బీబీఎంపీ అధికారులకు మంత్రి రామలింగారెడ్డి హెచ్చరిక
బెంగళూరు(బనశంకరి) : నగరంలో చెత్త సమస్య, పోస్టర్లు, ఫ్లెక్సీలను నియంత్రించని అధికారులను సెలవుపై ఇళ్లకు పంపుతామని బెంగళూరు ఇన్‌చార్జి మంత్రి రామలింగారెడ్డి హెచ్చరించారు. సాథనిక మల్లేశ్వరంలోని ఐపీపీ సభాంగణంలో రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖా మంత్రి దినేష్ గుండూరావు, ఎమ్మెల్యేలు, పాలికె సీనియర్ అధికారులతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. రహదారులపై మట్టి కుప్పలు, చెత్త రాశులు కనిపిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయంలో పదేపదే హైకోర్టు నుంచి అక్షింతలు వేసుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. నగరంలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని అధికారులకు హితవు పలికారు. పలు కార్యక్రమాల సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లను బాధ్యులపై చర్యలు చేపట్టి అపరాధ రుసుం వసూలు చేయాలని సూచించారు.
ఇందుకు ఏఆర్‌ఓ నేతృత్వం వహించి, జాయింట్ కమిషనర్, ఉప విభాగ అధికారి, పోలీస్ అధికారులతో సభ నిర్వహించి, పోస్టర్ల తొలగింపునకు చర్యలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే సురేష్ కుమార్ మాట్లాడుతూ... నగరంలో ఏర్పాటు చేసిన మొబైల్ టవర్ల వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు పాలికె కమిషనర్ లక్ష్మినారాయణ స్పందిస్తూ మొబైల్ టవర్ల నియంత్రణ పాలికె పరిధిలోకి రాదన్నారు. అయితే టవర్లు ఏర్పాటు చేసేవారిపై నిఘా వహించాలని అధికారులకు సూచిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే గోపాలయ్య, మేయర్ శాంతకుమారి, డిప్యూటీ మేయర్ కే.రంగణ్ణ తదితరులు పాల్గొన్నారు.
పని చేయకపోతే సెలవులో పంపిస్తాం
Published Thu, Feb 19 2015 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement