- తల్లి ఆపరేషన్ కోసం బయల్దేరి రోడ్డు ప్రమాదానికి గురైన అన్నదమ్ములు
- అన్న దుర్మరణం.. తమ్ముడికి తీవ్ర గాయాలు
- మీదికొండలో విషాద ఛాయలు
స్టేషన్‌ఘన్‌పూర్/రఘునాథపల్లి : సమగ్ర కుటుంబ సర్వే కోసం తమ స్వగ్రామానికి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు.. తిరిగి తమ తల్లి ఆపరేషన్ ఉండడంతో హైదరాబాద్‌కు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యూరు. రఘునాథపల్లి మండలం నిడిగొండలో జరిగిన ఈ ప్రమాదంలో అన్న మృతిచెందగా, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై సత్యనారాయణ, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మీదికొండకు చెందిన చాతరబోయిన వెంకటమ్మ, ఎల్లయ్య దంపతులకు కుమారులు వీరస్వామి(36), యాదగిరి ఉన్నారు.
మూడు రోజుల క్రితం తల్లి వెంకటమ్మ అనారోగ్యానికి గురికాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బుధవారం ఆపరేషన్ నిర్వహిస్తామని వైద్యులు చెప్పారు. కాగా మంగళవారం కుటుంబ సర్వే ఉండటంతో హైదరాబాద్‌లో ఉంటున్న తమ సోదరి, బావ వద్ద తల్లిని ఉంచి సర్వే కోసం గ్రామానికి ఉదయం బైక్‌పై ఇద్దరు అన్నదమ్ములు మీదికొండకు వచ్చారు. మధ్యాహ్నం సర్వే పూర్తయ్యాక తల్లికి కావాల్సిన వస్తువులు తీసుకుని వారు బైక్‌పై తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరారు.
యాదగిరి బైక్ నడుపుతుండగా వీరస్వామి వెనకాల కూర్చున్నాడు. నిడిగొండ బ్రిడ్జిపై ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న సిమెంట్ పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో వెనకాల కూర్చున్న వీరస్వామి ఎగిరి పిల్లర్‌కు తాకడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు చేరుకుని యాదగిరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారులు సంపత్, నాగరాజు ఉన్నారు. మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్లు ఎస్సై వెల్లడించారు.
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..
కాగా ఆపరేషన్‌తో తల్లికి బాగవుతుందని అనుకుంటున్న ఆ కుటుంబంలో విషాదవార్త తెలియడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించారు. అప్పటిదాకా గ్రామంలో అందరితో కలివిడిగా తిరిగిన అన్నదమ్ముల్లో అన్న మృతిచెందగా, తమ్ముడు తీవ్ర గాయాలపాలుకావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సర్పంచ్ నాగరబోయిన శ్రీరాములు, ఎంపీటీసీ సభ్యురాలు నాగరబోయిన మణెమ్మ, టీఆర్‌ఎస్ నాయకుడు యాదగిరి, ఆదర్శ రైతు చెరుకు పాపయ్య సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.