మోదం..ఖేదం
సాక్షి,ఒంగోలు:సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటములకు దారితీసిన అంశాలను రాజకీయ పార్టీలు అంతర్గతంగా విశ్లేషించుకుంటున్నాయి. ఓడిపోవడానికి కారణమైన అంశాలను ఆరాతీస్తూ.. ప్రధాన రాజకీయ పార్టీలు కుమిలిపోతున్నాయి. నేతల మధ్య సమన్వయ లోపం..గెలుపుధీమాపై మితిమీరిన ఆత్మవిశ్వాసం వంటి అంశాలే అభ్యర్థుల ఓటమికి కారణమని సీనియర్లు తేల్చిచెబుతుండగా... సామాజికవర్గ ఓట్ల ప్రభావంతో అందివచ్చే గెలుపు అవకాశాలను కూడా చేజార్చుకున్నామని బాధిత అభ్యర్థులు పశ్చాత్తాప పడుతున్నారు.
ఇదేక్రమంలో నియోజకవర్గాల్లో తమ విజయానికి కలిసొచ్చే అంశాల్ని సైతం తెలిసిమరీ విస్మరించారనే వాస్తవాల్ని ప్రధాన రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. జిల్లా పరిధిలోని రెండు లోక్‌సభ, 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, వాటిల్లో ఒక లోక్‌సభ వైఎస్సార్ కాంగ్రెస్‌కు దక్కగా.. మరొకటి టీడీపీ కైవసం చేసుకుంది. అసెంబ్లీల్లో ఆరు నియోజకవర్గాలను వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకోగా, టీడీపీ మాత్రం ఐదు స్థానాలకు పరిమితమైంది.
ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి పాగావేశాడు. ఆయా రాజకీయ పార్టీలు గెలుపోటములు సహజమని భావిస్తున్నప్పటికీ, నియోజకవర్గాల ఓటర్లు ఇచ్చిన తీర్పును ఎవరికి వారు విశ్లేషించుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే శనివారం నేతలంతా కలిసి ప్రయివేటు సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. తాము పోటీ చేసిన నియోజకవర్గాల్లో పోలింగ్‌బూత్‌ల వారీగా.. పోలయిన ఓట్లతో పాటు రౌండ్‌లవారీ ఫలితాలను సమీక్షించుకుంటున్నారు.
ఈ ప్రకారంగా ఏఏ ప్రాంతాల పోలింగ్‌బూత్‌ల్లో తమకు పడిన అనుకూల, ప్రతికూల ఓటింగ్‌ను బట్టి ఓటమికి దారితీసిన పరిస్థితులను అన్వేషిస్తున్నారు. అయితే, జిల్లా ఓటర్లు మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో ‘నువ్వా..నేనా..?’ అని పోటీపడిన వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలకు పెద్ద రాజకీయ అనుభవం నేర్పాయని..అంశాలవారీగా గుణపాఠం చెప్పినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సత్తా చాటిన వైఎస్సార్ సీపీ..
పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సాధారణ ఎన్నికల బరిలో నిల్చొన్న వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లాలో తన సత్తా చాటుకుంది. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సగం స్థానాలు (సంతనూతలపాడు, అద్దంకి, యర్రగొండపాలెం, మార్కాపురం, కందుకూరు, గిద్దలూరు) కైవసం చేసుకుంది. దర్శి, పర్చూరు, చీరాల, కొండపి, ఒంగోలు, కనిగిరి స్థానాల్లో ఓటమి పాలైంది. ఇప్పటికే జిల్లాపరిషత్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించిన వైఎస్సార్ కాంగ్రెస్ తాజాగా, ఆరు స్థానాల్లో పార్టీ జెండాను రెపరెపలాడించడంతో జిల్లాలో ఆ పార్టీ అధికార బలం పెరిగింది.
ఇదిలాఉంటే, ఓటమికి దారి తీసిన అంశాల్లోకొస్తే.. కొన్నిచోట్ల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లినప్పటికీ, ఓటర్లను ప్రలోభపెట్టడంలో టీడీపీతో పోటీ పడలేకపోయామని అంగీకరిస్తున్నారు. ఆర్థిక బలం చాలకపోవడం.. ప్రత్యర్థులు కొన్నిప్రాంతాల ఓటర్లను ఎంచుకుని మరీ భారీగా మద్యం పంపిణీ చేయించినట్లు తెలుసుకుని బాధపడుతున్నారు. దీంతోపాటు వైఎస్సార్ సీపీ నేతలు ఎవరికి వారు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల ప్రచారానికే పరిమితమవడం... ఇతరుల గెలుపునకు సహకరించకపోవడం పెద్దసమస్యగా పరిణమించిందని పరిశీలకులు వివరిస్తున్నారు.
పశ్చిమాన్ని వదిలేసి చేతులెత్తేసిన టీడీపీ
జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో టీడీపీ సత్తా చాటకపోవడం స్వయంకృతాపరాధమేనంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు. ఆ ప్రాంత నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం..ఎవరికి వారు తమకేం పట్టిందని నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అక్కడ నాయకత్వ లోపమే ఓటమికి పనిచేసింది. ఫలితంగా మార్కాపురం సహా పశ్చిమప్రాంతమంతా టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందనేది పార్టీవర్గాల వాదన. పరిషత్ ఎన్నికల్లో గెలుపు అవకాశాలను దెబ్బతీసింది కూడా పార్టీ నేతల వైఖరేనని ఘంటాపథంగా చెబుతుండటం గమనార్హం.
సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థిగా బీఎన్ విజయ్‌కుమార్ కాంగ్రెస్‌ను కాదని వచ్చినా ఫలితం దక్కలేదు. అతనికి సీటిచ్చినట్లు ప్రకటించిన మరుసటిరోజే.. ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి పొత్తుల్లో భాగంగా కట్టబెట్టామనడం.. మరలా అతను పోటీలో ఉంటారనడం ఓటర్లను గందరగోళానికి గురిచేసింది. అతనికి పార్టీసహకారం అందించలేదు.
యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు తెలిసిందే.
కందుకూరులోనూ ఓటర్లను ఆకర్షించలేకపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి పోటీచేసిన కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని ప్రతికూల ఓటింగ్‌ను గుర్తించకపోవడం ఓటమికి దారి తీసిందని అంచనావేస్తున్నారు.
చీరాలను చేజేతులా స్వతంత్ర అభ్యర్థికి కట్టబెట్టడంలో పోతుల సునీతకు స్థానిక పార్టీ నాయకత్వం వెన్నుపోటు పొడిచిందని చెబుతున్నారు.