దుర్గారావు మృతికి సంతాపం తెలుపుతున్న ఎమ్మెల్యే ఐజయ్య, వైఎస్సార్‌సీపీ నేతలు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, మురళీకృష్ణ, తెర్నేకల్ సురేందర్ రెడ్డి తదితరులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ను విఘ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పినా..ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విజయవంతం చేశారని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, టీడీపీలు డ్రామాలను కట్టిపెట్టి హోదాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో వారు మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని పార్లమెంట్‌లో అవిశ్వాసం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పడంతో వైఎస్సార్‌సీపీ బంద్‌కు పిలుపునిచ్చిందన్నారు. ఈ విషయాన్ని మరచిన తెలుగుదేశం ప్రభుత్వం.. పోలీసుల సాయంతో బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసినా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్‌ను పాటించారన్నారు. కొందరు పోలీసు అధికారులు తమ పార్టీ నాయకుల అరెస్టు చేసే సమయంలో అతిగా వ్యవహరించారని, మహిళలపై దురుసుగా ప్రవర్తించారన్నారు.
కొన్ని పార్టీల వైఖరి తేటతెల్లం...
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఇచ్చిన బంద్‌తో ప్రత్యేక హోదాపై కొన్ని పార్టీల వైఖరి తేటతెల్లమైందని బీవై రామయ్య, ఐజయ్య అన్నా రు. ప్రత్యేక హోదా కోసం గతంలో అనేక పార్టీలు బంద్‌కు పిలుపునిస్తే వైస్సార్‌సీపీ పాల్గొన్నదన్నారు. అయితే వైఎస్సార్‌సీపీ ఇచ్చిన బంద్‌కు మాత్రం పాల్గొనకూడదని కొందరు నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో వారికి ప్రత్యేక హోదాపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు.
డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు అర్థరహితం...
బంద్‌లతో ఏమి సాధిస్తారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించడాన్ని బీవై రామయ్య, ఐజయ్య తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వంపై మొదటి సారి అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌సీపీదేనన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పగలు బీజేపీతో..రాత్రి కాంగ్రెస్‌తో కలసి ఏపీ హక్కులను కాలరాస్తున్నారన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటానంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న కేఈ కృష్ణమూర్తి..ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అదే పని చేస్తానని ఎందుకు చెప్పడం లేదన్నారు.
ఎస్వీ వ్యాఖ్యలు శోచనీయం..
కర్నూలు సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. కర్నూలులో ప్రజలే స్వచ్ఛందంగా ముం దుకు వచ్చి బంద్‌ను విజయవంతం చేశారని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి గమనించాలన్నారు. బంద్ సక్సెస్ కాలేదని ఆయన వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో మృతిచెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు దుర్గారావుకి సంతాపం ప్రటించారు. కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మురళీకృష్ణ, రాష్ట్ర నాయకులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మద్దయ్య, కర్నాటి పుల్లారెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, హనుమంతరెడ్డి, కృష్ణారెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, ఫిరోజ్, పోలూరు భాస్కరరెడ్డి, సలోమి, విజయకుమారి, రమణ, బెల్లం మహేశ్వరరెడ్డి, పర్ల ఆశోకవర్ధన్‌రెడ్డి, ఆసిఫ్, శ్రీనివాసరెడ్డి, భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మాటలను ప్రజలు నమ్మరు..
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్సే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామంటే ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీకి మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో అడ్రస్ ఉండదన్నారు. రాష్ట్రబంద్‌ను విఘ్నం చేయాలని చూసి టీడీపీ.. ప్రత్యేక హోదాకు వ్యతిరేకమని నిరూపించుకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment