విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీవై రామయ్య, చిత్రంలో ఎమ్మెల్యే గౌరు చరిత, కంగాటి శ్రీదేవి, హఫీజ్‌ఖాన్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తదితరులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): తెలుగుదేశం పార్టీ శనివారం కర్నూలులో నిర్వహించిన ధర్మపోరాట సభ అపహాస్యమైందని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. నాలుగు జిల్లాల నుంచి జనాన్ని తరలించినా పది వేల మందికి మించలేదని, ఆ పార్టీ బలమెంతో తేలిపోయిందన్నారు. కర్నూలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార దుర్వినియోగం చేసి ఆర్టీసీ బస్సుల్లో ఇతర జిల్లాల నుంచి ధర్మపోరాట సభకు ప్రజలను తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని భయపెట్టి సీఎం సభకు తీసుకొచ్చారని, ఈ క్రమంలో మిడ్తూరు మండలం చెరకుచెర్లకు చెందిన అయ్యస్వామి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్నారు.
హోదా అడిగితే కేసులు పెట్టారు..
నాలుగేళ్లు బీజేపీతో కలసి ఉండి ఏమీ సాధించలేకపోవడంతో ప్రజలు తన్ని తరిమేస్తారన్న భయంతో సీఎం చంద్రబాబునాయుడు..బయటకు వచ్చి అధర్మ ఉపన్యాసాలు ఇస్తున్నారని బీవై రామయ్య అన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి..నాలుగేళ్ల నుంచి చెబుతున్నా పట్టించుకోకుండా ఇప్పుడు టీడీపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ధర్మ పోరాటాలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా అడిగిన ప్రతిపక్ష పార్టీ నాయకులు, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులపై కేసుల పెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. హోదా తెచ్చే సత్తా, సామర్థ్యం జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే ఉన్నాయన్నారు. జిల్లాలో పది రకాల హబ్‌లు ఏర్పాటు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి.. పబ్బులు మాత్రం నిర్మించి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు.
పోరాటంలో ధర్మం లేదు..
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడికి ధర్మ పోరాటం చేసే హక్కు లేదన్నారు. హోదా కోసం టీడీపీ చేసే ధర్మ పోరాటంలో ధర్మం లేదన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డే స్వయంగా.. ధర్మ పోరాటాలు అనవసరమని చెప్పడం ఇందుకు నిదర్శమన్నారు. డబ్బులు ఇచ్చి మద్యం పోస్తామన్నా.. టీడీపీ సభలకు జనాలు రావడంలేదని పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. జిల్లాకు ఎన్నో హామీలను ఇచ్చిన చంద్రబాబు.. ఒక్కదానిని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. కర్నూలు సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి సీఎం సభకు మందిని రప్పించలేకపోయారని, కర్నూలులో ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోందన్నారు.
సమస్యలు పరిష్కరించాలని నిరసన చేపట్టిన విద్యార్థులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. నందికొట్కూరు నియోజకవర్గ కో– ఆర్డినేటర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ..తమ నియోజకవర్గానికి చెందిన అయ్యస్వామి మృతికి రోడ్డు ప్రమాదం కారణం కాదని..ఇది టీడీపీ ప్రభుత్వం చేసిన హత్య అన్నారు. రెండు నెలల క్రితం వచ్చిన పింఛన్ తీసివేస్తామని బలవంతంగా తీసుకొచ్చారని విమర్శించారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన విద్యార్థులతో మాట్లాడే సమయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవ్వకుండా అరెస్టు చేయించడం ఎంత వరకు సబబన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చెరకుచెర్ల రఘురామయ్య, కర్నాటి పుల్లారెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, బెల్లం మహేశ్వరరెడ్డి, హనుమంతరెడ్డి, ఫిరోజ్, గోపాల్‌రెడ్డి, కృష్ణకాంత్‌రెడ్డి, కొనేటి వెంకటేశ్వర్లు, కరుణాకరరెడ్డి, వినీత్‌రెడ్డి, రైల్వే ప్రసాద్, ధనుంజయాచారి, శివశంకర్ నాయుడు, మహేశ్వరరెడ్డి, మహిళా నాయకురాలు రేణుకమ్మ, డాక్టర్ శశికళ, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment