land occupied
-
అయ్యన్న పాత్రుడు అడ్డంగా దొరికిపోయాడు: డిప్యూటీ సీఎం
సాక్షి, తాడేపల్లి: అధికారంలో ఉండగా అయ్యన్న పాత్రుడు అక్రమాలకు పాల్పడి, అడ్డంగా దొరికిపోయారని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మండిపడ్డారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలాన్ని కాజేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు. అయ్యన్న పాత్రుడి అరెస్ట్‌తో బీసీలకు సంబంధమేంటి అని ప్రశ్నించారు. కులంకార్డు అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు సానుభూతి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. మీరు తప్పు చేయకపోతే కోర్టులో నిరూపించుకోవాలని కోరారు. రాష్ట్రంలో టీడీపీ నేతలకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా?. తప్పచేసిన వారిపై చర్యలు తీసుకోకూడదా అన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రశ్నించారు. చదవండి: (అనంతపురం దుర్ఘటన.. విద్యుత్ శాఖకు సీఎం జగన్ కీలక ఆదేశాలు) -
రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ కీలక నిర్ణయం.. కబ్జాపై ‘ఎస్ఓటీ’
సాక్షి, హైదరాబాద్: మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, వ్యభిచారం వంటి నేరస్తులను పట్టుకోవటంలో దిట్టయిన స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు.. ఇక నుంచి భూ ఆక్రమణదారులపైనా దృష్టి సారించనున్నారు. భూ తగాదాలు పెరిగిపోతుండటం, వీటిని ఆసరాగా చేసుకొని కొందరు పోలీసులు అక్రమాలకు పాల్పడటం, చివరికి హత్యలకూ దారితీస్తున్న నేపథ్యంలో... రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. భూ ఆక్రమణలు, కబ్జాలపై పోలీసులకు మార్గదర్శకాలు ఖరారు చేశారు. ఆయా విధి విధానాలకు లోబడే చర్యలు తీసుకోవాలని సూచించారు. వేల సంఖ్యలో ఫిర్యాదులు.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్ పరిధిలో భూముల విలువలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీంతో కబ్జాదారులు నకిలీ పత్రాలను సృష్టించి ఖాళీ స్థలాలను విక్రయించడం లేదా కబ్జాలకు పాల్పడటం వంటి వాటికి పాల్పడుతున్నారు. దీంతో రోజుకు వేల సంఖ్యలో పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిలో చాలా వరకు కేసులను ‘సివిల్ మ్యాటర్’ అని పోలీసులు పక్కన పెడుతుండగా.. తమ వారి కేసులను మాత్రం ప్రత్యేక దృష్టి సారించి మరీ పరిష్కరిస్తున్నారు. కొన్ని పీఎస్‌లలో సబ్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఏసీపీలు కబ్జాదారులకు ఒత్తాసు పలుకుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి పలు కేసులలో భూ యజమానులు ఆగ్రహం కట్టలు తెంచుకొని.. హత్యలు చేసే స్థాయికి వెళ్లిపోతుండటం గమనార్హం. ఇటీవలి కాలంలో ఇలాంటి భూ తగాదాల నేపథ్యంలో హత్యలు జరగడమే ఇందుకు నిదర్శనం. చదవండి: మరోసారి తెరపైకి సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ పేరు అన్ని కేసుల్లో పోలీసుల ప్రమేయం ఉండదు.. చాలా మంది భూ యజమానులు వారి భూమి ఆక్రమణలకు గురైతే చాలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇది సివిల్ కేసు అని, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించినా సరే పోలీసులు పట్టించుకోవటం లేదని పలువురు భూ యజమానులు ‘పెద్ద’ మనుషులతో ఫోన్లు చేయించి, ఒత్తిడి తెస్తున్నారు. ప్రతి భూ ఆక్రమణ కేసులో పోలీసుల ప్రమేయం ఉండదు. సివిల్, పోలీస్‌ల మధ్య ఉన్న స్పష్టమైన లక్ష్మణ రేఖను దాటకుండా.. పోలీసులు చర్యలు తీసుకుంటారు. సివిల్ కేసులకు న్యాయస్థానాలు, సబ్–రిజిస్ట్రేషన్ ఆఫీసులు వంటివి ఉన్నాయి. ఎవరి అధికారాల పరిధిలో వాళ్లు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. భూ తగాదాలపై పోలీసులు, బాధితులకు సూచనలు చేసేందుకు ఇద్దరు న్యాయ సలహాదారులను నియమించారు. ఏ తరహా కేసులపై పోలీసులు జోక్యం చేసుకోవాలి, ఏ తరహా విధానాలను అనుసరించాలనే పలు అంశాలపై సూచనలు ఇస్తుంటారు. రోజుకు 15 ఇలాంటి కేసులే.. కమిషనరేట్‌లో నన్ను కలిసేందుకు రోజుకు 20 మంది సందర్శకులు వస్తే.. ఇందులో 15 మంది భూమి తగాదాల బాధితులే ఉంటున్నారు. ఇందులో 5 కేసులు న్యాయబద్ధంగా ఉంటే.. మిగిలినవి క్రిమినల్ కేసులుంటున్నాయి. బాధితులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి దిశా నిర్దేశం చేస్తున్నాం. – మహేశ్ భగవత్, సీపీ, రాచకొండ -
కబ్జాల నుంచి.. విశాఖకు విముక్తి
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమం 2020, అక్టోబర్ 24 నాటిది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించుకుని ఇందులోని రెండెకరాల్లో కళాశాల భవన నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. సుమారు రూ.500 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినప్పటికీ.. తెలుగుదేశం నేత కావడంతో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గీతం యూనివర్సిటీ ప్రహరీ గోడను తొలగించి కబ్జాలో ఉన్న 42.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ అంటే అందమైన నగరం.. మరో పేరు చెప్పమంటే ప్రశాంత తీరం.. అటువంటి మహానగరంలో అవకాశమున్న ప్రతీచోటా రూ.వేల కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను కబ్జాకోరులు చెరపట్టేశారు. వీరిలో అత్యధికులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. ఇప్పుడు వీరి ఆగడాలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్లెంవేస్తూ వారి భరతం పడుతోంది. ఆక్రమణలకు గురైన భూములను విడిపిస్తూ విశాఖ నగరానికి విముక్తి కల్పిస్తోంది. ఇలా ఇప్పటివరకు రూ.5,080 కోట్ల విలువైన సర్కారు భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏళ్లుగా కబ్జాల్లో ఉండి.. ప్రభుత్వ కార్యాలయాల్లో మూలనపడిన భూ రికార్డుల దుమ్ముదులిపి ఈ భూముల లెక్కతేలుస్తున్నారు. బినామీ పేర్లతో టీడీపీ నేతల భూదాహం గతంలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు బినామీ పేర్లతో విశాఖ జిల్లా భూములపై తెగబడ్డారు. ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.వేల కోట్లు ఖరీదుచేసే భూములను చెరపట్టేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. టీడీపీ పెంచి పోషించిన భూబకాసురుల ఆక్రమణలపై ప్రభుత్వాధికారులు ఉక్కుపాదం మోపారు. భూ రాబందుల నుంచి రూ.2,600 కోట్లకు పైగా విలువైన 430.81 ఎకరాల భూములను వారి చెర నుంచి విడిపించారు. వీటి మార్కెట్ విలువ ఏకంగా రూ.5 వేల కోట్లకు పైమాటే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో.. నిజానికి.. విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం జిల్లా రెవెన్యూ అధికారులు మూడేళ్లుగా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటుచేసి.. రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం 270 ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన 430.81 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారు. వీటి ప్రభుత్వ విలువ రూ.2,638 కోట్లు కాగా.. మార్కెట్ విలువ రూ.5 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పదేపదే ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపైనా క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తున్నారు. పీఠాలు కదులుతున్నాయ్.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వేల కోట్లు రూపాయల విలువ చేసే భూములను దోచుకున్న టీడీపీ నేతల భూభాగోతం బట్టబయలైంది. జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ కబ్జాకోరుల కబంధ హస్తాల్లోనివే కావడం గమనార్హం. గయాలు, పోరంబోకు, గోర్జి, కొండ పోరంబోకు, వాగులు, కాలువలు, గెడ్డలు, రాస్తాలు, గుట్టలు, ఇనాం, జిరాయితీ, గ్రామకంఠాలు, చెరువులు.. ఇలా కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా అందినకాడికి తమ గుప్పిట బంధించేశారు. ఇప్పుడు వీరి పీఠాలు కదులుతున్నాయి. 430 ఎకరాలకుపైగా స్వాధీనం జిల్లాలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను రక్షించే చర్యలను చేపడుతున్నాం. గత మూడేళ్లల్లో జిల్లావ్యాప్తంగా 430 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని రక్షించాం. వీని బేసిక్ విలువ రూ.2,638 కోట్లకు పైగా ఉందని తేలింది. మార్కెట్ ధరలతో లెక్కిస్తే రూ.5 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్కారు భూములను రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. – వేణుగోపాల్ రెడ్డి, జేసీ, విశాఖపట్నం జిల్లా -
కేసీఆర్ తాతయ్యా.. న్యాయం చేయరూ..!
సాక్షి, సిరిసిల్ల టౌన్: ‘‘మోదీ తాతయ్యా.. కేసీఆర్ తాతయ్యా.. నా మొర ఆలకించండి.. మూడేళ్లుగా నా ఆస్తిని ఓ ప్రజాప్రతినిధి కబ్జా చేశాడు. కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. మీరైనా స్పందించి న్యాయం చేయరూ ప్లీజ్..’’ అంటూ ఓ ఆరేళ్ల పసివాడు వేడుకుంటున్నాడు. బాధితుల కథనం ప్రకారం.. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లికి చెందిన కుమారస్వామి, మమత దంపతులు 2017లో అనారోగ్యంతో చనిపోయారు. వీరికి కుమారుడు నాగప్రణీత్ (6) ఉన్నాడు. మమతకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన 1.16 ఎకరాల భూమి సర్వే నంబర్ 108/17, 33/6లో ఉంది. చదవండి: రాబోయే మూడు నెలలు జాగ్రత్త ఈ భూమిని కౌలుకు తీసుకున్న ఓ మాజీ ప్రజాప్రతినిధి.. మమత, కుమారస్వామి చనిపోయేవరకు కౌలు చెల్లించాడు. అయితే వాళ్లిద్దరూ చనిపోయాక, కొద్ది రోజుల క్రితం ఆ భూమిని రెవెన్యూ రికార్డుల్లో తన పేరిట మార్పించుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ లింగంపల్లి నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు మంగళవారం నాగప్రణీత్ తన తాత రాజయ్యతో కలిసి పాదయాత్ర చేశాడు. ఈ విషయంపై గతంలోనే రెండు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అప్పటి జాయింట్ కలెక్టర్ విచారణకు ఆదేశించినా.. ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని బాధితులు తెలిపారు. కలెక్టర్ స్పందించి సరైన న్యాయం చేయాలని వేడుకుంటూ మంగళవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. చదవండి: వాసాలమర్రిని దత్తత తీసుకున్న కేసీఆర్ -
టీడీపీ నేత గుట్టు రట్టు..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చేతిలో అధికారం.. అందుకు సహకరించే ప్రజాప్రతినిధుల అండతో లక్షల రూపాయల విలువైన భూమిని ఆక్రమించుకుని దర్జాగా అనుభవిస్తున్న పచ్చనేత భరతం పట్టింది ‘సాక్షి’ కథనం. అప్పటి వరకు తనకు ఎదురే లేదంటూ బాహుదా నది పరివాహక ప్రాంతాన్ని అనుభవిస్తున్న ఆ నేత మెడలు వంచి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకున్నా రు. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి పంచాయతీకి చెందిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్ కుమారుడు దూపాన సూర్యనారాయణ స్థానిక బాహుదానది పరివాక ప్రాంతంలో గల 4ఎకరాల 80 సెంట్ల భూమిని గత కొన్నేళ్ల నుంచి తన ఆదీనంలోకి తీసుకొని అనుభవిస్తున్నాడు. సుమారు రూ.50లక్షల రూపాయలు విలువైన ఈ భూమిని గతంలో మశాఖపురం గ్రామానికి చెందిన ఓ మాజీ సైనిక ఉద్యోగికి ప్రభుత్వం కేటాయించింది. అయితే విలువైన ఆ భూమిపై కన్నేసిన టీడీపీ నేత ఆ భూ మిని ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతో కల్ల బొల్లి మాటలు చెప్పి విలువైన స్థలాన్ని సొంతం చేసుకున్నాడు. పదేళ్ల పాటు వారి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అధికారులు సైతం ఆ స్థలం వైపు కన్నెత్తి చూడలేకపోయారు. ‘ఆక్రమణలో పోరంబోకు’ అన్న శీర్షికన సెప్టెంబర్ 24న సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంతో అటు రెవెన్యూ అధికారులు, ఇటు టీడీపీ నేతలు ఉలిక్కి పడ్డారు. విలువైన భూమిని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఆ టీడీపీ నేత శతవిధాలా ప్రయత్నాలు సాగించిన కుట్రను ‘సాక్షి’ గుట్టురట్టు చేసింది. స్థానిక తహసీల్దార్ పర్రి అమల ఆక్రమణ భూమిని సెపె్టంబర్ 24న స్వయంగా పరిశీలించి సర్వే నిర్వహించారు. ముందస్తుగా ఆ భూమిని తన భూమిగా నిరూపించుకోవాలని పదిహేను రోజుల క్రితం ఫామ్–7 రూపంలో టీడీపీ నేత దూపాన సూర్యనారాయణకు అవకాశం కల్పించింది. అయినప్పటికీ ఆయన వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో శుక్రవారం ఫామ్–6 రూపంలో 4ఎకరాల 80 సెంట్ల భూమిని ప్రభుత్వ ఆస్థిగా నిర్ధారిస్తూ రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. తహసీల్దార్ పర్రి అమల శుక్రవారం సాయంత్రం ఆక్రమణ స్థలం వద్దకు వెళ్లి ‘ప్రభుత్వ భూమి’గా నిర్ధారిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. -
పచ్చ నేత చెరవీడిన తెలుగు గంగ స్థలం
సాక్షి, చిత్తూరు : టీడీపీ అధికారంలో ఉండగా నేతలు దర్జాగా ఆక్రమించిన స్థలాలను అధికారులు స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. సత్యవేడులో మూడు కోట్ల విలువైన తెలుగుగంగ స్థలాన్ని పచ్చపార్టీ నాయకుడు, మాజీ ఎంపీపీ మస్తాన్ యాదవ్ గతంలో ఆక్రమించిచాడు. తెలుగు గంగ అధికారులు ఎన్నిసార్లు నోటీసులిచ్చినా మస్తాన్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారడంతో కలెక్టర్ ఆదేశాలకనుగుణంగా పోలీసుల పహారాలో ప్రహరీ గోడను అధికారులు శనివారం కూల్చివేశారు. -
రూ. 50 కోట్ల స్థలం మింగేశారు!
సాక్షి, రాజేంద్రనగర్: భూకబ్జాదారులు బరితెగిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఏకంగా డంపింగ్ యార్డు స్థలానికి ఎసరు పెట్టారు. మొత్తం 22 ఎకరాల్లో దాదాపు 6 ఎకరాలను ప్లాట్లుగా మార్చి విక్రయించి యథేచ్ఛగా సొమ్ము చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట మండల పరిధిలోని గంధంగూడ సర్వేనంబర్ 43లో ప్రభుత్వానికి చెందిన 22.17 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని గతంలో ప్రభుత్వం డంపింగ్ యార్డును ఏర్పాటు చేసేందుకు సిలికాన్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన చెత్తాచెదారాన్ని ఇక్కడ డంప్ చేసి రీసైక్లింగ్ నిర్వహించేవారు. ఏడు సంవత్సరాల క్రితం ఈ డంపింగ్ యార్డు మూతబడింది. అంతకుముందు వేసిన చెత్తచెదారంతో ఆ ప్రాంతం ఓ గుట్టలా మారింది. అయితే, కొంతకాలంగా కొందరు స్థానిక నేతలు ఈ చెత్తను తొలగించి ప్లాట్లుగా మారి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. చెత్తలోనే గుంతలు తీసి పిల్లర్లు వేసి ఇళ్లను నిర్మిస్తున్నారు. 120 నుంచి 180 గజాల వరకు ప్లాట్లుగా చేసి నిర్మాణాలను ప్రారంభించారు. ఈ నిర్మాణాలకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. డంపింగ్ యార్డు స్థలంలోనే నిర్మాణాలను చేపడుతున్న ఇక్కడి కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఈ స్థలాన్ని గండిపేట మండల ఆర్ఐ, వీఆర్వోల ఆధ్వర్యంలో డిజిటల్ సర్వే నిర్వహించడం కొసమెరుపు. స్థానికుడు కృష్ణాగౌడ్ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలంటూ ఇటీవల ఫిర్యాదు చేయడంతో ఈ సర్వే చేపట్టారు. ఈ సర్వే వివరాలను 3–4 రోజుల్లో వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ఒక్కో ఎకరం దాదాపు రూ. 8 కోట్ల వరకు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. అక్రమార్కులు దాదాపు రూ. 50 కోట్ల విలువైన స్థలాన్ని మింగేసినా యంత్రాంగం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్ఐ వాణిరెడ్డిని వివరణ కోరగా.. కొన్నిరోజుల్లో సర్వేకు సంబంధించిన రిపోర్టు వస్తుందని, దాని ద్వారా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
బహుళ అంతస్తుల ప్రేమ..!
సాక్షి, నెల్లూరు: ఉదయగిరిలో టీడీపీ నేత బరితెగింపు హద్దులు దాటింది. ప్రభుత్వ భూములు కజ్జా చేసి పెద్దపెద్ద భవంతులు నిర్మాణం చేసుకున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఆక్రమించి భవంతి నిర్మాణం చేసుకుంటున్నా రెవెన్యూ అధికారులు మాత్రం అడ్డుకొనే ప్రయత్నం చేయలేకపోయారు. ఉదయగిరి మండలం కొండాయపాళెం రెవెన్యూ పరిధిలో గంగిరెడ్డిపల్లి సమీపంలోని సర్వే నంబరు 533/2లో ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక టీడీపీ మండల స్థాయి నేత మన్నేటి వెంకటరెడ్డి తండ్రి మన్నేటి పాపిరెడ్డి దశాబ్దకాలం క్రితం ఆక్రమించి రేకుల షెడ్ నిర్మాణం చేశాడు. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఖరీదైన భూమి కావడంతో సదరు టీడీపీ నేత తన తండ్రి ఆక్రమణలో ఉన్న సర్వే నంబర్‌లోనే అదనంగా 0.43 ఎకరాల భూమిని కూడా కజ్జా చేశారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఆయన కనుసన్నలో పని చేసేవారు కావడంతో దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే భూమిని ఆక్రమించినా అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు అత్యంత సన్నిహిత నేత కావడంతో రెవెన్యూ అధికారులు సైతం భూకజ్జాపై చర్యలు చేపట్టలేదు. ఆక్రమిత భూమిలో భారీ భవంతి నిర్మాణం టీడీపీ నేత అక్రమించిన భూమిలో బహుళ అంతస్తు భవనాన్ని నిర్మించారు. గత ఏడాది కాలంగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక భారీగానే డీల్ కుదిరినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.2 కోట్లు విలువైన భూమిని కజ్జా చేసి రూ. కోటి విలువైన అక్రమ కట్టడం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలకు తావిస్తుంది. 40 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా ఇదే నేత మండలంలోని కొండాయపాళెం రెవెన్యూ పరిధిలోని దాదాపు 40 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు స్థానికులు తెలిపారు. తన బినామీల పేర్లతో రెవెన్యూ రికార్డులను తారు మారు చేయించి సొంతం చేసుకుని జామాయిల్ పంట సాగు చేశారని తెలిసింది. ఆయా ప్రభుత్వ భూములకు డీ–ఫారం పట్టాలు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలించలేదని తెలిసింది. ఓ పేద రైతు సెంటు భూమి ఆక్రమిస్తే కర్రపెత్తనం చేసే రెవెన్యూ యంత్రాంగం కోట్లు విలువచేసే భూమిని టీడీపీ నేత యథేచ్ఛగా కజ్జా చేసినా అధికారులు మౌనం దాల్చిన తీరు విమర్శలకు తావిస్తోంది జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా.. టీడీపీ నేత భూకజ్జాలపై గతంలో స్థానిక మండలాధ్యక్షుడు చేజర్ల సుబ్బారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం లేదని ఆయన ఆరోపించారు. పలుమార్లు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేసినా కూడా సదరు టీడీపీ నేత అక్రమితి భూమిలో బహుళ అంతస్తు భవన నిర్మాణం అధికారులు నిలువరించలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేత కావడంతో భూకజ్జాదారుడిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనకంజ వేశారన్నారు. అదే సన్నకారు రైతు సెంటు భూమిని అక్రమిస్తే వెంటనే దండించే అధికారులకు టీడీపీ నేత భూకజ్జా కనిపించపోవడం దారుణమన్నారు. -
కాదేది ఆక్రమణకు అనర్హం ..
సాక్షి, బల్లికురవ: శ్మశాన వాటికల అభివృద్ధికి ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరు అవుతున్నా పాలకులు, అధికారులు శ్రద్ధ వహించటంలేదు. మంజూరైన నిధులు సైతం రద్దయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 20 గ్రామాల్లో శ్మశానాలు ఆక్రమణలు, చిల్లచెట్లతో మూసుకుపోయి రహదారి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. జన్మభూమి, మా ఊరు గ్రామసభల్లో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు,మండల స్థాయి అధికారులకు ఆయా గ్రామాల్లోని ప్రజలు లిఖితపూర్వకంగా అర్జీలు పెట్టుకున్నా అతీగతిలేదు. కూకట్లపల్లిలో... కూకట్లపల్లి ఎస్సీ శ్మశాన వాటికకు ఎకరా 28 సెంట్ల భూమి ఉంది. ఆక్రమణలతో ఈ భూమి కుచించుకుపోయింది. చిల్లచెట్లు పెరిగి కాలనీ నుంచి శ్మశానానికి వెళ్లేదారి అధ్వాన స్థితికి చేరింది. మనిషి చనిపోతే బతికున్నవారికి నరకయాతన తప్పటంలేదు. ఇటీవల కాలనీలో సురభి అంజయ్య చనిపోతే బంధువులు, కాలనీవాసుల పడిన వెతలు వర్ణనాతీతం. ఈ ఏడాది జనవరి 4 న జరిగిన జన్మభూమి, మాఊరు గ్రామసభకు ఎమ్మెల్యే రవికుమార్ హాజరయ్యారు. కాలనీవాసులు సురభి మహేష్, వేల్పుల అబ్రహం, ముట్లూరి ఎల్లయ్య, గొల్లపూడి అంజయ్యలు శ్మశానానికి వెళ్లే రహదారిని అభివృద్ధి చేయాలని విన్నవించారు. గ్రామ పంచాయతీ నిధుల్లో రూ.3 లక్షలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ హామీ అడుగు మందుకుపడలేదు. ఎదురు చూసిచూసి ఫలితం లేకపోవడంతో కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో నేతలకు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్తామని ప్రజలు అంటున్నారు. మిగిలిన గ్రామాల్లో కూడా అవస్థలే : బల్లికురవలోని హిందూ, క్రిష్టియన్ శ్మశాన వాటికలు ఆక్రమణలకు గురయ్యాయి. మల్లాయపాలెం, ఉప్పమాగులూరు, కొమ్మినేనివారిపాలెం, వీకొప్పెరపాడు, చెన్నుపల్లి, రామాంజనేయపురం, వైదన, గొర్రెపాడు, కొణిదెన, గంగపాలెం, వేమవరం గ్రామాల్లోని స్మశాన వాటికలు ఆక్రమణలతో పాటు శ్మశానానికి వెళ్లే రహదారి వసతి కూడా అంతంత మాత్రంగానే ఉంది. -
అధికార భూమాయ
శ్రీకాళహస్తి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు నడుం బిగించిన తరుణంలో అధికార పార్టీ నాయకులు అప్పనంగా పరిహారం పొందేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను ఆక్రమించుకునేశారు. రెవెన్యూ అధికారులతో కలసి తమ అనుభవంలోనే ఈ భూములు ఉన్నట్లు కనికట్టు చూపుతున్నారు. శ్రీకాళహస్తి రూరల్: వెలంపాడు పంచాయతీలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఏకమై ఈ ఏడాది జూలై నెలలో ఓ ప్రైవేటు సర్వేయర్ సాయంతో సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం ఓ రెవెన్యూ అధికారిని మచ్చిక చేసుకుని చెట్టుపుట్ట కొట్టి తీర్చుకుని 60 ఎకరాలు పంచుకుని దర్జాగా మినుము పంట సాగుచేసిన ఘటన మండలంలోని వెలంపాడులో తాజాగా వెలుగు చూసింది. గతేడాది ఇవే భూములను ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించగా అప్పట్లో సాక్షి దినపత్రికలో భూ ఆక్రమణలపై కథనాలు రావడతో అప్పటి తహశీల్దార్ చంద్రమోహన్ అడ్డుకట్ట వేశారు. అరుుతే నాలుగు నెలల కిందట ఇక్కడ పనిచేస్తున్న తహశీల్దార్ బదిలీపై వెళ్లడం, దీనికి తోడు భూ సేకరణకు సంబంధించి ప్రక్రియ మండలంలో జోరుగా జరుగుతున్న నేపథ్యంలో మరోసారి టీడీపీ తమ్ముళ్లు పరిహారం కోసం జిమ్మిక్కులు చేస్తున్నారు. రూ.6 కోట్లు పై మాటే మన్నవరం భెల్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో వెలంపాడు రెవెన్యూ పరిధిలో 178, 185 వ బ్లాక్‌లో 225 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో 150 ఎకరాల భూమిని ప్రభుత్వం రెండేళ్ల కిందట ఏపీఐఐసీకి అప్పగించింది. అప్పట్లో ఏపీఐఐసీ మేనేజర్ ప్రతాప్, అప్పటి తహశీల్దార్ చంద్రమోహన్‌తో కలసి భూములను పరిశీలించి భూములకు సంబంధించి రికార్డులను సిద్దం చేసి, వారికి అందించారు. అరుుతే తాజా భూసేకరణ నేపథ్యంలో ఆక్రమణ చోటు చేసుకుంది. ఓ రెవెన్యూ అధికారి సహకారంతో ఇదే అదునుగా భావించి వెలంపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బ్లాక్ నంబర్ 178లో దామరాకులగుంట నుంచి మామిడిగుంటకు వెళ్లేదారిలో 30 ఎకరాలు, అదే బ్లాక్‌లో రేపల్లికండ్రిగ చెరువు వద్ద 30 ఎకరాలు దర్జాగా ఆక్రమించారు. అనంతరం జేసీబీ యంత్రాలు పెట్టి చెట్టు, పుట్ట కొట్టి ప్రభుత్వ భూములను తీర్చేశారు. వారం రోజుల కిందట ఆ భూములను చదును చేసి మినుము పంట సాగుచేశారు. ఈ ఆక్రమిత భూములు విలువ రూ.6 కోట్లు పైమాటే. ఏపీఐఐసీకి అప్పగించారని తెలిసినా ఖాతరు చేయకుండా గత వారం రోజుల నుంచి ఇదే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. కొంత మంది స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించినా వారు పట్టించుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీఐఐసీ పరిశ్రమలు తీసుకొచ్చేలోపు ఆ భూముల్లో పంటలు సాగుచేసి భూ సేకరణ బృందానికి తమ పేర్లను సూచించి అనుభవం డబ్బులు కాజేయాలని రచించిన పన్నాగం పూర్తరుుంది. అనుభవంలోకి మార్చడానికి ప్రయత్నాలు వెలంపాడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా 60 ఎకరాల్లో చెట్లను తొలగించి ఏదో ఒక పంట సాగు చేస్తే అనుభవం కింద మార్చివేస్తానని ఓ రెవెన్యూ అధికారి టీడీపీ తమ్ముళ్లకు భరోసా ఇచ్చారని సమాచారం. వచ్చిన పరిహారంలో రెవెన్యూ అధికారికి వాటా ఇచ్చేలా రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం . మాకు సంబంధం లేదు ఏపీఐఐసీకి భూములు అప్పగించాక వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిదే. ఇప్పుడు ఆ భూములపై మాకు ఎలాంటి సంబంధం లేదు. సంఘటనా స్థలానికి రెవెన్యూ సిబ్బందిని పంపించి విచారిస్తాం. తర్వాత ఏపీఐఐసీ అధికారులకు సమాచారం అందిస్తాం. - రమేష్‌బాబు, తహశీల్దార్, శ్రీకాళహస్తి -
'ఆత్మహత్యకు అనుమతివ్వండి'
భూమి కబ్జా చేస్తున్నారు.. న్యాయం జరగడం లేదు చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీరామినేని చిట్టి ఆవేదన హైదరాబాద్: తన పొలాన్ని కొంత మంది ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని, ఈ విషయమై పోలీసులకు, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చిత్తూరు జిల్లా, గుడిపాల మండలం, శ్రీనివాసపురానికి చెందిన శ్రీరామినేని చిట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదని, ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నానని, ఇందుకు భారత ప్రభుత్వం అనుమతించాలని ఆమె అభ్యర్థించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ తమ గ్రామంలో మూడేళ్ల కిందట తన భర్త వెంకటాచలంనాయుడు మూడెకరాల పొలాన్ని కొన్నారన్నారు. కొన్న ఆరు నెలల నుంచి అదే ఊరికి చెందిన పరంధామనాయుడు, శేఖర్‌బాబులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఈ విషయమై కోర్టును ఆశ్రయించగా కోర్టు సైతం తమకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని వెల్లడించారు. కోర్టు ఆదేశాలనూ లెక్కచేయకుండా వారు తమ పొలంలో చొరబడి సాగు చేసుకున్న పంటను నాశనం చేయడంతోపాటు లేగదూడను కొట్టి చంపారని వాపోయారు. తన భర్త అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉన్నారని, తాను కూడా అప్పుల పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై పోలీసులను ఆశ్రయిస్తే వారు కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నారని, రెవెన్యూ అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందారు. -
టీడీపీ కార్యాలయానికి అక్రమ పునాది!
గుంటూరులో వెయ్యి గజాలు లీజుకు తీసుకుని మరో 1,637 గజాలు ఆక్రమణ ఆక్రమణ భూమిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి సన్నాహాలు మైకు దొరికితే నీతి, నిజాయతీ గురించి మాట్లాడే చంద్రబాబు.. తాను అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కోసం రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించేందుకు అక్రమ పునాదులు వేస్తున్నారు. చేతిలో అధికారం ఉందికదా అనే ధీమాతో ఏకంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి, పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి, గుంటూరు: అధికార పార్టీ టీడీపీ వ్యవహారశైలి కంచే చేను మేసిన చందంగా తయారైంది. గుంటూరులో ఆ పార్టీ 16 ఏళ్ల క్రితం కబ్జా చేసిన కార్పొరేషన్ స్థలంలో ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ప్రస్తుతం ఆక్రమణలో ఉన్న స్థలంతోపాటు చుట్టు పక్కల స్థలాలపైనా కన్నేసింది. గతంలో అధికారంలో ఉన్నపుడు 1999లో గుంటూరులోనే ఖరీదైన ప్రాంతం అరండల్‌పేట పిచుకులగుంటలో జిల్లా టీడీపీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. దీనికోసం టీఎస్ నంబరు 826లో వెయ్యి చదరపు గజాల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. దీనికి అప్పటి ప్రభుత్వం 1999 జూలై 1న జీవో ఎంఎస్ నం. 325 ద్వారా 30 ఏళ్లపాటు ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చింది. ఏడాదికి రూ. 25 వేల చొప్పున నగరపాలక సంస్థకు అద్దె చెల్లిస్తూ, ప్రతి మూడేళ్లకొకసారి లీజును రెన్యువల్‌తో పాటు 33 శాతం అద్దె పెంచాలని అందులో పేర్కొంది. అయితే లీజు స్థలం పక్కనే సర్వే నం 12/3లో మరో 1,637 చదరపు గజాల స్థలాన్ని సైతం ఆక్రమించి ప్రహరీ నిర్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఒక్క చదరపు గజం స్థలం రూ.1.25 లక్షల వర కు ధర పలుకుతోంది. దీని ప్రకారం చూస్తే మొత్తం స్థలం విలువ దాదాపు రూ.20 కోట్లు. అప్పట్లోనే ఈ ఆక్రమణను నగరపాలకసంస్థ గుర్తించినప్పటికీ టీడీపీ అధికారంలో ఉండటంతో దాని జోలికెళ్లలేదు. 2008లో తిరిగి దీనిపై ఫిర్యాదులు రావడంతో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడితో నగరపాలక సంస్థ అధికారులు కదిలారు. సిటీప్లానర్ విచారణ జరిపి ఆక్రమణ జరిగినట్లు తేల్చారు. ఆయన నివేదిక ఆధారంగా టీడీపీ జిల్లా కార్యాలయానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుకు అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వివరణ ఇచ్చారు. కార్యాలయం పక్కన గుంతలుగా ఉన్న స్థలాన్ని చదును చేసి పార్కింగ్ కోసం ఆక్రమించామని ఒప్పుకున్నారు. ఆక్రమించిన స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ నగరపాలకసంస్థ అధికారులకు లేఖ రాశారు. దీనికి కౌన్సిల్ ఆమోదం తెలపలేదు. అయినా ఆ స్థలం టీడీపీ ఆక్రమణలోనే ఉండిపోయింది. లీజుకు తీసుకున్న స్థలానికి ఏడాదికి ప్రస్తుతం రూ. 89,881 చెల్లిస్తున్నారు. 16 ఏళ్లుగా టీడీపీ ఆక్రమణలో ఉన్న 1,637 గజాల ప్రభుత్వ స్థలానికి సంబంధించి ఒక్కపైసా కూడా చెల్లించలేదు. లీజుకు అనుమతి లేకపోవడంతోనే రుసుము చెల్లించలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. లీజుకు తీసుకున్న స్థలం ప్రకారం చూసినా ఆక్రమించిన స్థలానికి సంబంధించి కార్పొరేషన్ దాదాపు పన్నెండున్నర లక్షల ఆదాయం కోల్పోయింది. లోకేశ్ కనుసన్నల్లో సన్నాహాలు.. రాష్ట్ర విభజన నేపథ్యంలో నూతన రాజధాని నిర్మాణ ప్రాంతం గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత తనయుడు లోకేశ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దాని కోసం స్థల పరిశీలనకు కొద్ది రోజుల క్రితం ఆయన గుంటూరుకు రావాల్సి ఉన్నా.. రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాట ఘటనతో పర్యటన వాయిదా పడింది. ఇప్పటికే లోకేశ్ వ్యక్తిగత సిబ్బందితోపాటు రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేయించిన సిద్ధాంతి సైతం జిల్లా టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించి కొలతలు తీసుకెళ్లారు. ఇప్పుడు అక్కడ టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటైతే ఆ పార్టీ ఆక్రమించిన స్థలం సైతం పూర్తిగా వారి అధీనంలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. -
రెవెన్యూ సిబ్బందిపై భూ మాఫియా దాడి
అధికారపార్టీ అండతో వీఆర్వో, వీఆర్ఏను చితకబాదిన కబ్జాదారులు మంగళగిరి: రెవెన్యూ అధికారులపై అక్రమార్కులు, కబ్జాదారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు, కృష్ణా జిల్లా ముసునూరు తహసీర్దార్లు నారాయణమ్మ, వనజాక్షిలపై అధికార పార్టీ నేతలు చేసిన దాడుల తీవ్రత చల్లారకముందే గుంటూరు జిల్లా మంగళగిరి లో ఆదివారం వీఆర్వోపై భూ కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. మండల పరిధిలోని ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిని అనుకుని ఉన్న సర్వే నంబరు 366లో అదే గ్రామానికి చెందిన బొమ్ము ఉమామహేశ్వరరెడ్డితోపాటు మరో ఇద్దరికి ప్రభుత్వం గతంలో 65 సెంట్లకు డీ పట్టాలు మంజూరు చేసింది. ఈ భూమి రికార్డు ల్లో మాత్రం వాగు పోరంబోకుగా నమోదుగా ఉంది. మంగళగిరికి చెందిన కొందరు అందులోని 20 సెంట్లకు నకిలీ దస్తావేజులు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నించగా అనుభవదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పిలిపించి న పోలీసులు, ఆ భూమి విషయం తేల్చేవరకు అక్కడ అడుగుపెట్టవద్దని హెచ్చరిం చారు. అధికార పార్టీ నేతల అండతో రెచ్చిపోయిన భూ మాఫి యా ఆదివారం స్థలం లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో స్థానిక తహశీల్దార్ వీఆర్వో శ్రీనివాసరావును పరిశీలనకు పంపారు. వీఆర్ఏ చలపతిరావుతో కలిసి స్థలం వద్దకు వెళ్లిన వీఆర్వో.. నిర్మాణాలు ఆపాలని వారికి సూచించారు. అక్కడే వున్న కరిముల్లాతో పాటు మరో ఐదుగురు రెవెన్యూ సిబ్బందిని దూషించడంతో ఘర్షణ మొదలైంది. దీంతో రెచ్చిపోయిన ఆరుగురు వీఆర్వో , వీఆర్ఏలపై దాడి చేశారు. కాగా, దాడికి నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తం గా వీఆర్ఏలు, వీఆర్వోలు విధులు బహిష్కరిస్తున్నట్లు సంఘం నేతలు తెలిపారు. -
అక్రమ నిర్మాణాలు తొలగింపు
హైదరాబాద్: నగరంలో శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారిలో దేవాదాయశాఖ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. గత 35 సంవత్సరాలుగా ఓ వ్యాపారి ఈ ఆలయ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టి సంబంధిత అధికారులకు కొరక రాని కొయ్యగా తయారయ్యాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న దేవాదాయ శాఖ అధికారులు బంజారాహిల్స్ పోలీసుల సహాయంతో అక్రమంగా నిర్మించిన కూరగాయల దుకాణాన్ని తొలగించారు. ఆక్రమణను కూల్చివేసే సమయంలో కబ్జాదారులు తీవ్రంగా ప్రతిఘటించారు. పలువురు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ స్థలం ఆలయానికి సంబంధించినదని, అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నామని శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో బాలాజీ తెలిపారు. మూడు గంటల పాటు ఈ కూల్చివేత పనులు చేపట్టారు. కూరగాయల దుకాణం తొలగించిన ప్రాంతంలో వెంటనే సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేస్తామని ఈవో బాలాజీ తెలిపారు. ఈ స్థలం దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నామని వెల్లడించారు. ఇక నుంచి ఇక్కడ తమ పర్యవేక్షణ ఉంటుందని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్థలాన్ని ప్రజాపయోజన కార్యక్రమాలకు వినియోగించాలని శ్రీనగర్ కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. -
ఆక్రమణల్లో శ్మశానాలు
వినుకొండ, న్యూస్‌లైన్ :పురపాలక సంఘ పరిధిలోని శ్మశాన స్థలాలు కనుమరుగవుతున్నాయి. మృతులను పూడ్చేందుకు జాగా లేక నివాస గృహాల మధ్య చేస్తున్న సమాధులు అరుగులుగా మారుతున్నాయి. ఖననం చేసేందుకు జాగా లేక ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి దహన సంస్కారాలు చేస్తున్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని దాతలు విరాళాలుగా ఇచ్చిన శ్మశాన స్థలాలు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. పరిరక్షించాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తుండటంతో పట్టణ పరిధిలోని శ్మశానాలు కాలక్రమేణ కనిపించే పరిస్థితి లేదని అంటున్నారు. స్థానిక తిమ్మాయిపాలెం రోడ్డు 13వ వార్డు పరిధిలో హిందూ శ్మశానం సగానికి పైగా ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లింది.సుమారు ఐదు ఎకరాల వరకు ఉండాల్సిన స్థలం ప్రస్తుతం ఎకరానికి మించి లేదు. ఉన్న స్థలం కూడా అభివృద్ధికి నోచుకోక చెట్టుచేమలతో అధ్వానంగా మారింది. ముళ్లపొదలు, లోతైన గుంతలతో కనిపిస్తుంది. ఆచారాల ప్రకారం ఖననం చేసే హిందూ శ్మశాన వాటిక పట్టణంలో ఇది ఒక్కటే ఉంది. మిగిలిన ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలని పలు మార్లు ప్రజలు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఉన్న స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని లేకుంటే ఆ స్థలం కూడా మిగిలే పరిస్థితి లేదని అంటున్నారు. పిచ్చి చెట్లను తొలగించి అభివృద్ధి చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. నరగాయకుంట వద్ద... అదేవిధంగా వెల్లటూరు రోడ్డులోని నరగాయకుంట వద్ద దాతలు ఇచ్చిన హిందూ శ్మశాన వాటిక ఆక్రమణలకు గురికాగా మిగిలిన ప్రాంతం కూడ వివాదాస్పదంగా మారింది. నివాస గృహాల మధ్య శ్మశానం ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. ఇక స్వీపర్స్ కాలనీలోని క్రిష్టియన్, హిందూ శ్మశాన వాటికలు కనుమరుగయ్యాయి. నివాస గృహాల మధ్య నిర్మించిన సమాధులు ఆప్రాంత వాసులకు అరుగులుగా మారుతున్నాయి. అక్కడ ఉన్న శ్మశాన స్థలం పూర్తిగా ఆక్రమణకు గురికావడంతో బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని చెక్కవాగు వద్ద స్థలం కేటాయించారు. ఇలా పురపాలక సంఘ పరిధిలో శ్మశాన స్థలాలు కబ్జాకు గురవుతున్నా అధికారులు చోద్యం చూస్తుండం వల్ల ఆక్రమణలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయని పక్షంలో భవిష్యత్‌లో మరింత ఇబ్బందులు తప్పవని అంటున్నారు.