టైటిల్ : ఏప్రిల్ 28 ఏం జరిగింది
జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్
నటీనటులు : రంజిత్, షెర్రీ అగర్వాల్,తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు
నిర్మాణ సంస్థ : వీజీ ఎంటర్‌టైన్మెంట్
నిర్మాత & దర్శకత్వం : వీరాస్వామి
సంగీతం : సందీప్ కుమార్
సినిమాటోగ్రఫీ : సునీల్ కుమార్
విడుదల తేది : ఫిబ్రవరి 27, 2021
కరోనా కారణంగా కొన్ని నెలల పాటు థియేటర్లకు దూరమైన సినీ ప్రియులు ఇప్పుడిప్పుడే మునుపటి వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. వంద శాతం సిట్టింగ్‌కు అనుమతి రావడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకుతరలివస్తున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో వరుస సినిమాలను విడుదల చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మన టాలీవుడ్‌దర్శక,నిర్మాతలు. ప్రతి వారం నాలుగైదు సినిమాలను విడుదలచేస్తూ సినీ ప్రియులను అలరిస్తున్నారు. ఈ వారం కూడా ఇప్పటికే నితిన్ చెక్‌తో పాటు అరడజను పైగా చిత్రాలు విడుదలయ్యాయి. తాజాగా శనివారం (పిభ్రవరి 27)న ‘ఏప్రిల్ 28న ఏం జరిగింది’మూవీ విడుదలైంది. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో రంజిత్, షెర్రీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్,టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు భయపెట్టింది? తొలి సినిమాతో రంజిత్ హిట్ అందుకున్నాడా లేదా? రివ్యూలో చూద్దాం.
కథ
విహారి(రంజిత్) సినిమా రైటర్. ప్రముఖ నిర్మాత(తనికెళ్ల భరణి)కి గతంలో నాలుగు విజయవంతమైన సినిమాలు అందించాడు. కానీ ఇటీవల తీసిన సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది. దీంతో తదుపరి తీయబోయే సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలని దర్శకుడిపై ఒత్తిడి పెంచుతాడు. దీనికి తోడు ప్రముఖ దర్శకుడు (రాజీవ్ కనకాల) నిర్మాతకు డేట్స్ కేటాయించడంతో ఒత్తిడి మరింత పెరుగుతుంది.దీంతో ఆ ఒత్తిడిని తగ్గించేందుకు భార్య ప్రవలిక( షెర్రీ అగర్వాల్), పిల్లలతో కలిసి వారం రోజుల పాటు సిటీకి దూరంగా గడపాలని భావిస్తాడు. ఫ్యామిలీతో కలిసి కారులో బయలుదేరిన విహారికి మార్గమధ్యలో ఎస్సై డేవిడ్(అజయ్) తారాసపడతాడు. డేవిడ్ సలహా మేరకు విహారి ఫ్యామిలీతో కలిసి సిరిపురం అను గ్రామంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్‌కి వెళ్తాడు. వెళ్లిన మొదటి రోజే తాను దిగిన గెస్ట్ హౌస్ కు ఎదురుగా ఉండే భవంతి తనకేదో చెప్పాలనుకుంటుదనే భావనకు గురవుతాడు. తనకు అనిపించిన విషయాన్ని ఎస్సై డేవిడ్‌తో షేర్ చేసుకొని ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతాడు. విహారికి నిజంగా ఆ ఇల్లు ఏదో చెప్పాలని అనుకుందా? ఆ ఇంట్లో ఉన్న ఆత్మలు ఎవరివి? అసలు విహారి మాత్రమే ఆ ఆత్మలు ఎందుకు కనిపించాయి? అసలు ఏప్రిల్ 28న ఏం జరిగింది? అనేదే మిగతా కథ
నటీ నటులు
హీరో రంజిత్‌కి ఇది మొదటి సినిమా. ప్రముఖ సినిమా రచయిత ఏల్చూరి వెంకట్రావు గారి అబ్బాయే రంజిత్. మొదటి సినిమా అయినప్పటికీ ఉన్నంతతో అతను బాగానే నటించాడు. కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంది. హీరోయిన్ షెర్రీ అగర్వాల్ తన పాత్రకు న్యాయం చేసింది. ఇక విలన్‌గా రాజీవ్ కనకాల బాగానే మెప్పించాడు. చాలా కాలం తర్వాత రాజీవ్ నటనకు ఆస్కారం ఉన్న పాత్ర పోషించాడు. అజయ్, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు.
విశ్లేషణ
హారర్ సినిమాలు తెలుగులో చాలానే వచ్చాయి. ఊరికి చివరిలో ఓ పాడుపడ్డ గది. అందులో దెయ్యాలు.. అక్కడి అనుకోకుండా హీరో వెళ్లడం..దెయ్యాలకు ఫ్లాష్‌బ్యాక్.. చిన్నపాటి ట్విస్ట్. దాదాపు హారర్ చిత్రాలు అన్ని ఇలాగే ఉంటాయి. కానీ వాటిని తెరపై చూపించే విధానాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడుతుంది. ఇక ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’సినిమా కూడా అలాంటిదే. గత సినిమాల కథనే దర్శకుడు ఎంచుకున్నాడు. కాకపోతే చిన్న ట్విస్ట్‌లు పెట్టి హిట్ కొట్టాలనుకున్నాడు. కానీ అతని ఆలోచన బెడిసి కొట్టింది. సినిమాలో ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు కానీ, భయపెట్టే సీన్లు కాని ఒకటి కూడా ఉండదు.
ఫస్టాఫ్ మొత్తం సింపుల్‌గా సాగిపోతుంది. అసలు హారర్ మూవీ చూస్తున్నామనే భావనే ప్రేక్షకులకు కలగకపోగా, బోర్ కొట్టించే సన్నివేశాలు బోలెడన్ని ఉన్నాయి. ఏ ఒక్క సన్నివేశంలో కూడా కొత్తదనం కనిపించదు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథ సాగదీతగా అనిపిస్తుంది. అలాగే ఆ దెయ్యాల ఫ్లాష్ బ్యాక్ కూడా బోర్ కొట్టించేవిధంగా ఉంటుంది. ఇక క్లైమాక్స్‌లో మాత్రం చిన్నపాటి ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తాడు. సందీప్ కుమార్ తన నేపథ్య సంగీతంతో కొన్ని సన్నివేశాలను కాస్త భయపెట్టే ప్రయత్నం చేశాడు. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫి పర్వాలేదు. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే హారర్ మూవీస్ రెగ్యులర్‌గా చూసే ప్రేక్షకులకు ఈ సినిమాలో కొత్తదనం ఏది కనిపించడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏప్రిల్ 28 ఏమి జరగలేదు.
ప్లస్ పాయింట్స్
ఉన్నంతలో రాజీవ్ కనకాల, రంజిత్ నటన
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
రొటీన్ హారర్ డ్రామా
ఫస్టాఫ్
సెకండాఫ్ సాగతీత సీన్లు
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment