టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం
ఒంగోలు అర్బన్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో జిల్లా అభివృద్ధి తిరోగమనంలో ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ విమర్శించారు. జిల్లా పరిషత్ సమావేశం శుక్రవారం జరగనున్న నేపథ్యంలో అద్దంకి, కందుకూరు, సంతనూతలపాడు, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, ఆదిమూలపు సురేష్, జంకె వెంకటరెడ్డి, డేవిడ్‌రాజు, ముత్తుముల అశోక్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ సమావేశమై జిల్లా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమం టీడీపీ ప్రచార కార్యక్రమంగా ఉందే తప్ప..ప్రభుత్వ కార్యక్రమంగా లేదన్నారు.
గత ముఖ్యమంత్రుల హయాంలో ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమం జరిగినా..జిల్లాలోని ప్రజాప్రతినిధులందరితో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఎటువంటి సమీక్షలు నిర్వహించకుండా ఒంటెత్తు పోకడలకు పోతోందని దుయ్యబట్టారు. జన్మభూమి కార్యక్రమానికి జిల్లాకు కోటి రూపాయల నిధులు కేవలం అధికార యంత్రాంగానికి కేటాయించారు తప్పితే, ప్రజాసమస్యల పరిష్కారానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
చంద్రబాబు పర్యటన పార్టీ ప్రచారమే...
మొన్న జిల్లాలో చేపట్టిన చంద్రబాబు పర్యటన కూడా పార్టీ ప్రచార కార్యక్రమంలా ఉందని వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు విమర్శించారు. జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఇక్కడి ప్రజల సమస్యల గురించి గానీ, వెలిగొండ ప్రాజెక్టు గురించి గానీ, జిల్లా అభివృద్ధి గురించి గానీ మాట్లాడకుండా హాస్యాస్పదంగా ఒంగోలు మైసూర్‌పాక్ బాగుంటుందని, వేటపాలెం జీడిపప్పు బాగుంటుందని వాటికి సంబంధించిన పరిశ్రమలు పెట్టాలని మాట్లాడాడని ఎద్దేవా చేశారు. కనీసం ప్రజాప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయకుండా దుర్మార్గపు పాలనను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయం దండగ అన్నాడని, ఇప్పుడు శనగ రైతులను పిచ్చోళ్లుఅని సంబోధించటం ఆయన వైఖరికి దర్పణం పడుతోందన్నారు. జిల్లాలో ఉన్న తెలుగుదేశం ప్రజాప్రతినిధులు గానీ, మంత్రి గానీ ఇక్కడి సమస్యలపై ఏ ఒక్క రోజైనా ముఖ్యమంత్రితో మాట్లాడరా... అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం 14 విద్యాసంస్థలను మన రాష్ట్రానికి కేటాయిస్తే కనీసం ఒక్క విద్యాసంస్థను కూడా జిల్లాకు తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి ప్రజాప్రతినిధిని భాగస్వామ్యం చేయాలని అధికార పార్టీకి తొత్తులుగా మారవద్దని హితవు పలికారు.
వెలిగొండ ప్రాజెక్టు సంవత్సరంలో పూర్తి చేస్తామన్న చంద్రబాబు 75 కోట్లు నిధులిచ్చి ఏ విధంగా పూర్తి చేయగలరని ప్రశ్నించారు. మొదటి టన్నెల్ పూర్తి చేయటానికి 250 కోట్లు అవసరమవుతుందని అయితే ఇంత తక్కువ నిధులు కేటాయించిన చంద్రబాబు ఏ విధంగా సంవత్సరంలో పూర్తి చేయగలరన్నారు. పింఛన్ల విషయంలో కూడా 1000 పెంచటం ఆహ్వానించదగ్గ విషయమే కానీ వయోపరిమితి 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు.
అదేవిధంగా ఎటువంటి భూమి గానీ, పొలం గానీ లేని వ్యక్తులను పొలాలున్నాయంటూ పింఛన్ల విషయంలో అనర్హులుగా ప్రకటించారన్నారు. పొలాలు లేని వారికి పొలం ఉన్నట్లుగా చూపించి పింఛన్లు ఎత్తివేశారు, వారికి ఉన్నట్లు చెబుతున్న పొలమైనా వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రి మొద్దునిద్ర వీడి ప్రజాసమస్యలపై నిస్వార్థంగా, నిజాయితీగా పార్టీకతీతంగా పని చేయాలని సూచించారు. ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకే పేర్లు మార్చి అమలు చేస్తున్నారన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా అభివృద్ధి పథంలో నడిపేందుకు తమ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.