Worst problem
-
అంతా వాళ్లే చేశారు..!
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు దుర్భర పరిస్థితులను చవిచూశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. దెబ్బతిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను బాగు చేయడమే తన ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్‌లో.. ‘భారత ఆర్థిక వ్యవస్థ: సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. యూపీఏ–2 పాలనలో 2013 సెప్టెంబర్ 4 నుంచి 2016 సెప్టెంబర్ 4 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా, 2012 ఆగస్ట్ 10 నుంచి 2013లో ఆర్బీఐ గవర్నర్ అయ్యే నాటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా రఘురామ్‌రాజన్ పనిచేశారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలను మంత్రి సీతారామన్ తన ప్రసంగంలో ఎండగట్టారు. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రాణవాయువు అందించడమే భారత ఆర్థిక మంత్రి ప్రాథమిక విధి. ఈ ప్రాణవాయువు అన్నది రాత్రికి రాత్రి రాదు’’ అని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో రాజన్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఆర్థిక రంగానికి సంబంధించి చెప్పుకోతగ్గది ఏదీ చేయలేదంటూ విమర్శించారు. ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకృతమైందని, ఆర్థి క వృద్ధికి సంబంధించి నాయకత్వానికి స్పష్టమైన విధానం లోపించిందన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎదురైన ప్రశ్నకు సీతారామన్ గట్టిగానే బదులిచ్చారు. ఫోన్ కాల్స్‌తో రుణాలు ‘‘ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ హయాంలో సన్నిహిత నేతల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌తో రుణాలు మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు నాటి ఊబి నుంచి బయటకు వచ్చేందుకు నేటికీ ప్రభుత్వం అందించే నిధులపై ఆధారపడుతున్నాయి. ఎంతో ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం (మన్మోహన్సింగ్) కారణంగా భారీ స్థాయి అవినీతి చోటుచేసుకుంది. భారత్ వంటి వైవిధ్య దేశానికి గట్టి నాయకత్వం కావాలి. మరీ ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం అంటే నాకు భయమే. ఎందుకంటే అవినీతి తాలూకూ దుర్గంధాన్ని అది విడిచి వెళ్లింది. దాన్ని ఈ రోజూకీ శుద్ధి చేస్తున్నాం’’ అంటూ యూపీఏ పాలనను నిర్మలా సీతారామన్ విమర్శించారు. రాజన్‌ను తాను ఎగతాళి చేయడం లేదని, విద్యావంతుడైన ఆయన్ను గౌరవిస్తానంటూనే, వాస్తవాలను తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించినందుకు రాజన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, బ్యాంకులు నేడు ఏ స్థితిలో ఉన్నాయో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు రూ.8,06,412 కోట్లుగా ఉన్నాయి. గత మార్చి నాటికి ఉన్న రూ.8,95,601 కోట్లతో పోలిస్తే రూ.89,189 కోట్లు తగ్గాయి. -
చెత్తను చితకేయండి
ఇంట్లో చెత్తా చెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవడం పెద్ద తలనొప్పి వ్యవహారం. ఇంట్లో డస్ట్బిన్లు ఉంటాయి. ఒక్కోసారి చెత్త వాటికి మించే ఉంటుంది. చెత్త తీసుకుపోయే మునిసిపాలిటీ బళ్లు రెండు మూడు రోజులు రాలేదంటే ఇక ఆ బాధ చెప్పనలవి కాదు. ఇంట్లోను, వంటింట్లోను అంతకంతకు చెత్త పరిమాణం పెరగడమే కాదు, చెత్త చుట్టూ దోమలు, ఈగలు, బొద్దింకల వంటి జీవుల సంచారం కూడా విపరీతంగా పెరుగుతుంది. వాటి ధాటికి నానా రోగాలూ చుట్టుముడతాయి. ఇలాంటి చెత్త సమస్యకు పరిష్కారమే ఈ ‘కిచెన్ ఎయిడ్’ ట్రాష్ కాంపాక్టర్. మామూలుగా ఐదు చెత్త సంచుల్లో పట్టేంత చెత్తను ఇందులో వేస్తే, క్షణాల్లోనే అది ఒక సంచిలో పట్టేంతగా కుదించుకుపోతుంది. ఎలాంటి చెత్తనైనా ఇది క్షణాల్లోనే నజ్జు నజ్జు చేసేస్తుంది. ఇందులోని ‘ఆడర్ మేనేజ్మెంట్ సిస్టమ్’ పనితీరు వల్ల చెత్త నుంచి దుర్గంధం కూడా వెలువడకుండా ఉంటుంది. ఇళ్లల్లోని చెత్త సమస్యకు చెక్ పెట్టాలంటే, ఇలాంటి పరికరం ఉండాల్సిందే! -
పని చేయకపోతే సెలవులో పంపిస్తాం
బీబీఎంపీ అధికారులకు మంత్రి రామలింగారెడ్డి హెచ్చరిక బెంగళూరు(బనశంకరి) : నగరంలో చెత్త సమస్య, పోస్టర్లు, ఫ్లెక్సీలను నియంత్రించని అధికారులను సెలవుపై ఇళ్లకు పంపుతామని బెంగళూరు ఇన్చార్జి మంత్రి రామలింగారెడ్డి హెచ్చరించారు. సాథనిక మల్లేశ్వరంలోని ఐపీపీ సభాంగణంలో రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖా మంత్రి దినేష్ గుండూరావు, ఎమ్మెల్యేలు, పాలికె సీనియర్ అధికారులతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. రహదారులపై మట్టి కుప్పలు, చెత్త రాశులు కనిపిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయంలో పదేపదే హైకోర్టు నుంచి అక్షింతలు వేసుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. నగరంలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని అధికారులకు హితవు పలికారు. పలు కార్యక్రమాల సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లను బాధ్యులపై చర్యలు చేపట్టి అపరాధ రుసుం వసూలు చేయాలని సూచించారు. ఇందుకు ఏఆర్ఓ నేతృత్వం వహించి, జాయింట్ కమిషనర్, ఉప విభాగ అధికారి, పోలీస్ అధికారులతో సభ నిర్వహించి, పోస్టర్ల తొలగింపునకు చర్యలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే సురేష్ కుమార్ మాట్లాడుతూ... నగరంలో ఏర్పాటు చేసిన మొబైల్ టవర్ల వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ స్పందిస్తూ మొబైల్ టవర్ల నియంత్రణ పాలికె పరిధిలోకి రాదన్నారు. అయితే టవర్లు ఏర్పాటు చేసేవారిపై నిఘా వహించాలని అధికారులకు సూచిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే గోపాలయ్య, మేయర్ శాంతకుమారి, డిప్యూటీ మేయర్ కే.రంగణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
స్పెయిన్ కంపెనీకి ‘చెత్త’ బాధ్యతలు!
బెంగళూరు : చెత్త డంపింగ్ యార్డ్ నిర్వహణ బాధ్యతలను స్పెయిన్ దేశానికి చెందిన కంపెనీకి అప్పగించాలని బీబీఎంపీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు వచ్చే పాలికె సర్వసభ్య సమావేశంలో తగిన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. బీబీఎంపీ మేటర్ కట్టే సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ ఇందిరా, పాలికె పరిపాల విభాగం నాయకుడు అశ్వథ్ నారాయణగౌడ, పాలికె ప్రతిపక్ష నేత మంజునాథరెడ్డి, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెయిన్ కంపెనీ అధికారులతో బుధవారం సాయంత్రం చర్చించారు. రోజూ సుమారు 1,000 టన్నుల చెత్తను డంప్ చేస్తే విద్యుత్ ఉత్పత్తి చేస్తామని, అయితే ఆ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి 18 నెలలు పడుతుందని స్పెయిన్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో కౌన్సిల్ సభలో, రాష్ట్ర ప్రభుత్వంతో దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మేయర్ కట్టే సత్యనారాయణ తెలిపారు. నేడు సీఎం సమావేశం మండూరు చెత్త సమస్యపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన క్యాంపు కార్యాలయం కృష్ణలో అధికారులతో శుక్రవారం సమావేశం కానున్నారు. బెంగళూరు నగర ఇన్చార్జ్ మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ కమిషనర్ లక్ష్మినారాయణ, మేయర్ కట్టే సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ ఇందిరా తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. చెత్త తరలింపుపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. -
‘సీమ రాజధాని’కి చిక్కుసమస్య
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : కోనసీమ రాజధాని వంటి అమలాపురంలో రెండు దశాబ్దాలుగా ‘చెత్త సమస్య’ తిష్ట వేసింది. 7.02 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 54 వేల మంది జనాభాతో, గ్రేడ్-1 మున్సిపాలిటీ అయిన పట్టణంలో ఈ సమస్యను విరగడ చేయడంలో ఇటు అధికారులు, అటు ప్రజా ప్రతినిధులు విఫలమవుతున్నారు. 11 వేల నివాస గృహాల నుంచి రోజూ సేకరించే 40 టన్నుల చెత్తను పోయడానికి అవసరమైన కంపోస్టు యార్డుకు జాగాయే గగనమైంది. చెత్త డంపిం గ్‌కు అవసరమైన స్థలం లేక పట్టణవాసులు ఎదుర్కొంటున్న అసౌకర్యం అంతా ఇంతా కాదు. ఈ సమస్య ఇంత జటిలంగా మారడానికి మున్సిపాలిటీ అధికారులే కాక.. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ఎన్నికవుతూ వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా బాధ్యులే. మున్సిపాలిటీకి పలు చోట్ల సొంత స్థలాలు ఉన్నా చాలీచాలని పరాయి స్థలాన్ని కంపోస్టు యార్డుగా ఉపయోగిస్తూ చెత్త సమస్యను సాగదీస్తూ వస్తోంది. సొంత స్థలంలోకి వెళ్లేందుకు మున్సిపల్ అధికారులు చొరవ చూపరు. ఒకవేళ చొరవ చూపినా రాజకీయ నాయకులు అవాంతరాలు సృష్టించి, సమస్యను ‘చివికిపోని ప్లాస్టిక్ వ్యర్థం’లా మిగుల్చుతున్నారు. చాలీచాలని జాగాలో.. మున్సిపాలిటీ ప్రస్తుతం బైపాస్ రోడ్డు వద్ద, శ్మశానం చెంతన, పంట కాల్వ పక్కనున్న నీటి పారుదల శాఖ స్థలంలో కంపోస్టు యార్డు నిర్వహిస్తోంది. రోజూ సేకరించే 40 టన్నుల చెత్త తెచ్చి పోసేందుకు ఈ కొద్దిపాటి స్థలం మాత్రం సరిపోవటంలేదు. దీంతో చెత్త కుప్పలుకుప్పలుగా బైపాస్ రోడ్డు మార్జిన్ వరకు, యార్డును ఆనుకుని ఉన్న శ్మశానంలోకి విస్తరిస్తోంది. ఓపక్క నీటిపారుదల శాఖ తమ స్థలాన్ని ఇచ్చేయమని డిమాండ్ చేస్తుండగా మరోపక్క ప్రజలు శ్మశానం చెంత నుంచి డంపింగ్ యార్డును వేరొక చోటకు తరలించాలంటూ నిరసనలకు దిగుతున్నారు. స్థానిక గోశాల ప్రతినిధి పోతురాజు రామకృష్ణ ఈ సమస్యపై నిరవధిక దీక్ష చేయగా ప్రజలు రాస్తారోకో చేశారు. ఈ ఒత్తిడితో మున్సిపాలిటీ గతంలో పట్టణ సమీపంలోని రూరల్ మండల పరిధిలోకి వచ్చే భట్లపాలెంలో పదెకరాల భూమిని సేకరించి అక్కడికి డంపింగ్‌యార్డును తరలించాలనుకుంది. అయితే కొందరు రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రయత్నానికి గండి పడింది. వెనక్కు పోయిన రూ.అరకోటి నిధులు : డంపింగ్‌యార్డు నిమిత్తం మరోచోట భూమి సేకరణకు 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరైనా సకాలంలో వాటిని ఖర్చుచేయకపోవడం వల్ల వెనక్కు పోయాయి. మున్సిపాలిటీ మళ్లీ డంపింగ్ యార్డు స్థల సేకరణ ఊసే మరిచింది. సమస్య మాత్రం రోజురోజుకూ తీవ్రతరమవుతూనే ఉంది. గతంతో పోలిస్తే పట్టణ జనాభాతోపాటు విస్తీర్ణం కూడా 30 శాతం వరకు పెరిగింది. కంపోస్టు యార్డుగా కనీసం ఐదెకరాల భూమి ఉంటేనే చెత్త సమస్యకు పరిష్కారం దొరకదు. జవాబు లేని ప్రశ్న.. మున్సిపాలిటీకి వడ్డిగూడెం శివారులో ఉన్న రెండెకరాల సొంత స్థలాన్నే ఏడేళ్ల క్రితం వరకు కంపోస్టుయార్డుగా ఉపయోగించే వారు. మున్సిపాలిటీకి మరికొన్ని చోట్ల స్థలాలున్నా అవి జనావాసాలకు చేరువలో ఉన్నాయి. కాగా వడ్డిగూడెంలోని స్థలంలో చెత్త వేయడంపై అక్కడి ప్రజలు అభ్యంతరం చెప్పడంతో పాటు రాజకీయ నాయకుల ఒత్తిడితో తప్పనిసరై కంపోస్టుయార్డును ప్రస్తుతమున్న నీటిపారుదల శాఖ జాగాలోకి తరలించారు. అప్పటి నుంచీ సమస్య జవాబు దొరకని ప్రశ్నలా వేధిస్తూనే ఉంది. అయినా సొంతస్థలాల్లో ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీ చొరవ చూపలేకపోతోంది. కాగా వడ్డిగూడెంలోని రెండెకరాల్లో ప్రభుత్వం బాలికల హాస్టల్ భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. అసలే చెత్తను ఎక్కడకు తరలించాలో దిక్కుతోచని స్థితిలో ఉండగా మున్సిపాలిటీకి ఉన్న కోట్ల విలువైన జాగాకు కూడా ఎసరు పెట్టినట్టయింది. ఆ స్థలాన్ని కాపాడుకుని, ఎలాగైనా కంపోస్టు యార్డు అక్కడ పెట్టాలని అధికారులు భావిస్తున్నా రాజకీయ వర్గాల నుంచి సరైన మద్దతు లభించడం లేదు. ‘చెత్త’ సమస్య నుంచి విముక్తమయ్యే సుదినం అమలాపురానికి ఎప్పుడు వస్తుందో?