ఆరు నెలల్లో అన్ని కేఎస్‌ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు
రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి
మంత్రి రామలింగారెడ్డి(ఫైల్) బెంగళూరు: ఆరు నెలల్లో 16వేల కేఎస్‌ఆర్‌టీసీ, బీఎంటీసీ బస్సుల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. అంతేకాక రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలఓ సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారమిక్కడి కేపీసీసీ కార్యాలయానికి వచ్చిన రామలింగారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రోడ్డు రవాణా సంస్థను మరింత అభివృద్ధి పరిచేందుకు అధిక ప్రాధాన్యం కల్పించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరినట్లు చెప్పారు. డీజిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో చార్జీలను కూడా తగ్గిస్తారా? అన్న విలేకరుల ప్రశ్నపై మంత్రి రామలింగారెడ్డి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇక మార్కోపోలో బస్‌ల కొనుగోళ్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఇప్పటికే నివేదిక అందిందని, ఈ నివేదికలో ఎవరినైతే నిందితులుగా పేర్కొన్నారో వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జార్జితో భిన్నాభిప్రాయాలు లేవు.....
ఇక బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కె.జె.జార్జ్‌తో తనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని రామలింగారెడ్డి తెలిపారు. అభివృద్ధి కోసం ప్రతిపక్ష సభ్యులతో సైతం కలిసి మెలిసి పనిచేసే తాము జార్జ్‌తో ఎందుకు విబేధిస్తానని ప్రశ్నించారు. జార్జ్‌కు బెంగళూరు నగర అభివృద్ధి శాఖను కేటాయించడంపై తనకెలాంటి అభ్యంతరాలు లేవని, జార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతో చక్కగా బెంగళూరు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు.
బస్సుల్లో నిఘా వ్యవస్థ
Published Thu, Mar 10 2016 2:25 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement