సాక్షి ప్రతినిధి, కడప: ప్రజావిశ్వాసం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ చీప్‌ట్రిక్స్‌కు పాల్పడుతోంది. పోలింగ్ ఏజెంట్లు లేకపోయినా పోలీసులను అడ్డుపెట్టుకుని దేవగుడి గ్రామంలో రీపోలింగ్‌కు ఆదేశాలు తీసుకువచ్చారు. శాంతిభద్రతల సమస్యను బూచిగా చూపి కేంద్ర ఎన్నికల కమిషన్ రీపోలింగ్ ఆదేశాలు జారీ చేసింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి. రామసుబ్బారెడ్డి స్వగ్రామం గుండ్లకుంటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సి. ఆదినారాయణరెడ్డికి పోలింగ్ ఏజెంటు లేరు. అలాగే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి స్వగ్రామమైన దేవగుడిలో టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డికి పోలింగ్ ఏజెంటు లేరు. ఆ రెండు గ్రామాలు దశాబ్దాల తరబడి ఆయా నేతలకు ఏకపక్షంగా నిలుస్తున్నాయి. అందులో భాగంగా ఈనెల 7న నిర్వహించిన పోలింగ్ సందర్భంగా ఆయా గ్రామాల్లో పాత చరిత్ర పునరావృతమైంది.
వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న టీడీపీ..
ఓటమి తప్పదని భావించిన తెలుగుదేశం పార్టీ గత కొద్ది రోజుల నుంచి వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ముందస్తు వ్యూహంలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జమ్మలమడుగు, లింగాల, పులివెందుల మండలాల పరిధిలో పోలింగ్ ఏజెంట్లను మండల పరిధిలో అనుమతించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నేతల అభ్యర్థన పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ మండల పరిధిలోని ఓటరు పోలింగ్ ఏజెంటుగా కూర్చోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జమ్మలమడుగు చెందిన రామకృష్ణారెడ్డి, అవినాష్ దేశాయ్ అనే వ్యక్తులు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు జస్టిస్ ఆర్. సుభాషన్‌రెడ్డి, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తిల ధర్మాసనం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను రద్దు చేసింది. ఎన్నికల నియమావళి ఆధారంగా బూత్ పరిధిలోని వారినే పోలింగ్ ఏజెంటుగా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేవగుడి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి పోలింగ్ ఏజెంటు లభించలేదని తెలుస్తోంది. దేవగుడి పరిధిలోని మూడు బూత్‌లలో 93 శాతం పోలింగ్ నమోదైంది.
పావుగా ఉపయోగపడిన ఏఎస్పీ నాయుడు...
తెలుగుదేశం పార్టీ ఎత్తుగడలకు జమ్మలమడుగు ఏఎస్పీ వెంకటఅప్పలనాయుడు పావుగా ఉపయోగపడ్డారని విశ్లేషకుల అభిప్రాయం. పోలింగ్ బూత్‌లలోకి పోలీసు అధికారులు వెళ్లరాదని నిబంధలు ఉన్నాయి. అయినప్పటికీ దేవగుడి పోలింగ్ బూత్‌లోకి ఏఎస్పీ నాయుడు వెళ్లారు. పోలింగ్ బూత్‌లోకి మీకేంపని అంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తనయుడు సుధీర్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆయన ఒక్కమారుగా సుధీర్‌ను చొక్కాపట్టుకొని లాక్కొచ్చినట్లు సమాచారం. ఆ పరంపరలో దేవగుడిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసు వాహనాలు ధ్వంసం కావడం, ఏఎస్పీ నాయుడు గాలిలోకి కాల్పులు జరపడం లాంటి సంఘటనలు జరిగాయి. అదే అంశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్,ఎన్నికల అధికారి కోన శశిధర్‌ను నివేదిక కోరారు. దేవగుడి గ్రామంలో నిబంధనల మేరకు పోలింగ్ ముగిసిందని ఎన్నికల కమిషన్‌కు ఆయన నివేదికలు అందజేసినట్లు సమాచారం. అయితే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కావడంతోనే దేవగుడిలోని 80, 81, 82 పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
పోలింగ్ శాతం తగ్గించాలనే ఎత్తుగడ..
దేవగుడి గ్రామంలో మూడు పోలింగ్ బూత్‌లలో 2784 ఓట్లు పోలయ్యాయి. రీపోలింగ్ నిర్వహించడం ద్వారా పోలింగ్ శాతాన్ని భారీగా తగ్గించవచ్చనే అంచనాతోనే తెలుగుదేశం పార్టీ అడుగులు వే సినట్లు విశ్లేషకుల భావన. ఓటమి తప్పదని భావించిన ఆ పార్టీ నేతలు రాజ్యసభసభ్యుడు సీఎం రమేష్ నేతృత్వంలో దింపుడు కళ్లెం ఆశలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగానే జమ్మలమడుగు, చాపాడులో రీపోలింగ్ జరిపిస్తామని ప్రకటించి ఆ మేరకు ఆదేశాలు ఇప్పించారని తెలుగుతమ్ముళ్లు పేర్కొంటున్నారు. చీప్‌ట్రిక్స్ వల్ల పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికి ఓవైపు అధినేత, మరోవైపు జిల్లాలోని తెలుగుతమ్ముళ్ల మెప్పుకోసం సీఎం రమేష్ తాపత్రయపడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
13న దేవగుడిలో రీ పోలింగ్
జమ్మలమడుగు, న్యూస్‌లైన్: జమ్మలమడుగు మండల పరిధిలోని దేవగుడి గ్రామంలో 80,81,82 పోలింగ్ కేంద్రాల్లో 13వతేదీన రీ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రఘునాథరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ మూడు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7గంటలనుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. 80వ పోలింగ్ కేంద్రంలో 1017 మంది ఓటర్లు, 81లో 1006 మంది, 82వ పోలింగ్ కేంద్రంలో 959 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు.
చీప్ ట్రిక్స్
Published Sun, May 11 2014 3:47 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement