దళారులే సూత్రధారులు  | Political Leaders Involved In Granite Smuggling In Prakasam | Sakshi
Sakshi News home page

దళారులే సూత్రధారులు 

Published Wed, Oct 16 2019 10:48 AM | Last Updated on Wed, Oct 16 2019 11:02 AM

Political Leaders Involved In Granite Smuggling In Prakasam - Sakshi

సాక్షి, ఒంగోలు: గ్రానైట్‌ అక్రమ రవాణా వ్యవహారంలో రాజకీయ దళారులే అసలు సూత్రధారులని పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో అక్రమాలకు సహకరించిన టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఫ్యాక్టరీ యజమానుల నుంచి గ్రానైట్‌ను బిల్లులు లేకుండా తక్కువ ధరకు కొనుగోలు చేసి అన్ని శాఖల అధికారులకు తాయిలాలు ఇచ్చి రాష్ట్రాలు దాటించిన వ్యవహారంలో టీడీపీ నేతల అనుచరుల పాత్ర బయటపడింది. దీంతో ఎక్కడ తమ బండారం బయట పడుతుందోనన్న భయంతో విచారణ జరుపుతున్న పోలీసు అధికారిని టార్గెట్‌ చేస్తున్నారు. నకిలీ వే బిల్లులతో గ్రానైట్‌ను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతున్నారు. ఒకప్పుడు తిండికి తికాణా లేని అనామకులు అక్రమ వ్యాపారంలో అడ్డగోలుగా సంపాదించి కోట్లకు పడగలెత్తారంటే గ్రానైట్‌ మాఫియా ఏ స్థాయిలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.

మార్టూరు మండలంలో నకిలీ కంపెనీలు సృష్టించి దొంగ వేబిల్లులు పొంది అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే వ్యవహారాన్ని అక్కడి ఎస్సై బయటకు తీయడంతో గ్రానైట్‌ మాఫియా డొంక కదిలినట్టయింది. అప్పట్లో నకిలీ కంపెనీలు సృష్టించిన వారిని అరెస్టు చేసి విచారిస్తే కళ్లు చెదిరే వాస్తవాలు బయట పడిన విషయం తెలిసిందే. ఒక్క ఏడాది వ్యవధిలో ఒక మండలంలో జరిగిన గ్రానైట్‌ అక్రమ రవాణాకు సంబంధించి రాయల్టీ, జీఎస్టీ లెక్కిస్తే సుమారు రూ.85 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి çపడిందంటే టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎంత మేర అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిందో లెక్కకు కూడా అందని పరిస్థితి. 

అక్రమార్కుల చేతుల్లోకి పరిశ్రమ..
జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించే గ్రానైట్‌ పరిశ్రమ కొందరు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయింది. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆ పార్టీ నేతలు దళారులుగా మారి బిల్లులు లేకుండా గ్రానైట్‌ లారీలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ వచ్చారు. ఇందు కోసం ఒక్కో లారీకి రూ.30 వేల వరకు వసూలు చేశారు. ఇటీవల మార్టూరు పరిధిలో బయటపడిన నకిలీ వే బిల్లుల కుంభకోణం వ్యవహారంలో ఫ్యాక్టరీ యజమానుల కంటే దళారులే కీలక సూత్రధారులుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. సుమారు 19వేల వే బిల్లులు అక్రమ మార్గంలో పొంది వాటి ద్వారా గ్రానైట్‌ అక్రమ రవాణాకు పాల్పడ్డట్లు పోలీసులు నిర్థారించి కొందరిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన రూ.85 కోట్లు గ్రానైట్‌ మాఫియా బీరువాల్లోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల మార్టూరు పోలీసులు అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. సదరు వ్యక్తి ఓ టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో నిజాయితీగా పనిచేస్తున్న పోలీసు అధికారిని టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టారు. తాము చేసిన తప్పుడు పనులు బయటకొచ్చే సమయంలో తప్పుడు ఆరోపణలతో తప్పించుకోవాలనే కుట్రలు పన్నుతూనే ఉన్నారు. తమ అనుచరులను విచారిస్తే దాని వెనుకున్న తమపేర్లు ఎక్కడ బయటకొస్తాయోననే భయం టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. 

లోతుగా విచారిస్తే కదలనున్న డొంక...
నకిలీ కంపెనీలు సృష్టించి దొంగ వే బిల్లులు పొంది గ్రానైట్‌ను ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసిన వ్యవహారంలో పోలీసు శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి లోతుగా విచారణ జరిపితే టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల డొంక కదులుతుందనేది బహిరంగ రహస్యమే. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అప్పట్లో ఉన్నఅధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని వేల లారీల గ్రానైట్‌ను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి వందల కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిన విషయం వెలుగులోకి రావడం ఖాయమని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఒక్క ఎస్సై జరిపిన విచారణలోనే సుమారు రూ.100 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండి కొట్టారంటే జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపితే సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు బయటకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.  

అక్రమ దందా సాగేదిలా...
టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో గ్రానైట్‌ అక్రమ రవాణా మొత్తం టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరిగిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులు గ్రానైట్‌ ఫ్యాక్టరీల నుంచి బిల్లులు లేకుండా లారీలు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు  ఒక్కో లారీకి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు బేరం కుదుర్చుకుని అన్ని శాఖల అధికారులకు మామూళ్లు ఇస్తూ అధికారిక దందా కొనసాగిస్తారు. బిల్లులు లేకుండా వెళ్లే గ్రానైట్‌ లారీకి కిలో మీటరు దూరంలో టీడీపీ నేతల అనుచరులు బైక్‌లు, కార్లతో  విజిలెన్స్, ఇతర శాఖల అధికారుల కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉంటారు. అధికారులు ఉంటే వెంటనే సమాచారం అందించి లారీని వేరే మార్గం ద్వారా మళ్లిస్తారు. ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లాలోని నాగార్జున సాగర్, పొందుగల సరిహద్దు చెక్‌ పోస్టులు దాటించే వరకు టీడీపీ నేతల అనుచరులు గ్రానైట్‌ లారీలకు రక్షణ కవచంలా వ్యవహరిస్తారు. ఇలా రోజుకు 50 నుంచి 100 లారీల వరకు అక్రమంగా ఇతర రాష్ట్రాలకు చేరుస్తారు. రోజుకు టీడీపీ నేతల ఆదాయం రూ.15 లక్షలకు పైగానే ఉంటుందంటే అక్రమ దందా ఏ స్థాయిలో నడిచిందో అర్థం చేసుకోవచ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement