాశం జిల్లా కందుకూరులో ఇలాగే 5 కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నారంటూ నానా హడావుడి చేసి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొట్టి తీరా పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి చూస్తే అందులో కేవలం ఒక జత బట్టలు, ఒక దుప్పటి మాత్రమే కనిపించడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. వివరాలిలా ఉన్నాయి...
ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న పోతుల రామారావు బంధువు ఒకరు కారులో వస్తుండగా, ఆ కారులో 5 కోట్ల రూపాయలు ఉన్నాయని, వాటిని పంచడానికి తీసుకెళ్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. అంతేకాదు, కందుకూరు టీడీపీ అభ్యర్థి దివి శివరాం తన కారును తీసుకొచ్చి, ఆ కారుకు అడ్డంగా పెట్టి నానా గందరగోళం మొదలుపెట్టారు. దాదాపు 200-300 మంది టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని, ఆ ప్రాంతంలోనే ఉన్న ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహనరెడ్డి పీఏ పరంధామిరెడ్డిని కొట్టి, ఆయన చొక్కా కూడా చించేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని సమాచారం అందుకున్న పోతుల రామారావు కూడా అక్కడకు చేరుకున్నారు. తీరా కారును పోలీసు స్టేషన్ వద్దకు తీసుకెళ్లి మొత్తం తనిఖీ చేయగా, అందులో ఉన్న సూట్కేసులో కేవలం ఒక జత దుస్తులు, ఒక దుప్పటి మాత్రమే ఉన్నాయి. టీడీపీ నాయకులు చెప్పినట్లుగా 5 కోట్లు కాదు కదా.. 5 వేల రూపాయలు కూడా దొరకలేదు. దీంతో తమపై దౌర్జన్యం చేసి, కారు అడ్డుపెట్టి, తమవాళ్లను కొట్టిన టీడీపీ అభ్యర్థి దివి శివరాం, ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని రామారావు కోరారు. ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న అరాచకాలను అడ్డుకోవాలని చెప్పారు.