సాక్షి, అమరావతి : అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌లు జరుపుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
అలాగే.. స్పీకర్, చైర్మన్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్, అసెంబ్లీ స్పీకర్‌లతో పాటు ఫిర్యాదుదారు అయిన మదునూరి ప్రసాదరాజును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఇదీ నేపథ్యం..
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ వారిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తరువాత వారు టీడీపీలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో.. వీరిపై ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలంటూ చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే రీతిలో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యపై కూడా శాసన మండలిలో చీఫ్‌విప్ అయిన మేరిగ మురళీధర్ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.
వీటిపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ విచారణ చేపట్టారు. అనర్హత వేటు ఎందుకు వేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఫిరాయింపుదారులకు ఇటీవల నోటీసులిచ్చారు. ఈనెల 29న విచారణ జరుపుతానని అందులో పేర్కొన్నారు. కానీ, ఈ నోటీసులను రద్దుచేయాలని కోరుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు నలుగురు, ఎమ్మెల్సీ సోమవారం అత్యవసరంగా హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేర్వేరుగా దాఖలు చేశారు. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు మరింత గడువునిచ్చేలా స్పీకర్, చైర్మన్లను ఆదేశించాలని, అలాగే విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని వారు తమ పిటిషన్లలో కోర్టును కోరారు.
సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం..
ఈ వ్యాజ్యాలపై జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ప్రసాదరావు ఫిర్యాదుపై స్పీకర్ తమకు నోటీసులిచ్చి, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈ నెల 8న ఆదేశించారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కావాలని ఆ నలుగురు కోరడంతో ఈ నెల 26 వరకు స్పీకర్ గడువునిచ్చారన్నారు. తిరిగి ఈనెల 24న స్పీకర్‌కు లేఖ రాసి, వివరణకు నాలుగు వారాల గుడువునివ్వాలని కోరామన్నారు.
అయితే, స్పీకర్ తమ అభ్యర్థనను తిరస్కరించి, ఈ నెల 29న విచారణ జరుపుతామని చెప్పారన్నారు. స్పీకర్ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఏ నిమిషంలోనైనా ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉందని, అందువల్ల అనర్హత పిటిషన్లలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేయాలని ఆయనతో పాటు ఎమ్మెల్సీ న్యాయవాది కోర్టును కోరారు.
ఫిరాయింపుదారులను విచారించిన స్పీకర్
మరోవైపు.. వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభలోని తన కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నలుగురిని స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారించారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని స్పీకర్ వారిని కోరారు. వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తిని స్పీకర్ సున్నితంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే మూడుసార్లు సమయం ఇచ్చామని గుర్తుచేస్తూ వారిని విచారించారు. అలాగే, స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ కూడా విచారణకు హాజరయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం హాజరుకాలేదు.
నోటీసులివ్వడం సహజ న్యాయ సూత్రాలకు ఎలా విరుద్ధం?
అనంతరం.. అసెంబ్లీ తరఫున న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ.. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ గానీ, మండలి చైర్మన్‌గానీ ఓ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. అందువల్ల వారి నిర్ణయాలను అధికరణ 226 కింద కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదన్నారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపే పరిధి హైకోర్టుకు లేదన్నారు. కాలయాపన చేయాలన్న ఉద్దేశంతోనే వివరణ ఇచ్చేందుకు పిటిషనర్లు గడువు కోరుతున్నారని తెలిపారు.
న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలకు వారి వారి విధులు, బాధ్యతలున్నాయని, ఒక వ్యవస్థలోకి మరొకరు చొరబడటానికి వీల్లేదన్నారు. చట్టం నిర్ధేశించిన మేరకే స్పీకర్, చైర్మన్ నోటీసులిచ్చి వివరణ కోరారన్నారు. వివరణ కోరకుండా ఉత్తర్వులిస్తే అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమవుతుందే తప్ప, నోటీసులు ఇచ్చి వివరణ కోరడం ఎలా విరుద్ధమవుతుందని ప్రశ్నించారు. స్పీకర్, మండలిౖ చైర్మన్ తుది ఉత్తర్వులు జారీచేయడానికి ముందే దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలు అపరిపమైనవని మెట్టా చంద్రశేఖర్‌రావు వివరించారు.
ఇలా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్.. పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని తేల్చిచెప్పారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment