చిల్లచెట్లు, గోతులతో కూకట్లపల్లి ఎస్సీ శ్మశాన వాటిక రహదారి
సాక్షి, బల్లికురవ: శ్మశాన వాటికల అభివృద్ధికి ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరు అవుతున్నా పాలకులు, అధికారులు శ్రద్ధ వహించటంలేదు. మంజూరైన నిధులు సైతం రద్దయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 20 గ్రామాల్లో శ్మశానాలు ఆక్రమణలు, చిల్లచెట్లతో మూసుకుపోయి రహదారి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. జన్మభూమి, మా ఊరు గ్రామసభల్లో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు,మండల స్థాయి అధికారులకు ఆయా గ్రామాల్లోని ప్రజలు లిఖితపూర్వకంగా అర్జీలు పెట్టుకున్నా అతీగతిలేదు.
కూకట్లపల్లిలో...
కూకట్లపల్లి ఎస్సీ శ్మశాన వాటికకు ఎకరా 28 సెంట్ల భూమి ఉంది. ఆక్రమణలతో ఈ భూమి కుచించుకుపోయింది. చిల్లచెట్లు పెరిగి కాలనీ నుంచి శ్మశానానికి వెళ్లేదారి అధ్వాన స్థితికి చేరింది. మనిషి చనిపోతే బతికున్నవారికి నరకయాతన తప్పటంలేదు. ఇటీవల కాలనీలో సురభి అంజయ్య చనిపోతే బంధువులు, కాలనీవాసుల పడిన వెతలు వర్ణనాతీతం. ఈ ఏడాది జనవరి 4 న జరిగిన జన్మభూమి, మాఊరు గ్రామసభకు ఎమ్మెల్యే రవికుమార్ హాజరయ్యారు. కాలనీవాసులు సురభి మహేష్, వేల్పుల అబ్రహం, ముట్లూరి ఎల్లయ్య, గొల్లపూడి అంజయ్యలు శ్మశానానికి వెళ్లే రహదారిని అభివృద్ధి చేయాలని విన్నవించారు. గ్రామ పంచాయతీ నిధుల్లో రూ.3 లక్షలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ హామీ అడుగు మందుకుపడలేదు. ఎదురు చూసిచూసి ఫలితం లేకపోవడంతో కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నేతలకు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్తామని ప్రజలు అంటున్నారు.
మిగిలిన గ్రామాల్లో కూడా అవస్థలే :
బల్లికురవలోని హిందూ, క్రిష్టియన్ శ్మశాన వాటికలు ఆక్రమణలకు గురయ్యాయి. మల్లాయపాలెం, ఉప్పమాగులూరు, కొమ్మినేనివారిపాలెం, వీకొప్పెరపాడు, చెన్నుపల్లి, రామాంజనేయపురం, వైదన, గొర్రెపాడు, కొణిదెన, గంగపాలెం, వేమవరం గ్రామాల్లోని స్మశాన వాటికలు ఆక్రమణలతో పాటు శ్మశానానికి వెళ్లే రహదారి వసతి కూడా అంతంత మాత్రంగానే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment