చిల్లర పనులు మానుకోవాలి
కందుకూరు, న్యూస్‌లైన్ : ‘మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం.. ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 15 మంది పోటీచేశారు.. ఓడిన వారంతా తట్టుకోలేక ప్రజలపై దాడులు చేస్తే ఏమౌతుందో ఆలోచించుకోవాలి.. నాయకులనే వారు ఆదర్శంగా ఉండాలే తప్ప.. చిల్లర పనులు చేయకూడదు’... అని కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు స్థానిక టీడీపీ శ్రేణులనుద్దేశించి పేర్కొన్నారు.
స్థానిక కోవూరు రోడ్డులోని గెస్ట్‌హౌస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన సంఘటనలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. టీడీపీ పూర్తిస్థాయిలో అధికారం చేపట్టకుండానే స్థానికంగా విజయోత్సవ ర్యాలీ చేయడాన్ని ఆ పార్టీ నాయకుల విజ్ఞతికే వదిలేస్తున్నానన్నారు.
ఆ ర్యాలీలో షాపులపై దాడులు చేయడం, ఫ్లెక్సీలు చించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికాదన్నారు. నాయకులే బాధ్యతగా తీసుకుని ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సి ఉందన్నారు. కానీ, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. కందుకూరికి ఎవరూ రాకూడదనే భావన మంచిది కాదన్నారు. దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడటం, అదేమంటే ప్రభుత్వం మాదే అని మాట్లాడటం సరైన విధానం కాదని హితవు పలికారు. ఇదే పరిస్థితి కొనసాగితే సహించేది లేదని పోతుల రామారావు స్పష్టం చేశారు.
ప్రతిఒక్కరూ సమన్వయంతో వ్యవహరిస్తే నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పారు. అలాకాకుండా చిల్లర పనులకు పాల్పడి ప్రజాస్వామ్యానికి మచ్చ తేవద్దని సూచించారు. సోమవారం స్థానిక వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయంపై జరిగిన దాడి గురించి తాము ఎటువంటి ఫిర్యాదూ చేయడం లేదన్నారు. చిన్న, చిన్న విషయాలకు స్పందించడం తమ లక్షణం కాదన్నారు. బెదిరింపులకు దిగడం, ప్రజలను భయాందోళనకు గురిచేయడం తమకు తెలియని విషయాలని, భవిష్యత్తులో కూడా అటువంటి చిల్లర పనులకు పాల్పడమని పేర్కొన్నారు. విలువలు పాటించడమే తమకు తెలిసిన రాజకీయమని చెప్పారు.
పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి...
కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న అల్లర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు ఉన్నతాధికారులకు పోతుల రామారావు సూచించారు. పట్టణంలో చిన్న సంఘటన కూడా జర గకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ సమన్వయంతో వ్యవహరించి నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచాలని కోరారు. ఐదు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఎన్నికల కోసం గొడవలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి, నాయకులు కసుకుర్తి ఆదెన్న, రఫి తదితరులు పాల్గొన్నారు.
ఆరోపణలపై చర్చకు సిద్ధం : ఉప్పుటూరి
సోమవారం పట్టణంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులతో ఎక్కడైనా చర్చకు సిద్ధమని మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఓటమి బాధను ఇతరులపై మోపుతూ పబ్బం గడుపుకోవడం మానుకోవాలన్నారు. టీడీపీ నాయకుడు దివి లింగయ్యనాయుడిపై ఉప్పుటూరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధైర్యం ఉంటే తన సవాల్‌ని స్వీకరించి చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.