రోడ్డెక్కిన మార్టూరు గ్రానైట్ అక్రమ దందా రచ్చ
పర్చూరు ఎమ్మెల్యే, మంత్రి గొట్టిపాటి వర్గాల మధ్య విభేదాలు
లారీకి రూ. 32 వేలు చొప్పున పర్చూరు ఎమ్మెల్యే అనుచరుల వసూలు
తమ లారీలకు మామూళ్లు ఇచ్చేది లేదంటున్న మంత్రి అనుచరులు
ఇరువర్గాల మధ్య ముదిరిన వివాదం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: మార్టూరు గ్రానైట్ అక్రమ రవాణా వ్యవహారం అధికారపార్టీలో అగ్గి రాజేస్తోంది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య ఇది మరింత విభేదాలు సృష్టించింది. గ్రానైట్ అక్రమ రవాణాకు సంబంధించి ప్రతి లారీకి కప్పం కట్టాల్సిందేనంటూ పర్చూరు ఎమ్మెల్యే అనుచరులు పట్టుబడుతుండగా, తాము చెల్లించేది లేదంటూ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి అనుచరులు తెగేసి చెబుతున్నారు. వీరి మధ్య ముదిరిన ఈ వివాదం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
జీరో బిల్లులతో అక్రమ రవాణా
ప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్టీతో పాటు ఎటువంటి పన్నులు చెల్లించకుండా జీరో బిల్లులతో మార్టూరు నుంచి గ్రానైట్ నిత్యం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, పలు దేశాలకు తరలిపోతోంది. రోజుకు కనీసం 80 లారీల్లో 30 నుంచి 45 టన్నుల పాలిషింగ్ బండలు ఇలా జీరో బిల్లులతో తరలిస్తున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీలు పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరులో ఉన్నాయి.
జీరో బిల్లులతో తరలిస్తున్నందున ఇక్కడి అధికారపార్టీ ఎమ్మెల్యే అనుచరులు వసూళ్లకు పాల్పడుతున్నారు. మార్టూరు నుంచి తెలంగాణకు లారీ వెళ్లాలంటే బాపట్ల జిల్లాలోని పర్చూరు, అద్దంకి, పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల లేదా మాచర్ల నియోజకవర్గాలు దాటాల్సి ఉంది.
పర్చూరు నియోజకవర్గం నేతకు లారీకి రూ. 8 వేలు చెల్లిస్తుండగా చిలకలూరిపేట నేతకు రూ. 2 వేలు, నరసరావుపేట నేతకు రూ. 4 వేలు, సరిహద్దు కావడంతో మాచర్ల రూటున వెళితే అక్కడి నేతకు రూ. 10 వేలు, లేదా పిడుగురాళ్ల రూటున వెళితే అక్కడి నేతకు రూ. 10 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. రూ. 8 వేలు దందా నిర్వహకులు తమ వాటాగా తీసుకుంటున్నారు. మొత్తంగా లారీకి రూ. 32 వేలు వసూలు చేస్తున్నారు.
పర్చూరు నేత కనుసన్నల్లోనే వసూళ్ల పర్వం..
డబ్బు చెల్లించిన లారీలను మాత్రమే పిడుగురాళ్ల లేదా మాచర్ల నుంచి తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. లారీకి చెల్లించాల్సిన రూ. 32 వేలు వసూలయ్యాకే వాటిని పంపుతున్నారు. ఇలా వసూలైన మొత్తాన్ని పర్చూరు నేత అనుచరులు అందరికీ పంపకాలు చేస్తున్నారు.
ఈ వ్యవహారాన్ని ఆ పర్చూరు నేత మార్టూరు మండలానికి చెందిన ఓ బీసీ నేతకు అప్పగించారు. ఆవ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతకు రూ. 2 కోట్లు ఎన్నికల ఫండ్ ముట్టజెప్పాడని సమాచారం. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి వారం నుంచే గ్రానైట్ అక్రమ రవాణా వ్యవహారం అతనికి కట్టబెట్టారని తెలుస్తోంది.
కప్పం కట్టేందుకు ససేమిరా..
మంత్రి గొట్టిపాటి సొంత గ్రామం పర్చూరు నియోజకవర్గంలోని యద్దనపూడి మండలంలో ఉంది. మార్టూరు గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకుల్లో మంత్రి అనుచరులు కూడా ఉన్నారు. మంత్రికి అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మార్టూరులోని 250 పాలిషింగ్ పరిశ్రమలకు గ్రానైట్ రాయి (ముడిరాయి)ని తరలిస్తారు.
గొట్టిపాటి క్వారీల నుంచి రాయిని తెచ్చుకోవడం, పైగా సొంత నియోజకవర్గానికి చెందినవారు కావడంతో గ్రానైట్ వ్యాపారులకు మంత్రితో సత్సంబంధాలున్నాయి. కొందరు బంధువులు కూడా ఉన్నారు. వీరంతా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే అనుచరులకు కప్పం కట్టేది లేదంటూ తేల్చి చెబుతున్నారు.
తమ నియోజకవర్గంలో ఉన్న ఫ్యాక్టరీల నుంచి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నందున తమ నేతకు కప్పం కట్టాల్సిందేనంటూ పర్చూరు ఎమ్మెల్యే అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మంత్రి సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలో ఉంది కాబట్టి కట్టించుకుంటున్న కప్పంలో వాటా ఇవ్వాలని గొట్టిపాటి అనుచరులు మెలిక పెట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య అగ్గిరాజుకుంది.
ఈ వ్యవహారం అద్దంకి, పర్చూరు ప్రాంతాల్లోనే కాక జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి అధిష్టానానికి సైతం ఈ రచ్చ చేరినట్లు అధికారపార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ప్రభుత్వాదాయానికి భారీగా గండి..
అధికార పార్టీకి చెందిన వారే ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తుండటంతో ఖజానాకు భారీగా గండి పడుతోంది. ప్రతి టన్ను పాలిషింగ్ రాయికి సేల్స్‌టాక్స్ రూ. 1,300, మైనింగ్ ట్యాక్స్ రూ. 700 చొప్పున మొత్తం రూ. 2 వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ లెక్కన 35 టన్నుల లారీకి రూ. 70 వేలు ట్యాక్స్ చెల్లించాలి. రోజుకు 80 లారీలు అనుకుంటే రూ. 56 లక్షలు ట్యాక్స్ రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించకుండా అక్రమ మార్గంలో గ్రానైట్‌ను తరలిస్తున్నారు. అయినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment