రచ్చ గెలిచి.. ఇంట గెలవకున్నా..
* పద్ధతి మార్చుకోని కందుకూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు
* ఇక్కడ ఓడినా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ రెచ్చగొట్టే ర్యాలీ
* పట్టణంలో ఓ సామాజికవర్గమే లక్ష్యంగా షాపులపై దాడులు
* భయంతో షాపులు మూసి పరుగులు తీసిన వ్యాపారులు
* తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
కందుకూరు, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఓడామన్న బాధను బయటకు కనిపించకుండా రాష్ట్రంలో అధికారం వచ్చిందంటూ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలు చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వివరాలు.. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన దివి శివరాం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోతుల రామారావు చేతిలో ఘోర ఓటమిని చవిచూశారు.
నియోజకవర్గంలో ఓటమిపాలైనా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటూ పట్టణంలో సోమవారం ర్యాలీ చేపట్టారు. కోటారెడ్డినగర్‌లోని దివి శివరాం ఇంటి నుంచి ఓవీరోడ్, పోస్టాఫీసు సెంటర్, పామూరు రోడ్, ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీకి ముందు కొందరు టీడీపీ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై హల్‌చల్ చేశారు. తమకు ఓట్లు వేయలేదని భావిస్తున్న ఓ సామాజిక వర్గానికి చెందిన వారి షాపులను టార్గెట్ చేశారు. పోస్టాఫీసు సెంటర్ లో ఉన్న వేముల పాపయ్యగుప్తా జ్యూయలర్స్ (వీపీజీ జ్యూలయర్స్) ఎదుట కొందరు ద్విచక్ర వాహనాలు ఆపి హంగామా చేశారు. అనంతరం ఆ జ్యుయలరీ షాపును టార్గెట్ చేస్తూ దాడులకు దిగారు. షాపు అద్దాలు పగలగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
వీలు కాకపోవడంతో పక్కనే ఉన్న సైకిల్‌ను బలంగా విసరడంతో షాపు అద్దాలు ధ్వసమయ్యాయి. దీంతో అప్పటికే షాపులో బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళతో పాటు కూలీలు, యజమాని గజగజలాడిపోయారు. భయభ్రాంతులకు గురై షాపు షెట్టర్ వేసుకుని లోపలే ఉండిపోయారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులు మొత్తం భయంతో తమ షాపులు మూసివేసి పరుగులు తీశారు. ర్యాలీ పామూరురోడ్డులోకి వచ్చే సరికి వ్యాపార సంస్థలన్నీ మూతబడ్డాయి. కొద్దిసేపటి తర్వాత దాడి జరిగిన వీపీజీ జ్యుయలరీ వద్దకు వచ్చిన దివి శివరాం.. షాపు యజమానితో మాట్లాడారు. ఏదో పొరపాటున అద్దాలు ధ్వంసమయ్యాయని సర్దిచెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం.
ఓట్లు పడలేదని నిర్ధారించుకునేదాడులు
గెలుపు కోసం టీడీపీ నాయకుల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వరుసగా మూడోసారి శివరాం ఓటమి పాలుకావడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎన్నికలకు ముందు నుంచే తమకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గాలన్నిటినీ తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పట్టణంలో అధిక సంఖ్య లో ఓటర్లు ఉన్న ఓ సామాజికవర్గానికి చెందిన కొందరు నేతలను తమ వైపునకు తిప్పుకున్నారు. ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ తమకే వస్తాయని భావించగా ఎన్నికల్లో వారికి ఊహించని షాక్ తగిలింది. పట్టణంలో అధిక మంది ఓటర్లు వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపారు. తాము ఎంతో నమ్మకం పెట్టుకున్న ఓట్లు సైతం తమకు పడలేదనే బాధ టీడీపీ నేతల్లో ఉంది. ఓటమికి గల కారణాలను అన్వేషించిన టీడీపీ నేతలు పట్టణంలో ఆ సామాజికవర్గం వారి షాపులను టార్గెట్ చేసుకుని దాడులకు దిగారు.
పాత సంప్రదాయం పునరావృతం
కందుకూరు అర్బన్, న్యూస్‌లైన్ : కందుకూరులో పాత సంప్రదాయం పునరావృతమైంది. నియోజకవర్గంలో ఓటమి తట్టుకోలేని టీడీపీ శ్రేణులు స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంపై అక్కసు వెల్లగక్కాయి. నియోజకవర్గంలో టీడీపీ గెలిచిన ఓడినా ఆ పార్టీ కార్యకర్తలు పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తారని అందరూ ముందుగా ఊహించిన విధంగానే జరిగింది. టీడీపీ ఓటమిని తట్టుకోలేని ఆ పార్టీ కార్యకర్తలు తొలి రెండు రోజలు మౌనం వహించారు. తమ ఉనికిని ఏ విధంగానైనా చాటుకోవాలని భావించి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న పేరుతో కందుకూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కోవూరు రోడ్డులో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం మీదుగా కావాలనే సాగించారు.
అక్కడ ఉన్న ఆ పార్టీ కార్యాలయంపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు ఫ్లెక్సీలను చించేసి బీభత్సం సృష్టించారు. కార్యాలయంలో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు భయంతో తలుపులు ముసికొని లోపలే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో మరింత రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు మీ అంతు చస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగని టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ యువజన విభాగం పట్టణ కన్వీనర్ రఫీ పూల కొట్టు ఎదురుగా తారాజువ్వలు కాలుస్తూ భయనక వాతావరణం సృష్టించారు. రఫీపై దాడి చేసేందుకు పక్కనే ఉన్న దేవాల యంలో 20 మంది టీడీపీ యువకులు సిద్ధంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐ మధుబాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న వారిని చెదరగొట్టారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
విజయోత్సవ ర్యాలీ సందర్భంగా టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన జ్యుయలరీ షాపును పోలీసులు పరిశీలించారు. సీఐ ఎం.మధుబాబు, పట్టణ ఎస్సై రమణయ్యలు సంఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని షాపు యజమానికి సూచించారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.