potula ramarao
-
రెండో రోజూ...ఐటీ దాడులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ఆస్తులపై ఐటీæ శాఖ రెండవరోజు శనివారం కూడా ఐటీ దాడులు కొనసాగాయి. శుక్రవారం జరుగుమల్లి మండలం కె. బిట్రగుంటలోని ఎమ్మెల్యేకు చెందిన సదరన్ ఇన్ఫ్రా ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు జిల్లాలోని పలు సంస్థలపైనే కాక గుంటూరు విజయవాడల్లోని పోతులకు చెందిన ఐదు కంపెనీల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శనివారం సైతం పోతుల కంపెనీలలో సోదాలు నిర్వహించారు. శనివారం ప్రధానంగా విజయవాడలోని పోతుల రామారావుకు చెందిన సదరన్ డెవలపర్స్ రియలెస్టేట్ కంపెనీలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఐటీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పోతుల సమీప బంధువు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహించినట్లు తెలుస్తోంది. పోతుల తన కంపెనీ ద్వారా అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. -
పోతులవన్నీ కోతలే!
► ఎమ్మెల్యే పోతుల రామారావుపై వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆగ్రహం ► నమ్మించి మోసం చేశాడని మండిపాటు ► టీడీపీలో చేరడాన్ని వ్యతిరేకించిన నేతలు ► కరేడులో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం ► కందుకూరు నియోజకవర్గంలో ఆందోళనలు ఉలవపాడు:కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పోతుల రామారావుపై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చే రడాన్ని తప్పుబట్టారు. గురువారం ఆయన సీఎం చంద్రబాబు సమక్షంలో విజయవాడలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. 16 రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే కార్యకర్తలను ఇలా నట్టేట్లో ముంచాడని నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని కరేడులో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రామారావు టీడీపీలో చేరడంతో ఆయన కుటుంబానికి ఉన్న మంచి పేరు గంగలో కలసిపోయిందన్నారు. నిత్యం తన కుటుంబం, వంశం గురించి కోతలు కోసే రామారావు.. ప్రజలకు ఇప్పుడేం సమాధానం చెబుతాడన్నారు. వైఎస్సార్, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలు పెట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కార్యకర్తలను నిలువునా మోసం చేశాడన్నారు. ఉలవపాడు ఎంపీపీ ఎన్నికల సమయంలో ఇద్దరు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు టీడీపీకి ఓటేశారని, అందువల్లే ఎంపీపీ పదవి వైఎస్సార్ సీపీకి దక్కకుండా పోరుుందన్నారు. అప్పుడు సదరు ఎంపీటీసీ సభ్యులను మందలించిన పోతుల.. ఇప్పుడు వారికేం సమాధానం చెబుతాడని నిలదీశారు. తనతో పాటు క్యాడర్‌ను టీడీపీలోకి తీసుకెళ్లాలని ప్రయత్నించి విఫలమయ్యూడని చెప్పారు. అధికార పార్టీ నేతల ప్యాకేజీలకు వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు తలొగ్గలేదన్నారు. ఉలవపాడులో రమేష్ అనే కార్యకర్త మెడలో వైఎస్సార్ సీపీ కండువా వేసుకుని ప్రతీ దుకాణానికి వెళ్లి పోతుల నీతిమాలిన చర్యను వ్యాపారులకు వివరించారు. నిరసన కార్యక్రమంలో కరేడు ఎంపీటీసీ సభ్యురాలు సుందరమ్మ, గ్రామ ఉప సర్పంచి భాస్కర్, పార్టీ గ్రామ కన్వీనర్ డి.వెంకారెడ్డి, వి.కృష్ణ, కె.రామకోటయ్య, శరభారెడ్డి, సుధాక ర్‌రెడ్డి, రామకోటిరెడ్డి, నాగరాజు, దగ్గుమాటి శేషారెడ్డి, ద్వారం.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం
ఒంగోలు అర్బన్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో జిల్లా అభివృద్ధి తిరోగమనంలో ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ విమర్శించారు. జిల్లా పరిషత్ సమావేశం శుక్రవారం జరగనున్న నేపథ్యంలో అద్దంకి, కందుకూరు, సంతనూతలపాడు, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, ఆదిమూలపు సురేష్, జంకె వెంకటరెడ్డి, డేవిడ్‌రాజు, ముత్తుముల అశోక్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ సమావేశమై జిల్లా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమం టీడీపీ ప్రచార కార్యక్రమంగా ఉందే తప్ప..ప్రభుత్వ కార్యక్రమంగా లేదన్నారు. గత ముఖ్యమంత్రుల హయాంలో ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమం జరిగినా..జిల్లాలోని ప్రజాప్రతినిధులందరితో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఎటువంటి సమీక్షలు నిర్వహించకుండా ఒంటెత్తు పోకడలకు పోతోందని దుయ్యబట్టారు. జన్మభూమి కార్యక్రమానికి జిల్లాకు కోటి రూపాయల నిధులు కేవలం అధికార యంత్రాంగానికి కేటాయించారు తప్పితే, ప్రజాసమస్యల పరిష్కారానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటన పార్టీ ప్రచారమే... మొన్న జిల్లాలో చేపట్టిన చంద్రబాబు పర్యటన కూడా పార్టీ ప్రచార కార్యక్రమంలా ఉందని వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు విమర్శించారు. జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఇక్కడి ప్రజల సమస్యల గురించి గానీ, వెలిగొండ ప్రాజెక్టు గురించి గానీ, జిల్లా అభివృద్ధి గురించి గానీ మాట్లాడకుండా హాస్యాస్పదంగా ఒంగోలు మైసూర్‌పాక్ బాగుంటుందని, వేటపాలెం జీడిపప్పు బాగుంటుందని వాటికి సంబంధించిన పరిశ్రమలు పెట్టాలని మాట్లాడాడని ఎద్దేవా చేశారు. కనీసం ప్రజాప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయకుండా దుర్మార్గపు పాలనను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయం దండగ అన్నాడని, ఇప్పుడు శనగ రైతులను పిచ్చోళ్లుఅని సంబోధించటం ఆయన వైఖరికి దర్పణం పడుతోందన్నారు. జిల్లాలో ఉన్న తెలుగుదేశం ప్రజాప్రతినిధులు గానీ, మంత్రి గానీ ఇక్కడి సమస్యలపై ఏ ఒక్క రోజైనా ముఖ్యమంత్రితో మాట్లాడరా... అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం 14 విద్యాసంస్థలను మన రాష్ట్రానికి కేటాయిస్తే కనీసం ఒక్క విద్యాసంస్థను కూడా జిల్లాకు తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి ప్రజాప్రతినిధిని భాగస్వామ్యం చేయాలని అధికార పార్టీకి తొత్తులుగా మారవద్దని హితవు పలికారు. వెలిగొండ ప్రాజెక్టు సంవత్సరంలో పూర్తి చేస్తామన్న చంద్రబాబు 75 కోట్లు నిధులిచ్చి ఏ విధంగా పూర్తి చేయగలరని ప్రశ్నించారు. మొదటి టన్నెల్ పూర్తి చేయటానికి 250 కోట్లు అవసరమవుతుందని అయితే ఇంత తక్కువ నిధులు కేటాయించిన చంద్రబాబు ఏ విధంగా సంవత్సరంలో పూర్తి చేయగలరన్నారు. పింఛన్ల విషయంలో కూడా 1000 పెంచటం ఆహ్వానించదగ్గ విషయమే కానీ వయోపరిమితి 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. అదేవిధంగా ఎటువంటి భూమి గానీ, పొలం గానీ లేని వ్యక్తులను పొలాలున్నాయంటూ పింఛన్ల విషయంలో అనర్హులుగా ప్రకటించారన్నారు. పొలాలు లేని వారికి పొలం ఉన్నట్లుగా చూపించి పింఛన్లు ఎత్తివేశారు, వారికి ఉన్నట్లు చెబుతున్న పొలమైనా వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రి మొద్దునిద్ర వీడి ప్రజాసమస్యలపై నిస్వార్థంగా, నిజాయితీగా పార్టీకతీతంగా పని చేయాలని సూచించారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకే పేర్లు మార్చి అమలు చేస్తున్నారన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా అభివృద్ధి పథంలో నడిపేందుకు తమ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. -
జంప్ జిలానీలకు ఝలక్!
ఒంగోలు వన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. ఆఖరు నిముషంలో పార్టీలు మారిన జంప్ జిలానీలకు ప్రజలు తమ ఓటుతో గట్టి గుణపాఠమే చెప్పారు. జిల్లాలో ముగ్గురు శాసనసభ్యులు, ఒక శాసనమండలి సభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఆఖరు నిముషంలో పార్టీలు మారి ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో ఒక శాసనసభ్యుడు, ఒక శాసనమండలి సభ్యుడిని ఓటర్లు ఆదరించారు. మిగిలిన ముగ్గురిని తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యుడిగా దీర్ఘకాలం పదవులు అనుభవించి ఆఖరు నిముషంలో పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన ముగ్గురిని ఓటర్లు తిరస్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి శాసనసభ్యులుగా పోటీ చేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని ఓటర్లు ఆదరించారు. తమ ఓట్లతో వారిని ఆశీర్వదించి అందలం ఎక్కించారు. దేశవ్యాప్తంగా బలంగా వీచిన నరేంద్రమోడీ గాలి కానీ, చంద్రబాబునాయుడు ప్రకటించిన రైతులకు రుణమాఫీ, ఇతర వర్గాలకు రకరకాల తాయిలాలు కానీ పార్టీ ఫిరాయించి తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని గట్టెక్కించలేదు. జిల్లాలో 2009లో కాంగ్రెస్ శాసనసభ్యునిగా ఎన్నికైన ఆదిమూలపు సురేష్ (యర్రగొండపాలెం రిజర్వుడు), బీఎన్ విజయకుమార్ (సంతనూతలపాడు రిజర్వుడు)లు ప్రస్తుత ఎన్నికల్లో తాము ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ను వీడారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిద్దరూ ప్రత్యర్థులుగా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో తలపడ్డారు. ఎమ్మెల్యే విజయకుమార్ మూడేళ్లుగా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. భవిష్యత్ వ్యూహంతో ముందుగానే విజయకుమార్ తెలుగుదేశం నాయకులను మచ్చిక చేసుకొని తమ వైపు తిప్పుకున్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆఖరు నిముషంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు ఆయనకు పార్టీ టికెట్ ఖరారైంది. అయితే అప్పటినుంచి అవిశ్రాంతంగా ప్రచారంలో పాల్గొని ఓటర్ల మనుసుదోచారు. విజయతీరాలు చేరారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎవరూ గెలవని ఆనవాయితీని కొనసాగించారు. సంతనూతలపాడు నియోజకవర్గ ఆనవాయితీని పటాపంచాలు చేయాలన్న విజయకుమార్ కలలు కల్లలుగా మిగిలాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతుల రామారావు ఆఖరు నిముషంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. సౌమ్యుడిగా మంచి వ్యక్తిగా పేరున్న పోతుల రామారావును నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు అక్కున చేర్చుకున్నారు. నియోజకవర్గానికి కొత్త అయినప్పటి కీ పోతుల రామారావుకు అక్కడి ప్రజలు పట్టం కట్టారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ దివి శివరాం నోటి దురుసుతనం ఆయనకు చేటు తెచ్చింది. శివరాం 2004, 2009లో మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి చేతిలో, ప్రస్తుతం పోతుల రామారావు చేతిలో పరాజయం పాలై ఓటమిలో హ్యాట్రిక్ సాధించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మూడుసార్లు ఎన్నికైన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆ పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరారు. ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైవీ.సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఘనవిజయం సాధించారు. గతంలో నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోయినా ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, నాయకులతో సుబ్బారెడ్డికి సత్సంబంధాలున్నాయి. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో జిల్లా నుంచి వివిధ పనుల కోసం ఎవరు హైదరాబాద్ వెళ్లినా వారందరికీ ప్రథమ ప్రాధాన్యతనిచ్చి వారి పనులు చేసి పంపి అందరి హృదయాల్లో సుబ్బారెడ్డి స్థానం సంపాదించారు. ఇవన్నీ ఆయనకు ఎన్నికల్లో బాగా కలిసొచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ తర ఫున గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చలామణి అయిన అన్నా రాంబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గిద్దలూరు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి గెలుపొందారు. కారణాలు ఏవైనప్పటికీ కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించి పోటీ చేసిన వారందరినీ జిల్లా ఓటర్లు తిరస్కరించటం విశేషం. -
చిల్లర పనులు మానుకోవాలి
కందుకూరు, న్యూస్‌లైన్ : ‘మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం.. ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 15 మంది పోటీచేశారు.. ఓడిన వారంతా తట్టుకోలేక ప్రజలపై దాడులు చేస్తే ఏమౌతుందో ఆలోచించుకోవాలి.. నాయకులనే వారు ఆదర్శంగా ఉండాలే తప్ప.. చిల్లర పనులు చేయకూడదు’... అని కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు స్థానిక టీడీపీ శ్రేణులనుద్దేశించి పేర్కొన్నారు. స్థానిక కోవూరు రోడ్డులోని గెస్ట్‌హౌస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన సంఘటనలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. టీడీపీ పూర్తిస్థాయిలో అధికారం చేపట్టకుండానే స్థానికంగా విజయోత్సవ ర్యాలీ చేయడాన్ని ఆ పార్టీ నాయకుల విజ్ఞతికే వదిలేస్తున్నానన్నారు. ఆ ర్యాలీలో షాపులపై దాడులు చేయడం, ఫ్లెక్సీలు చించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికాదన్నారు. నాయకులే బాధ్యతగా తీసుకుని ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సి ఉందన్నారు. కానీ, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. కందుకూరికి ఎవరూ రాకూడదనే భావన మంచిది కాదన్నారు. దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడటం, అదేమంటే ప్రభుత్వం మాదే అని మాట్లాడటం సరైన విధానం కాదని హితవు పలికారు. ఇదే పరిస్థితి కొనసాగితే సహించేది లేదని పోతుల రామారావు స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ సమన్వయంతో వ్యవహరిస్తే నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పారు. అలాకాకుండా చిల్లర పనులకు పాల్పడి ప్రజాస్వామ్యానికి మచ్చ తేవద్దని సూచించారు. సోమవారం స్థానిక వైఎస్ఆర్ సీపీ కార్యాలయంపై జరిగిన దాడి గురించి తాము ఎటువంటి ఫిర్యాదూ చేయడం లేదన్నారు. చిన్న, చిన్న విషయాలకు స్పందించడం తమ లక్షణం కాదన్నారు. బెదిరింపులకు దిగడం, ప్రజలను భయాందోళనకు గురిచేయడం తమకు తెలియని విషయాలని, భవిష్యత్తులో కూడా అటువంటి చిల్లర పనులకు పాల్పడమని పేర్కొన్నారు. విలువలు పాటించడమే తమకు తెలిసిన రాజకీయమని చెప్పారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి... కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న అల్లర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు ఉన్నతాధికారులకు పోతుల రామారావు సూచించారు. పట్టణంలో చిన్న సంఘటన కూడా జర గకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ సమన్వయంతో వ్యవహరించి నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచాలని కోరారు. ఐదు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఎన్నికల కోసం గొడవలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి, నాయకులు కసుకుర్తి ఆదెన్న, రఫి తదితరులు పాల్గొన్నారు. ఆరోపణలపై చర్చకు సిద్ధం : ఉప్పుటూరి సోమవారం పట్టణంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులతో ఎక్కడైనా చర్చకు సిద్ధమని మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఓటమి బాధను ఇతరులపై మోపుతూ పబ్బం గడుపుకోవడం మానుకోవాలన్నారు. టీడీపీ నాయకుడు దివి లింగయ్యనాయుడిపై ఉప్పుటూరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధైర్యం ఉంటే తన సవాల్‌ని స్వీకరించి చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. -
రచ్చ గెలిచి.. ఇంట గెలవకున్నా..
* పద్ధతి మార్చుకోని కందుకూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు * ఇక్కడ ఓడినా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ రెచ్చగొట్టే ర్యాలీ * పట్టణంలో ఓ సామాజికవర్గమే లక్ష్యంగా షాపులపై దాడులు * భయంతో షాపులు మూసి పరుగులు తీసిన వ్యాపారులు * తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహంపై వెల్లువెత్తుతున్న విమర్శలు కందుకూరు, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఓడామన్న బాధను బయటకు కనిపించకుండా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వివరాలు.. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన దివి శివరాం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోతుల రామారావు చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు. నియోజకవర్గంలో ఓటమిపాలైనా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటూ పట్టణంలో సోమవారం ర్యాలీ చేపట్టారు. కోటారెడ్డినగర్లోని దివి శివరాం ఇంటి నుంచి ఓవీరోడ్, పోస్టాఫీసు సెంటర్, పామూరు రోడ్, ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీకి ముందు కొందరు టీడీపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై హల్చల్ చేశారు. తమకు ఓట్లు వేయలేదని భావిస్తున్న ఓ సామాజిక వర్గానికి చెందిన వారి షాపులను టార్గెట్ చేశారు. పోస్టాఫీసు సెంటర్ లో ఉన్న వేముల పాపయ్యగుప్తా జ్యూయలర్స్ (వీపీజీ జ్యూలయర్స్) ఎదుట కొందరు ద్విచక్ర వాహనాలు ఆపి హంగామా చేశారు. అనంతరం ఆ జ్యుయలరీ షాపును టార్గెట్ చేస్తూ దాడులకు దిగారు. షాపు అద్దాలు పగలగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వీలు కాకపోవడంతో పక్కనే ఉన్న సైకిల్‌ను బలంగా విసరడంతో షాపు అద్దాలు ధ్వసమయ్యాయి. దీంతో అప్పటికే షాపులో బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళతో పాటు కూలీలు, యజమాని గజగజలాడిపోయారు. భయభ్రాంతులకు గురై షాపు షెట్టర్ వేసుకుని లోపలే ఉండిపోయారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులు మొత్తం భయంతో తమ షాపులు మూసివేసి పరుగులు తీశారు. ర్యాలీ పామూరురోడ్డులోకి వచ్చే సరికి వ్యాపార సంస్థలన్నీ మూతబడ్డాయి. కొద్దిసేపటి తర్వాత దాడి జరిగిన వీపీజీ జ్యుయలరీ వద్దకు వచ్చిన దివి శివరాం.. షాపు యజమానితో మాట్లాడారు. ఏదో పొరపాటున అద్దాలు ధ్వంసమయ్యాయని సర్దిచెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం. ఓట్లు పడలేదని నిర్ధారించుకునేదాడులు గెలుపు కోసం టీడీపీ నాయకుల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వరుసగా మూడోసారి శివరాం ఓటమి పాలుకావడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే తమకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గాలన్నిటినీ తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పట్టణంలో అధిక సంఖ్య లో ఓటర్లు ఉన్న ఓ సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలను తమ వైపునకు తిప్పుకున్నారు. ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ తమకే వస్తాయని భావించగా ఎన్నికల్లో వారికి ఊహించని షాక్ తగిలింది. పట్టణంలో అధిక మంది ఓటర్లు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. తాము ఎంతో నమ్మకం పెట్టుకున్న ఓట్లు సైతం తమకు పడలేదనే బాధ టీడీపీ నేతల్లో ఉంది. ఓటమికి గల కారణాలను అన్వేషించిన టీడీపీ నేతలు పట్టణంలో ఆ సామాజికవర్గం వారి షాపులను టార్గెట్ చేసుకుని దాడులకు దిగారు. పాత సంప్రదాయం పునరావృతం కందుకూరు అర్బన్, న్యూస్‌లైన్ : కందుకూరులో పాత సంప్రదాయం పునరావృతమైంది. నియోజకవర్గంలో ఓటమి తట్టుకోలేని టీడీపీ శ్రేణులు స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంపై అక్కసు వెల్లగక్కాయి. నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన ఓడినా ఆ పార్టీ కార్యకర్తలు పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తారని అందరూ ముందుగా ఊహించిన విధంగానే జరిగింది. టీడీపీ ఓటమిని తట్టుకోలేని ఆ పార్టీ కార్యకర్తలు తొలి రెండు రోజలు మౌనం వహించారు. తమ ఉనికిని ఏ విధంగానైనా చాటుకోవాలని భావించి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న పేరుతో కందుకూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కోవూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం మీదుగా కావాలనే సాగించారు. అక్కడ ఉన్న ఆ పార్టీ కార్యాలయంపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు ఫ్లెక్సీలను చించేసి బీభత్సం సృష్టించారు. కార్యాలయంలో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు భయంతో తలుపులు ముసికొని లోపలే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మరింత రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు మీ అంతు చస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగని టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ యువజన విభాగం పట్టణ కన్వీనర్ రఫీ పూల కొట్టు ఎదురుగా తారాజువ్వలు కాలుస్తూ భయనక వాతావరణం సృష్టించారు. రఫీపై దాడి చేసేందుకు పక్కనే ఉన్న దేవాల యంలో 20 మంది టీడీపీ యువకులు సిద్ధంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐ మధుబాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న వారిని చెదరగొట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన జ్యుయలరీ షాపును పోలీసులు పరిశీలించారు. సీఐ ఎం.మధుబాబు, పట్టణ ఎస్సై రమణయ్యలు సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. స్టేషన్లో ఫిర్యాదు చేయాలని షాపు యజమానికి సూచించారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
5 కోట్లు అన్నారు.. ఉన్నవి జత బట్టలే!!
వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్తుంటే చాలు.. ఆ వాహనాల్లోను, సూట్కేసుల్లోను కట్టలకొద్దీ డబ్బులు ఉన్నాయంటూ గోల చేయడం టీడీపీ నాయకులకు బాగా అలవాటైపోయింది. ప్రకాశం జిల్లా కందుకూరులో ఇలాగే 5 కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నారంటూ నానా హడావుడి చేసి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొట్టి తీరా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి చూస్తే అందులో కేవలం ఒక జత బట్టలు, ఒక దుప్పటి మాత్రమే కనిపించడంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. వివరాలిలా ఉన్నాయి... ప్రకాశం జిల్లా కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న పోతుల రామారావు బంధువు ఒకరు కారులో వస్తుండగా, ఆ కారులో 5 కోట్ల రూపాయలు ఉన్నాయని, వాటిని పంచడానికి తీసుకెళ్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. అంతేకాదు, కందుకూరు టీడీపీ అభ్యర్థి దివి శివరాం తన కారును తీసుకొచ్చి, ఆ కారుకు అడ్డంగా పెట్టి నానా గందరగోళం మొదలుపెట్టారు. దాదాపు 200-300 మంది టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని, ఆ ప్రాంతంలోనే ఉన్న ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహనరెడ్డి పీఏ పరంధామిరెడ్డిని కొట్టి, ఆయన చొక్కా కూడా చించేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని సమాచారం అందుకున్న పోతుల రామారావు కూడా అక్కడకు చేరుకున్నారు. తీరా కారును పోలీసు స్టేషన్ వద్దకు తీసుకెళ్లి మొత్తం తనిఖీ చేయగా, అందులో ఉన్న సూట్‌కేసులో కేవలం ఒక జత దుస్తులు, ఒక దుప్పటి మాత్రమే ఉన్నాయి. టీడీపీ నాయకులు చెప్పినట్లుగా 5 కోట్లు కాదు కదా.. 5 వేల రూపాయలు కూడా దొరకలేదు. దీంతో తమపై దౌర్జన్యం చేసి, కారు అడ్డుపెట్టి, తమవాళ్లను కొట్టిన టీడీపీ అభ్యర్థి దివి శివరాం, ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని రామారావు కోరారు. ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న అరాచకాలను అడ్డుకోవాలని చెప్పారు.