veera swamy
-
‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏప్రిల్ 28 ఏం జరిగింది జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు : రంజిత్, షెర్రీ అగర్వాల్,తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నిర్మాణ సంస్థ : వీజీ ఎంటర్టైన్మెంట్ నిర్మాత & దర్శకత్వం : వీరాస్వామి సంగీతం : సందీప్ కుమార్ సినిమాటోగ్రఫీ : సునీల్ కుమార్ విడుదల తేది : ఫిబ్రవరి 27, 2021 కరోనా కారణంగా కొన్ని నెలల పాటు థియేటర్లకు దూరమైన సినీ ప్రియులు ఇప్పుడిప్పుడే మునుపటి వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. వంద శాతం సిట్టింగ్‌కు అనుమతి రావడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకుతరలివస్తున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో వరుస సినిమాలను విడుదల చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మన టాలీవుడ్దర్శక,నిర్మాతలు. ప్రతి వారం నాలుగైదు సినిమాలను విడుదలచేస్తూ సినీ ప్రియులను అలరిస్తున్నారు. ఈ వారం కూడా ఇప్పటికే నితిన్ చెక్‌తో పాటు అరడజను పైగా చిత్రాలు విడుదలయ్యాయి. తాజాగా శనివారం (పిభ్రవరి 27)న ‘ఏప్రిల్ 28న ఏం జరిగింది’మూవీ విడుదలైంది. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో రంజిత్, షెర్రీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్,టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు భయపెట్టింది? తొలి సినిమాతో రంజిత్ హిట్ అందుకున్నాడా లేదా? రివ్యూలో చూద్దాం. కథ విహారి(రంజిత్) సినిమా రైటర్. ప్రముఖ నిర్మాత(తనికెళ్ల భరణి)కి గతంలో నాలుగు విజయవంతమైన సినిమాలు అందించాడు. కానీ ఇటీవల తీసిన సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది. దీంతో తదుపరి తీయబోయే సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలని దర్శకుడిపై ఒత్తిడి పెంచుతాడు. దీనికి తోడు ప్రముఖ దర్శకుడు (రాజీవ్ కనకాల) నిర్మాతకు డేట్స్ కేటాయించడంతో ఒత్తిడి మరింత పెరుగుతుంది.దీంతో ఆ ఒత్తిడిని తగ్గించేందుకు భార్య ప్రవలిక( షెర్రీ అగర్వాల్), పిల్లలతో కలిసి వారం రోజుల పాటు సిటీకి దూరంగా గడపాలని భావిస్తాడు. ఫ్యామిలీతో కలిసి కారులో బయలుదేరిన విహారికి మార్గమధ్యలో ఎస్సై డేవిడ్(అజయ్) తారాసపడతాడు. డేవిడ్ సలహా మేరకు విహారి ఫ్యామిలీతో కలిసి సిరిపురం అను గ్రామంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్‌కి వెళ్తాడు. వెళ్లిన మొదటి రోజే తాను దిగిన గెస్ట్ హౌస్ కు ఎదురుగా ఉండే భవంతి తనకేదో చెప్పాలనుకుంటుదనే భావనకు గురవుతాడు. తనకు అనిపించిన విషయాన్ని ఎస్సై డేవిడ్‌తో షేర్ చేసుకొని ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతాడు. విహారికి నిజంగా ఆ ఇల్లు ఏదో చెప్పాలని అనుకుందా? ఆ ఇంట్లో ఉన్న ఆత్మలు ఎవరివి? అసలు విహారి మాత్రమే ఆ ఆత్మలు ఎందుకు కనిపించాయి? అసలు ఏప్రిల్ 28న ఏం జరిగింది? అనేదే మిగతా కథ నటీ నటులు హీరో రంజిత్‌కి ఇది మొదటి సినిమా. ప్రముఖ సినిమా రచయిత ఏల్చూరి వెంకట్రావు గారి అబ్బాయే రంజిత్. మొదటి సినిమా అయినప్పటికీ ఉన్నంతతో అతను బాగానే నటించాడు. కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంది. హీరోయిన్ షెర్రీ అగర్వాల్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇక విలన్‌గా రాజీవ్ కనకాల బాగానే మెప్పించాడు. చాలా కాలం తర్వాత రాజీవ్ నటనకు ఆస్కారం ఉన్న పాత్ర పోషించాడు. అజయ్, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. విశ్లేషణ హారర్ సినిమాలు తెలుగులో చాలానే వచ్చాయి. ఊరికి చివరిలో ఓ పాడుపడ్డ గది. అందులో దెయ్యాలు.. అక్కడి అనుకోకుండా హీరో వెళ్లడం..దెయ్యాలకు ఫ్లాష్‌బ్యాక్.. చిన్నపాటి ట్విస్ట్. దాదాపు హారర్ చిత్రాలు అన్ని ఇలాగే ఉంటాయి. కానీ వాటిని తెరపై చూపించే విధానాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడుతుంది. ఇక ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’సినిమా కూడా అలాంటిదే. గత సినిమాల కథనే దర్శకుడు ఎంచుకున్నాడు. కాకపోతే చిన్న ట్విస్ట్‌లు పెట్టి హిట్ కొట్టాలనుకున్నాడు. కానీ అతని ఆలోచన బెడిసి కొట్టింది. సినిమాలో ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు కానీ, భయపెట్టే సీన్లు కాని ఒకటి కూడా ఉండదు. ఫస్టాఫ్ మొత్తం సింపుల్‌గా సాగిపోతుంది. అసలు హారర్ మూవీ చూస్తున్నామనే భావనే ప్రేక్షకులకు కలగకపోగా, బోర్ కొట్టించే సన్నివేశాలు బోలెడన్ని ఉన్నాయి. ఏ ఒక్క సన్నివేశంలో కూడా కొత్తదనం కనిపించదు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథ సాగదీతగా అనిపిస్తుంది. అలాగే ఆ దెయ్యాల ఫ్లాష్ బ్యాక్ కూడా బోర్ కొట్టించేవిధంగా ఉంటుంది. ఇక క్లైమాక్స్‌లో మాత్రం చిన్నపాటి ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తాడు. సందీప్ కుమార్ తన నేపథ్య సంగీతంతో కొన్ని సన్నివేశాలను కాస్త భయపెట్టే ప్రయత్నం చేశాడు. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫి పర్వాలేదు. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే హారర్ మూవీస్ రెగ్యులర్‌గా చూసే ప్రేక్షకులకు ఈ సినిమాలో కొత్తదనం ఏది కనిపించడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏప్రిల్ 28 ఏమి జరగలేదు. ప్లస్ పాయింట్స్ ఉన్నంతలో రాజీవ్ కనకాల, రంజిత్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ రొటీన్ హారర్ డ్రామా ఫస్టాఫ్ సెకండాఫ్ సాగతీత సీన్లు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
పచ్చగా ఉండాలంటే.. పచ్చదనం ఉండాలి
మనిషి బతకాలంటే చుట్టూ ఉన్న అడవులు, కొండలు కోనలు, చెట్లు చేమలు, చెరువులు సెలయేళ్లు, నదులు సముద్రాలు, వీటన్నింటినీ అంటిపెట్టుకుని ఉండే సకల జీవకోటి బతకాలి. అప్పుడే మనిషి ప్రకృతిలో భాగంగా బతకగలడు. మనిషి ప్రకృతి నుంచి విడిపోయి మనుగడ సాగించలేడు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశాలను మనం పంచ భూతాలుగా చెప్పుకుంటున్నాం. ఈ పంచ భూతాలు కలయికతో ఏర్పడేదే ప్రకృతి. ఈ పంచ భూతాత్మక ప్రకృతినే పర్యావరణం అంటాం. భూగోళాన్ని ఆవరించి ఉన్న వాయువునే వాతావరణం అంటాం. ఈ భూవాతావరణం అనేక జీవులు, నిర్జీవులతో కూడుకుని ఉంది. అందుకే మన పర్యావరణం కలుషితం కాకూడదనేదే అందరి వాదన. నేడు అడవుల సమతుల్యం, పర్యా వరణ సమతుల్యం దెబ్బతినడంవల్లే జీవి మను గడకు ప్రమాదం ఏర్పడింది. నగరీకరణ, ఆధునీకరణ, పారిశ్రామికీకరణ విషయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే జల, వాయు, శబ్ద, ఆహార కాలుష్యాలు ప్రమాద స్థాయిని మించి పోయాయి. ప్రాచీన సంస్కృతులన్నీ ప్రకృతిని ఆరాధిస్తూనే పెరిగాయి. అన్ని ప్రధాన పండుగలు, సంప్రదాయాలలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. ఎప్పుడైతే మనం ప్రకృతితో ఉన్న అను బంధం నుంచి దూరంగా ఉండడం మొదలు పెట్టామో.. అప్పటి నుంచే కాలుష్యాన్ని పుట్టించడం, పర్యావరణాన్ని నాశనం చేయడం మొదలైంది. నేడు దేశంలోని ధర్మల్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, ఎరువుల కర్మాగారాలు, మందులు, రసాయన పరిశ్రమలు, సిమెంట్, తోలు వంటి అనేక కర్మాగారాలు వెదజల్లుతున్న విషపూరిత వాయువు, రసాయన వ్యర్థ పదార్థాల వల్ల, నగ రాలు, పట్టణాల్లో ఉత్పత్తి అవుతున్న తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ క్యారీభ్యాగ్లు వంటి వాటి వల్ల నేడు పర్యావరణం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. జల కాలుష్యం, వాయు కాలుష్యం అభివృద్ధిని మించిపోయింది. దీంతో వాతావరణంలో మార్పులు సంభవించి భూమి వేడెక్కిపోతుంది. పర్యావరణ కాలుష్యం వల్ల నష్ట పోయేది ఎక్కువగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, మూగజీవులే. సమాజంలో పది శాతం కూడా ఉండని సంపన్నులు వెదజల్లే కాలుష్యానికి వీరు బలైపోతున్నారు. సంపన్నులు వాడే ఏసీ మిషన్లు వల్ల, వీరు ఉపయోగించే వాహ నాలు వల్ల, వీరు నిర్వహించే పరిశ్రమల వల్ల, వీటి మూలంగా ఏర్పడే తీవ్రమైన ఎండలు, సైక్లోన్లు, కల్తీ ఆహారం, కలుషిత నీరు,కలుషిత వాయువు వల్ల అనారోగ్యానికి గురై నష్టపోయేది పేదలే. సంపన్నులు ఏసీ గదుల్లోను, ఆక్సిజన్ బార్లలోను, ఆర్గానిక్ ఆహారంతో కాలుష్య ఫలితాలకు దూరం గా జీవిస్తుంటారు. సామాన్యులు, మూగజీవులు మాత్రం కలుషిత ఆహారం, నీరు, అధిక ఉష్ణోగ్రతలు, గాలివానలు భరిస్తూ, గూడులేని జీవి తాన్ని గడుపుతూ కాలుష్య ఫలితాలు అనుభవిస్తున్నారు. ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు బాధ్యత వహించుతూ బడ్జెట్లో అధిక శాతం నిధులు కేటాయించి చిత్తశుద్ధితో అమలు పర్చాలి. నిత్యం పర్యావరణ ఆడిటింగ్ జరుపుతూ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. కాలుష్య నివారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. పర్యావరణ పరిరక్షణకు చట్టాలు మాత్రమే సరిపోవు. మనిషి జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. వినూత్న విధానాలతో నీటిని కాలుష్యం బారిన పడకుండా చూడటం, పొదుపు చేయడం. ఆక్సిజన్ బార్లు అవసరం రాని వాతావరణంను కల్పించుకోవడం, రసాయనాలు లేని వ్యవసాయం అమలు చేయడం, నదులను పునరుజ్జీవింప చేయడం, మొక్కలను పెంచడం, ప్లాస్టిక్ వినియోగంలో చైతన్యం తేవడం, వ్యర్థాలు ఏమాత్రం ఉత్పత్తి చేయని జీవన విధానాలను అవలంభించడం వంటి విషయాలలో అందరినీ ముఖ్యంగా యువతను భాగస్వాములు చేయాలి. పర్యావరణ కాలుష్యంకు కారకులైన కార్పొరేట్ సంస్థలు, సంపన్నులే.. ఈ కాలుష్య నివారణకు నడుంబిగించి ముందుకు రావాలి. కాలుష్య ఫలితంగా పేదలకు, మూగజీవులకు జరిగిన నష్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సంపన్నులు, ప్రభుత్వానిదే. అప్పుడే అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినం జరుపుకోవడంలో నిజమైన ఆనందం, లక్ష్యం సాధించగలం. (నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం) యాతం వీరాస్వామి, రచయిత,విశ్లేషకులు మొబైల్ : 95816 76918 -
వ్యక్తి దారుణ హత్య
రూ. 8 వేల కోసం.. - నమ్మించి కడతేర్చిన మిత్రుడు - నిందితుడి అరెస్టు నిజామాబాద్ క్రైం : డబ్బులకోసం ఘాతుకానికి ఒడిగట్టాడో మిత్రుడు. నమ్మించి స్నేహితుడినే దారుణంగా హత్య చేశాడు. మృతుడి భార్య ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. కేసును ఛేదించారు. సంఘటనకు సంబంధించి ఒకటో టౌన్ ఎస్హెచ్ఓ శ్రీనివాసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా చిన్నారావుపేట్ మండలం చింతలతండా గ్రామం ఎల్లయ్యగూడానికి చెందిన కొర్ర వీరాస్వామి(42) రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం భార్య శారదతో కలిసి నిజామాబాద్‌కు వచ్చాడు. కాలూర్ రోడ్డులో నిర్మిస్తున్న గోదాంల వద్ద వాచ్‌మన్‌గా పనిలో చేరాడు. ఇక్కడ ఆటోనగర్‌కు చెందిన యూసుఫ్ రోడ్‌రోలర్ నడుపుతుంటాడు. మిగతా సమయాల్లో ఆటో నడుపుతాడు. అతడితో వీరాస్వామికి పరిచయమైంది. అది స్నేహంగా మారింది. గతనెల 30వ తేదీన స్వగ్రామానికి వెళ్లాలనుకున్న వీరాస్వామి.. యూసుఫ్‌కు ఫోన్ చేసి ఆటో తీసుకుని రావాలని కోరాడు. అతడు శారద, వీరాస్వామిలను బస్టాండ్‌కు తీసుకువచ్చాడు. శారదను బస్టాండ్‌లో వేచి ఉండాలని చెప్పిన వీరాస్వామి.. యూసుఫ్‌తో కలిసి మద్యం తాగడానికి వెళ్లాడు. వీక్లీ మార్కెట్లో మద్యం కొనుగోలు చేసి ఆటోలోనే తాగాడు. తన వద్ద ఇనుప సామగ్రి ఉందని, దానిని అమ్ముదామని యూసుఫ్‌తో చెప్పాడు. ఇనుప సామగ్రిని ఆటోలో ఆటోనగర్‌కు తీసుకువచ్చి రూ. 2 వేలకు అమ్మారు. అంతకుముందే వీరాస్వామి వద్ద రూ. 6 వేలున్నాయి. అక్కడినుంచి అర్సపల్లి వెళ్లి మద్యం కొనుగోలు చేసి ఇద్దరూ తాగారు. వీరాస్వామి వద్ద ఉన్న రూ. 8 వేలను కాజేయాలని యూసుఫ్ భావించాడు. తన ఇంటి పక్కన నివాసం ఉండే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్‌కు చెందిన ఉత్తమ్‌కు ఫోన్ చేసి విషయం తెలిపాడు. అతడు వీరున్న చోటికి చేరుకున్నాడు. ముగ్గురూ కలిసి నాగారంలోని కల్లుబట్టికి వచ్చారు. అప్పటికే మద్యం మత్తులో ఊగుతున్న వీరాస్వామితో కల్లు తాగించారు. అక్కడినుంచి ఆటోలో నాగారంలోని 300 క్వార్టర్స్ ప్రాంతంలోగల మున్సిపల్ డంపింగ్ యార్డ్ సమీపానికి తీసుకువచ్చి, కింద పడేసి పెద్ద రాయితో తలపై మోది చంపారు. అనంతరం వీరాస్వామి జేబులోని రూ. 8 వేలు తీసుకుని మృతదేహాన్ని కాల్వ పక్కన చెట్ల పొదల్లో పడేశారు. ఉత్తమ్ ధర్మాబాద్ వెళ్లిపోగా.. యూసుఫ్ ఏమీ తెలియనట్లు ఇంటికి చేరుకున్నాడు. వీరాస్వామి భార్య ఫిర్యాదుతో.. భర్త ఎంతకీ తిరిగి రాకపోవడంతో వీరాస్వామి భార్య శారద ఒంటరిగా స్వగ్రామానికి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులతో విషయం తెలిపింది. వీరాస్వామికి ఫోన్ కలవకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఒకటో తేదీన నిజామాబాద్ వచ్చారు. యూసుఫ్ ఇంటికి వెళ్లి వీరాస్వామి గురించి ప్రశ్నించారు. అతడు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యూసుఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. గురువారం మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం చేయించామని ఎస్హెచ్ఓ తెలిపారు. మరో నిందితుడు ఉత్తమ్‌ను ధర్మాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
‘తెలంగాణ’ వీరస్వామి ఇకలేరు..!
అనారోగ్యంతో మృతి నేడు అంత్యక్రియలు ముషీరాబాద్ : తెలంగాణనే ఇంటి పేరుగా మార్చుకున్న ఉద్యమ నాయకుడు శనిగరపు వీరస్వామి(44) సోమవారం మృతి చెందాడు. అవివాహితుడైన వీరస్వామి ఏడాది కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. శనివారం రాత్రి దమ్మాయిగూడలోని ఆయన నివాసం నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. జూడాలు సమ్మెలో ఉన్నారని వీరస్వామిని ఆసుపత్రిలో చేర్చుకోలేదు. అతడ్ని వెంటనే ఇంటికి తీసుకుపోయారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కాగా అతడి తల్లి దశదిన ఖర్మ రోజునే వీరస్వామి మృతి చెందాడు. ఉద్యమమే ఊపిరిగా.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పోరు బాట పట్టాడు. ఆందోళనల్లో పాల్గొని తెలంగా ణ వాణిని వినిపించారు. కేసీఆర్, కోదండరామ్‌లతో పాటు తెలంగాణ ఉద్యమంలోని కీలక నేతలందరికీ తెలంగాణ వీరస్వామి సుపరిచితుడు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్న 2009 డిసెంబ ర్ 23 నుంచి తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డ జూలై 2, 2014 వరకు అరగుండును టీ ఆకారంలో కత్తిరించుకొని నిరసన తెలిపాడు. నేడు అంత్యక్రియలు.. వీరస్వామి అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు పార్శిగుట్ట శ్మశానవాటికలో నిర్వహిస్తున్నట్లు ముషీరాబాద్ జేఏసీ చైర్మన్ ఎం. నర్సయ్య తెలిపారు. వీరస్వామి నివాస ప్రాంతం సమీపంలోని ఎస్సార్టీ పార్క్ నుంచి పార్శిగుట్ట వరకు అంతిమయాత్ర జరుగుతుందని తెలిపారు. అతడి మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. -
సర్వేకు వచ్చి వెళుతూ మృత్యుఒడిలోకి..
తల్లి ఆపరేషన్ కోసం బయల్దేరి రోడ్డు ప్రమాదానికి గురైన అన్నదమ్ములు అన్న దుర్మరణం.. తమ్ముడికి తీవ్ర గాయాలు మీదికొండలో విషాద ఛాయలు స్టేషన్‌ఘన్‌పూర్/రఘునాథపల్లి : సమగ్ర కుటుంబ సర్వే కోసం తమ స్వగ్రామానికి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు.. తిరిగి తమ తల్లి ఆపరేషన్ ఉండడంతో హైదరాబాద్‌కు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యూరు. రఘునాథపల్లి మండలం నిడిగొండలో జరిగిన ఈ ప్రమాదంలో అన్న మృతిచెందగా, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై సత్యనారాయణ, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మీదికొండకు చెందిన చాతరబోయిన వెంకటమ్మ, ఎల్లయ్య దంపతులకు కుమారులు వీరస్వామి(36), యాదగిరి ఉన్నారు. మూడు రోజుల క్రితం తల్లి వెంకటమ్మ అనారోగ్యానికి గురికాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బుధవారం ఆపరేషన్ నిర్వహిస్తామని వైద్యులు చెప్పారు. కాగా మంగళవారం కుటుంబ సర్వే ఉండటంతో హైదరాబాద్‌లో ఉంటున్న తమ సోదరి, బావ వద్ద తల్లిని ఉంచి సర్వే కోసం గ్రామానికి ఉదయం బైక్‌పై ఇద్దరు అన్నదమ్ములు మీదికొండకు వచ్చారు. మధ్యాహ్నం సర్వే పూర్తయ్యాక తల్లికి కావాల్సిన వస్తువులు తీసుకుని వారు బైక్‌పై తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరారు. యాదగిరి బైక్ నడుపుతుండగా వీరస్వామి వెనకాల కూర్చున్నాడు. నిడిగొండ బ్రిడ్జిపై ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న సిమెంట్ పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో వెనకాల కూర్చున్న వీరస్వామి ఎగిరి పిల్లర్‌కు తాకడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు చేరుకుని యాదగిరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారులు సంపత్, నాగరాజు ఉన్నారు. మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు ఎస్సై వెల్లడించారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు.. కాగా ఆపరేషన్‌తో తల్లికి బాగవుతుందని అనుకుంటున్న ఆ కుటుంబంలో విషాదవార్త తెలియడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించారు. అప్పటిదాకా గ్రామంలో అందరితో కలివిడిగా తిరిగిన అన్నదమ్ముల్లో అన్న మృతిచెందగా, తమ్ముడు తీవ్ర గాయాలపాలుకావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సర్పంచ్ నాగరబోయిన శ్రీరాములు, ఎంపీటీసీ సభ్యురాలు నాగరబోయిన మణెమ్మ, టీఆర్ఎస్ నాయకుడు యాదగిరి, ఆదర్శ రైతు చెరుకు పాపయ్య సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
చిల్లర పనులు మానుకోవాలి
కందుకూరు, న్యూస్‌లైన్ : ‘మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం.. ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 15 మంది పోటీచేశారు.. ఓడిన వారంతా తట్టుకోలేక ప్రజలపై దాడులు చేస్తే ఏమౌతుందో ఆలోచించుకోవాలి.. నాయకులనే వారు ఆదర్శంగా ఉండాలే తప్ప.. చిల్లర పనులు చేయకూడదు’... అని కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు స్థానిక టీడీపీ శ్రేణులనుద్దేశించి పేర్కొన్నారు. స్థానిక కోవూరు రోడ్డులోని గెస్ట్‌హౌస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన సంఘటనలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. టీడీపీ పూర్తిస్థాయిలో అధికారం చేపట్టకుండానే స్థానికంగా విజయోత్సవ ర్యాలీ చేయడాన్ని ఆ పార్టీ నాయకుల విజ్ఞతికే వదిలేస్తున్నానన్నారు. ఆ ర్యాలీలో షాపులపై దాడులు చేయడం, ఫ్లెక్సీలు చించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికాదన్నారు. నాయకులే బాధ్యతగా తీసుకుని ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సి ఉందన్నారు. కానీ, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. కందుకూరికి ఎవరూ రాకూడదనే భావన మంచిది కాదన్నారు. దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడటం, అదేమంటే ప్రభుత్వం మాదే అని మాట్లాడటం సరైన విధానం కాదని హితవు పలికారు. ఇదే పరిస్థితి కొనసాగితే సహించేది లేదని పోతుల రామారావు స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ సమన్వయంతో వ్యవహరిస్తే నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పారు. అలాకాకుండా చిల్లర పనులకు పాల్పడి ప్రజాస్వామ్యానికి మచ్చ తేవద్దని సూచించారు. సోమవారం స్థానిక వైఎస్ఆర్ సీపీ కార్యాలయంపై జరిగిన దాడి గురించి తాము ఎటువంటి ఫిర్యాదూ చేయడం లేదన్నారు. చిన్న, చిన్న విషయాలకు స్పందించడం తమ లక్షణం కాదన్నారు. బెదిరింపులకు దిగడం, ప్రజలను భయాందోళనకు గురిచేయడం తమకు తెలియని విషయాలని, భవిష్యత్తులో కూడా అటువంటి చిల్లర పనులకు పాల్పడమని పేర్కొన్నారు. విలువలు పాటించడమే తమకు తెలిసిన రాజకీయమని చెప్పారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి... కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న అల్లర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు ఉన్నతాధికారులకు పోతుల రామారావు సూచించారు. పట్టణంలో చిన్న సంఘటన కూడా జర గకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ సమన్వయంతో వ్యవహరించి నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉంచాలని కోరారు. ఐదు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఎన్నికల కోసం గొడవలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి, నాయకులు కసుకుర్తి ఆదెన్న, రఫి తదితరులు పాల్గొన్నారు. ఆరోపణలపై చర్చకు సిద్ధం : ఉప్పుటూరి సోమవారం పట్టణంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులతో ఎక్కడైనా చర్చకు సిద్ధమని మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఓటమి బాధను ఇతరులపై మోపుతూ పబ్బం గడుపుకోవడం మానుకోవాలన్నారు. టీడీపీ నాయకుడు దివి లింగయ్యనాయుడిపై ఉప్పుటూరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధైర్యం ఉంటే తన సవాల్‌ని స్వీకరించి చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.