Granite smuggling
-
ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: మార్టూరు గ్రానైట్ అక్రమ రవాణా వ్యవహారం అధికారపార్టీలో అగ్గి రాజేస్తోంది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య ఇది మరింత విభేదాలు సృష్టించింది. గ్రానైట్ అక్రమ రవాణాకు సంబంధించి ప్రతి లారీకి కప్పం కట్టాల్సిందేనంటూ పర్చూరు ఎమ్మెల్యే అనుచరులు పట్టుబడుతుండగా, తాము చెల్లించేది లేదంటూ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి అనుచరులు తెగేసి చెబుతున్నారు. వీరి మధ్య ముదిరిన ఈ వివాదం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జీరో బిల్లులతో అక్రమ రవాణాప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్టీతో పాటు ఎటువంటి పన్నులు చెల్లించకుండా జీరో బిల్లులతో మార్టూరు నుంచి గ్రానైట్ నిత్యం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, పలు దేశాలకు తరలిపోతోంది. రోజుకు కనీసం 80 లారీల్లో 30 నుంచి 45 టన్నుల పాలిషింగ్ బండలు ఇలా జీరో బిల్లులతో తరలిస్తున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీలు పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరులో ఉన్నాయి. జీరో బిల్లులతో తరలిస్తున్నందున ఇక్కడి అధికారపార్టీ ఎమ్మెల్యే అనుచరులు వసూళ్లకు పాల్పడుతున్నారు. మార్టూరు నుంచి తెలంగాణకు లారీ వెళ్లాలంటే బాపట్ల జిల్లాలోని పర్చూరు, అద్దంకి, పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల లేదా మాచర్ల నియోజకవర్గాలు దాటాల్సి ఉంది. పర్చూరు నియోజకవర్గం నేతకు లారీకి రూ. 8 వేలు చెల్లిస్తుండగా చిలకలూరిపేట నేతకు రూ. 2 వేలు, నరసరావుపేట నేతకు రూ. 4 వేలు, సరిహద్దు కావడంతో మాచర్ల రూటున వెళితే అక్కడి నేతకు రూ. 10 వేలు, లేదా పిడుగురాళ్ల రూటున వెళితే అక్కడి నేతకు రూ. 10 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. రూ. 8 వేలు దందా నిర్వహకులు తమ వాటాగా తీసుకుంటున్నారు. మొత్తంగా లారీకి రూ. 32 వేలు వసూలు చేస్తున్నారు. పర్చూరు నేత కనుసన్నల్లోనే వసూళ్ల పర్వం..డబ్బు చెల్లించిన లారీలను మాత్రమే పిడుగురాళ్ల లేదా మాచర్ల నుంచి తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. లారీకి చెల్లించాల్సిన రూ. 32 వేలు వసూలయ్యాకే వాటిని పంపుతున్నారు. ఇలా వసూలైన మొత్తాన్ని పర్చూరు నేత అనుచరులు అందరికీ పంపకాలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఆ పర్చూరు నేత మార్టూరు మండలానికి చెందిన ఓ బీసీ నేతకు అప్పగించారు. ఆవ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతకు రూ. 2 కోట్లు ఎన్నికల ఫండ్ ముట్టజెప్పాడని సమాచారం. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి వారం నుంచే గ్రానైట్ అక్రమ రవాణా వ్యవహారం అతనికి కట్టబెట్టారని తెలుస్తోంది.కప్పం కట్టేందుకు ససేమిరా.. మంత్రి గొట్టిపాటి సొంత గ్రామం పర్చూరు నియోజకవర్గంలోని యద్దనపూడి మండలంలో ఉంది. మార్టూరు గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకుల్లో మంత్రి అనుచరులు కూడా ఉన్నారు. మంత్రికి అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మార్టూరులోని 250 పాలిషింగ్ పరిశ్రమలకు గ్రానైట్ రాయి (ముడిరాయి)ని తరలిస్తారు. గొట్టిపాటి క్వారీల నుంచి రాయిని తెచ్చుకోవడం, పైగా సొంత నియోజకవర్గానికి చెందినవారు కావడంతో గ్రానైట్ వ్యాపారులకు మంత్రితో సత్సంబంధాలున్నాయి. కొందరు బంధువులు కూడా ఉన్నారు. వీరంతా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే అనుచరులకు కప్పం కట్టేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. తమ నియోజకవర్గంలో ఉన్న ఫ్యాక్టరీల నుంచి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నందున తమ నేతకు కప్పం కట్టాల్సిందేనంటూ పర్చూరు ఎమ్మెల్యే అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మంత్రి సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలో ఉంది కాబట్టి కట్టించుకుంటున్న కప్పంలో వాటా ఇవ్వాలని గొట్టిపాటి అనుచరులు మెలిక పెట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య అగ్గిరాజుకుంది. ఈ వ్యవహారం అద్దంకి, పర్చూరు ప్రాంతాల్లోనే కాక జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి అధిష్టానానికి సైతం ఈ రచ్చ చేరినట్లు అధికారపార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ప్రభుత్వాదాయానికి భారీగా గండి..అధికార పార్టీకి చెందిన వారే ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తుండటంతో ఖజానాకు భారీగా గండి పడుతోంది. ప్రతి టన్ను పాలిషింగ్ రాయికి సేల్స్‌టాక్స్ రూ. 1,300, మైనింగ్ ట్యాక్స్ రూ. 700 చొప్పున మొత్తం రూ. 2 వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ లెక్కన 35 టన్నుల లారీకి రూ. 70 వేలు ట్యాక్స్ చెల్లించాలి. రోజుకు 80 లారీలు అనుకుంటే రూ. 56 లక్షలు ట్యాక్స్ రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించకుండా అక్రమ మార్గంలో గ్రానైట్‌ను తరలిస్తున్నారు. అయినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. -
కోట్లు కొల్లగొడుతున్న ‘లగాన్ గ్యాంగ్’.. కుదిరితే మామూళ్లు, లేదంటే కత్తి
ముందు ఒక కారు...ఆ వెనుక నాలుగు బైక్‌లు.. అందరూ బలిష్టంగా ఉంటారు. చూడగానే రౌడీల్లా కనిపిస్తారు. ‘లగాన్ గ్యాంగ్’గా పేరుపొందిన వీరు అక్రమ రవాణాను అన్నీ తామై నడిపిస్తారు. ఎలాంటి బిల్లులు లేకుండా గ్రానైట్ తరలించే లారీలకు ముందు వెళ్తుంటారు. దారిలో ఎవరైనా లారీలను ఆపితే మామూళ్లతో మచ్చిక చేసుకోవాలనుకుంటారు...కుదరకపోతే మెడపై కత్తి పెట్టి బెదిరిస్తారు. అదీ కాకపోతే దాడులకు సైతం దిగుతారు. అంతిమంగా అక్రమ రవాణాకు అండదండలు అందిస్తుంటారు. ఇందుకోసం ఒక్కో లోడుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా వసూలు చేస్తారు. రాయల్టీ రూపంలో సర్కారు ఖాజానాకు చేరాల్సిన రూ.కోట్ల సొమ్మును కొట్టేస్తున్నారు. సాక్షి,తాడిపత్రి : తాడిపత్రి....గ్రానైట్ పరిశ్రమకు పేరుగాంచింది. కానీ చుట్టుపక్కల ఎక్కడా క్వారీలు లేవు. గ్రానైట్ బండలన్నీ చిత్తూరు, ఒంగోలు, పొదిలి, కనిగిరి, కృష్ణగిరి నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. ఒక లోడు గ్రానైట్ బండలు క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే ‘లగాన్ గ్యాంగ్’ రాయల్టీ లేకుండానే రవాణా చేస్తామని క్వారీ, పాలిష్ మిషన్ యూనిట్ల వ్యాపారులతో ఒప్పందం చేసుకుంటోంది. గ్రానైట్ బండల లారీ బయలుదేరగానే పైలెట్‌గా ముందు వెళ్తారు. చెక్ పోస్టులు, అధికారుల తనిఖీని సైతం వారే మేనేజ్ చేస్తారు. ఇందుకు ఒక్కో లారీ లోడ్‌కు రూ.20 వేల నుంచి రూ.30 వేలు తీసుకుంటారు. తక్కువ మొత్తంతోనే పని జరుగుతుండటంతో వ్యాపారులు కూడా ‘జీరో’ దందాకే మొగ్గు చూపుతున్నారు. అందువల్లే ఇతర ప్రాంతాల్లోని క్వారీల నుంచి గ్రానైట్ బండలు తాడిపత్రికి రావాలన్నా...తాడిపత్రిలో పాలిష్ అయిన బండలు జిల్లా దాటాలన్నా ‘లగాన్ గ్యాంగ్’ కీలకంగా మారింది. విజిలెన్స్ కళ్లుగప్పి అక్రమ రవాణా విజిలెన్స్ అధికారులు దాడులకు దిగితే..ఆ విషయం ముందుగానే లగాన్ గ్యాంగుకు తెలిసిపోతుంది. దీంతో దారి తప్పించే చర్యలకు ‘పైలెట్లు’ ఉపక్రమిస్తారు. ఒక వేళ మరీ తప్పదనుకుంటే లారీలోని గ్రానైట్ పరిమాణాన్ని బిల్లులో తక్కువ చూపించి రవాణా చేస్తారు. ఒకే బిల్లుతో 5 నుంచి 6 లోడ్లు తరలిస్తారు. ఈ మొత్తం తతంగంలో అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి బాగోగులు చూసుకుంటారు. రెండేళ్లుగా బ్రేక్...మళ్లీ ప్రారంభం 2015 ఆగస్టులో భూగర్భ గనుల శాఖ విజిలెన్స్ ఏడీగా ప్రతాప్‌రెడ్డి ఉండేవారు. తాడిపత్రిలో కొనసాగుతున్న అక్రమాలను చూసి ఆయన నివ్వెరపోయారు. బిల్లులు సక్రమంగా లేని లారీలకు భారీగా జరిమానాలు విధించారు. దీంతో అప్పట్లో జేసీ సోదరుల ప్రధాన అనుచరుడు పొట్టి రవి ఆయన్ను బెదిరించారు. అయినప్పటికీ విజిలెన్స్ ఏడీ భయపడకుండా దాడులు మరింత ముమ్మరం చేశారు. ఇలా రెండేళ్లలో గ్రానైట్ అక్రమ దందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు జరిమానా రూపంలో ఏటా రూ. కోటి వసూలయ్యేది. ప్రతాప్‌రెడ్డి వచ్చాక 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారు. దీంతో లగాన్ గ్యాంగ్ ప్రతాప్‌రెడ్డిని దారికి తెచ్చుకోవాలని చూసింది... ఆ తర్వాత బెదిరించింది. భౌతిక దాడులకు యతి్నంచింది. అయినా ఫలితం లేకపోకపోవడంతో తమ ‘పచ్చ’ నేతలకు చెప్పి అవినీతి మరక అంటించేందుకు ప్రతాప్‌రెడ్డిపై డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయించింది. అయితే ఉన్నతాధికారులు ఏడీ ప్రతాప్‌రెడ్డికి క్లీన్చిట్ ఇచ్చారు. లగాన్ గ్యాంగ్‌కు ‘పచ్చ’నేత అండదండలు తాడిపత్రిలోని శ్రీనివాసపురానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఈ లగాన్ గ్యాంగ్‌కు బాస్‌గా వ్యవహరిస్తున్నాడు. జేసీ సోదరుల అండతో గతంలోనూ ‘లగాన్ గ్యాంగ్’ను నడిపించేవాడు. టీడీపీ హయాంలో మైనింగ్ ఏడీ ప్రతాప్‌రెడ్డిని బెదిరించిన కేసులోనూ అతను నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతనే మళ్లీ జీరో దందాను ప్రోత్సహిస్తున్నాడు. కర్నూలు జిల్లాలోని ఆదోని సమీపంలోని క్వారీల నుంచి తాడిపత్రి గ్రానైట్ పరిశ్రమలకు ముడి సరుకును యథేచ్ఛగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నాడు. తెలిసినా...కన్నెత్తి చూడని అధికారులు తాడిపత్రిలో గ్రానైట్ మాఫియా సాగిస్తోన్న అక్రమ దందా భూగర్భ గనుల శాఖ అధికారులకు తెలిసినా ‘లగాన్ గ్యాంగ్’తో వారికున్న సత్సంబంధాలతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఏడీ ప్రతాప్‌రెడ్డి జీరో దందాకు అడ్డుగా నిలవగా, గనులశాఖ ఉన్నతాధికారులు మాత్రం మామూళ్లు తీసుకుని ‘మాఫియా’కే మద్దతిచ్చారు. అందువల్లే ఏ ఒక్క అధికారి కూడా తాడిపత్రి వైపు కన్నెత్తి చూడలేదని గనులశాఖ సిబ్బందే చెబుతున్నారు. -
దళారులే సూత్రధారులు
సాక్షి, ఒంగోలు: గ్రానైట్ అక్రమ రవాణా వ్యవహారంలో రాజకీయ దళారులే అసలు సూత్రధారులని పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో అక్రమాలకు సహకరించిన టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఫ్యాక్టరీ యజమానుల నుంచి గ్రానైట్‌ను బిల్లులు లేకుండా తక్కువ ధరకు కొనుగోలు చేసి అన్ని శాఖల అధికారులకు తాయిలాలు ఇచ్చి రాష్ట్రాలు దాటించిన వ్యవహారంలో టీడీపీ నేతల అనుచరుల పాత్ర బయటపడింది. దీంతో ఎక్కడ తమ బండారం బయట పడుతుందోనన్న భయంతో విచారణ జరుపుతున్న పోలీసు అధికారిని టార్గెట్ చేస్తున్నారు. నకిలీ వే బిల్లులతో గ్రానైట్‌ను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతున్నారు. ఒకప్పుడు తిండికి తికాణా లేని అనామకులు అక్రమ వ్యాపారంలో అడ్డగోలుగా సంపాదించి కోట్లకు పడగలెత్తారంటే గ్రానైట్ మాఫియా ఏ స్థాయిలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. మార్టూరు మండలంలో నకిలీ కంపెనీలు సృష్టించి దొంగ వేబిల్లులు పొంది అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే వ్యవహారాన్ని అక్కడి ఎస్సై బయటకు తీయడంతో గ్రానైట్ మాఫియా డొంక కదిలినట్టయింది. అప్పట్లో నకిలీ కంపెనీలు సృష్టించిన వారిని అరెస్టు చేసి విచారిస్తే కళ్లు చెదిరే వాస్తవాలు బయట పడిన విషయం తెలిసిందే. ఒక్క ఏడాది వ్యవధిలో ఒక మండలంలో జరిగిన గ్రానైట్ అక్రమ రవాణాకు సంబంధించి రాయల్టీ, జీఎస్టీ లెక్కిస్తే సుమారు రూ.85 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి çపడిందంటే టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎంత మేర అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిందో లెక్కకు కూడా అందని పరిస్థితి. అక్రమార్కుల చేతుల్లోకి పరిశ్రమ.. జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించే గ్రానైట్ పరిశ్రమ కొందరు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయింది. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆ పార్టీ నేతలు దళారులుగా మారి బిల్లులు లేకుండా గ్రానైట్ లారీలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ వచ్చారు. ఇందు కోసం ఒక్కో లారీకి రూ.30 వేల వరకు వసూలు చేశారు. ఇటీవల మార్టూరు పరిధిలో బయటపడిన నకిలీ వే బిల్లుల కుంభకోణం వ్యవహారంలో ఫ్యాక్టరీ యజమానుల కంటే దళారులే కీలక సూత్రధారులుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. సుమారు 19వేల వే బిల్లులు అక్రమ మార్గంలో పొంది వాటి ద్వారా గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడ్డట్లు పోలీసులు నిర్థారించి కొందరిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన రూ.85 కోట్లు గ్రానైట్ మాఫియా బీరువాల్లోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల మార్టూరు పోలీసులు అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. సదరు వ్యక్తి ఓ టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో నిజాయితీగా పనిచేస్తున్న పోలీసు అధికారిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టారు. తాము చేసిన తప్పుడు పనులు బయటకొచ్చే సమయంలో తప్పుడు ఆరోపణలతో తప్పించుకోవాలనే కుట్రలు పన్నుతూనే ఉన్నారు. తమ అనుచరులను విచారిస్తే దాని వెనుకున్న తమపేర్లు ఎక్కడ బయటకొస్తాయోననే భయం టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. లోతుగా విచారిస్తే కదలనున్న డొంక... నకిలీ కంపెనీలు సృష్టించి దొంగ వే బిల్లులు పొంది గ్రానైట్‌ను ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసిన వ్యవహారంలో పోలీసు శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి లోతుగా విచారణ జరిపితే టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల డొంక కదులుతుందనేది బహిరంగ రహస్యమే. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అప్పట్లో ఉన్నఅధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని వేల లారీల గ్రానైట్‌ను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి వందల కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిన విషయం వెలుగులోకి రావడం ఖాయమని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఒక్క ఎస్సై జరిపిన విచారణలోనే సుమారు రూ.100 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండి కొట్టారంటే జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపితే సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు బయటకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అక్రమ దందా సాగేదిలా... టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో గ్రానైట్ అక్రమ రవాణా మొత్తం టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరిగిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులు గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి బిల్లులు లేకుండా లారీలు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ఒక్కో లారీకి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు బేరం కుదుర్చుకుని అన్ని శాఖల అధికారులకు మామూళ్లు ఇస్తూ అధికారిక దందా కొనసాగిస్తారు. బిల్లులు లేకుండా వెళ్లే గ్రానైట్ లారీకి కిలో మీటరు దూరంలో టీడీపీ నేతల అనుచరులు బైక్‌లు, కార్లతో విజిలెన్స్, ఇతర శాఖల అధికారుల కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉంటారు. అధికారులు ఉంటే వెంటనే సమాచారం అందించి లారీని వేరే మార్గం ద్వారా మళ్లిస్తారు. ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లాలోని నాగార్జున సాగర్, పొందుగల సరిహద్దు చెక్ పోస్టులు దాటించే వరకు టీడీపీ నేతల అనుచరులు గ్రానైట్ లారీలకు రక్షణ కవచంలా వ్యవహరిస్తారు. ఇలా రోజుకు 50 నుంచి 100 లారీల వరకు అక్రమంగా ఇతర రాష్ట్రాలకు చేరుస్తారు. రోజుకు టీడీపీ నేతల ఆదాయం రూ.15 లక్షలకు పైగానే ఉంటుందంటే అక్రమ దందా ఏ స్థాయిలో నడిచిందో అర్థం చేసుకోవచ్చు. -
రోడ్డే గ్రానైట్ అడ్డా!
ప్రకాశం, బల్లికురవ: అధికారం చేతిలో ఉందని మంత్రి, మరో 4 క్వారీల యజమానులు ఆర్అండ్బీ రోడ్డును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రోడ్డును అడ్డాగా చేసుకుని గ్రానైట్ మీటరు, ముడి రాళ్లను క్వారీ నుంచి దొర్లించటంతో తారు రోడ్డు సైతం మట్టిరొడ్డుగా మారి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. కోట్లు వెచ్చించి ఇటీవల అభివృద్ధి పరచిన రోడ్డును క్వారీదార్లు తమ ఆధీనంలోకి తీసుకున్నా అధికార్లు చూసీ చూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అడిగేవారే లేక పోవటంతో వేళాపాళా లేకుండా బ్లాస్టింగ్ మోతలు అధికమయ్యాయి. బ్లాస్టింగ్ మోతలతో వాహన చోదకులు బెంబేలెత్తుతున్నారు. 7.6 కి.మీ రోడ్డు.. మండలంలోని చెన్నుపల్లి అనంతవరం ఆర్అండ్బీ రోడ్డులో కొండాయపాలెం గ్రామం నుంచి వేమవరం వరకు 7.6 కిలో మీటర్లను ఇటీవల రూ. 8 కోట్లతో డబుల్ రోడ్డుగా విస్తరించి అభివృద్ధి పరిచారు. ఈ రోడ్డులోనే కొండాయపాలెం–మల్లాయపాలెం గ్రామాల మధ్య కొణిదెన రెవెన్యూలోని ఈర్లకొండ విస్తరించి ఉంది. కొండలోని సూమారు 5 హెక్టార్లను లీజుకు తీసుకున్న మంత్రి శిద్దా రాఘవరావు ఆర్అండ్బీ రోడ్డును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంత్రే ఆధీనంలో తీసుకుంటే తమను అడిగేదెవరని మరో నాలుగు క్వారీల యజమానులు రోడ్డును ఆక్రమించి గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు. రోడ్డు మార్జిన్‌లోనే రాళ్లు ఈ రోడ్డు ఇరువైపులా మార్జిన్లో గ్రానైట్ మీటరు ముడిరాళ్లను నిల్వ చేస్తున్నారు. అక్కడే లారీలను నిలిపి లోడింగ్ చేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పటంలేదు. రోడ్డుపైనే క్రేన్లతో ఇటీవల నిర్మించిన తారు రోడ్డు సైతం మూన్నాళ్ల ముచ్చటగా మారి రూపం కోల్పోతోంది. ఈ పరిస్థితులకు తోడు వేళాపాళా లేకుండా బ్లాస్టింగ్ మోతలతో వాహన చోదకులు, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. రెండు మండలాల వాసులకు దగ్గరి మార్గం బల్లికురవ, సంతమాగులూరు మండలాలల్లో 40 గ్రామాల ప్రజలకు చిలకలూరిపేట, చీరాల, గుంటూరు వెళ్లాలంటే ఇదే దగ్గరి మార్గం ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించి అధికారులు చేతులు దులుపుకున్నారే తప్ప పర్యవేక్షణ లేదని వాహనచోదకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై క్వారీలు, బ్లాస్టింగ్ మోతలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కొండమీద బ్లాస్టింగ్ శబ్దానికి రాళ్లు రోడ్డు మీదకు వచ్చి పడుతున్నాయి. కొత్త వ్యక్తులు ఈ రోడ్డు ద్వారా వెళ్లాలన్నా బ్లాస్టింగ్ మోతలతో భయాందోళన చెందుతున్నారు. చెన్నుపల్లి అనంతవరం రోడ్డులో కొండాయపాలెం గ్రామసమీపంలో రోడ్డును గ్రానైట్‌దార్లు ఆధీనంలోకి తీసుకోవటం నేరమని ఆర్అండ్బీ జేఈ భాస్కరరావు అన్నారు. రోడ్డును పరిశీలించి బాధ్యులపై చర్యలు చేపడతామన్నారు. -
అక్రమ రవాణాకు రైట్.. రైట్
అది జిల్లా సరిహద్దులోని చెక్ పోస్ట్.. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే కేంద్రాల్లో దానిదే మొదటి స్థానం. అలాంటి కేంద్రంలో సిబ్బంది అక్రమార్జనకు అలవాటుపడ్డారు. వాహనాల యజమానులు, మధ్యవర్తులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చేయి తడుపుకొని రైట్ చెబుతున్నారు. ఫలితంగా ఏడాదికి రావాల్సిన దాదాపు రూ.15 కోట్ల ఆదాయంలో రూ.మూడు కోట్ల వరకు పక్కదారి పడుతోంది. కర్నూలు, కొలిమిగుండ్ల: భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలో బందార్లపల్లె క్రాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన రాయల్టీ తనిఖీ కేంద్రం అక్రమాలకు కేరాఫ్‌గా మారింది. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన తనిఖీ కేంద్రం సిబ్బందే అందినకాడికి తీసుకుని రైట్ చెప్పేస్తున్నారనే విమర్శలున్నాయి. నాపరాతి గనుల నుంచి ట్రాక్టర్లు, లారీల ద్వారా నాపరాళ్లను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. నిబంధనల ప్రకారం ఆన్లైన్లో రాయల్టీని ప్రింట్ తీసుకొని చెక్‌పోస్ట్ వద్ద అధికారులతో తనిఖీ చేయించాకే రవాణా చేయాల్సి ఉంటుంది. చాలా మంది యజమానులు అధికారులు, మధ్యవర్తులతో సన్నిహిత సంబం«ధాలు ఏర్పాటు చేసుకొని వాహనానికో రేటు చొప్పున విధించి హద్దులు దాటిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆన్లైన్ రాయల్టీ.. 1996లో మొదట అంకిరెడ్డిపల్లెలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. బందార్లపల్లె, తుమ్మలపెంట, గొర్విమానుపల్లె గ్రామాల నుంచి వాహనాలు తనిఖీ కేంద్రానికి సంబంధం లేకుండా వెళ్లిపోతుండటంతో బందార్లపల్లె క్రాస్ రోడ్డులోని జిల్లా సరిహద్దుకు మార్పు చేశారు. మొదట్లో రాయల్టీలు బుక్ రూపంలో ఉండటంతో పాటు తక్కువ ధర ఉండేది. క్రమేపీ ధరలు పెరుగుతూ వచ్చాయి. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆన్లైన్ రాయల్టీని అమలు చేసింది. రాయల్టీల ధర కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం ఏటా ప్రభుత్వానికి కేవలం రాయల్టీల రూపంలోనే దాదాపు రూ.15 కోట్లకు పైగా ఆదాయం రావాల్సి ఉన్నా అధికారుల అక్రమార్జన వల్ల రూ.3కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తోంది. సాగుతోంది ఇలా.. నాపరాళ్లను రవాణా చేయాలంటే ట్రాక్టర్‌కు రూ.500, ముప్పై టన్నుల లారీకి రూ.3వేల చొప్పున ఆన్లైన్ రాయల్టీ పొందాల్సి ఉంది. రోజుకు 500కు పైగానే ట్రాక్టర్లు, 80 వరకు లారీలు రవాణా సాగిస్తుంటాయి. లారీలకు రాయల్టీ లేకుండా సిబ్బంది వెయ్యి రూపాయలు మామూళ్లు పుచ్చుకొని పంపిస్తున్నారు. ట్రాక్టర్లకు సైతం రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ యజమానులతో నెల మామూళ్లు ఏర్పాటు చేసుకున్నారనే విమర్శలూ ఉన్నాయి. ఇక రాయల్టీలు లేకుండా రోజూ 40 లారీలకు పైగానే సాగిపోతున్నట్లు సమాచారం. చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి లారీల రూపంలోనే రూ.40 వేల అక్రమార్జన వస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు ప్రకాశం, తదితర జిల్లాల నుంచి గ్రానైట్ రాయిని అనంతపురం జిల్లాలోని ఫ్యాక్టరీలకు తరలించాలంటే ఈ చెక్‌పోస్టు మీదుగా వెళ్లాల్సిందే. గ్రానైట్ లారీలకు రూ.3వేల వరకు బహిరంగంగానే వసూలు చేస్తున్నారు. తాడిపత్రి సమీపంలోని గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి ఇళ్లకు తీసుకెళ్లే గ్రానైట్ రాళ్ల నుంచి రూ.2వేలు రాబడుతున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా.. రాయల్టీ చెక్‌పోస్ట్‌లో పేరుకు మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అక్రమంగా రవాణా చేసే వాహనాలను పట్టుకునేందుకు వీలు లేకుండా సీసీ కెమెరాలను ఆఫ్ చేస్తున్నట్లు సమాచారం. లారీల్లో ఇతర రాష్ట్రాలకు నాప, పాలీష్ రాళ్లను తరలించే వ్యక్తులు రాళ్లు కనిపించకుండా టార్పాలిన్లను కప్పుకొని వెళ్తున్నారు. అయినా సిబ్బంది అంతోఇంతో పుచ్చుకొని లారీలను తనిఖీ చేయడంలేదనే విమర్శలున్నాయి. మరికొంతమంది లారీల యజమానులు ముందుగానే సిబ్బందికి మామూళ్లు ఇస్తుండటంతో వారికి సంబంధించిన లారీలవైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. తనిఖీ కేంద్రం వద్దనే గేటు ఏర్పాటు చేసినా ఏనాడూ వాటిని ఉపయోగించిందిలేదు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా ఉన్నతాధికారుల తనిఖీలు జరిగిన దాఖలాలు మచ్చుకైనా కనిపించవు. అలాంటిదేమీ లేదు రాయల్టీ చెక్‌పోస్టులో డబ్బులు తీసుకొని లారీలు, ట్రాక్టర్లను పంపడమనేది లేదు. అలాంటిదేమైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. నాపరాళ్లను తరలించే లారీలకు టార్పాలిన్లు కట్టుకొని వెళ్తున్న విషయంపై దృష్టి సారిస్తాం. – వెంకటరెడ్డి, మైనింగ్ ఏడీ,బనగానపల్లె -
అక్రమాల ‘గనులు’
♦ అడ్డూ అదుపూ లేకుండా గ్రానైట్ అక్రమ ఎగుమతులు ♦ {పభుత్వ ఆదాయానికి భారీగా గండి ♦ కనీస చర్యలు తీసుకోని యంత్రాంగం ♦ అక్రమార్కులకు అధికారపార్టీ నేతల సహకారం పన్నులు కట్టకుండా తరలిస్తున్నా... పట్టించుకునే నాథుడే ఉండరు. ఎగుమతుల పేరుతో వందల కోట్ల రూపాయల రాయల్టీని ఎగవేస్తున్నా.. {పభుత్వాలు చర్యలు తీసుకోవు. ఇంకా మాట్లాడితే తమ అక్రమాలకు అధికారులు, అధికారపార్టీ నాయకుల వాహనాలను, చిరునామాలనూ ఉపయోగించగలరు. శ్రుతిమించిన గ్రానైట్ అక్రమ వ్యాపారం అనంతపురం జిల్లాలో ఏకంగా రైలును ఢీకొట్టి ఓ ఎమ్మెల్యేతో పాటు నలుగురి ప్రాణాలను బలిగొంది. ఈ నేపథ్యంలో జిల్లాలో గ్రానైట్ వ్యాపారుల ఆగడాలపై కథనం.. సాక్షి, చిత్తూరు : గ్రానైట్ గనులు.. జిల్లాలోని వ్యాపారులకు మణి, మాణిక్యాలుగా మారాయి. దీంతో జిల్లాలో వీరి అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలక్ష్యంతోపాటు... అధికార పార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోతోంది. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా కోట్లాది రూపాయల విలువైన గ్రానైట్‌ను నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలోని మంగళూరు ఫోర్ట్‌ల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లా నుంచి అరబ్ దేశాలతో పాటు యూరోపియన్ యానియన్ ,చైనా, జపాన్ దేశాలకు గ్రానైట్ ఎక్కువగా తరలిపోతోంది. మైనింగ్ అధికారులతో పాటు వాణిజ్య పన్నులు, రవాణా, పోలీసు, రెవెన్యూ, విజిలెన్స్ తదితర విభాగాలు అందిన కాడికి దండుకుని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి సొంతజిల్లాలో అధికారపార్టీ నేతల మితిమీరిన జోక్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పైగా చాలా మంది నాయకులకు ఈ వ్యాపారంతో ప్రతక్ష్య, పరోక్ష సంబంధాలు ఉండడం కూడా అక్రమార్కులకు వరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 330 పైగా వర్కింగ్ గ్రానైట్ గనులు ఉన్నాయి. జీ-20, ఇంగ్లీష్ టీక్, మేప్లవర్, మదనపల్లివైట్, పుంగనూరువైట్, గ్రీన్, పీకార్గ్రీన్, వైట్‌రోజ్, చిత్తూరు ఫ్యారడైజ్ తదితర గ్రానైట్ రకాలు ఉన్నాయి. వీటిలో దాదాపు చాలా రకాల గ్రానైట్‌కు ఇతర దేశాలలో డిమాండ్ ఉంది. దీంతో గ్రానైట్ యజమానులు లారీల ద్వారా కృష్ణపట్నం, చెన్నై, మంగుళూరు పోర్టులకు తరలించి అక్కడి నుండి విదేశాలకు చేరవేస్తున్నారు. ప్రతి రోజూ వెయ్యి క్యూబిక్ మీటర్ల బ్లాకులకు తగ్గకుండా గ్రానెట్ రాయి ఎగుమతి అవుతోంది. ఎగుమతి బ్లాకులలో 75 శాతం పైగా అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 400 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉండగా వాటి పరిధిలో రెండు వేల కటింగ్ మిషన్లు ఉన్నాయి. ఒక్కో కటింగ్ మిషన్ పరిధిలో రోజుకు ఒక్క క్యూబిక్‌మీటర్ రాయి చొప్పున మొత్తం రెండు వేల క్యూబిక్ మీటర్ల రాయి అవసరం. ఇక వెయ్యి క్యూబిక్‌మీటర్లకు పైగా రాయి ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. మొత్తం కలిపితే రోజుకు మూడువేల క్యూబిక్ మీటర్ల రాయి అవసరం. ఈ లెక్కన జిల్లాలోని 330 గనుల పరిధిలో రోజుకు 10 క్యూబిక్ మీటర్ల రాయిని తీయాల్సి ఉంది. ఒక్కో క్యూబిక్ మీటరు రాయికి రూ. రెండు వేలు రాయల్టీ చెల్లించాల్సివుంది. ఈ మూడువేల క్యూబిక్ మీటర్లకు ఏడాదికి రూ.220 కోట్ల రాయల్టీ రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఏడాదికి కేవలం 84 కోట్లకు మించి రాయల్టీ రావడం లేదు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడుతో గ్రానైట్ తరలుతోంది. పర్మిట్లు ఉండవు, వాణిజ్య పన్నులశాఖకు పన్నులు చెల్లించరు. గతంలో అక్రమ రవాణా రాత్రిళ్లు జరిగేది. టీడీపీ అధికారంలోకి రావడంతో అక్రమ రవాణా పగటిపూట సాగుతోంది. గ్రానైట్ రాయిని 400 లారీలు నిత్యం ఎగుమతి చేస్తుండగా వాటిల్లో 350 లారీలు అధికార పార్టీ ముఖ్యనేతలవే కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఉందని ఓ అధికారి సాక్షితో చెప్పడం పరిస్థితిని తెలియజేస్తోంది.