రూ. 50 కోట్ల స్థలం మింగేశారు!  | Dumping Yard Land Occupied In Rangareddy | Sakshi
Sakshi News home page

రూ. 50 కోట్ల స్థలం మింగేశారు! 

Published Mon, Aug 26 2019 6:41 AM | Last Updated on Mon, Aug 26 2019 6:48 AM

Dumping Yard Land Occupied In Rangareddy - Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌: భూకబ్జాదారులు బరితెగిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఏకంగా డంపింగ్‌ యార్డు స్థలానికి ఎసరు పెట్టారు. మొత్తం 22 ఎకరాల్లో దాదాపు 6 ఎకరాలను ప్లాట్లుగా మార్చి విక్రయించి యథేచ్ఛగా సొమ్ము చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట మండల పరిధిలోని గంధంగూడ సర్వేనంబర్‌ 43లో ప్రభుత్వానికి చెందిన 22.17 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని గతంలో ప్రభుత్వం డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేసేందుకు సిలికాన్‌ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన చెత్తాచెదారాన్ని ఇక్కడ డంప్‌ చేసి రీసైక్లింగ్‌ నిర్వహించేవారు. ఏడు సంవత్సరాల క్రితం ఈ డంపింగ్‌ యార్డు మూతబడింది. అంతకుముందు వేసిన చెత్తచెదారంతో ఆ ప్రాంతం ఓ గుట్టలా మారింది.

అయితే, కొంతకాలంగా కొందరు స్థానిక నేతలు ఈ చెత్తను తొలగించి ప్లాట్లుగా మారి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. చెత్తలోనే గుంతలు తీసి పిల్లర్లు వేసి ఇళ్లను నిర్మిస్తున్నారు. 120 నుంచి 180 గజాల వరకు ప్లాట్లుగా చేసి నిర్మాణాలను ప్రారంభించారు. ఈ నిర్మాణాలకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. డంపింగ్‌ యార్డు స్థలంలోనే నిర్మాణాలను చేపడుతున్న ఇక్కడి కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.

ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఈ స్థలాన్ని గండిపేట మండల ఆర్‌ఐ, వీఆర్వోల ఆధ్వర్యంలో డిజిటల్‌ సర్వే నిర్వహించడం కొసమెరుపు. స్థానికుడు కృష్ణాగౌడ్‌ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలంటూ ఇటీవల ఫిర్యాదు చేయడంతో ఈ సర్వే చేపట్టారు. ఈ సర్వే వివరాలను 3–4 రోజుల్లో వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ఒక్కో ఎకరం దాదాపు రూ. 8 కోట్ల వరకు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. అక్రమార్కులు దాదాపు రూ. 50 కోట్ల విలువైన స్థలాన్ని మింగేసినా యంత్రాంగం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్‌ఐ వాణిరెడ్డిని వివరణ కోరగా.. కొన్నిరోజుల్లో సర్వేకు సంబంధించిన రిపోర్టు వస్తుందని, దాని ద్వారా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement