ఈవీఎంలపై రగడ | no doubt about on evm's | Sakshi
Sakshi News home page

ఈవీఎంలపై రగడ

Published Wed, May 21 2014 2:29 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

ఈవీఎంలపై రగడ - Sakshi

ఈవీఎంలపై రగడ

 చీరాల, న్యూస్‌లైన్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  చీరాల నియోజకవర్గంలో ఈవీఎంలను మార్చి  అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఒక కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంలను రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు అధికారులు ప్రయత్నించిన వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది.

చీరాలలోని వీఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కాలేజీలో భద్రపరిచిన ఈవీఎంలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సోమవారం రాత్రి తరలించేందుకు ప్రయత్నించగా..సమాచారం అందుకున్న టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కాలేజీ వ ద్దకు ఇరుపార్టీల కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, కార్యకర్తల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ప్రత్యేక బలగాలను మోహరించారు. ఏ క్షణంలో అయినా ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉండడంతో టియర్‌గ్యాస్, ప్రత్యేక బలగాలను తరలించారు.

 మంగళవారం స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ఈవీఎంలు ఉంచిన గదిని పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీవోను సైతం టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అధికారులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని..ఈవీఎంలు ఉంచిన గది వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం..రాత్రివేళ ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నించడం..స్ట్రాంగ్ రూం కిటికీలు తెరచి ఉంచడంపై తమకు సమాధానం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత భర్త పోతుల సురేష్ నిలదీశారు.
 
 స్థానిక అధికారులు ముందుగా గదిలో ఉన్న ఈవీఎంల నంబర్లు తమకు ఇవ్వలేదని, ఇందులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని రిటర్నింగ్ అధికారి పద్మజపై ఆరోపణలు చేశారు. స్థానిక అధికారులపై తమకు నమ్మకం లేదని..ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పర్యవేక్షణలో ఈవీఎంల అక్రమ తరలింపుపై విచారణకు నాయకులు డిమాండ్ చేశారు. స్ట్రాంగ్‌రూంలో ట్రైనింగ్, రిజర్వ్ ఈవీఎంలే ఉన్నాయని డీఆర్వో, ఆర్డీవోతో పాటు స్థానిక అధికారులు చెప్పినా టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు ఒప్పుకోలేదు. ఇతర జిల్లాల నుంచి అధికారులను రప్పించి విచారణ జరిపించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు.   జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ట్రైనింగ్, రిజర్వ్ ఈవీఎంలను జిల్లా కేంద్రానికి తరలించగా చీరాలలో ఉంచిన ఈవీఎంలను తరలించపోవడం వెనుక రెవెన్యూ అధికారుల వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ నరహర ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.
 
వీడిన అనుమానం..
ఈవీఎంల వ్యవహారంపై  స్థానిక, జిల్లా అధికారులతో కాకుండా ఇతర అధికారులతో విచారణ  చేయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ను టీడీపీ అభ్యర్ధి పోతుల సునీత, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో కలిసి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణాధికారులుగా గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, తెనాలి ఆర్డోఓ శ్రీనివాసమూర్తి, బాపట్ల తహశీల్దార్ వెంకటేశ్వర్లును నియమించింది. సాయంత్రానికి చీరాల వచ్చిన విచారణాధికారులు పార్టీల నాయకులతో చర్చించారు. అనుమానం ఉన్న ఈవీఎంలను అభ్యర్థుల సమక్షంలోనే సీలు తీసి పరిశీలించారు. మొత్తం అందులో ఉన్న 71 ఈవీఎంలను తనిఖీ చేశారు. అన్ని ఈవీఎంలలో రిజల్ట్ సున్నాలు రావడంతో అది రిజర్వ్, ట్రైనింగ్ ఈవీఎంలుగా విచారణాధికారులు నిర్ధారించారు.
 
 ఆ ఈవీఎంలలో అవకతవకలు లేవు
 కాలేజీలో భద్రపరచిన ఈవీఎంల పరిశీలన అనంతరం విచారణాధికారి, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంలలో ఎటువంటి పోలు కాలేదని, అవి రిజర్వ్‌లో ఉంచినవని చెప్పారు. అయితే ఈవీఎంలను భద్రపరిచే విషయంలో స్థానిక ఎన్నికల, రెవెన్యూ అధికారులు నిబంధనలు విస్మరించారని, స్ట్రాంగ్ రూంల వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం వలనే వివాదం తలెత్తిందని తమ పరిశీలనలో తేలిందన్నారు. దీనిపై అన్ని వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు నివేదించనున్నామన్నారు. దీంతో 24 గంటలుగా చీరాలలో ఉద్రిక్తతకు కారణమైన ఈవీఎంల వివాదానికి తెరపడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement