రోడ్డే గ్రానైట్‌ అడ్డా! | Road Damages With Granite Smuggling | Sakshi
Sakshi News home page

రోడ్డే గ్రానైట్‌ అడ్డా!

Published Thu, Nov 15 2018 1:24 PM | Last Updated on Thu, Nov 15 2018 1:24 PM

Road Damages With Granite Smuggling - Sakshi

చెన్నుపల్లి అనంతవరం రోడ్డు మట్టిగా మారిన దృశ్యం

ప్రకాశం, బల్లికురవ: అధికారం చేతిలో ఉందని మంత్రి, మరో 4 క్వారీల యజమానులు ఆర్‌అండ్‌బీ రోడ్డును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రోడ్డును అడ్డాగా చేసుకుని గ్రానైట్‌ మీటరు, ముడి రాళ్లను క్వారీ నుంచి దొర్లించటంతో తారు రోడ్డు సైతం మట్టిరొడ్డుగా మారి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. కోట్లు వెచ్చించి ఇటీవల అభివృద్ధి పరచిన రోడ్డును క్వారీదార్లు తమ ఆధీనంలోకి తీసుకున్నా అధికార్లు చూసీ చూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అడిగేవారే లేక పోవటంతో వేళాపాళా లేకుండా బ్లాస్టింగ్‌ మోతలు అధికమయ్యాయి. బ్లాస్టింగ్‌ మోతలతో వాహన చోదకులు బెంబేలెత్తుతున్నారు.

7.6 కి.మీ రోడ్డు..
మండలంలోని చెన్నుపల్లి అనంతవరం ఆర్‌అండ్‌బీ రోడ్డులో కొండాయపాలెం గ్రామం నుంచి వేమవరం వరకు 7.6 కిలో మీటర్లను ఇటీవల రూ. 8 కోట్లతో డబుల్‌ రోడ్డుగా విస్తరించి అభివృద్ధి పరిచారు. ఈ రోడ్డులోనే కొండాయపాలెం–మల్లాయపాలెం గ్రామాల మధ్య కొణిదెన రెవెన్యూలోని ఈర్లకొండ విస్తరించి ఉంది. కొండలోని సూమారు 5 హెక్టార్లను లీజుకు తీసుకున్న మంత్రి శిద్దా రాఘవరావు ఆర్‌అండ్‌బీ రోడ్డును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంత్రే ఆధీనంలో తీసుకుంటే తమను అడిగేదెవరని మరో నాలుగు క్వారీల యజమానులు రోడ్డును ఆక్రమించి గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్నారు.

రోడ్డు మార్జిన్‌లోనే రాళ్లు
ఈ రోడ్డు ఇరువైపులా మార్జిన్‌లో గ్రానైట్‌ మీటరు ముడిరాళ్లను నిల్వ చేస్తున్నారు. అక్కడే లారీలను నిలిపి లోడింగ్‌ చేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పటంలేదు. రోడ్డుపైనే క్రేన్‌లతో ఇటీవల నిర్మించిన తారు రోడ్డు సైతం మూన్నాళ్ల ముచ్చటగా మారి రూపం కోల్పోతోంది. ఈ  పరిస్థితులకు తోడు వేళాపాళా లేకుండా బ్లాస్టింగ్‌ మోతలతో వాహన చోదకులు, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.

రెండు మండలాల వాసులకు దగ్గరి మార్గం
బల్లికురవ, సంతమాగులూరు మండలాలల్లో 40 గ్రామాల ప్రజలకు చిలకలూరిపేట, చీరాల, గుంటూరు వెళ్లాలంటే ఇదే దగ్గరి మార్గం ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ రోడ్డును డబుల్‌ రోడ్డుగా విస్తరించి అధికారులు చేతులు దులుపుకున్నారే తప్ప పర్యవేక్షణ లేదని వాహనచోదకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై క్వారీలు, బ్లాస్టింగ్‌ మోతలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కొండమీద బ్లాస్టింగ్‌ శబ్దానికి రాళ్లు రోడ్డు మీదకు వచ్చి పడుతున్నాయి. కొత్త వ్యక్తులు ఈ రోడ్డు ద్వారా వెళ్లాలన్నా బ్లాస్టింగ్‌ మోతలతో భయాందోళన చెందుతున్నారు. చెన్నుపల్లి అనంతవరం రోడ్డులో కొండాయపాలెం గ్రామసమీపంలో రోడ్డును గ్రానైట్‌దార్లు ఆధీనంలోకి తీసుకోవటం నేరమని ఆర్‌అండ్‌బీ జేఈ భాస్కరరావు అన్నారు. రోడ్డును పరిశీలించి బాధ్యులపై చర్యలు చేపడతామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement