ఆక్రమణల్లో శ్మశానాలు
Published Thu, Jan 2 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
వినుకొండ, న్యూస్‌లైన్ :పురపాలక సంఘ పరిధిలోని శ్మశాన స్థలాలు కనుమరుగవుతున్నాయి. మృతులను పూడ్చేందుకు జాగా లేక నివాస గృహాల మధ్య చేస్తున్న సమాధులు అరుగులుగా మారుతున్నాయి. ఖననం చేసేందుకు జాగా లేక ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి దహన సంస్కారాలు చేస్తున్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని దాతలు విరాళాలుగా ఇచ్చిన శ్మశాన స్థలాలు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. పరిరక్షించాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తుండటంతో పట్టణ పరిధిలోని శ్మశానాలు కాలక్రమేణ కనిపించే పరిస్థితి లేదని అంటున్నారు.
స్థానిక తిమ్మాయిపాలెం రోడ్డు 13వ వార్డు పరిధిలో హిందూ శ్మశానం సగానికి పైగా ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లింది.సుమారు ఐదు ఎకరాల వరకు ఉండాల్సిన స్థలం ప్రస్తుతం ఎకరానికి మించి లేదు. ఉన్న స్థలం కూడా అభివృద్ధికి నోచుకోక చెట్టుచేమలతో అధ్వానంగా మారింది. ముళ్లపొదలు, లోతైన గుంతలతో కనిపిస్తుంది. ఆచారాల ప్రకారం ఖననం చేసే హిందూ శ్మశాన వాటిక పట్టణంలో ఇది ఒక్కటే ఉంది. మిగిలిన ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలని పలు మార్లు ప్రజలు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఉన్న స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని లేకుంటే ఆ స్థలం కూడా మిగిలే పరిస్థితి లేదని అంటున్నారు. పిచ్చి చెట్లను తొలగించి అభివృద్ధి చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
నరగాయకుంట వద్ద... అదేవిధంగా వెల్లటూరు రోడ్డులోని నరగాయకుంట వద్ద దాతలు ఇచ్చిన హిందూ శ్మశాన వాటిక ఆక్రమణలకు గురికాగా మిగిలిన ప్రాంతం కూడ వివాదాస్పదంగా మారింది. నివాస గృహాల మధ్య శ్మశానం ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. ఇక స్వీపర్స్ కాలనీలోని క్రిష్టియన్, హిందూ శ్మశాన వాటికలు కనుమరుగయ్యాయి. నివాస గృహాల మధ్య నిర్మించిన సమాధులు ఆప్రాంత వాసులకు అరుగులుగా మారుతున్నాయి. అక్కడ ఉన్న శ్మశాన స్థలం పూర్తిగా ఆక్రమణకు గురికావడంతో బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని చెక్కవాగు వద్ద స్థలం కేటాయించారు. ఇలా పురపాలక సంఘ పరిధిలో శ్మశాన స్థలాలు కబ్జాకు గురవుతున్నా అధికారులు చోద్యం చూస్తుండం వల్ల ఆక్రమణలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయని పక్షంలో భవిష్యత్‌లో మరింత ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
Advertisement