పచ్చగా ఉండాలంటే.. పచ్చదనం ఉండాలి | Guest Column By Veera Swamy Over World Environment Day | Sakshi
Sakshi News home page

పచ్చగా ఉండాలంటే.. పచ్చదనం ఉండాలి

Published Wed, Jun 5 2019 1:31 AM | Last Updated on Wed, Jun 5 2019 1:31 AM

Guest Column By Veera Swamy Over World Environment Day - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మనిషి బతకాలంటే చుట్టూ ఉన్న అడవులు, కొండలు కోనలు, చెట్లు చేమలు, చెరువులు సెలయేళ్లు, నదులు సముద్రాలు, వీటన్నింటినీ అంటిపెట్టుకుని ఉండే సకల జీవకోటి బతకాలి. అప్పుడే మనిషి ప్రకృతిలో భాగంగా బతకగలడు. మనిషి ప్రకృతి నుంచి విడిపోయి మనుగడ సాగించలేడు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశాలను మనం పంచ భూతాలుగా చెప్పుకుంటున్నాం.  ఈ పంచ భూతాలు కలయికతో ఏర్పడేదే ప్రకృతి. ఈ పంచ భూతాత్మక ప్రకృతినే పర్యావరణం అంటాం. భూగోళాన్ని ఆవరించి ఉన్న వాయువునే వాతావరణం అంటాం. ఈ భూవాతావరణం అనేక జీవులు, నిర్జీవులతో కూడుకుని ఉంది. అందుకే మన పర్యావరణం కలుషితం కాకూడదనేదే అందరి వాదన. నేడు అడవుల సమతుల్యం, పర్యా వరణ సమతుల్యం దెబ్బతినడంవల్లే జీవి మను గడకు ప్రమాదం ఏర్పడింది. నగరీకరణ, ఆధునీకరణ, పారిశ్రామికీకరణ విషయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే జల, వాయు, శబ్ద, ఆహార కాలుష్యాలు ప్రమాద స్థాయిని మించి పోయాయి.

ప్రాచీన సంస్కృతులన్నీ ప్రకృతిని ఆరాధిస్తూనే పెరిగాయి. అన్ని ప్రధాన పండుగలు, సంప్రదాయాలలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తూ వచ్చింది. ఎప్పుడైతే మనం ప్రకృతితో ఉన్న అను బంధం నుంచి దూరంగా ఉండడం మొదలు పెట్టామో.. అప్పటి నుంచే కాలుష్యాన్ని పుట్టించడం, పర్యావరణాన్ని నాశనం చేయడం మొదలైంది. నేడు దేశంలోని ధర్మల్‌ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, ఎరువుల కర్మాగారాలు, మందులు, రసాయన పరిశ్రమలు, సిమెంట్, తోలు వంటి అనేక కర్మాగారాలు వెదజల్లుతున్న విషపూరిత వాయువు, రసాయన వ్యర్థ పదార్థాల వల్ల, నగ రాలు, పట్టణాల్లో ఉత్పత్తి అవుతున్న తడి, పొడి చెత్త, ప్లాస్టిక్‌ క్యారీభ్యాగ్‌లు వంటి వాటి వల్ల నేడు పర్యావరణం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. జల కాలుష్యం, వాయు కాలుష్యం అభివృద్ధిని మించిపోయింది.

దీంతో వాతావరణంలో మార్పులు సంభవించి భూమి వేడెక్కిపోతుంది. పర్యావరణ కాలుష్యం వల్ల నష్ట పోయేది ఎక్కువగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, మూగజీవులే. సమాజంలో పది శాతం కూడా ఉండని సంపన్నులు వెదజల్లే కాలుష్యానికి వీరు బలైపోతున్నారు. సంపన్నులు వాడే ఏసీ మిషన్లు వల్ల, వీరు ఉపయోగించే  వాహ నాలు వల్ల, వీరు నిర్వహించే పరిశ్రమల వల్ల, వీటి మూలంగా ఏర్పడే తీవ్రమైన ఎండలు, సైక్లోన్‌లు, కల్తీ ఆహారం, కలుషిత నీరు,కలుషిత వాయువు వల్ల అనారోగ్యానికి గురై నష్టపోయేది పేదలే.  సంపన్నులు ఏసీ గదుల్లోను, ఆక్సిజన్‌ బార్లలోను, ఆర్గానిక్‌ ఆహారంతో కాలుష్య ఫలితాలకు దూరం గా జీవిస్తుంటారు. సామాన్యులు, మూగజీవులు మాత్రం  కలుషిత ఆహారం, నీరు, అధిక ఉష్ణోగ్రతలు, గాలివానలు భరిస్తూ, గూడులేని జీవి తాన్ని గడుపుతూ కాలుష్య ఫలితాలు అనుభవిస్తున్నారు.  
 
ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు  బాధ్యత వహించుతూ బడ్జెట్‌లో అధిక శాతం నిధులు కేటాయించి చిత్తశుద్ధితో అమలు పర్చాలి. నిత్యం పర్యావరణ ఆడిటింగ్‌ జరుపుతూ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. కాలుష్య నివారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. పర్యావరణ పరిరక్షణకు చట్టాలు మాత్రమే సరిపోవు. మనిషి జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. వినూత్న విధానాలతో నీటిని కాలుష్యం బారిన పడకుండా చూడటం, పొదుపు చేయడం.

ఆక్సిజన్‌ బార్లు అవసరం రాని వాతావరణంను కల్పించుకోవడం, రసాయనాలు లేని వ్యవసాయం అమలు చేయడం, నదులను పునరుజ్జీవింప చేయడం, మొక్కలను పెంచడం, ప్లాస్టిక్‌ వినియోగంలో చైతన్యం తేవడం, వ్యర్థాలు ఏమాత్రం ఉత్పత్తి చేయని జీవన విధానాలను అవలంభించడం వంటి విషయాలలో అందరినీ ముఖ్యంగా యువతను భాగస్వాములు చేయాలి. పర్యావరణ కాలుష్యంకు కారకులైన కార్పొరేట్‌ సంస్థలు, సంపన్నులే.. ఈ కాలుష్య నివారణకు నడుంబిగించి ముందుకు రావాలి. కాలుష్య ఫలితంగా పేదలకు, మూగజీవులకు జరిగిన నష్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సంపన్నులు, ప్రభుత్వానిదే. అప్పుడే అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినం జరుపుకోవడంలో నిజమైన ఆనందం, లక్ష్యం సాధించగలం.

(నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం)
యాతం వీరాస్వామి,
రచయిత,విశ్లేషకులు
మొబైల్‌ : 95816 76918 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement