మాండగాడలో పూర్తి కావస్తున్న శ్మశానవాటిక
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్) : ఉపాధిహామీ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఊరూరా వైకుంఠధామాలు (శ్మశాన వాటికలు) నిర్మించేందుకు నిధులు ఉన్నప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 268 శ్మశాన వాటికల నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా ప్రస్తుతం కేవలం 81 శ్మశానవాటికల నిర్మాణ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఒక్కో శ్మశానవాటికకు రూ.10.36 లక్షల చొప్పున నిధులు విడుదలైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ శ్మశాన వాటికల నిధులు గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ అవుతుండటంతో పాత సర్పంచులు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టేందుకు ఎక్కువ మంది ముందుకు రాలేదు. నిధుల విడుదలలో కూడా జాప్యం జరుగుతుండటంతో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రస్తుత కొత్త సర్పంచులు శ్మశాన వాటికల నిర్మాణంపై చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
అన్నిసౌకర్యాలతో వైకుంఠధామాలు
నేటికీ చాలా గ్రామాల్లో చనిపోయిన వ్యక్తుల అంతిమ సంస్కారాలు చేయడానికి కనీస వసతులు లేని పరిస్థితి. వర్షాకాలంలో అయితే వాగు దాటుతూ వెళ్లి, వర్షంలో శవాన్ని దహనం చేసే పరిస్థితులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఏళ్లుగా గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, స్ట్రీట్‌లైట్‌లు వంటి అనేక అంశాలపై దృష్టి సారించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతో ముఖ్యమైన అంతిమ సంస్కారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించలేదనే చెప్పవచ్చు. కనీసం శ్మశానవాటికకు వెళ్లేందుకు దారిలేని గ్రామాలు నేటికీ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి గ్రామాల్లో ఈజీఎస్ నిధులు రూ.10.36 లక్షలతో వైకుంఠధామాలు నిర్మించుకునేందుకు సర్పంచులు చొరవ చూపితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఒక ఎకరం నుంచి, రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ వైకుంఠధామాల్లో రెండు పిల్లర్లు, ఒక స్లాబ్‌తో రెండు శవాన్ని దహనం చేసే ప్లాట్‌ఫాంలు, ఒక గేట్, కమాన్, ఒక కార్యాలయ గది, మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఒక్కో టాయిలెట్, ఒకహాల్, ఒక 500 లీటర్ల వాటర్ ట్యాంక్, 6 ట్యాప్‌లు, ఒక ఇంకుడుగుంత, రెండు గద్దెలు నిర్మిస్తారు. దీంతో పాటు భూమిని మొత్తం గ్రావెల్‌తో చదును చేస్తారు. ఇప్పటి వరకు శ్మశాన వాటికలు మంజూరు కానీ గ్రామ పంచాయతీలు ఒక ఎకరం నుంచి రెండెకరాల వరకు స్థలం చూపించి తీర్మాణం ఇస్తే శ్మాశనవాటిక మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇదీ పరిస్థితి
జిల్లా వ్యాప్తంగా జైనథ్, ఆదిలాబాద్, బేల, గుడిహత్నూర్, బజార్‌హత్నూర్, బోథ్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నార్నూర్, నేరడిగొండ, తలమడుగు, తాంసి, ఉట్నూర్ మండలాల్లో మొత్తం 268 శ్మశానవాటికలు మంజూరయ్యాయి. ఒక్కో శ్మశానవాటికకు రూ.10.36 లక్షల వ్యయంతో పనులు చేపడుతున్నారు. వీటిలో కేవలం 81శ్మశానవాటిక పనులు మాత్రమే ప్రస్తుతం వివిద దశల్లో కొనసాగుతున్నాయి. ఇంకా 96 శ్మశానవాటిక పనులు ప్రారంభదశలో ఉండగా, 91 శ్మశానవాటికల నిర్మాణానికి అసలు పనులు ప్రారంభమే కాలేదు. అయితే నిధులు సకాలంలో రాకపోవడంతోనే పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో అంత్యక్రియలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు.
ప్రత్యేక దృష్టి సారించాం
గ్రామ పంచాయతీలో శ్మశానవాటికల నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాం. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పనుల పురోగతిని పరిశీలిస్తున్నాం. కొంత బిల్లుల చెల్లింపులో ఆలస్యం వాస్తవమే. మెటీరియల్ కాంపోనెంట్ బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతోంది. ఈ బిల్లులు వస్తే పనులు వేగంగా జరుగుతాయి.
– రాథోడ్ రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
Comments
Please login to add a commentAdd a comment