![People Suffering With Dump Yard](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/444.jpg.webp?itok=7rb1P97o)
సాక్షి, హైదరాబాద్: విస్తరిస్తున్న నగరంతో పాటే చెత్త సమస్యలూ పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ నుంచి గతంలో రోజుకు 3,500 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడగా.. ప్రస్తుతం 7,500 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. దీని నిర్వహణ కోసం జవహర్‌నగర్ డంప్ యార్డుకు తరలిస్తున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తతో ఎంతో కాలంగా అక్కడి పరిసర గ్రామాల ప్రజలు తల్లడిల్లుతున్నారు. చెరువుల కాలుష్యం తగ్గించేందుకు లీచెట్ ట్రీట్‌మెంట్ వంటి పనులు జరుగుతున్నా తమ ఆరోగ్యానికి ముప్పేనని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో నగరంలోని చెత్త మొత్తం ఒకేచోట పోగు పడకుండా ఉండేందుకు నగరానికి నాలుగు వైపులా డంపింగ్ యార్డులు, చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ప్రకటిస్తున్నాయి. దశాబ్దం క్రితం నుంచే ఆ దిశగా చర్యలు ప్రారంభమైనా, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత, నిరసనలతో అవి ముందుకుసాగడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా పరిధిలోకొచ్చే నగర శివార్లలోని ప్యారానగర్‌లో ఏర్పాటు కానున్న చెత్త నిర్వహణ కేంద్రానికీ అదే పరిస్థితి ఎదురవుతోంది. పనులకు సాగనీయకుండా గత నాలుగు రోజులుగా పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
బతుకులు బలి చేస్తారా?
అక్కడ అత్యాధునిక సాంకేతికతతో యూరోపియన్ దేశాల్లోని చెత్త నిర్వహణ పద్ధతుల్ని పాటిస్తామని, దాని వల్ల పరిసరాల్లో ఎలాంటి కాలుష్యం వ్యాపించదని చెబుతున్న జీహెచ్‌ఎంసీ అధికారుల మాటల్ని ప్రజలు విశ్వసించడం లేదు. నగరంలోని చెత్తతో తమ బతుకులు బలి చేస్తారా? అని ప్రశి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏం కానుందన్నది మున్ముందు తేలనుంది.
అక్కడ ఏర్పాటు కానున్న చెత్త నిర్వహణ కేంద్రం గురించి జీహెచ్‌ఎంసీ అధికారులేమంటున్నారంటే..
⇒ అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీతో ఏర్పాటు కానున్న ప్లాంట్‌లో అడ్వాన్స్‌డ్ డ్రై అనరోబిక్ బయోమిథనేషన్ టెక్నాలజీ (డీఏబీటీ)తో తడిచెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కంపోస్టు ఎరువు తయారవుతుంది.
⇒ఆర్‌డీఎఫ్(రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫూయెల్) ప్రాసిసెంగ్ తో పొడిచెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
⇒ జవహర్‌నగర్‌లో పుష్కరకాలంగా పేరుకుపోయిన చెత్తతో దుర్వాసన, కాలుష్యం వంటి సమస్యలుండగా, ప్యారానగర్ ప్లాంట్‌లో అలాంటి సమస్యలుండవు.
⇒ చెత్త అనేది అసలు నిల్వ లేకుండానే ఎప్పటికప్పుడు ప్రాసెస్ అవుతుంది. చెత్త బహిరంగంగా కనిపించదు.
⇒ డీఏబీటీతో వెలువడే బయోగ్యాస్‌ను ఇంధనంగా లేదా విద్యుత్ ఉత్పత్తికి వినియోగించవచ్చు. ఆర్‌డీఎఫ్‌ను విద్యుత్ తయారీకి ఉపయోగిస్తారు.
⇒ ఈ ప్లాంట్‌లో పనులన్నీ భూమిలోపల బంకర్లలో, మూసివేసిన షెడ్లలో జరుగుతాయి. చెత్త రవాణా సైతం ఆయిల్ ట్యాంకర్ల మాదిరిగా పూర్తిగా మూసి ఉండే వాహనాల ద్వారా జరుగుతుంది. గాలిని కూడా బయో ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేయడం వల్ల ఎలాంటి దుర్వాసనలు రావు.
⇒ డ్రై డైజెసన్ టెక్నాలజీ వల్ల లీచెట్ (విష జలాల) సమస్య ఉండదు. చెత్త నిర్వహణలో పర్యావరణపరంగా మేలైనది. అక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్ స్థానిక అవసరాలకు సరిపోతుంది.
⇒ రోజుకు 2 వేల మెట్రిక్ టన్నుల చెత్తతో 15 మెగావాట్ల విద్యుత్, 270 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది.
చెత్తను మోయలేని జవహర్‌నగర్
నగరం నుంచి ప్రస్తుతం వెలువడుతున్న దాదాపు 7,500 మెట్రిక్ టన్నుల చెత్తతో పాటు శివార్లలోని మున్సిపాలిటీల చెత్త అక్కడికే వెళ్తోంది. జవహర్‌నగర్‌ఫై పడుతున్న ఈ భారాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా నలువైపులా చెత్త నిర్వహణ ఏర్పాటు కేంద్రాలకు ఎప్పటినుంచో ఆలోచనలున్నాయి.
జీహెచ్‌ఎంసీలో ఒక వ్యక్తి నుంచి రోజుకు వెలువడుతున్న చెత్త
2019లో 500 గ్రాములు
2024లో 733 గ్రాములు
జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలుతున్న చెత్త
2014లో 3,500 మెట్రిక్ టన్నులు
2024లో 7,500 మెట్రిక్ టన్నులు
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ చెత్త 9వేల మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. నగరానికి నాలుగువైపులా డంపింగ్ కేంద్రాలు, చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటుతో జవహర్‌నగర్‌పై భారం తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment