Cemeteries
-
‘ఆరడుగుల’ వేదన తీరింది!
బాపట్ల జిల్లా భట్టిప్రోలు నుంచి సాక్షి ప్రతినిధి బి.ఫణికుమార్: రాష్ట్రంలోని దళితవాడలను తరతరాలుగా ఓ సమస్య వేధిస్తోంది. ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు ప్రశాంతంగా నిర్వహించలేకపోవడమే ఆ సమస్య. వారికి శ్మశాన వాటికలు లేకపోవడమే దానికి కారణం. అలాంటి సమస్య ఉన్న గ్రామాల్లో బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రు పంచాయతీ శివారున పెదపాలెం దళితవాడ ఒకటి. 150 ఇళ్లు ఉన్న ఆ ఊళ్లో ఎవరైనా చనిపోతే వారికి అంత్యక్రియలు ఎక్కడ చేయాలనేది పెద్ద సమస్య.ఆ గ్రామం ఏర్పడి వందల ఏళ్లయినా అక్కడ మాత్రం శ్మశానం లేదు. రోడ్డు పక్కన, చెట్ల చాటున, పొదల మధ్య, కంచెల్లో, బురదలో ఎక్కడో ఒక చోట ఆరు అడుగుల నేల వెతుక్కుని అక్కడ అంత్యక్రియలు చేసేవారు. శ్మశానం కోసం భూమి ఇవ్వాలని ఆ ఊరి వాళ్లు అనేక సంవత్సరాలుగా పాలకులను అడుగుతూనే ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ ఊరికి మాత్రం శ్మశానం ఏర్పడలేదు. దళితుల కష్టాలకు చరమగీతం పాడుతూ, వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు వారికి కొండంత భరోసా ఇస్తున్నాయి.ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎక్కడా శ్మశాన వాటికలు లేని దళిత వాడలు ఉండకూడదనే సీఎం నిర్ణయం ఆ గ్రామ ప్రజల కష్టాలు తీర్చింది. గ్రామానికి ఆనుకుని సర్వే నంబర్ 273/2, 3లో శ్మశానం కోసం ఇటీవలే ప్రభుత్వం ఎకరం భూమి కేటాయించింది. ఇన్నాళ్లకు గ్రామానికి బాధ తప్పిందని, జగన్ వల్లే తమ కష్టాలు తీరాయని ఆ గ్రామానికి చెందిన యాజలి లూకయ్య సంతోషంగా చెప్పాడు. సీఎం లక్ష్యంతో నెరవేరిన కల ఎన్నితరాలు మారినా ఇంకా రాష్ట్రంలోని అనేక దళితవాడల్లో శ్మశానాలు లేవు. ఇప్పటి వరకు వారికి ఆ ఆరడుగుల వేదన తీరలేదు. అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు అనేక దళిత వాడలు చెట్లూ, పుట్టలు, రోడ్ల పక్కన ఖాళీ స్థలాలపై ఆధారపడే దుర్భర పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఈ సమస్య తన దృష్టికి వచ్చిన మరుక్షణం నుంచే వైఎస్ జగన్ రాష్ట్రంలో శ్మశాన వాటిక లేని దళితవాడ ఉండకూడదని నిర్ణయించారు. సమాజంలో వెనుకబడిన వారికోసం ఆ గ్రామాల్లోనే శ్మశాన వాటికల సదుపాయం కల్పించడానికి చకచకా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో శ్మశాన వాటికలు లేని దళితవాడలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో 1,854 గ్రామాల్లో శ్మశానాలు లేవని, వాటి కోసం 1,230 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది. ఆ గ్రామాల జనాభాను బట్టి అర ఎకరం నుంచి ఎకరం భూమిని శ్మశాన వాటికల కోసం ఇచ్చే అధికారాన్ని కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చింది.దీంతో ఇప్పటికే 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఈ నెల 17న ఏలూరు జిల్లా నూజివీడులో జరిగే సభలో సీఎం వైఎస్ జగన్ ఆ శ్మశాన వాటికల కోసం భూమి కేటాయింపు పత్రాలను ఆ గ్రామాల వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. భూ సమీకరణ చేసైనా.. దళితవాడలను అనేక సంవత్సరాలుగా శ్మశాన వాటికల సమస్య పీడిస్తున్న గత పాలకులు వాటిపై దృష్టి పెట్టలేదు. తమ గ్రామానికి శ్మశాన వాటికల కోసం భూమి ఇవ్వాలని దళిత వాడల ప్రజలు ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు అడిగినా ఎవరూ స్పందించలేదు. చూద్దాం, చేద్దామనే వారే తప్ప వారి బాధను అర్థం చేసుకున్న వారే లేరు. మొట్టమొదటిసారి ఈ సమస్య మళ్లీ వినపడకుండా చేయాలనే సంకల్పంతో సీఎం జగన్ ఒకేసారి శ్మశాన వాటికలు లేని దళిత వాడలన్నింటికీ భూమి కేటాయించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. ప్రభుత్వ భూమి లేని చోట భూ సమీకరణ చేసైనా శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆరు అడుగుల కోసం వెతికేవాళ్లం మా ఊళ్లో ఎవరైనా చనిపోతే మా పరిస్థితి దారుణంగా తయారయ్యేది. చివరి కార్యక్రమాల కోసం గ్రామం చుట్టు పక్కల ఆరు అడుగుల భూమి కోసం వెతికేవాళ్లం. నలుగురూ నాలుగు దిక్కులకు వెళ్లి రోడ్డు పక్కన ఎక్కడైనా అనువైన స్థలం ఉందేమో చూసేవాళ్లం. ఎవరైనా అడ్డు చెబితే మళ్లీ వేరే స్థలం వెతికేవాళ్లం. పొదల్లోనో, చెట్ల చాటునో ఎక్కడో ఒక చోట భూమిని వెతికి అలాంటి దారుణమైన స్థితిలోనే ఇప్పటివరకు అంత్యక్రియలు చేస్తున్నాం. మా గ్రామానికి శ్మశానం కోసం భూమి ఇవ్వాలని ఎంతమందిని అడిగామో లెక్కే లేదు. ఓట్ల కోసం మా ఊరు వచ్చినప్పుడు ఆ పని చేస్తామని చెప్పేవారు. ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకునే వారు కాదు. పెద్దల చుట్టూ తిరిగి అలిసిపోయాం. జగన్ వచ్చి మా కష్టాలు తీర్చారు. మమ్మల్ని తలెత్తుకునేలా చేశాడు. మా గ్రామానికి శ్మశానం కోసం ఎకరం భూమి ఇచ్చారు. – యాజుల రఘుబాబు, పెదపాలెం దళితవాడ, భట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా. జగనన్న మాకు గౌరవాన్ని కల్పించారు మా తాతల కాలం నుంచి శ్మశానం కోసం భూమి ఇవ్వాలని అడుగుతూనే ఉన్నాం. ఎన్ని కష్టాలు పడ్డామో చెప్పలేం. ఎవరైనా కాలం చేస్తే ఊరంతా ఆందోళన చెందేది. చనిపోయిన వాళ్లకి అంత్యక్రియలు కూడా గౌరవంగా చేయలేకపోతున్నామే అని బాధపడేవాళ్లం. ఇన్నాళ్లకి ఆ సమస్యని జగనన్న పట్టించుకుని మా ఇబ్బందిని తీర్చారు. ఇకపై మా ఊరికి శ్మశానం లేదనే బాధ లేదు. అంతకుముందు ఎంతమందిని శ్మశానం కోసం స్థలం ఇవ్వాలని అడిగినా పట్టించుకోలేదు. చేద్దామనే వాళ్లు తప్ప చేసేవాళ్లు కాదు. కాళ్లావేళ్లా పడితే అదెంత పని అనేవాళ్లు. తీరా చూస్తే ఏమీ పని జరిగేది కాదు. మా కష్టం ఇప్పటికి తీరింది. – పోతర్లంక సుజని, పెదపాలెం దళితవాడ, భట్టిప్రోలు మండలం, బాపట్ల జిల్లా. -
ఎల్బీ నగర్ లో ‘ముక్తిఘాట్’.. ఒకేచోట హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశానాలు
-
మూడుపాయల ‘ముక్తిఘాట్’.. ఒకేచోట హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశానాలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం.. భిన్నభాషలు, సంస్కృతులు, ఆచారాలు, మతాలకు నెలవు. మతసామరస్యం, అలయ్, బలయ్, ఆత్మీయతలకు ఆలంబన. అన్ని మతాల సారం ఒక్కటేనని చాటిచెప్పే తాత్విక పునాదులపై వెలసింది. ఆ సత్యాన్ని సమున్నతంగా ఆవిష్కరించేవిధంగా ప్రభుత్వం ‘ముక్తిఘాట్’ను నిర్మించింది. దేశంలోనే మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో మూడు మతాల సంప్రదాయాలకు అనుగుణంగా ఒకేచోట శ్మశానవాటికలు ఏర్పాటు చేసింది. ఎవరి మత సంప్రదాయాల మేరకు వారు అంతిమ సంస్కారాలను నిర్వహించేవిధంగా ముక్తిఘాట్‌లో హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ‘అంతిమంగా మనమంతా ఒక్కటే’అనే గొప్ప సందేశాన్ని ఇచ్చేవిధంగా నాగోల్ బండ్లగూడ సమీపంలోని ఫతుల్లాగూడలో రూ.16.25 కోట్ల వ్యయంతో ఇది రూపుదిద్దుకుంది. అత్యాధునిక, మౌలిక సదుపాయాలను ముక్తిఘాట్‌లో ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో అంతిమ సంస్కారాలను వీక్షించే సదుపాయం కూడా ఉంది. మంగళవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ముక్తిఘాట్‌ను ప్రారంభించారు. ముక్తిఘాట్‌కు అడుగులు ఇలా.. ►ఫతుల్లాగూడలోని సుమారు ఆరున్నర ఎకరాల డంపింగ్ యార్డ్ స్థలాన్ని హెచ్ఎండీఏ ముక్తిఘాట్ కోసం సేకరించింది. ఈ స్థలంలో మతసామరస్యాన్ని ప్రతిబింబించేవిధంగా ఒకేచోట హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లకు 2.5 +2+2 చొప్పున మూడు శ్మశానాలను ఏర్పాటు చేసింది. ►ముక్తిఘాట్‌లో కార్యాలయం, ప్రార్థనామందిరాలు, శీతలీకరణగది, మరుగుదొడ్లు, వాచ్‌మన్ గది, అంతిమయాత్రల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏరియా తదితర సదుపాయాలను కల్పించింది. ►సుమారు 50 కేఎల్డీ (కిలోలీటర్ పర్ డే) సామర్థ్యం కలిగిన మురుగుశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదకరమైన ల్యాండ్‌స్కేప్‌లను అభివృద్ధి చేసింది. హిందూ శ్మశానవాటికలో... ►పర్యావరణహితమైన పద్ధతిలో దహనసంస్కారాలు నిర్వహించేవిధంగా 140 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ప్లాంట్లతో దహనసంస్కారాలు నిర్వహించే దహనవాటికలను ఏర్పాటు చేసింది. ►హిందూ సంప్రదాయం ప్రకారం10వ రోజు చేసే దశదిన కర్మకాండకు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ముస్లిం,క్రైస్తవ శ్మశాన వాటికల్లో.. ►శ్మశానాల్లో మూడు భాగాలు ఏర్పాటు చేశారు. ఒక్కో దాంట్లో సుమారు 550 మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఆన్లైన్ వీక్షణ సదుపాయం అనివార్య కారణాల వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన బంధుమిత్రులు తమ ఆత్మీయుల భౌతికదేహాలను చివరిసారి చూసుకొనేందుకు ఆన్లైన్ వీక్షణ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ జరిగే అంత్యక్రియలను ఎక్కడి నుంచైనా చూడవచ్చు. -
చచ్చినా చావే..!
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్) : ఉపాధిహామీ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఊరూరా వైకుంఠధామాలు (శ్మశాన వాటికలు) నిర్మించేందుకు నిధులు ఉన్నప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 268 శ్మశాన వాటికల నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా ప్రస్తుతం కేవలం 81 శ్మశానవాటికల నిర్మాణ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఒక్కో శ్మశానవాటికకు రూ.10.36 లక్షల చొప్పున నిధులు విడుదలైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ శ్మశాన వాటికల నిధులు గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ అవుతుండటంతో పాత సర్పంచులు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టేందుకు ఎక్కువ మంది ముందుకు రాలేదు. నిధుల విడుదలలో కూడా జాప్యం జరుగుతుండటంతో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రస్తుత కొత్త సర్పంచులు శ్మశాన వాటికల నిర్మాణంపై చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. అన్నిసౌకర్యాలతో వైకుంఠధామాలు నేటికీ చాలా గ్రామాల్లో చనిపోయిన వ్యక్తుల అంతిమ సంస్కారాలు చేయడానికి కనీస వసతులు లేని పరిస్థితి. వర్షాకాలంలో అయితే వాగు దాటుతూ వెళ్లి, వర్షంలో శవాన్ని దహనం చేసే పరిస్థితులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఏళ్లుగా గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, స్ట్రీట్‌లైట్లు వంటి అనేక అంశాలపై దృష్టి సారించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతో ముఖ్యమైన అంతిమ సంస్కారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించలేదనే చెప్పవచ్చు. కనీసం శ్మశానవాటికకు వెళ్లేందుకు దారిలేని గ్రామాలు నేటికీ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి గ్రామాల్లో ఈజీఎస్ నిధులు రూ.10.36 లక్షలతో వైకుంఠధామాలు నిర్మించుకునేందుకు సర్పంచులు చొరవ చూపితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక ఎకరం నుంచి, రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ వైకుంఠధామాల్లో రెండు పిల్లర్లు, ఒక స్లాబ్‌తో రెండు శవాన్ని దహనం చేసే ప్లాట్‌ఫాంలు, ఒక గేట్, కమాన్, ఒక కార్యాలయ గది, మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఒక్కో టాయిలెట్, ఒకహాల్, ఒక 500 లీటర్ల వాటర్ ట్యాంక్, 6 ట్యాప్‌లు, ఒక ఇంకుడుగుంత, రెండు గద్దెలు నిర్మిస్తారు. దీంతో పాటు భూమిని మొత్తం గ్రావెల్‌తో చదును చేస్తారు. ఇప్పటి వరకు శ్మశాన వాటికలు మంజూరు కానీ గ్రామ పంచాయతీలు ఒక ఎకరం నుంచి రెండెకరాల వరకు స్థలం చూపించి తీర్మాణం ఇస్తే శ్మాశనవాటిక మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదీ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా జైనథ్, ఆదిలాబాద్, బేల, గుడిహత్నూర్, బజార్హత్నూర్, బోథ్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నార్నూర్, నేరడిగొండ, తలమడుగు, తాంసి, ఉట్నూర్ మండలాల్లో మొత్తం 268 శ్మశానవాటికలు మంజూరయ్యాయి. ఒక్కో శ్మశానవాటికకు రూ.10.36 లక్షల వ్యయంతో పనులు చేపడుతున్నారు. వీటిలో కేవలం 81శ్మశానవాటిక పనులు మాత్రమే ప్రస్తుతం వివిద దశల్లో కొనసాగుతున్నాయి. ఇంకా 96 శ్మశానవాటిక పనులు ప్రారంభదశలో ఉండగా, 91 శ్మశానవాటికల నిర్మాణానికి అసలు పనులు ప్రారంభమే కాలేదు. అయితే నిధులు సకాలంలో రాకపోవడంతోనే పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో అంత్యక్రియలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. ప్రత్యేక దృష్టి సారించాం గ్రామ పంచాయతీలో శ్మశానవాటికల నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాం. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తున్నాం. కొంత బిల్లుల చెల్లింపులో ఆలస్యం వాస్తవమే. మెటీరియల్ కాంపోనెంట్ బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతోంది. ఈ బిల్లులు వస్తే పనులు వేగంగా జరుగుతాయి. – రాథోడ్ రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
బస్తీ మే దెయ్యం
చేత'న'బడి చీకట్లో ఏడుపులు వినిపిస్తున్నాయి. గుండెల మీద ఎవరో కూర్చున్నట్టుగా ఉంది! చనిపోయిన బాలమ్మ కళ్లను దానం చేశారు కాబట్టి... బాలమ్మ దెయ్యం ఇంటింటికీ... ‘తడుముకుంటూ’ తిరుగుతోందని బస్తీలో పుకార్లు! ఓర్నాయనో! ఎవరిని ఆవహిస్తుందో ఏమో! బస్తీ గజగజలాడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వివేకంగా ఉండాలి! దేనికి జాగ్రత్త? దేనికి వివేకం. చదవండి. రెండు సంఘటనలు. మూడు మరణాలు. ఆ బస్తీని అతలాకుతలం చేస్తున్నాయి. ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీం పట్నంలో ముదిరాజ్ బస్తీ. మూడు శ్మశానాల మధ్య ఉంది ఆ బస్తీ. అక్కడ నివసించేవారంతా శ్రామికులే. రవి బేల్దారి పని చేస్తుంటాడు. అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేచాడు. లేస్తూనే ఇంట్లో వాళ్ల మీద విరుచుకు పడ్డాడు. ‘నేనెన్ని సార్లు మిమ్మల్ని గిచ్చి లేపినా ఒక్కరూ లేవరేం?’ అని అరిచాడు. ‘నువ్వెప్పుడు గిచ్చావయ్యా’ అంటే వినడు. ‘నా గుండెల మీద బ్రహ్మరాక్షసి కూర్చుంది. ఎంతకీ లేవలేదు. మిమ్మల్ని లేపుతుంటే ఒక్కరూ లేవలేదు’ అని రవి ఆరోపణ. అంతే... ఇంట్లో వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెట్టడం మొదలైంది. ‘ఊరి వాళ్లంతా నెత్తీనోరూ కొట్టుకుని చెప్పినా వినకపోతిరి’ అని సణుగుతూ రవి తల్లి పక్కింటి వైపు తొంగి చూసింది. ఆ పెంకుటింటికి ఎప్పటిలాగే తాళం పెట్టి ఉంది. రవికి కూడా గుబులు మొదలైంది. రవి కళ్ల ముందు గతం మెదిలింది. అది సంతోష ఆత్మేనా?! ఆ పెంకుటిల్లు సంతోషది. ఆమె భర్తకు నల్గొండ జిల్లా చిట్యాలలో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం. వారి కాపురమూ అక్కడే. సంతోష గర్భవతైంది. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ భార్యాభర్తల మధ్య కీచులాటలు ఎక్కువయ్యాయి. సంతోష ప్రాణాలు తీసుకుంది! చిట్యాలలో వారున్నది అద్దె ఇల్లు. ఆ ఇంటి నుంచి దహన సంస్కారాలు చేయడానికి ఇంటి యజమానులు ఒప్పుకోరు. సొంతూరికి వచ్చి సొంత వాళ్ల మధ్యన ఆ కర్మకాండలు నిర్వహించడమే మార్గం. అయితే ఇందుకు ఊరు ఒప్పుకోలేదు. రెండు ప్రాణాలు పోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. సహాయ నిరాకరణ చేసింది. దాయాదులైన రవి కుటుంబం ఒక్కటే ఆదుకుంది. పాడె మోయడం దగ్గర నుంచి అంతిమ సంస్కారం వరకు ఆ కుటుంబం వారే దగ్గరుండి పూర్తి చేశారు. అయితే రోజులు గడిచినా ఊరివాళ్లకు సంతోష మరణం మీద శంకలు తగ్గలేదు. సంతోష ఆత్మ అక్కడే, ఆ ఇంట్లోనే ఉంటుందని, పాడె మోసిన వారిని పీడిస్తుందని భయపెట్టసాగారు. జరిగినదంతా గుర్తొచ్చి రవికి ఒళ్లంతా చెమటలు పట్టాయి. సందేహం లేదు. సంతోష ఆత్మ తన గుండెల మీద కూర్చుని ప్రాణాలు తీయబోయింది అనే నిర్ధారణకు వచ్చేశాడు. ఈ సంగతి ఊరంతా పొక్కింది. అంతలోనే మరో సంఘటన. రెండో ఆత్మ... బాలమ్మ! అదే బస్తీలో ఉండే పోచమ్మ ఓ రోజు పొద్దున్నే కూతుర్ని పిలిచి అర్ధరాత్రి నట్టింట్లో ఏడుపు వినిపించిందని చెప్పింది. అది బాలమ్మ ఏడుపేనేమో అనుకున్నారు తల్లీకూతుళ్లు. అప్పటినుంచి ఆ ఇంట్లో అందరూ అస్థిమితంగానే నిద్రపోతున్నారు. ఊళ్లో దాదాపుగా అందరికీ ఏదో ఒక సమయంలో ఏడుపు వినిపిస్తోంది. ఇదంతా ఏదో అరిష్టానికి సంకేతం అని ఊరంతా నమ్మింది. గుబులుగా రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు పోచమ్మ ఇంట్లో సందడి. కల్లు తాగి, తిళ్లు వండుకుని తిన్నారంతా. కొంతసేపటికి పోచమ్మ విచిత్రంగా ప్రవర్తిస్తోంది. టీవీ సీరియళ్లలో, సినిమాల్లో దెయ్యం పాత్రలో కనిపించే హావభావాలన్నీ ఆమె ముఖంలో పలుకుతున్నాయి. వాంతి వస్తోందని కొంతసేపు హడావుడి చేసింది. గర్భిణి సంతోష దెయ్యమై పట్టిందేమోనని వెన్నులో నుంచి చలి మొదలైంది పోచమ్మ కూతురికి. ‘అన్నం అరగలేదేమో, జీర్ణమవడానికి ఏ నిమ్మకాయ రసమో ఇవ్వు’ అనేసి నిద్రకు ఉపక్రమించాడు పోచమ్మ అల్లుడు. మరికొంత సేపటికి పోచమ్మ ఆకలంటూ కేకలు పెట్టింది. ‘కార్జం (కాలేయం), మాంసం పెట్టండి’ అంటోంది. పొంతనలేని మాటలతో ఇంట్లో వాళ్లు భీతిల్లిపోతున్నారు. ‘నువ్వెవరు’ అనగానే ‘మీకు తెల్వదా, నన్ను మర్చిపోయిన్రా... మీ పక్కింటి బాలమ్మను కదా’ అంటోంది పోచమ్మ. ఆ పక్కింట్లోనే బాలమ్మ కొడుకు, కోడలు, ఇద్దరు పిల్లలు నిద్రపోతున్నారు. ‘మీ ఇంటికి పోక, మా ఇంటికెందుకొచ్చావ్’ అన్నది పోచమ్మ కూతురు. ‘నా కొడుకు పూజ చేయించి నన్ను ఇంట్లోకి రానివ్వకుండా కట్టడి చేసిండు’ అని చెప్పింది బాలమ్మ ఉరఫ్ పోచమ్మ. అలా మాట్లాడుకుంటూ ఇంటి బయటికొచ్చింది. కళ్లు కనిపించనట్లు తడుముకుంటూ శ్మశానం వైపు వెళ్లి పోయింది. చూపు లేని దెయ్యం! బాలమ్మ చనిపోయిన తర్వాత ఆమె కళ్లను దానం చేశాడు కొడుకు. దాంతో బాలమ్మ దెయ్యమైన తర్వాత చూపు కోల్పోయిందని, దారి కనిపించక తడుముకుంటూ తిరుగుతోందనేది బస్తీలో వదంతులు లేచాయి. బాలమ్మ దెయ్యమై తిరుగుతోందని, అర్ధరాత్రి వినిపించే ఏడుపు కూడా బాలమ్మదేనని పుకారు పుట్టింది. దాంతో బస్తీలో చాలా మంది భయంతో విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కొందరి ప్రవర్తన బాలమ్మను స్ఫురింప చేస్తుంటే, కొందరి ప్రవర్తన సంతోషను గుర్తు చేస్తోంది. కాలనీలో మహిళలందరి చీర కొంగులకు, చుడీదార్ చున్నీలకు మంత్రించిన నిమ్మకాయల మూటలు కనిపిస్తున్నాయి. ఊరంతటికీ కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత కాస్తంత సమాధానపడినట్లు కనిపిస్తున్నారు. కానీ వారిలో భయం పూర్తిగా పోలేదు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి అసలేం జరిగింది? గత డిసెంబర్లో వృద్ధురాలు బాలమ్మ తుదిశ్వాస విడిచింది. అది జరిగి రెండు నెలలు గడవక ముందే ఫిబ్రవరిలో తొమ్మిది నెలల నిండు గర్భిణి సంతోష ఆత్మహత్య చేసుకుంది. గర్భిణి కాబట్టి అది ఒక మరణం కాదు, రెండు మరణాల పెట్టు. అందుకే ఊరికి అరిష్టం పట్టిందని బస్తీవాసులు నమ్మారు. ఏడిచిందెవరు? కుక్కలు... మనిషి చెవులు వినలేని చాలా తక్కువ పౌనఃపున్యం ఉన్న శబ్దాన్ని కూడా గ్రహి స్తాయి. దానికి ప్రతిస్పందనగా తిరిగి అదే లయతో అరుస్తాయి. ఆ అరుపు మనిషి ఏడుపును తలపిస్తుంది. అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉండడంతో చాలా దూరం వినిపిస్తుంది. కల్లు, దెయ్యం కలిశాయి జెవివి సూచన మేరకు పోచమ్మను మరో కూతురు తనింటికి తీసుకెళ్లింది. అక్కడ ఆమెకు ఎటువంటి భ్రాంతులూ కలగడం లేదు. ఈ విచిత్ర ప్రవర్తనకు కారణం దెయ్యం భయం, దానికి తోడు కల్తీ కల్లు. ఆ కల్లు చిన్న మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. విచిత్రమైన భ్రాంతులకు లోను చేస్తుంది. రవి పరిస్థితి కూడా అలాంటిదే. ఊరంతా సంతోష దెయ్యమై పట్టుకుంటుందని భయపెట్టడం, కల్తీ కల్లు తాగడం కలిసి ఆరోగ్యం పాడైంది. గుండెలు పట్టేసినట్లు అనిపించడంతో దెయ్యం గుండెల మీద కూర్చున్నదని భయపడ్డాడు. దానికితోడు టీవీ సీరియళ్లు, సినిమాల ప్రభావంతో ఆయాపాత్రల హావభావాలను ఆటోమేటిక్‌గా అనుకరించడం అలవాటైపోయింది. - టి. రమేశ్, జనరల్ సెక్రటరీ,ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ -
శ్మశానవాటికలూ కబ్జా..!
‘కాదేది కబ్జాలకు అనర్హం’ అన్నట్లుగా భూ కబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. చెరువులు, కుంటలు, కాల్వలు, కత్వలు, ప్రభుత్వ స్థలాలనూ వదలని కబ్జాదారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ‘ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసేస్తాం’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మనిషి మరణిస్తే ఆరు అడుగుల జాగాను కూడా వదిలిపెట్టడం లేదంటే భూ కబ్జాలు ఏ తరహాలో చేస్తున్నారో ఇట్టే తెలుస్తోంది. - ఇబ్రహీంపట్నం రూరల్ ఇబ్రహీంపట్నం మండలంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ప్రతి ఒక్కరూ భూమినే నమ్ముకొని జీవితాలు గడుపుతున్నారు. ఏంచేసినా తొందరగా అభివృద్ధి సాధించలేమని భూములు కొనడం, అమ్మడంవల్ల అభివృద్ధిని గమనించి రియల్ వ్యాపారులు, భూస్వాములు శ్మశానవాటికలను కూడా వదిలిపెట్టడం లేదు. ఇచ్చినవీ లాక్కుంటున్నారు... ఇబ్రహీంపట్నం మండలంలోని కప్పహాడ్, తుర్కగూడ, రాందాసుపల్లి అనుబంధ గ్రామమైన మల్సెట్టిగూడ, ఎంపీ పటేల్‌గూడ, ఆదిబట్ల, కొంగరకలాన్ గ్రామాల్లో ఇప్పటికే శ్మశానవాటికలను కబ్జా చేశారు. అదే గ్రామానికి చెందిన పెద్దరైతులు గతంలో శ్మశానవాటికల కోసం స్థలాలు ఇచ్చి మళ్లీ లాక్కుంటున్నారు. ఇటీవలికాలంలో మండలంలోని కప్పపహాడ్ గ్రామంలో ఎస్సీ, బీసీల శ్మశానవాటిక భూములు ఆక్రమించారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తుర్కగూడ గ్రామస్తులు, మల్సెట్టిగూడ గ్రామాస్తులు కూడా కబ్జాకు గురైందని కలెక్టర్‌కు ఫిర్యాదు ఇచ్చారు. కప్పపహాడ్ గ్రామంలో నెలరోజుల క్రితం శ్మశానవాటిక వద్దకు తీసుకొచ్చిన మృతదేహాన్ని దహన సంస్కరాలు నిర్వహించకుండా కబ్జాదారులు అడ్డుకున్నారు. దీంతో గ్రామపెద్దలు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగి దహన సంస్కారాలు చేశారు. కొనసాగుతున్న ఆందోళనలు.. మనిషి మరణిస్తే దహన సంస్కారాలు నిర్వహించుకునే స్థలాల పరిరక్షించుకోవడం కోసం ప్రజలు ఆందోళనబాట పడుతున్నారు. రెండు వారాల క్రితం ఎంపీ పటేల్‌గూడ గ్రామానికి చెందిన దళితులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. చింతపల్లిగూడ, మల్సెట్టిగూడ ప్రజలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా అప్పటి ఆర్టీఓ యాదగిరిరెడ్డి మల్సిట్టిగూడలో జరిగిన ఆక్రమణలపై స్పందించారు. మిగతా గ్రామాల్లో జరుగుతున్న సమస్యలపై రెవెన్యూ యంత్రాంగం స్పందించలేదు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. శ్మశానవాటికలను కబ్జా చేస్తు న్న వారిపై చర్యలు తీసుకోవాలి. పాలకుల నిర్లక్ష్యం ఆక్రమణలు జరుగుతున్నాయి. అ ధికారులు స్పందించాలి. కబ్జాదారులపై ఉక్కుపాదం మోపితే ఇలాంటి చర్యలకు పాల్పడరు. కబ్జాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. - మహేందర్, కేవీపీఎస్ నాయకుడు కఠినంగా వ్యవహరించాలి.. శ్మశానవాటికలు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుని పర్యవేక్షించాలి. ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాలకు పాల్పడుతున్నారు. వాటిని నివారించాలి. - మొగిలి గణేష్, బీజేపీ మండల అధ్యక్షుడు -
సమాధులూ కబ్జా
ఊరూవాడా అంబేద్కర్ వర్ధంతి సభలు...దాదాపు ప్రతిసభలోనూ నేతలంతా అంబేద్కర్ మార్గాన్ని అనుసరిస్తారమని, అంటరానితనాన్ని చూపుమాపుతామంటూ గొప్పలు చెప్పారు. ఇక ప్రజాప్రతినిధులు, మంత్రులైతే ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి పంపిణీచేస్తున్నాం.. వారు ఆర్థికంగా ఎదిగి తలెత్తుకుని జీవించేలా చేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చేశారు. కానీ సీఎం కేసీఆర్ సొంతగడ్డ సిద్దిపేటలో దళితులు మాత్రం బంగారు బతుకులు దేవుడికెరక ..చచ్చాక ఆరడగుల నేలనివ్వండి చాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు కేటాయించిన శ్మశాన వాటికను కాపాడాలని కోరుతూ వారంతా శుక్రవారం సిద్దిపేట ఆర్డీఓ, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలను అందజేశారు. - సిద్దిపేట అర్బన్ బతికినన్నాళ్లూ అంటరాని వారంటూ అవమానాలు ఎదుర్కొంటున్న దళితులు...చచ్చాక కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. దళితులకు కేటాయించిన శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాల్సిన సిద్దిపేట రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఆ ప్రాంతాన్ని చెత్త డంపింగ్ యార్డుగా మార్చేశారు. దీన్ని అవకాశంగా తీసుకున్న అక్రమార్కులు ఆ స్థలాన్ని కబ్జాచేస్త్తున్నారు. దీంతో దళితులంతా తమ శాశ్వత నిద్రకు ఆరడుగుల స్థలం ఇవ్వండి సార్లూ అంటూ గగ్గోలు పెడుతున్నారు. సిద్దిపేట పట్టణంలోని ముర్షద్‌గడ్డలో సుమారు 50 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయి. వారికి నాసర్‌పురా శివారులో గల కప్పలకుంట సర్వే నంబర్ 2194లో 3.17 ఎకరాల భూమిని 1960లో అప్పటి ప్రభుత్వం శ్మశానం కోసం కేటాయించింది. అప్పటి నుంచి దళితుల మృతదేహాలను అక్కడ ఖననం చేస్తున్నారు. అయితే శ్మశాన వాటిక దళితులదే కదా అనుకున్నారో ఏమో కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు దాని గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో శ్మశాన వాటిక స్థలంలో మున్సిపల్ సిబ్బంది చెత్తను వేయడం ప్రారంభించారు. మరోవైపు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం, సిద్దిపేట ప్రాంతంలో రోజురోజుకు రియల్ వ్యాపారం జోరందుకోవడంతో అక్రమార్కుల కన్ను దళితుల శ్మశాన వాటికపై పడింది. అందులోని కొంత స్థలాన్ని కబ్జా చేసిన అక్రమార్కులు..మున్సిపల్ అధికారుల అండతో ఆ స్థలాన్ని కొట్టేయాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ప్రస్తుతానికి దళితుల శ్మశాన వాటికను డంపింగ్‌యార్డుగా మార్చేశారు. అంతేకాకుండా జేసీబీని ఉపయోగించి శ్మశాన వాటిక ఉన్న స్థలంలోని మట్టిని యథేచ్ఛగా తరలించేశారు. దీంతో శ్మశాన వాటికలె పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో దళితులంతా మృతదేహాలను ఖననం చేసేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. విన్నపాలు వినిపించుకోని అధికారులు శ్మశాన వాటిక ఉనికికే ప్రమాదం ఏర్పడడంతో దళితులంతా ఆందోళనలు చేశారు. దీంతో స్పందించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు శ్మశాన వాటిక రక్షణకు 2009లో బీఆర్జీఎఫ్ స్కీంలో రూ.3 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో శ్మశాన వాటికకు కాంపౌండ్ వాల్, బోరు తదితర వసతులను కల్పించాల్సి ఉంది. అయితే నేటి వరకు ఆ పనులు జరగలేదు. మరోవైపు శ్మశాన వాటిక డంపింగ్‌యార్డుగా మారుతుండడంతో...దళితులంతా శ్మశానవాటికకు రక్షణ కల్పించాలని పలుమార్లు గ్రీవెన్ సెల్లో పలుమార్లు అధికారులకు విన్నవించారు. అయినప్పటికీ దళితుల ఆవేదనను ఏ అధికారీ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం వారంతా తమ శ్మశాన వాటికకు రక్షణ కల్పించాలని మరోసారి సిద్దిపేట ఆర్డీఓ, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలను అందజేశారు. -
ఆక్రమణల్లో శ్మశానాలు
వినుకొండ, న్యూస్‌లైన్ :పురపాలక సంఘ పరిధిలోని శ్మశాన స్థలాలు కనుమరుగవుతున్నాయి. మృతులను పూడ్చేందుకు జాగా లేక నివాస గృహాల మధ్య చేస్తున్న సమాధులు అరుగులుగా మారుతున్నాయి. ఖననం చేసేందుకు జాగా లేక ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి దహన సంస్కారాలు చేస్తున్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని దాతలు విరాళాలుగా ఇచ్చిన శ్మశాన స్థలాలు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. పరిరక్షించాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తుండటంతో పట్టణ పరిధిలోని శ్మశానాలు కాలక్రమేణ కనిపించే పరిస్థితి లేదని అంటున్నారు. స్థానిక తిమ్మాయిపాలెం రోడ్డు 13వ వార్డు పరిధిలో హిందూ శ్మశానం సగానికి పైగా ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లింది.సుమారు ఐదు ఎకరాల వరకు ఉండాల్సిన స్థలం ప్రస్తుతం ఎకరానికి మించి లేదు. ఉన్న స్థలం కూడా అభివృద్ధికి నోచుకోక చెట్టుచేమలతో అధ్వానంగా మారింది. ముళ్లపొదలు, లోతైన గుంతలతో కనిపిస్తుంది. ఆచారాల ప్రకారం ఖననం చేసే హిందూ శ్మశాన వాటిక పట్టణంలో ఇది ఒక్కటే ఉంది. మిగిలిన ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలని పలు మార్లు ప్రజలు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఉన్న స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని లేకుంటే ఆ స్థలం కూడా మిగిలే పరిస్థితి లేదని అంటున్నారు. పిచ్చి చెట్లను తొలగించి అభివృద్ధి చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. నరగాయకుంట వద్ద... అదేవిధంగా వెల్లటూరు రోడ్డులోని నరగాయకుంట వద్ద దాతలు ఇచ్చిన హిందూ శ్మశాన వాటిక ఆక్రమణలకు గురికాగా మిగిలిన ప్రాంతం కూడ వివాదాస్పదంగా మారింది. నివాస గృహాల మధ్య శ్మశానం ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. ఇక స్వీపర్స్ కాలనీలోని క్రిష్టియన్, హిందూ శ్మశాన వాటికలు కనుమరుగయ్యాయి. నివాస గృహాల మధ్య నిర్మించిన సమాధులు ఆప్రాంత వాసులకు అరుగులుగా మారుతున్నాయి. అక్కడ ఉన్న శ్మశాన స్థలం పూర్తిగా ఆక్రమణకు గురికావడంతో బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని చెక్కవాగు వద్ద స్థలం కేటాయించారు. ఇలా పురపాలక సంఘ పరిధిలో శ్మశాన స్థలాలు కబ్జాకు గురవుతున్నా అధికారులు చోద్యం చూస్తుండం వల్ల ఆక్రమణలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయని పక్షంలో భవిష్యత్‌లో మరింత ఇబ్బందులు తప్పవని అంటున్నారు.