ఒంగోలు వన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. ఆఖరు నిముషంలో పార్టీలు మారిన జంప్ జిలానీలకు ప్రజలు తమ ఓటుతో గట్టి గుణపాఠమే చెప్పారు. జిల్లాలో ముగ్గురు శాసనసభ్యులు, ఒక శాసనమండలి సభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఆఖరు నిముషంలో పార్టీలు మారి ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో ఒక శాసనసభ్యుడు, ఒక శాసనమండలి సభ్యుడిని ఓటర్లు ఆదరించారు. మిగిలిన ముగ్గురిని తిరస్కరించారు.
కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యుడిగా దీర్ఘకాలం పదవులు అనుభవించి ఆఖరు నిముషంలో పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన ముగ్గురిని ఓటర్లు తిరస్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి శాసనసభ్యులుగా పోటీ చేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని ఓటర్లు ఆదరించారు. తమ ఓట్లతో వారిని ఆశీర్వదించి అందలం ఎక్కించారు. దేశవ్యాప్తంగా బలంగా వీచిన నరేంద్రమోడీ గాలి కానీ, చంద్రబాబునాయుడు ప్రకటించిన రైతులకు రుణమాఫీ, ఇతర వర్గాలకు రకరకాల తాయిలాలు కానీ పార్టీ ఫిరాయించి తెలుగుదేశం అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని గట్టెక్కించలేదు.
జిల్లాలో 2009లో కాంగ్రెస్ శాసనసభ్యునిగా ఎన్నికైన ఆదిమూలపు సురేష్ (యర్రగొండపాలెం రిజర్వుడు), బీఎన్ విజయకుమార్ (సంతనూతలపాడు రిజర్వుడు)లు ప్రస్తుత ఎన్నికల్లో తాము ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ను వీడారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిద్దరూ ప్రత్యర్థులుగా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో తలపడ్డారు. ఎమ్మెల్యే విజయకుమార్ మూడేళ్లుగా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
భవిష్యత్ వ్యూహంతో ముందుగానే విజయకుమార్ తెలుగుదేశం నాయకులను మచ్చిక చేసుకొని తమ వైపు తిప్పుకున్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆఖరు నిముషంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు ఆయనకు పార్టీ టికెట్ ఖరారైంది. అయితే అప్పటినుంచి అవిశ్రాంతంగా ప్రచారంలో పాల్గొని ఓటర్ల మనుసుదోచారు. విజయతీరాలు చేరారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎవరూ గెలవని ఆనవాయితీని కొనసాగించారు. సంతనూతలపాడు నియోజకవర్గ ఆనవాయితీని పటాపంచాలు చేయాలన్న విజయకుమార్ కలలు కల్లలుగా మిగిలాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతుల రామారావు ఆఖరు నిముషంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. సౌమ్యుడిగా మంచి వ్యక్తిగా పేరున్న పోతుల రామారావును నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు అక్కున చేర్చుకున్నారు. నియోజకవర్గానికి కొత్త అయినప్పటి కీ పోతుల రామారావుకు అక్కడి ప్రజలు పట్టం కట్టారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ దివి శివరాం నోటి దురుసుతనం ఆయనకు చేటు తెచ్చింది. శివరాం 2004, 2009లో మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి చేతిలో, ప్రస్తుతం పోతుల రామారావు చేతిలో పరాజయం పాలై ఓటమిలో హ్యాట్రిక్ సాధించారు.
ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మూడుసార్లు ఎన్నికైన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆ పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరారు. ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైవీ.సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఘనవిజయం సాధించారు. గతంలో నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోయినా ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, నాయకులతో సుబ్బారెడ్డికి సత్సంబంధాలున్నాయి. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో జిల్లా నుంచి వివిధ పనుల కోసం ఎవరు హైదరాబాద్ వెళ్లినా వారందరికీ ప్రథమ ప్రాధాన్యతనిచ్చి వారి పనులు చేసి పంపి అందరి హృదయాల్లో సుబ్బారెడ్డి స్థానం సంపాదించారు. ఇవన్నీ ఆయనకు ఎన్నికల్లో బాగా కలిసొచ్చాయి.
ప్రజారాజ్యం పార్టీ తర ఫున గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చలామణి అయిన అన్నా రాంబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గిద్దలూరు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి గెలుపొందారు. కారణాలు ఏవైనప్పటికీ కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించి పోటీ చేసిన వారందరినీ జిల్లా ఓటర్లు తిరస్కరించటం విశేషం.
జంప్ జిలానీలకు ఝలక్!
Published Thu, May 22 2014 2:40 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement