ballikurava
-
టీడీపీ ఎమ్మెల్యే ధనదాహం.. కార్మికుడు బలి
టీడీపీ ఎమ్మెల్యే ధనదాహానికి ఓ నిండు ప్రాణం బలైంది.. నిబంధనలకు విరుద్ధంగా జరిపిన బ్లాస్టింగ్ ఓ కార్మికుడి ప్రాణాలు బలిగొంది. అక్రమాలు జరిగాయంటూ సీజ్ చేసిన గ్రానైట్ క్వారీలో వక్రమార్గంలో తవ్వకాలు జరిపారు. పక్కనే ఉన్న మరో క్వారీ నుంచి మూతపడ్డ క్వారీకి దారి వేసి మరీ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. బినామి పేర్లతో గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తూ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడి రూ.వందల కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. సీజ్ చేసిన క్వారీలో నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రానికి వచ్చి కష్టం చేసుకుంటున్న అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బల్లికురవ మండలంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనతో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అక్రమ దందా వెలుగు చూసింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోని రాగానే ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వాటిల్లో జరుగుతున్న అక్రమాలను నిగ్గు తేల్చారు. ఇందులో భాగంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తన కుటుంబ సభ్యుల పేరుతో, తన అనుయాయుల పేర్లతో నడుపుతున్న క్వారీల్లో భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించి వందల కోట్ల రూపాయల పెనాల్టీలు విధించారు. తన గనుల్లో తవ్విన గ్రానైట్‌కు సంబంధించి జీఎస్టీ, రాయల్టీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా తన జేబులు నింపుకున్న వైనం విజిలెన్స్ విచారణలో బయటపడింది. అయినా ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడంతో అధికారులు గొట్టిపాటికి చెందిన క్వారీలను సీజ్ చేశారు. అయితే అక్రమాలకు అలవాటు పడ్డ ఎమ్మెల్యే సీజ్ చేసిన క్వారీల్లో సైతం రాత్రిపూట దొంగతనంగా తవ్వకాలు జరుపుతూ పక్కనే ఉన్న తన బినామీలకు చెందిన క్వారీల్లో నుంచి గ్రానైట్‌ను అక్రమ రవాణా చేస్తూ భారీస్థాయి దోపిడీకి పాల్పడుతున్నారు. మూతపడ్డ క్వారీలో ఆదివారం జరిగిన బ్లాస్టింగ్‌లో కార్మికుడు మృతి చెందిన ఘటనతో గొట్టిపాటి అక్రమాలు బట్టబయలయ్యాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కనుసన్నల్లో గ్రానైట్ మాఫియా నడుస్తుందనే విషయం జిల్లాలో అందరికీ తెలిసిందే. శ్రీ రాఘవవేంద్ర గ్రానైట్స్ క్వారీ టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తన కుటుంబ సభ్యులు, బినామీల పేర్లతో గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తూ అక్రమ తవ్వకాలకు తెరతీశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని గాని, జీఎస్టీని గాని చెల్లించకుండా అసలు బిల్లులే లేకుండా గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడిన వైనం విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలైంది. తాను చేసిన అక్రమ వ్యవహారాలను కప్పి పుచ్చుకునేందుకు తనను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నారంటూ మొసలి కన్నీరు కారుస్తూ తిరుగుతున్నారు.(చదవండి: ఇబ్బంది లేకుండా 'ఇసుక') అంతటితో ఆగకుండా మూతపడ్డ క్వారీల్లో సైతం దొంగతనంగా తవ్వకాలు జరుపుతూ అక్రమ దందాకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. మూతపడ్డ గంగాభవాని క్వారీలోనే సుమారు 100 మంది కూలీలకు షెల్టర్ ఏర్పాటు చేసి ఉంచుతున్నారంటే అక్రమ దందా ఏస్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం తన క్వారీలో నిబంధనలకు విరుద్దంగా బ్లాస్టింగ్లు చేయడంతో తమిళనాడుకు చెందిన ఎం.అర్ముగం (40) అనే కార్మికుని తలపై బండ రాళ్లు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో క్వారీలోకి వెళ్లి చూసిన పోలీసు, మైనింగ్ అధికారులకు కళ్లు చెదిరే వాస్తవాలు కనిపించాయి. మూతపడిన ఎమ్మెల్యే గొట్టిపాటి క్వారీలో కూలీలను ఉంచిన గదులు గత 8 నెలల క్రితం మూతపడిన గంగాభవాని క్వారీలో సైతం అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు బయటపడింది. పక్కనే తన బినామీకి చెందిన సాయి రాఘవేంద్ర క్వారీలో నుంచి దారి వేసుకుని యథేచ్చగా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో అంతా అవాక్కయ్యారు. ప్రభుత్వం తమను వేధిస్తుందంటూ బయట ప్రచారాలు చేస్తూ చీకట్లో మాత్రం అక్రమ దందా నిర్వహించడం ఆ ఎమ్మెల్యే నైజాన్ని తేటతెల్లం చేస్తోంది. అక్రమ గ్రానైట్ దందా మాట అటుంచితే నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు చేసి ఓ కూలీ ప్రాణాలను బలిగొన్న వైనంపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి జరుగుతున్న అక్రమ తవ్వకాలపై మైనింగ్, విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. గొట్టిపాటి గ్రానైట్ దందాపై చర్యలు తీసుకోవడంతో పాటు, మైనింగ్ మాఫియా దాష్టీకానికి బలైన కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు. ఈర్లకొండలో క్వారీ పరిశీలన బల్లికురవ: ఈర్లకొండ ఇంపీరియల్ క్వారీలో కార్మికుడు మృతి చెందిన నేపథ్యంలో సోమవారం డీఎస్పీ క్వారీని పరిశీలించారు. ఈ క్వారీకి ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న శ్రీరాఘవేంద్ర, గిరిరాజ్ క్వారీల్లో ఆదివారం సాయంత్రం బ్లాస్టింగ్ చేపట్టగా అక్కడ నుంచి రాయి ఎగిరిపడి ఆర్ముగం తలపై పడి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే చనిపోయినట్టు డీఎస్పీ దృష్టికి తెచ్చారు. విచారణ తదుపరి మైనింగ్ అధికారులకు నివేదించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. క్వారీ పరిశీలనలో అద్దంకి సీఐ ఆంజనేయరెడ్డి, ఎస్ఐ శివనాంచారయ్య పాల్గొన్నారు. మృతుని సోదరుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుతో ఆర్ముగం భౌతికకాయాన్ని పోస్టుమార్టూమ్ నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 30 లక్షల పరిహారానికి డిమాండ్.. గ్రానైట్ క్వారీల్లో వేళాపాళలేని బ్లాస్టింగ్లు రాళ్లు దొర్లిపడి తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని పట్టించుకోవాల్సిన మైన్స్ అండ్ సేప్టీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని క్వారీ వర్కర్ల యూనియన్ గౌరవాధ్యక్షుడు, సీఐటీ యూ నాయకుడు కాలం సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇంపీరియల్ క్వారీలో రాయిపడి చనిపోయిన ఆర్ముగం భౌతిక కాయానికి నివాళులతో కుటుంబ సభ్యులను ఓదార్చారు. బ్రతుకు దెరువుకు వలసవచ్చి విగత జీవిగా మా రిన ఆర్ముగం కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. క్వారీల్లో ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లీజులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కారి్మక సంఘం అధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
గంటల వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి
సాక్షి, బల్లికురవ(ప్రకాశం): కొడుకు అస్వస్థతకు గురి కావడంతో తీవ్ర ఆవేదన చెందిన తండ్రి 15 రోజులుగా మంచం పట్టాడు. ఆ దిగులుతోనే తండ్రి చనిపోగా తండ్రి లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఇప్పటికే తీవ్ర అస్వస్థతతో ఉన్న కుమారుడు గంటల వ్యవధిలో తనువు చాలించాడు. ఈ హృదయ విదారక సంఘటన బల్లికురవ ఎస్సీ కాలనీలో బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే జొన్నలగడ్డ దిబ్బయ్య (72)కు భార్య, కుమారుడు ఉన్నారు. అనారోగ్యంతో భార్య గతంలోనే చనిపోయింది. కుమారుడు బుల్లెయ్య (53), కోడలు దిబ్బయ్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇటీవల బుల్లెయ్యకు ఊపిరి తిత్తులు దెబతినడంతో వైద్యశాలల చుట్టూ తిరగుతున్నాడు. అయినా వ్యాధి తగ్గలేదు. విషయం తెలుసుకున్న తండ్రి మంచంపట్టి ఆ దిగులుతోనే చనిపోయాడు. తనకు జన్మనిచ్చిన తండ్రి ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని కుమారుడు కూడా తనువు చాలించాడు. బుధవారం ఉదయం తండ్రి అంత్యక్రియులు, ఆ తర్వాత కుమారుడి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు ముగించారు. బుల్లెయ్యకు భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుల బంధువుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. (చదవండి: యూపీలో మరో నిర్భయ) -
గనుల అక్రమ తవ్వకాలపై సర్కారు కొరడా
సాక్షి, విజయవాడ/ప్రకాశం: ప్రకాశం జిల్లాలో గనుల అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఐదు నెలలుగా సర్వే చేపట్టిన గనుల శాఖ అధికారులు వందల కోట్లు దోపిడీని గుర్తించారు. ఈ అడ్డగోలు గనుల తవ్వకాల వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. లైసెన్స్‌ను పరిధిని మించి తవ్వకాలు జరిపినట్లు గనుల శాఖ గుర్తించింది. బల్లికురవ మండలం కొనిదెన లో ఓ కంపెనీ భారీ దోపిడీ కి పాల్పడింది. 17 లక్షల 76 వేల 137 క్యూబిక్ మీటర్ల తవ్వకాలు చేసింది. 15 శాతం రికవరితో 2 లక్షల 66 వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ గా అధికారులు తేల్చారు. లక్షా 216 క్యూబిక్ మీటర్లకు మాత్రమే అనుమతి తీసుకున్న సంస్థ.. అక్రమంగా లక్షా 66 వేల 204 క్యూబిక్ మీటర్లు తవ్వేసింది. అక్రమ మైనింగ్ కి పాల్పడిన ఓ కంపెనీకి రూ.285 కోట్ల ఫీజు కట్టాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. టీడీపీ నేతల దోపిడీని కప్పిపుచ్చేందుకు ఎల్లో మీడియా వింత రాతలు రాయడం గమనార్హం. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
సాక్షి, బల్లికురవ (ప్రకాశం): మైనర్ బాలికకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న సంతమాగులూరు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు సిబ్బందితో కలిసి బాల్య వివాహాన్ని అడ్డుకుని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటన గురువారం రాత్రి బల్లికురవ ఎస్సీ కాలనీలో వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం ఎస్సీ కాలనీకి చెందిన బొంతా శ్యాంబాబు, బాణమ్మల కుమార్తె కోమలి ఇటీవలే పదో తరగతి పూర్తి చేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతానని చెప్పినప్పటికీ తల్లిదండ్రులు తమ వద్ద చదివించే స్థోమత లేదని గుంటూరు జిల్లా జొన్నలగడ్డకు చెందిన ఇండ్ల కృష్టోఫర్ సింగమ్మల కుమారుడు ప్రభాకర్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించారు. శుక్రవారం ఉదయం జొన్నలగడ్డలో వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నారు. ఐతే, గురువారం రాత్రి బాలిక ఇంటి వద్ద వివాహ వేడుకలు జరుగుతుండగా అధికారులకు మైనర్ వివాహం జరుగుతున్నట్టు సమాచారం అందింది. దీంతో సంతమాగులూరు ఐసీడీఎస్ సీడీపీఓ బి. విజయలక్ష్మి, సూపర్వైజర్ వి. నాగమణి, అంగన్వాడీ కార్యకర్త కె. రాజకుమారి బల్లికురవ ఎస్సై పి. అంకమ్మరావు, వివాహ వేడుకలు జరుగుతున్న బాలిక ఇంటివద్దకు వెళ్లారు. బాలికతోనూ, తల్లిదండ్రులతోనూ వేర్వేరుగా మాట్లాడారు. బాలిక తాను ఇంటర్ చదువుతానని, చదివించాలని, అధికారులను వేడుకుంది. మేజర్ అయ్యే వరకు వివాహం చేయమని బాలిక తల్లిదండ్రులు శ్యాంబాబు, బాణమ్మల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. బాలిక నుంచి కూడా మేజర్ అయ్యేవరకు వివాహం చేసుకోనని స్టేట్మెంట్ తీసుకుని, బల్లికురవ కళాశాలలో చేర్పించాల్సిందిగా అంగన్వాడీ కార్యకర్తను ఆదేశించారు. -
కాదేది ఆక్రమణకు అనర్హం ..
సాక్షి, బల్లికురవ: శ్మశాన వాటికల అభివృద్ధికి ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరు అవుతున్నా పాలకులు, అధికారులు శ్రద్ధ వహించటంలేదు. మంజూరైన నిధులు సైతం రద్దయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 20 గ్రామాల్లో శ్మశానాలు ఆక్రమణలు, చిల్లచెట్లతో మూసుకుపోయి రహదారి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. జన్మభూమి, మా ఊరు గ్రామసభల్లో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు,మండల స్థాయి అధికారులకు ఆయా గ్రామాల్లోని ప్రజలు లిఖితపూర్వకంగా అర్జీలు పెట్టుకున్నా అతీగతిలేదు. కూకట్లపల్లిలో... కూకట్లపల్లి ఎస్సీ శ్మశాన వాటికకు ఎకరా 28 సెంట్ల భూమి ఉంది. ఆక్రమణలతో ఈ భూమి కుచించుకుపోయింది. చిల్లచెట్లు పెరిగి కాలనీ నుంచి శ్మశానానికి వెళ్లేదారి అధ్వాన స్థితికి చేరింది. మనిషి చనిపోతే బతికున్నవారికి నరకయాతన తప్పటంలేదు. ఇటీవల కాలనీలో సురభి అంజయ్య చనిపోతే బంధువులు, కాలనీవాసుల పడిన వెతలు వర్ణనాతీతం. ఈ ఏడాది జనవరి 4 న జరిగిన జన్మభూమి, మాఊరు గ్రామసభకు ఎమ్మెల్యే రవికుమార్ హాజరయ్యారు. కాలనీవాసులు సురభి మహేష్, వేల్పుల అబ్రహం, ముట్లూరి ఎల్లయ్య, గొల్లపూడి అంజయ్యలు శ్మశానానికి వెళ్లే రహదారిని అభివృద్ధి చేయాలని విన్నవించారు. గ్రామ పంచాయతీ నిధుల్లో రూ.3 లక్షలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ హామీ అడుగు మందుకుపడలేదు. ఎదురు చూసిచూసి ఫలితం లేకపోవడంతో కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నేతలకు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్తామని ప్రజలు అంటున్నారు. మిగిలిన గ్రామాల్లో కూడా అవస్థలే : బల్లికురవలోని హిందూ, క్రిష్టియన్ శ్మశాన వాటికలు ఆక్రమణలకు గురయ్యాయి. మల్లాయపాలెం, ఉప్పమాగులూరు, కొమ్మినేనివారిపాలెం, వీకొప్పెరపాడు, చెన్నుపల్లి, రామాంజనేయపురం, వైదన, గొర్రెపాడు, కొణిదెన, గంగపాలెం, వేమవరం గ్రామాల్లోని స్మశాన వాటికలు ఆక్రమణలతో పాటు శ్మశానానికి వెళ్లే రహదారి వసతి కూడా అంతంత మాత్రంగానే ఉంది. -
ప్రసాదం తిని 70 మంది ఆస్పత్రిపాలు
సాక్షి, బల్లికురవ: రాములోరి కల్యాణమైన తర్వాత 16 రోజుల పండగ సందర్భంగా ఆదివారం కమిటీ సభ్యులు వడపప్పు పానకం పంపిణీ చేశారు. ఆ వడపప్పు, పానకం తాగిన వారిలో 70 మంది మంగళవారం నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఈ సంఘటన మండలంలోని సూరేపల్లిలో బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. గత నెల 25న శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలోని రామాలయంలో సీతారాముల కల్యాణం జరిపించారు. ఈ నెల 8వ తేదీన 16 రోజుల పండగ వెడుకలు నిర్వహించారు. హాజరైన భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ చేశారు. వడపప్పు, పానకం తాగిన వారిలో గుర్రాల శ్రీనివాసరావు, కొమ్మాలపాటి రామాంజమ్మ, గుర్రా సింగరకొండ, కోటేశ్వరరావు, బొంతునాగమ్మ, బొంతు ఆంజనేయులుతో పాటు మొత్తం 70 మంది వరకు ఉన్నారు. వీరంతా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. స్థానికులు భయపడి గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి సయ్యద్ అమీర్ ఆలీకి సమాచారం ఆందించారు. వైద్యశిబిరం ఏర్పాటు సమాచారం అందుకున్న వైద్యాధికారి గ్రామంలో తక్షణమే వైద్యశిబిరం ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడపప్పులో తేడా వల్లే ఇలా జరిగిందని, భయపడాల్సిన పనేమీ లేదన్నారు. నీరసంగా ఉన్న వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కొందరికి సెలైన్లు పెడుతున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఎండకు బయట తిరగకుండా ఉండాలని వైద్యుడు సూచించారు. -
సాగర్ కాల్వకు గండ్లు
ఒంగోలు : ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అద్దంకి బ్రాంచి కెనాల్‌కు శుక్రవారం గండ్లు పడ్డాయి. వల్లేపల్లి లాకుల సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున గండ్లు పడ్డాయి. దీంతో భారీగా నీరు పంట పొలాల్లోకి ప్రవేశించింది. దాంతో షట్టర్లను అధికారులు కిందికి దింపారు. నీరు ముందుకు వెళ్లకుండా కంప చెట్లను అడ్డుగా ఉంచటంతోనే కెనాల్‌కు గండ్లు పడ్డాయని రైతులు ఆరోపిస్తున్నారు. -
ఎంతో ఎత్తుకు గులాబీ
ప్రకాశం: సాధారణంగా నాలుగైదు అడుగులు పెరిగే గులాబి మొక్క ఏకంగా 12 అడుగుల మేర పెరిగింది. ప్రకాశం జిల్లా బల్లికురవకు చెందిన కావూరి అంజమ్మ తన ఇంటి ముందు గత ఏడాది జనవరిలో గులాబి మొక్క నాటారు. సేంద్రియ ఎరువులైన ఉల్లిపొట్టి, కోడిగుడ్డు తొక్కలు వేసి మొక్క పెంచగా 12 అడుగుల వరకు పెరిగింది. ఆరు నెలలుగా నిత్యం పూలు పూస్తూనే ఉందని అంజమ్మ వివరించింది. - బల్లికురవ, ప్రకాశం -
పాదచారులపై దూసుకెళ్లిన లారీ: ఇద్దరు మృతి
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయపురంలో వద్ద మంగళవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న లారీ రహదారిపై వెళ్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఆ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ దుర్ఘటనలో మరణించిన రెండు మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీతిమీరిన వేగంతోనే వాహనం నడపడం వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పోలీసులకు తెలిపారు.