తుది దశకు ‘వెలిగొండ’ | CM Jagan actions towards the implementation of another promise given in the election | Sakshi
Sakshi News home page

తుది దశకు ‘వెలిగొండ’

Published Sun, Nov 19 2023 6:16 AM | Last Updated on Sun, Nov 19 2023 7:09 AM

CM Jagan actions towards the implementation of another promise given in the election - Sakshi

సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు సిద్ధమైంది. ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ జి­ల్లా­ల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల స్వప్నా­న్ని సీఎం వైఎస్‌ జగన్‌ సాకారం చేశారు. ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేయించిన సీఎం జగన్‌.. రెండో సొరంగంలో శని­వారం సాయంత్రానికి 18.465 కి.మీ.ల పొడవున తవ్వకం పనులు పూర్తి చేయించారు. మరో 335 మీటర్ల పనులే మిగిలాయి.

రోజుకు 8 మీటర్ల చొప్పున పనులు చేయిస్తున్నామని.. డిసెంబర్‌లోగా పూర్తవుతాయని సీఈ మురళీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. వెలిగొండ రెండు సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు తరలించనున్నారు. ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం జగన్‌ చిత్తశుద్ధితో అడుగులేస్తున్నారు.   

వైఎస్సార్‌ హయాంలో పనుల వరద 
శ్రీశైలం నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులు తరలించి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్‌లో నిల్వ చేసి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4.37,300(తీగలేరు కెనాల్‌ ద్వారా 62 వేలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌ 2004, అక్టోబర్‌ 27న దీనికి శ్రీకారం చుట్టారు.

జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చు చేసి.. నల్లమలసాగర్‌­తో పాటు సొరంగాల్లో సింహభాగం పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసేలా 23 కి.మీ. పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్‌ చానల్‌ పనులు చేయించారు. తీగలేరు కెనాల్, తూర్పు ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్‌ పనులు చేపట్టారు.

ఖజానాను లూటీ చేసిన చంద్రబాబు 
ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండం నుంచి గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకూ ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.పది లక్షలు మాత్రమే.. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్ల కోసమే ఖర్చు చేశారు.

విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వెలిగొండ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకూ రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఎలాంటి ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు దోపిడీకి నిదర్శనం. జీవో–22(ధరల సర్దుబాటు), జీవో 63(çపనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.650 కోట్లకు పైగా దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి.. టీబీఎం(టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లు ఇచ్చి.. కమీషన్‌లు వసూలు చేసుకున్నారు.

2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు హామీలిస్తూ వచ్చిన చంద్రబాబు.. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి, వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి.. కమీషన్‌లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికొదిలేశారు.  

శరవేగంగా పూర్తి చేయించిన సీఎం జగన్‌ 
సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో అడుగులేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో దాదాపు రెండేళ్లు కరోనాతో పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే, మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కి.మీ. పనులను 2019, నవంబర్‌లో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తి చేయించారు.

శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్‌ రెగ్యులేటర్‌ పనులనూ అదే ఏడాది పూర్తి చేయించారు. రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వాటిని రద్దు చేసిన సీఎం జగన్‌.. వాటికి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి టీడీపీ సర్కార్‌ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్ల తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ సొరంగం పనులు అప్పగించారు.

తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందుంచారు. రెండో సొరంగంలో టీబీఎం(టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌)కు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్‌ పని జరగడమే కష్టంగా మారింది. దీంతో గతేడాది మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ., 16.555 కి.మీ., 14.5 కి.మీ., 13.5 కి.మీ., 12.5 కి.మీ. వద్ద సొరంగాలు తవ్వి.. అక్కడ మనుషులతో పనులు చేయిస్తున్నారు.

ఇప్పటికే 7.363 కి.మీ. పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా పూర్తి చేయించింది. మిగిలిన 335 మీటర్ల పనులు డిసెంబర్‌లోగా పూర్తికానున్నాయి. ప్రాజెక్టు పనులకు ఇప్పటిదాకా రూ.700 కోట్లకు పైగా వ్యయం చేసి.. ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తి చేసేలా అధికారులకు సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement