'ఆత్మహత్యకు అనుమతివ్వండి'
భూమి కబ్జా చేస్తున్నారు.. న్యాయం జరగడం లేదు
చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీరామినేని చిట్టి ఆవేదన
హైదరాబాద్: తన పొలాన్ని కొంత మంది ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని, ఈ విషయమై పోలీసులకు, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చిత్తూరు జిల్లా, గుడిపాల మండలం, శ్రీనివాసపురానికి చెందిన శ్రీరామినేని చిట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదని, ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నానని, ఇందుకు భారత ప్రభుత్వం అనుమతించాలని ఆమె అభ్యర్థించారు.
శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ తమ గ్రామంలో మూడేళ్ల కిందట తన భర్త వెంకటాచలంనాయుడు మూడెకరాల పొలాన్ని కొన్నారన్నారు. కొన్న ఆరు నెలల నుంచి అదే ఊరికి చెందిన పరంధామనాయుడు, శేఖర్‌బాబులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఈ విషయమై కోర్టును ఆశ్రయించగా కోర్టు సైతం తమకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని వెల్లడించారు. కోర్టు ఆదేశాలనూ లెక్కచేయకుండా వారు తమ పొలంలో చొరబడి సాగు చేసుకున్న పంటను నాశనం చేయడంతోపాటు లేగదూడను కొట్టి చంపారని వాపోయారు. తన భర్త అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉన్నారని, తాను కూడా అప్పుల పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై పోలీసులను ఆశ్రయిస్తే వారు కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నారని, రెవెన్యూ అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన చెందారు.