వ్యక్తి దారుణ హత్య | Brutal murder of a man | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Published Fri, Dec 5 2014 3:30 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

వ్యక్తి దారుణ హత్య - Sakshi

వ్యక్తి దారుణ హత్య

రూ. 8 వేల కోసం..
- నమ్మించి కడతేర్చిన మిత్రుడు
- నిందితుడి అరెస్టు

 నిజామాబాద్ క్రైం : డబ్బులకోసం ఘాతుకానికి ఒడిగట్టాడో మిత్రుడు. నమ్మించి స్నేహితుడినే దారుణంగా హత్య చేశాడు. మృతుడి భార్య ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. కేసును ఛేదించారు. సంఘటనకు సంబంధించి ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా చిన్నారావుపేట్ మండలం చింతలతండా గ్రామం ఎల్లయ్యగూడానికి చెందిన కొర్ర వీరాస్వామి(42) రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం భార్య శారదతో కలిసి నిజామాబాద్‌కు వచ్చాడు. కాలూర్ రోడ్డులో నిర్మిస్తున్న గోదాంల వద్ద వాచ్‌మన్‌గా పనిలో చేరాడు.

ఇక్కడ ఆటోనగర్‌కు చెందిన యూసుఫ్ రోడ్‌రోలర్ నడుపుతుంటాడు. మిగతా సమయాల్లో ఆటో నడుపుతాడు. అతడితో వీరాస్వామికి పరిచయమైంది. అది స్నేహంగా మారింది. గతనెల 30వ తేదీన స్వగ్రామానికి వెళ్లాలనుకున్న వీరాస్వామి.. యూసుఫ్‌కు ఫోన్ చేసి ఆటో తీసుకుని రావాలని కోరాడు. అతడు శారద, వీరాస్వామిలను బస్టాండ్‌కు తీసుకువచ్చాడు. శారదను బస్టాండ్‌లో వేచి ఉండాలని చెప్పిన వీరాస్వామి.. యూసుఫ్‌తో కలిసి మద్యం తాగడానికి వెళ్లాడు. వీక్లీ మార్కెట్‌లో మద్యం కొనుగోలు చేసి ఆటోలోనే తాగాడు. తన వద్ద ఇనుప సామగ్రి ఉందని, దానిని అమ్ముదామని యూసుఫ్‌తో చెప్పాడు.

ఇనుప సామగ్రిని ఆటోలో ఆటోనగర్‌కు తీసుకువచ్చి రూ. 2 వేలకు అమ్మారు. అంతకుముందే వీరాస్వామి వద్ద రూ. 6 వేలున్నాయి. అక్కడినుంచి అర్సపల్లి వెళ్లి మద్యం కొనుగోలు చేసి ఇద్దరూ తాగారు. వీరాస్వామి వద్ద ఉన్న రూ. 8 వేలను కాజేయాలని యూసుఫ్ భావించాడు. తన ఇంటి పక్కన నివాసం ఉండే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్‌కు చెందిన ఉత్తమ్‌కు ఫోన్ చేసి విషయం తెలిపాడు.

అతడు వీరున్న చోటికి చేరుకున్నాడు. ముగ్గురూ కలిసి నాగారంలోని కల్లుబట్టికి వచ్చారు. అప్పటికే మద్యం మత్తులో ఊగుతున్న వీరాస్వామితో కల్లు తాగించారు. అక్కడినుంచి ఆటోలో నాగారంలోని 300 క్వార్టర్స్ ప్రాంతంలోగల మున్సిపల్ డంపింగ్ యార్డ్ సమీపానికి తీసుకువచ్చి, కింద పడేసి పెద్ద రాయితో తలపై మోది చంపారు. అనంతరం వీరాస్వామి జేబులోని రూ. 8 వేలు తీసుకుని మృతదేహాన్ని కాల్వ పక్కన చెట్ల పొదల్లో పడేశారు. ఉత్తమ్ ధర్మాబాద్ వెళ్లిపోగా.. యూసుఫ్ ఏమీ తెలియనట్లు ఇంటికి చేరుకున్నాడు.
 
వీరాస్వామి భార్య ఫిర్యాదుతో..
భర్త ఎంతకీ తిరిగి రాకపోవడంతో వీరాస్వామి భార్య శారద ఒంటరిగా స్వగ్రామానికి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులతో విషయం తెలిపింది. వీరాస్వామికి ఫోన్ కలవకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఒకటో తేదీన నిజామాబాద్ వచ్చారు. యూసుఫ్ ఇంటికి వెళ్లి వీరాస్వామి గురించి ప్రశ్నించారు.

అతడు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యూసుఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. గురువారం మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం చేయించామని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. మరో నిందితుడు ఉత్తమ్‌ను ధర్మాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement