రాష్ట్రబంద్‌ విజయవంతం చేయండి | YSRCP State Bandh For Special Status | Sakshi
Sakshi News home page

రాష్ట్రబంద్‌ విజయవంతం చేయండి

Published Mon, Jul 23 2018 7:40 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSRCP State Bandh For Special Status - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య,  చిత్రంలో ఎమ్మెల్యేలు ఐజయ్య, గౌరు చరిత, పార్టీ నేతలు హఫీజ్‌ ఖాన్, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి తదితరులు

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):  వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 24న రాష్ట్రబంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హఫీజ్‌ ఖాన్‌ పిలుపునిచ్చారు.  పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. నాలుగేళ్ల నుంచి తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యువభేరీలు, బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేస్తూ హోదా అంశాన్ని సజీవంగా ఉంచారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇందుకు భిన్నంగా.. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు హోదా అంశాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారన్నారు.

ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేశారన్నారు. పార్లమెంట్‌ వేదికగా హోదా ఇవ్వబోమని బీజేపీ చెప్పినా టీడీపీ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదన్నారు. హోదా సాధన కోసం ఎంపీల రాజీనామాలు అడిగితే పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ, బీజేపీల తీరును నిరసిస్తూ తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చిట్లు చెప్పారు. ఈ బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తెర్నేకల్‌ సురేంద్ర్‌రెడ్డి, రెహమాన్, కర్నాటి పుల్లారెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, ధనుంజయాచారి, జిల్లా నాయకులు మదారపు రేణుకమ్మ, కరుణాకరరెడ్డి, పిట్టం ప్రతాప్‌రెడ్డి,  శౌరీ విజయకుమారి, ఆదిమోహన్‌రెడ్డి, భాస్కరరెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.
 
టీడీపీది అవకాశవాద రాజకీయం 
టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లవి అవకాశవాద రాజకీయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి విమర్శించారు. ఎన్‌డీఏ నుంచి బయటకి వచ్చి బీజేపీతో యుద్ధం చేస్తున్నామని టీడీపీ చెబుతున్నా...సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం తమకు మిత్రపక్షమేనని కేంద్ర çహోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారన్నారు. స్వప్రయోజనాల కోసం హోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబునాయుడుకు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదన్నారు.

 
చంద్రబాబుకు పరాభవం 
తెలుగుదేశం, బీజేపీ డ్రామాలను భారతదేశమంతా చూసిందని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య తెలిపారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దించేందుకు అన్ని రాజకీయ పక్షాలు మద్దతును కూడగట్టామని తెలుగుదేశం పార్టీలు నాయకులు చెప్పారన్నారు. అయితే ఓటింగ్‌లో అనుకూలంగా పాల్గొన్నది 126 మంది మాత్రమేనన్నారు.  40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి తీవ్ర పరాభవం ఎదురైందన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చంద్రబాబును పోల్చుకోలేమన్నారు.
 
టీడీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి
ప్యాకేజీ బాగుందని నరేంద్రమోదీ, అరుణ్‌జైట్లీలకు సన్మానం చేసినప్పుడు ఏపీకి జరిగిన అన్యాయం తెలియరాలేదా అని సీఎం చంద్రబాబునాయుడును వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడిడ్డి ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం చేసిన టీడీపీతోపాటు బీజేపీని కూడా  వైఎస్సార్‌సీపీ విమర్శిస్తూనే ఉందన్నారు. ప్రత్యేక హోదా పోరాట విషయంలో సీఎం, టీడీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

బీజేపీతో కొనసాగుతున్న టీడీపీ పొత్తు
ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబునాయుడుకు దమ్మూ, ధైర్యం ఉంటే టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించి తమ అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన విధంగా నిరాహార దీక్షలకు ముందుకు రావాలని కర్నూలు సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్‌ సవాల్‌ విసిరారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ బీజేపీతో అనధికారికంగా పొత్తును కొనసాగిస్తూ ముస్లిం ఓట్ల కోసం వైఎస్సార్‌సీపీపై నిందలు వేస్తోందన్నారు. తమ పార్టీకి బీజేపీతో ఎలాంటి అధికార, అ నధికార పొత్తుగాని, అవగాహన లేవన్నారు. ఈ విషయంలో ముస్లింలెవరూ టీడీపీ ఆరోపణలను నమ్మవద్దని సూచించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement