టీడీపీ ఎమ్మెల్యే ధనదాహం.. కార్మికుడు బలి  | Tamilnadu Men Deceased In TDP MLA Granite Quarry Blast Ballikurava | Sakshi
Sakshi News home page

నిలువునా ప్రాణం తీశారు 

Published Wed, Jan 27 2021 8:57 AM | Last Updated on Wed, Jan 27 2021 12:34 PM

Tamilnadu Men Deceased In TDP MLA Granite Quarry Blast Ballikurava - Sakshi

టీడీపీ ఎమ్మెల్యే ధనదాహానికి ఓ నిండు ప్రాణం బలైంది.. నిబంధనలకు విరుద్ధంగా జరిపిన బ్లాస్టింగ్‌ ఓ కార్మికుడి ప్రాణాలు బలిగొంది. అక్రమాలు జరిగాయంటూ సీజ్‌ చేసిన గ్రానైట్‌ క్వారీలో వక్రమార్గంలో తవ్వకాలు జరిపారు. పక్కనే ఉన్న మరో క్వారీ నుంచి మూతపడ్డ క్వారీకి దారి వేసి మరీ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. బినామి పేర్లతో గ్రానైట్‌ క్వారీలు నిర్వహిస్తూ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడి రూ.వందల కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. సీజ్‌ చేసిన క్వారీలో నిర్వహిస్తున్న బ్లాస్టింగ్‌ పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రానికి వచ్చి కష్టం చేసుకుంటున్న అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బల్లికురవ మండలంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనతో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అక్రమ దందా వెలుగు చూసింది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:  రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ అధికారంలోని రాగానే ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని గ్రానైట్‌ క్వారీలపై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. వాటిల్లో జరుగుతున్న అక్రమాలను నిగ్గు తేల్చారు. ఇందులో భాగంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ తన కుటుంబ సభ్యుల పేరుతో, తన అనుయాయుల పేర్లతో నడుపుతున్న క్వారీల్లో భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించి వందల కోట్ల రూపాయల పెనాల్టీలు విధించారు. తన గనుల్లో తవ్విన గ్రానైట్‌కు సంబంధించి జీఎస్టీ, రాయల్టీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా తన జేబులు నింపుకున్న వైనం విజిలెన్స్‌ విచారణలో బయటపడింది.

అయినా ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడంతో అధికారులు గొట్టిపాటికి చెందిన క్వారీలను సీజ్‌ చేశారు. అయితే అక్రమాలకు అలవాటు పడ్డ ఎమ్మెల్యే సీజ్‌ చేసిన క్వారీల్లో సైతం రాత్రిపూట దొంగతనంగా తవ్వకాలు జరుపుతూ పక్కనే ఉన్న తన బినామీలకు చెందిన క్వారీల్లో నుంచి గ్రానైట్‌ను అక్రమ రవాణా చేస్తూ భారీస్థాయి దోపిడీకి పాల్పడుతున్నారు. మూతపడ్డ క్వారీలో ఆదివారం జరిగిన బ్లాస్టింగ్‌లో కార్మికుడు మృతి చెందిన ఘటనతో గొట్టిపాటి అక్రమాలు బట్టబయలయ్యాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కనుసన్నల్లో గ్రానైట్‌ మాఫియా నడుస్తుందనే విషయం జిల్లాలో అందరికీ తెలిసిందే.


శ్రీ రాఘవవేంద్ర గ్రానైట్స్‌ క్వారీ

టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తన కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో గ్రానైట్‌ క్వారీలు నిర్వహిస్తూ అక్రమ తవ్వకాలకు తెరతీశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని గాని, జీఎస్టీని గాని చెల్లించకుండా అసలు బిల్లులే లేకుండా గ్రానైట్‌ అక్రమ రవాణాకు పాల్పడిన వైనం విజిలెన్స్‌ తనిఖీల్లో బట్టబయలైంది. తాను చేసిన అక్రమ వ్యవహారాలను కప్పి పుచ్చుకునేందుకు తనను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నారంటూ మొసలి కన్నీరు కారుస్తూ తిరుగుతున్నారు.(చదవండి: ఇబ్బంది లేకుండా 'ఇసుక')

అంతటితో ఆగకుండా మూతపడ్డ క్వారీల్లో సైతం దొంగతనంగా తవ్వకాలు జరుపుతూ అక్రమ దందాకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. మూతపడ్డ గంగాభవాని క్వారీలోనే సుమారు 100 మంది కూలీలకు షెల్టర్‌ ఏర్పాటు చేసి ఉంచుతున్నారంటే అక్రమ దందా ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం తన క్వారీలో నిబంధనలకు విరుద్దంగా బ్లాస్టింగ్‌లు చేయడంతో తమిళనాడుకు చెందిన ఎం.అర్ముగం (40) అనే కార్మికుని తలపై బండ రాళ్లు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో క్వారీలోకి వెళ్లి చూసిన పోలీసు, మైనింగ్‌ అధికారులకు కళ్లు చెదిరే వాస్తవాలు కనిపించాయి. 


మూతపడిన ఎమ్మెల్యే గొట్టిపాటి క్వారీలో కూలీలను ఉంచిన గదులు

గత 8 నెలల క్రితం మూతపడిన గంగాభవాని క్వారీలో సైతం అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు బయటపడింది. పక్కనే తన బినామీకి చెందిన సాయి రాఘవేంద్ర క్వారీలో నుంచి దారి వేసుకుని యథేచ్చగా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో అంతా అవాక్కయ్యారు. ప్రభుత్వం తమను వేధిస్తుందంటూ బయట ప్రచారాలు చేస్తూ చీకట్లో మాత్రం అక్రమ దందా నిర్వహించడం ఆ ఎమ్మెల్యే నైజాన్ని తేటతెల్లం చేస్తోంది. అక్రమ గ్రానైట్‌ దందా మాట అటుంచితే నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌లు చేసి ఓ కూలీ ప్రాణాలను బలిగొన్న వైనంపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి జరుగుతున్న అక్రమ తవ్వకాలపై మైనింగ్, విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించారు. గొట్టిపాటి గ్రానైట్‌ దందాపై చర్యలు తీసుకోవడంతో పాటు, మైనింగ్‌ మాఫియా దాష్టీకానికి బలైన కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు. 

ఈర్లకొండలో క్వారీ పరిశీలన
బల్లికురవ: ఈర్లకొండ ఇంపీరియల్‌ క్వారీలో కార్మికుడు మృతి చెందిన నేపథ్యంలో సోమవారం డీఎస్పీ క్వారీని పరిశీలించారు. ఈ క్వారీకి ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న శ్రీరాఘవేంద్ర, గిరిరాజ్‌ క్వారీల్లో ఆదివారం సాయంత్రం బ్లాస్టింగ్‌ చేపట్టగా అక్కడ నుంచి రాయి ఎగిరిపడి ఆర్ముగం తలపై పడి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే చనిపోయినట్టు డీఎస్పీ దృష్టికి తెచ్చారు. విచారణ తదుపరి మైనింగ్‌ అధికారులకు నివేదించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. క్వారీ పరిశీలనలో అద్దంకి సీఐ ఆంజనేయరెడ్డి, ఎస్‌ఐ శివనాంచారయ్య పాల్గొన్నారు. మృతుని సోదరుడు లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదుతో ఆర్ముగం భౌతికకాయాన్ని పోస్టుమార్టూమ్‌ నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

30 లక్షల పరిహారానికి డిమాండ్‌.. 
గ్రానైట్‌ క్వారీల్లో వేళాపాళలేని బ్లాస్టింగ్‌లు రాళ్లు దొర్లిపడి తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని పట్టించుకోవాల్సిన మైన్స్‌ అండ్‌ సేప్టీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని క్వారీ వర్కర్ల యూనియన్‌ గౌరవాధ్యక్షుడు, సీఐటీ యూ నాయకుడు కాలం సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇంపీరియల్‌ క్వారీలో రాయిపడి చనిపోయిన ఆర్ముగం భౌతిక కాయానికి నివాళులతో కుటుంబ సభ్యులను ఓదార్చారు. బ్రతుకు దెరువుకు వలసవచ్చి విగత జీవిగా మా రిన ఆర్ముగం కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని సుబ్బారావు డిమాండ్‌ చేశారు. క్వారీల్లో ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లీజులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కారి్మక సంఘం అధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement