ఈ ఫొటోల్లో కనిపిస్తున్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమం 2020, అక్టోబర్ 24 నాటిది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించుకుని ఇందులోని రెండెకరాల్లో కళాశాల భవన నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. సుమారు రూ.500 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినప్పటికీ.. తెలుగుదేశం నేత కావడంతో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గీతం యూనివర్సిటీ ప్రహరీ గోడను తొలగించి కబ్జాలో ఉన్న 42.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ అంటే అందమైన నగరం.. మరో పేరు చెప్పమంటే ప్రశాంత తీరం.. అటువంటి మహానగరంలో అవకాశమున్న ప్రతీచోటా రూ.వేల కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను కబ్జాకోరులు చెరపట్టేశారు. వీరిలో అత్యధికులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. ఇప్పుడు వీరి ఆగడాలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్లెంవేస్తూ వారి భరతం పడుతోంది. ఆక్రమణలకు గురైన భూములను విడిపిస్తూ విశాఖ నగరానికి విముక్తి కల్పిస్తోంది. ఇలా ఇప్పటివరకు రూ.5,080 కోట్ల విలువైన సర్కారు భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏళ్లుగా కబ్జాల్లో ఉండి.. ప్రభుత్వ కార్యాలయాల్లో మూలనపడిన భూ రికార్డుల దుమ్ముదులిపి ఈ భూముల లెక్కతేలుస్తున్నారు.
బినామీ పేర్లతో టీడీపీ నేతల భూదాహం
గతంలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు బినామీ పేర్లతో విశాఖ జిల్లా భూములపై తెగబడ్డారు. ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.వేల కోట్లు ఖరీదుచేసే భూములను చెరపట్టేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. టీడీపీ పెంచి పోషించిన భూబకాసురుల ఆక్రమణలపై ప్రభుత్వాధికారులు ఉక్కుపాదం మోపారు. భూ రాబందుల నుంచి రూ.2,600 కోట్లకు పైగా విలువైన 430.81 ఎకరాల భూములను వారి చెర నుంచి విడిపించారు. వీటి మార్కెట్ విలువ ఏకంగా రూ.5 వేల కోట్లకు పైమాటే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక దర్యాప్తు బృందాలతో..
నిజానికి.. విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం జిల్లా రెవెన్యూ అధికారులు మూడేళ్లుగా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటుచేసి.. రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం 270 ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన 430.81 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారు. వీటి ప్రభుత్వ విలువ రూ.2,638 కోట్లు కాగా.. మార్కెట్ విలువ రూ.5 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పదేపదే ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపైనా క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తున్నారు.
పీఠాలు కదులుతున్నాయ్..
అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వేల కోట్లు రూపాయల విలువ చేసే భూములను దోచుకున్న టీడీపీ నేతల భూభాగోతం బట్టబయలైంది. జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ కబ్జాకోరుల కబంధ హస్తాల్లోనివే కావడం గమనార్హం. గయాలు, పోరంబోకు, గోర్జి, కొండ పోరంబోకు, వాగులు, కాలువలు, గెడ్డలు, రాస్తాలు, గుట్టలు, ఇనాం, జిరాయితీ, గ్రామకంఠాలు, చెరువులు.. ఇలా కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా అందినకాడికి తమ గుప్పిట బంధించేశారు. ఇప్పుడు వీరి పీఠాలు కదులుతున్నాయి.
430 ఎకరాలకుపైగా స్వాధీనం
జిల్లాలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను రక్షించే చర్యలను చేపడుతున్నాం. గత మూడేళ్లల్లో జిల్లావ్యాప్తంగా 430 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని రక్షించాం. వీని బేసిక్ విలువ రూ.2,638 కోట్లకు పైగా ఉందని తేలింది. మార్కెట్ ధరలతో లెక్కిస్తే రూ.5 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్కారు భూములను రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.
– వేణుగోపాల్ రెడ్డి, జేసీ, విశాఖపట్నం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment