కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం చేపట్టనున్న రాష్ట్ర బంద్‌కు జిల్లాలో సానుకూల స్పందన లభిస్తోంది. ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించేందుకు ముందుకు వచ్చాయి. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు మంగళవారం సెలవు ప్రకటించాయి. ఇదే బాటలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు కూడా నడిచే అవకాశం ఉంది.
మరోవైపు పీడీఎస్‌యూ, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ, ఏఐఎస్‌ఏ, ఎంఎస్‌ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు బేషరతుగా బంద్‌కు మద్దతును ప్రకటించాయి. ఏపీయూడబ్ల్యూజే, పలు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల విద్యార్థి, యువజన, మహిళా నాయకులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేసేందుకు ముందుకు వచ్చారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన చేయడంతో సంపూర్ణమవుతుందని భావిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా బంద్‌కు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
హోదా కోసం ఎందాకైనా..
నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. మంగళవారం బంద్ సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, క్యాండిల్ లైట్ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం ఎలా డ్రామాలు ఆడుతుందో.. ఐదు కోట్ల మంది ఆకాంక్షను సీఎం చంద్రబాబు నాయుడు ఎలా తాకట్టు పెట్టారో వివరించనున్నారు.
డిపోలకే పరిమితం కానున్న ఆర్టీసీ బస్సులు
దేశవ్యాప్త సమ్మెతో ప్రస్తుతం లారీల రాకపోకలు స్తంభించి పోయాయి. ఇప్పటికే నాలుగు రోజులుగా లారీలు రోడ్డు ఎక్కడం లేదు. ఈనేపథ్యంలో మంగళవారం రాష్ట్రబంద్ కావడంతో రహదారులపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించేపోయే అవకాశం ఉంది. జిల్లాలోని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి.
ప్రతి ఒక్కరూ సహకరించాలి:
ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం బంద్ చేపడుతున్నాం. ఇందుకు జిల్లాలోని ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులు, వ్యాపారులు..అన్ని వర్గాల ప్రజలు ముందుకు వచ్చి ప్రత్యేక హోదా కాంక్షను వినిపించాలి. హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఉదయం 5 గంటల నుంచే బస్సుల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ప్రజలు మంగళవారం ఒక్క రోజు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. అత్యవసరం అనుకుంటే బయటకు వచ్చి ఇబ్బంది పడకూడదు. ఏపీకి సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం కొన్ని ఇబ్బందులు తలెత్తినా భవిష్యత్ తరాల కోసం సర్దుకోవాలి. బంద్‌ను సంపూర్ణవంతం చేసి హోదా సెగ ఢిల్లీకి తాకేలా నినదించాలి.
Comments
Please login to add a commentAdd a comment